6. అమ్మ వయసు 20 మాసములు.
అమ్మమ్మ, అమ్మ తెనాలి నుండి మన్నవకు ప్రయాణమయినారు. ఒంటెద్దు బండియెక్కి రైల్వే స్టేషనుకు బయలుదేరారు. దారిలో బండిని ఆపి బండివాడు పండ్లుకొని తేవటానికి కొట్టువద్దకు వెళ్ళాడు. అంతలో కాషాయగుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అమ్మమ్మతో – “నీ బిడ్డ భగవంతుడు. నీకు యిక జన్మలేదు” అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు.
ఆ మాటలకు అమ్మమ్మ నివ్వెరపోయి ఆలోచించుకుంటూ ఉండగా ఎదురుగా వచ్చే బండి తగిలి కాడి పైకి లేచి అమ్మమ్మా, అమ్మా పడబోయారు. కానీ పడలేదు. మళ్ళీ కాడి మామూలుగా ఎద్దు మెడమీదనే వున్నది.
అంతలో బండివాడు పండుకొనుక్కువచ్చి అమ్మమ్మకు ఇచ్చాడు. అమ్మ అందులో రెండు పళ్ళు తీసుకుని బండివాడికి ఇచ్చింది.
వెంటనే వాడు చిన్నపిల్ల అనే ఆలోచన కూడా లేకుండా రెండుచేతులూ కలిపి నమస్కారం చేశాడు.
7. అమ్మమ్మ, అమ్మ నిడుబ్రోలు స్టేషనులో దిగి ఎద్దులబండి ఎక్కి మన్నవకు బయలుదేరారు.
బండి మన్నవ వైపు బయలుదేరింది. పొన్నూరు ఊరిబయటకు వెళ్ళేటప్పటికి అమ్మ మలవిసర్జనకు వెళ్ళాలని అన్నది. అమ్మమ్మ అమ్మను బండి దించి కూర్చోబెట్టింది. (తదనంతర కాలంలో ఆ స్థలంలో సహస్రలింగ దేవాలయం, భ్రమరాంబ అమ్మవారు విగ్రహం ప్రతిష్ఠించబడింది).
తిరిగి అమ్మమ్మ అమ్మను బండి ఎక్కించే సమయంలో అమ్మ అన్నది.
“ఇక్కడ బాగున్నది. ఇక్కడ ఉందాం….”
“ఇక్కడ ఇల్లు లేదుగా, ఎట్లా ఉంటాం?”
“అయితే మీరు వెళ్ళండి. నేను ఇక్కడనే ఉంటాను”.
“మరి నీకు ఇల్లు వద్దూ?”
“కావాలా?” అని అమ్మ నవ్వేసింది.
“అమ్మ లేకుండా చిన్నపిల్లలు ఉండవచ్చునా?”
“ఏం? నీవు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటాగా…”
“ఏం మాటలమ్మా ! తాలుమాట లేదు.” “తోలునోరు కాదుకదూ! అందుకని తాలుమాట లేదు”.
ఔను – ఆ శరీరం రక్తమాంసాదులతో నిర్మితమే అయినా ప్రతి కణమూ ఎట్లా దివ్యమయినదో. అట్లాగే పలిగిన ప్రత్యక్షరమూ సత్యమయినది. ఏ ఒక్కటీ పొల్లుమాట గానీ, తాలుమాట గానీ ఆ నోటి నుండి రాదు.
8. అమ్మకు మూడవ సంవత్సరం.
కార్తిక శుద్ధ ఏకాదశీ – రాత్రి పదిన్నర అయింది.
అమ్మకు జ్వరం మండిపోతున్నది. పక్కలో అమ్మమ్మ పడుకున్నది. మరిడమ్మ తాతమ్మ వచ్చి చూచింది. అమ్మమ్మ చెక్కిళ్ళు కన్నీట తడిసి ఉన్నాయి.
“మౌనస్వామివారు క్రొత్తగా వేసిన రాజ్యలక్ష్మీ యంత్రప్రభావం వలన అన్ని జబ్బులూ నయమవుతున్నాయట. నీకు దిగులెందుకు? అమ్మాయిచేత మనం కూడా ప్రదక్షిణాలు చేయిద్దాం”.
తాతమ్మ మాటలు విని జ్వరంతో పడుకున్న అమ్మ చివాలున లేచి కూర్చుని అన్నది.
“అది రాజ్యలక్ష్మీ శ్రీరాజరాజేశ్వరీ యంత్రం”. యంత్రం కాదు;
ఆ పలుకెంతో శాంతంగానూ, స్పష్టంగానూ ఉన్నది. తాతమ్మ ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డది.
“సరేలే… అన్నీ నీకే -” అంటూ అమ్మమ్మ అమ్మ తలను రొమ్ముల్లో దాచుకుని పమిట కప్పింది. ఆ పమిటలో నుండే అంతర్వాణిలా పలికింది.
“ఔను; అన్నీ నావే కనుక -”
అప్పుడు అమ్మ చెప్పిన మాటలు ఎవరి మనసుకూ పట్టలేదు. కానీ 1958 నవరాత్రులలో అమ్మ మన్నవ వెళ్ళినప్పుడు మన్నవ కృష్ణశర్మ ప్రభృతులకు ఆ యంత్రం చూపి ఋజువుచేసింది.
అది రాజరాజేశ్వరీ యంత్రమే!
రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం క్రింద రాజరాజేశ్వరీ యంత్రం!
9. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా అమ్మ పెంపకం బాధ్యత పూర్తిగా మరిడమ్మ తాతమ్మ వహించక తప్పలేదు. రోజు శ్రద్ధగా అమ్మకు అన్నం పెట్టడం చేసేది. ఎందువల్లనో అన్నం శరీరతత్వానికి సరిపడలేదు. పెట్టిన అన్నం పెట్టినట్లే విసర్జింపబడేది. తాతగారు తెనాలిలో డాక్టర్ సాంబయ్యగారి వద్ద హోమియోవైద్యం చేయించారు. కానీ ఫలితం ఏమీ లేకపోయింది.
ఒకనాడు ఒక ఘోషాయి వచ్చి అమ్మకు యిస్తానని ఒక వనమూలికను అమ్మ మెడలో కట్టబోయాడు.
ఆ మూలికను అందుకుని అమ్మ చటాలున నోట్లో వేసుకున్నది. “ఆ మూలికను తినవద్దు! తింటే చచ్చిపోతారు” అని ఘోషాయి గబగబా పెద్దగా అరిచాడు.
“నీవు చెప్పినట్లు చచ్చిపోతే నీమూలిక పనిచేసినట్లే. లేకపోతే నీ మాట అబద్ధం. ఆయుర్దాయం తీరినవాడు మందులతో ఎట్లా బ్రతకడో, ఆయుర్దాయం ఉన్నవాడు అట్లే చావడు.” అమ్మ నవ్వుతూ నెమ్మదిగా చెప్తూ ఆ మూలికను నమిలి మింగింది. విచిత్రం! ఆ మూలిక అమ్మను ఏమీ చేయలేదు. ఘోషాయి ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు.
10. అమ్మకు 4 సంవత్సరముల 2 నెలలు.
అమ్మ ఒక రోజు సాయంత్రం ఒంటరిగా నడచి ముత్తాయిపాలెం రేవు సముద్రానికి వెళుతుంది. సముద్రపు ఒడ్డున వుండగా ఒక జాలరి వచ్చి అమ్మను “ఎవరు నీవు” అని అడుగగా అమ్మ పలుకదు. ఎవరో సముద్రమునకు వచ్చి ఈ పిల్లను మర్చిపోయి వుంటారు అని భావిస్తాడు. అమ్మ వొంటిమీద వున్న సొమ్ములన్నీ క్రమంగా వొలుస్తాడు. సొమ్ములు తీసుకుని అమ్మను సముద్రంలోకి విసిరివేస్తాడు. వేయగానే సముద్రంలో ఏదో మెరిసినట్లుండి
సముద్రమంతా కాంతిగా కనపడుతుంది. ఆ కాంతికి జాలరి గుండెలోని చీకటిరాశి ఛిన్నమైపోయి పశ్చాత్తాపం కలుగుతుంది. సముద్రంలో పడవేయగానే అమ్మ మొదటి అలకే వచ్చి ఒడ్డునపడుతుంది. కానీ జాలరి ఏమీ తోచక ఇంకా లోతుకుపోయి దారి తెలియక అందులో పడిపోతాడు. పడి ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక బాధపడుతున్న సమయంలో తను పడవేసిన పిల్లే రెండు చేతులతో తనను ఒడ్డునకు పడవేసినట్లు అనుభూతమవుతుంది.
జాలరి అమ్మను ఇంటికి తీసుకువెళ్ళి అన్నంపెట్టి తను తీసుకున్న సొమ్మంతా వొంటికి పెట్టబోగా అమ్మ “నీవు ఒలిచింది నీ సొమ్మే నాయనా. నీవు బ్రతికొచ్చావు అంతేచాలు. నాకదే సొమ్ము. నీకిదే సొమ్ము. తల్లికి బిడ్డ సొమ్ము. బిడ్డకు డబ్బు సొమ్ము” అని వారించి ఇంటికి వస్తుంది.
11. అమ్మ ఒకరోజు బాపట్ల భావనారాయణస్వామి దేవాలయానికి వెళ్ళి తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి ఒకమూల నిలుచున్నది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోయాడు.
అమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి విగ్రహాలేనా దేముడంటే వేరే వుంటాడా? అమ్మవారిని తాకి చూద్దాం అనుకొని జంకు లేకుండా కళ్లకు పెట్టిన డిప్పలను లాగివేసి కన్నులకోసం చూచింది. కనిపించలేదు. క్రమంగా అమ్మవారికి కట్టిన గుడ్డలు అన్నీ తీసి తరచి చూడగా అంతా రాయిగా కనపడుతుంది. తీసినవన్నీ దగ్గర పెట్టుకుంటూ వాటిని చూస్తూ “ఈ సొమ్ములు చేసినవాడు దేముడా? ఈ చీర దేముడా, ఆ రాయి చెక్కినవాడు దేముడా, అసలు ఈ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేముడా ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు? అందులో పుట్టిన వస్తువులు పెట్టి ఆమెను కాదని దేనికో పూజ చేస్తూ…. అని ఒక మూలన వున్న మట్టిలో గుప్పెడు పట్టుకుని “అమ్మా! నీలో పుట్టి, నీలో పెరిగి, నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజచేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా? అమ్మా! నిస్స్వార్థమూ, నిరుపమానమూ అయిన నీ చరిత్ర ఎంత పవిత్రమయినది? త్యాగభరితమూ, రాగసహితమూ అయిన నీ జీవితం ఎంత దివ్యమయినది? అందుకే సర్వ జగత్తుకూ నీవే మాతృమూర్తివంటాను. ఈ విశాల విశ్వమంతటిలోనూ నీవే సహనదేవత వంటాను. ఈ సమస్త జనులూ నిన్నే పూజించాలంటాను; అహరహమూ నిన్నే ఆరాధించాలంటాను”.