1. మార్చి 28 1923 – రుధిరోద్గారి చైత్రశుద్ధ ఏకాదశీ తెల్లవారుఝామున గం. 4.30 ని.లకు అమ్మ అవనీస్థలిపై అవతరించింది.
7వ రోజున బాలసారె హోమశాంతి సకల దానాలతో నవగ్రహ జపాలతో శాంతి పూర్తి అయింది. ఆశ్లేషా నక్షత్రం కనుక ఏ పేరు పెడితే బాగుంటుంది అని అందరూ ఆలోచించి ఆలోచించి నిర్ణయించిన పేరు సీతాపతి తాతగారు అనుకోకుండా కుంకుమపళ్ళెంలో వ్రాశారు.
ఆ నామకరణం జరిపిన సుముహూర్తబలమో, ఆ అక్షరాలలోని పవిత్రతా బలమో, ఆకర్షణో మరేమిటో నేడు యావజ్జగతికి ఆ అక్షరాలు చిరస్మరణీయ మయినాయి, మంత్రమై మననీయమయినాయి మధురమై అమృతోపమాన మయినాయి.
ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ.
అక్కడ కూర్చున్న అందరూ ఒకేసారి అనుకోకుండా మన అమ్మ పేరు “అనసూయ” అన్నారు.
జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి.
2. ఒకసారి అమ్మ జననానికి పూర్వం తాతగారు చింతచెట్టుక్రింద కూర్చుని ఉండగా వారి మనోనేత్రానికి ఒక బాలిక కనిపించింది పరిశీలనగా చూచేలోపల ఆ బాలిక చెన్నకేశవస్వామిగా రాజ్యలక్ష్మి అమ్మవారుగా రూపాంతరం పొందింది. ఆయన విస్మితుడై పులకితాంగుడవుతుండగా తిరిగి బాలికగా రూపందాల్చింది.
మరొకసారి తాతగారికి ఒక స్వప్నం వచ్చింది. అందులో ఒక ముత్తైదువ తన ఇంటిలో సామాను అంతా బయటపడేసి నట్టింట ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నది. ఆమె నొసట పెద్ద కుంకుమ బొట్టు ఉన్నది “ఎవరు నీవు?” అని అడిగితే “అమ్మను” అన్నది.
3. అమ్మకు మూడవ నెల వచ్చింది ఆ రోజు పూర్ణిమ. అమ్మచేత ముద్దకుడుములు ఇప్పించారు. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా మరిడమ్మ, తాతమ్మ అమ్మ పెంపకం బాధ్యత గొల్లనాగమ్మకు అప్పగించి, కొన్నాళ్ళు నీవు పెంచవలసిందే. మీ యింటి దగ్గరనే నీళ్ళు పొయ్యి. పాలు పట్టు. రోజూ ఒకసారి అమ్మకూ నాయనకూ చూపించు అంటుంది.
అమ్మను అందుకున్న నాగమ్మ హర్షపులకిత అయింది.
నాగమ్మ పెట్రోమాక్స్ లైటుతో బంధువులతో సంతోషంగా అమ్మను ఇంటికి తీసుకు వెళ్ళింది.
ఇంటి ముందుకు పోగానే పెద్ద త్రాచు ఆడుకుంటూ అమ్మను ఎత్తుకుని ఉన్న నాగమ్మ ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పడుకున్నది. ఇరుగూ పొరుగూ కొట్టటానికి కఱ్ఱలతో రాగా తళుక్కున మెరిసి పాము
అదృశ్యమయింది.
4. అమ్మ ఎనిమిదవ మాసంలో పారాడుతూ పారాడుతూ నాగమ్మ తింటూ ఉన్న కంచంలోని మెతుకులను నోటిలో పెట్టుకుంది. అదే అమ్మకు జరిగిన అన్నప్రాశన.
తప్పు, తప్పు వద్దు అంటూ నాగమ్మ గబగబా వచ్చి అమ్మ నోటిలోని మెతుకులు తీసివేయటానికి విఫలయత్నం చేసి అమ్మను తీసుకువెళ్ళి ఉయ్యాలలో పడుకోబెట్టింది.
ఆ విధంగా అన్నం కోసం అమ్మ మొదటిసారి చేసిన ప్రయత్నమే వారించబడింది.
అదీగాక అన్ని వేడుకలూ ఎంతో ఉత్సాహంతో జరిపే తాతగారి – సాంప్రదాయక కుటుంబంలో అమ్మకు అన్నప్రాశన జరపబడలేదు. ఎందువల్లనో !!
మరి తల్లిదండ్రులు అన్నప్రాశన జరపలేదని అమ్మ భోజనం మానివేసిందో అమ్మకు భోజనం అవసరంలేదని గుర్తించి ఆ తల్లిదండ్రులు ఆ వేడుకను విస్మరించారో అనూహ్యం.
5. 19 నెలల వయస్సులో ఒకసారి అమ్మమ్మ అమ్మను తీసుకుని తెనాలి వెళ్ళింది. అక్కడ ఒక దానిమ్మ చెట్టు క్రింద ఎడమకాలును ముందుకు చాచి కుడికాలును వెనక్కు మడత వేసి దానిమ్మపువ్వు చేతిలో పట్టుకుని శ్వాస ఆపివేసి నల్లగుడ్డు లోపలకు పోనిచ్చి చేపనిద్రలాగా అరమోడ్పు కన్నుతో కూర్చున్నది.
ఆ స్థితిలో అమ్మను పెదతల్లి అన్నపూర్ణమ్మగారు చూచి ‘ఏమిటీ?’ అనుకుంటూ ఉండగానే అమ్మ జాగ్రత్తలోకి వచ్చింది.
“ఏమిటమ్మా అట్లా కూర్చున్నావు?” కుతూహలం ఆగక ఆమె అడిగింది.
“శాంభవీ ముద్రలే….” అమ్మ నిర్లిప్తంగా చెప్పింది.
అన్నపూర్ణమ్మగారు ఆశ్చర్యపోయారు మాటలే సరిగా పలుకని వయస్సులో ‘శాంభవీ ముద్రట!’ పైగా మాటే కాదు అభ్యాసమున్నూ !!