(గత సంచిక తరువాయి)
- భావనారాయణస్వామి దేవాలయంలో అమ్మ ఆ రాత్రి గడిపిన తర్వాత ఆలయ ధర్మకర్త అర్చకునిపై అనుమానంతో రంగాచార్యులగారిని అర్చకత్వ బాధ్యతల నుంచి తొలగిస్తాడు. అమ్మ బయలుదేరి ధర్మకర్త దేశిరాజు రంగారావుగారింటికి వెళ్ళి వారి వాకిట్లో అరుగుమీద కూర్చుంటుంది. రంగారావు గారు ఇంట్లోకి వెళ్తూ అమ్మను చూసి “ఎవరమ్మా నీవు?” అని అడుగుతాడు. వారికి అమ్మ పెద్ద ముత్తైదువ వలే కనిపిస్తుంది.
“నేను రంగాచార్యులుగారి బంధువును”.
“ఆయన నీకేమవుతారమ్మా?”
“కొడుకు అవుతాడు. అంటే వాళ్ళ అమ్మా, నేనూ అక్కాచెల్లెలు వరుస. ఎవరో వాడి ఉద్యోగం తీసివేశారట. వాడు చాలా మంచివాడు; యోగ్యుడు. ఆ గుడికి వాడిచేత అర్చకత్వం జరిపించుకునే యోగ్యత లేదు”. అమ్మ స్పష్టంగా చెప్పింది.
ఆ మాటలు రంగారావుగారికి ఆకాశవాణివలెనూ, ఎవరో అదృశ్యదేవత పలికినట్లుగానూ వినిపించాయి. వెంటనే తన నిర్ణయం మార్చుకుని రంగాచార్యులుకు ఇవ్వవలసిన జీతంకంటే పదిరూపాయలు ఎక్కువ తీసుకుని దారిలో పండ్లూ, పూలూ కొనుక్కుని సరాసరి రంగాచార్యులు యింటికి వెళ్ళి క్షమాపణ చెబుతూ పైకం చేతిలో పెట్టి వేడుకున్నాడు.
రంగాచార్యులు నిశ్చేష్టుడై నిలబడి ఉండగా కిటికీలోగుండా వీధిన పోతున్న అమ్మ కనుపించింది. “అమ్మా!” అని ఒక్క పరుగున వీధిలోకి వచ్చాడు. కానీ అమ్మ కనిపించలేదు. నిరాశతో వెనక్కు తిరిగి విలపించాడు.
“అమ్మా! ఈ బిడ్డతో నీకీ దాగుడుమూత లేమిటమ్మా? నీ దర్శనం సంపూర్ణంగానూ శాశ్వతంగానూ ప్రసాదించమ్మా! నేనీ ఊయల ఊగలేనమ్మా! నాకీ మాయను తొలగించమ్మా. నన్ను నీ ఒడిలోకి తీసుకో అమ్మా!”
“ఇప్పుడు నీవు నా ఒడిలోనే ఉన్నావు నాన్నా! నా ఒడి విడిచి ఎవరూ ఎక్కడకూ పోలేరు.” రంగాచార్యులు గారికి అదృశ్యవాణి వినిపించింది.
- అమ్మమ్మ చనిపోయిన నాలుగవ రోజున చిదంబరరావుగారు పెంచిన పిల్లి కూడా చరమాంకంలోకి చేరింది. అమ్మ దానిని చూచింది. చిదంబరరావు గారిని పిలిచింది. “తాతయ్యా! పిల్లి ఎందుకిట్లా పడుకున్నది?” అమ్మ అడిగింది. “చావుకు సిద్దమయిందమ్మా!”.
“ముక్కులు ఎందుకిట్టా వున్నాయి తాతయ్యా?” అంటూ పిల్లి ముక్కు దగ్గర వేలు పెట్టి అమ్మ అడుగుతూ వుండగా పిల్లి శ్వాస ఆగిపోయినట్లు అమ్మ
“ఏమయింది తాతయ్యా?”
“పిల్లి చచ్చిపోయిందమ్మా”
“ఇదా చచ్చిపోవడమంటే – శ్వాస ఆగిపోవడమా” అని అమ్మ అడుగుతూ తన ముక్కు దగ్గర వేలు పెట్టుకుని చూచుకుంటూ శ్వాసను బంధించింది. చిదంబరరావుగారు చూస్తూ ఉండగానే అమ్మకూ, లోకానికి సంబంధం విచ్ఛిన్నమై అమ్మ నిర్వ్యాపార అయింది.
చిందబరరావుగారు మొదట గాబరాపడినా అనుక్షణమూ అమ్మనూ, అమ్మ మాటలనూ, అలౌకికతనూ, అమ్మలోని సముజ్జ్వల ధీశక్తినీ, అద్భుత చైతన్యాన్నీ అవలోకిస్తున్నందున, అతి సులభంగా అమ్మ పొందిన సమాధిస్థితినీ, శరీరంపై అమ్మకు గల అధికారాన్నీ అర్థం చేసుకుని ఆశ్చర్యమూ, ఆనందమూ పొందారు – “ఎక్కడిదీ జ్ఞానం? ఎప్పటిది సాధన?” అనుకుంటూ.
- అమ్మకు 4 సంవత్సరముల 7 మాసములు.
ఒక సాయంకాలం బాపట్ల రైల్వేయూనియన్ ఆఫీసు దగ్గర ఒక మర్రిచెట్టు క్రింద కూచోగా ఒక పోలీసువాడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మెడలో ఉన్న పులిగోరుపై ఆశపడి అమ్మ చేయి పట్టుకుని మెడలో ఉన్న పులిగోరు గట్టిగా లాగుతాడు కానీ అది రాదు.
అమ్మ : నీ చెయ్యి నెప్పి పుట్టుతుంది. నేను ఇస్తాలే! అది సరేకానీ ఒక సంగతి అడుగుతాను చెప్తావా?
పోలీసు : ఆ చెప్తా! ఇస్తానంటే చెప్తా.
అమ్మ : ఎందుకివ్వను? మాట అంటే ఏమిటో ఎప్పుడన్నా విన్నావా! అర్థం తెలుసునా? “మాట అంటే మారు మాటలేని మాట”. ఆ మాటనే మంత్రమంటారు ఉత్తములకు అటువంటి మంత్రం మామూలు. ఇంతకూ చెప్తావా?
పోలీసుః “అడుగు”
అమ్మ : “అసలు నీ ఉద్యోగమేమిటి?” పోలీసుః “ఎవరు ఏ లోపాలను చేసినా కనిపెట్టటం. వారిని పట్టుకుని జైలులో పెట్టటం.”
అమ్మ : “లోపమంటే?”
“దొంగతనం చేసినా, ఒకరు ఒకరిని కొట్టినా, చంపినా వున్నాయిలే. నీకర్థం కావు”, ఇంకా చాలా
“ఇప్పుడు నీవు చేసినదేమిటి? ఇది దొంగతనం కాదా? నిన్నెవరు పట్టుకుంటారు? ఇంకొక పోలీసు పట్టుకుంటాడా? లేక అందరూ యింతేచేస్తారా? మీకు తప్పులేదని వదిలిందా ప్రభుత్వం?” అంటూ పోలీసు ముఖమువంక చూడగా ఆ పోలీసునకు అమ్మ ముఖములో అరుణోదయమైన కాంతి గోచరించి అమ్మ ముఖము కనుపించకుండా పోయి 15 నిమిషాల పాటు ఆ కాంతే నిలబడుతుంది. ఆ పోలీసు పేరు మస్తాన్.
- అమ్మలో అద్భుతకాంతిని దర్శించిన మస్తాన్ వణికే చేతులతో పులిగోరు అమ్మ మెడలో వేసి మారుమాటలేక అమ్మను ఎత్తుకుని తన యింటికి తీసుకు వెళతాడు. ఆ రాత్రి అతని కబురు మీద కొందరు పోలీసులు అతని యింటిలో సమావేశమవుతారు. మస్తాన్ ఉర్దూలో వారికి తనకూ, అమ్మకూ మధ్య జరిగిన సంఘటన వివరిస్తూ సంభాషణలోని అమ్మ మాటను తప్పుచెపుతాడు. అమ్మ వెంటనే ఆపి “నేను అదేనా అన్నది? అబద్ధమాడుతావేమి? ఉన్నది ఉన్నట్లు
చెప్పు. కాదు కాదు ఉన్నది ఉన్నట్లు చెప్పలేవు కూడా. జరిగింది జరిగినట్లు చెప్పు” అంటుంది.
అమ్మ మాటలు విని అందరూ బిత్తరపోతారు. వారిలో ఒక పోలీసు అమ్మకేదో మహత్తరమయిన శక్తి ఉన్నదని భావిస్తాడు. అతడి పేరు అంకదాసు.
- ఇద్దరు పోలీసులు మస్తాన్, అంకదాసు ప్రతిరోజు అమ్మను సాయంకాలం ఆ మర్రిచెట్టు క్రిందో, లేక రైలు అవతల అద్దంకి వారి తోటలోనో బాపట్లలో ఉన్నప్పుడల్లా కలుసుకుంటారు. వారికి అమ్మ మొదట చెప్పిన మారుమాట లేని మాట మహామంత్రంగా పాటించి ధన్యులవుతారు. అంటే ఉద్యోగధర్మాన్ని సత్యంగా నెరవేర్చటం.
ఒక రోజున మస్తాన్ “అమ్మా! ఈ వచ్చీరాని మాటలతో మాకు నీతీ నిజాయితీని వ్యక్తపరచి ధర్మం బోధించి మమ్మల్ని తరింప చేయటానికి వచ్చావా అమ్మా!” అంటూ వివశుడై గద్గద స్వరంతో “అవతారమూర్తివమ్మా! నాకు సమయం వచ్చే నా మనసు నీ మెడలోని పులిగోరుమీదకు పోయింది”. అమ్మ : ఆ నీతి నిజాయితీయే దేముడు.
అప్పటికి అమ్మకు 5 సంవత్సరములు నిండుతాయి.
- అమ్మ మేడ మీద ఒక గదిలో కూర్చుని ఉండగా ఉదయం 10 గంటలు సమయంలో చిదంబరరావు గారు “అమ్మా! అనసూయా! అన్నం తిందువుగాని రావూ?” అని అడిగారు.
అమ్మ : “ఆ – కలి లేదు” తాతగారు : “ఏ కలి లేదు?”
అమ్మ : “ఈ కలిలో నా కాకలి లేదు”
“మనసు సునిశితమూ, మాటలు చురుకూ” అనుకుంటూ చిదంబరరావుగారు దిగిపోయారు.
(సశేషం)