1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 17
Month : October
Issue Number : 4
Year : 2018

(గత సంచిక తరువాయి)

  1. అమ్మకు 6వ సంవత్సరము ప్రారంభము : అమ్మ సరాసరి మేడమీదకి వెళ్ళి తాటాకు చాపమీద పడుకుంటుంది. చిదంబరావు తాతగారు భారతం చదివి రాత్రి 10 గంటలకు మేడమీదకు వచ్చి మూలనున్న బాదమాకులు దీపం ముందర పెట్టుకుని విస్తళ్ళు కుట్టటం ప్రారంభిస్తారు. అంతలో అమ్మ వచ్చి తొడిమలు తీసి తాతగారికి అందిస్తూ వుండగా అమ్మను తేలు కుడుతుంది. తాతగారు గబగబా లేచి తేలుకోసం వెతుకుతారు. ఆకులలో కనపడుతుంది.

అమ్మః “తాతగారూ! తేలు నాకు కనపడలేదేం?”

తాతగారు : అన్ని ఆకులలో తేలు యేమి కనపడుతుంది? అందులో కీనీడ!

అమ్మ: కీనీడ అంటే ఏమిటి తాతగారూ?

తాతగారు : “దీపం చుట్టూ చీకటేగా, దానినే కీనీడ అంటారు.

అమ్మ : “చీకటి పోగొట్టే దీపం చుట్టూ చీకటా? వెలుతురుకాధారం చీకటా” అమ్మ ఫక్కుమని నవ్వుతుంది.

  1. అమ్మ మేడమీదకు వెళ్ళి కూర్చుని వుంటుంది. మేడకు ప్రక్కగా వున్న ఐలూరు కాంతమ్మగారి దొడ్లో గేదె పాలు పిండుతూ వుంటారు. చెంబులో పడగానే పాలధార ధ్వని వస్తుంది. అది “అమ్మా!” అని వినపడుతుంది అమ్మకు. పాలు నన్ను పిలుస్తున్నాయేమో నని చెవులు కళ్ళు అటు తిప్పి ‘అమ్మా’ అనే శబ్దాన్ని గురించి ఆలోచిస్తుంది. “పాలకు అమ్మ ఎవరు? పాలుతీసే చన్ను. చన్నుకు అమ్మ ఎవరు? పొదుగు. పొదుగుకు అమ్మ పొట్ట. పొట్టకు అమ్మ చర్మము, కండరాలు, నరములు, కోశములు ఒకదానికొకటి ఆధారమై అన్నీ కలిపి గేదై అన్నింటి రసం పాలుగా వచ్చి అన్నీ “అమ్మా” అని పిలిచినయి. పిలిచేది అమ్మ – పలికేది అమ్మ – ఉన్నది అమ్మ. అంతా అమ్మై “మమ” అయింది” అనుకుంటూ అమ్మ ఆలోచిస్తుంది.

20 సాయంకాలం 6 గంటలకు అమ్మ మామూలుగా మర్రిచెట్టు క్రిందకు వెళుతుంది. ఇంతలో తూర్పుదిక్కు నుండి మస్తాన్, అంకదాసు కూడా వస్తారు. మస్తాన్ సాహెబ్ పైకండువా తీసి కిందపరచి అమ్మను కూర్చోబెట్టి మహమ్మదీయ ఆచారముతో నమస్కారము చేస్తాడు. అంకదాసు సాష్టాంగ నమస్కారము చేస్తాడు. వస్తూ వస్తూ అమ్మకు పీచు మిఠాయి, పంచదార బూంది తీసుకు వస్తారు. అమ్మ చేతిలో పెట్టగానే అమ్మ పొట్లాలు విప్పుతుంది. ముగ్గురూ మౌనంగా కూర్చుంటారు. అరగంట అయిన తరువాత పొట్లాల వంక చూస్తే పదార్ధములు ఖాళీ అయిపోయి వుంటాయి. సాష్టాంగ నమస్కారము చేసి, “అమ్మా! నీవెవరమ్మా? తినేటప్పుడు నీవుగా నీవే తీసుకున్నది కనపడలేదు. నీవుగా లేవు. ముసలి అమ్మ లాగా కనపడ్డావెందుకు? మాకు అడగటం చేతకాదు. నిన్ను తెలుసుకోలేము. చెప్పమ్మా! చెప్పు తల్లీ. “ఓ తల్లీ!” అని భయంతో వణుకుతూ, పెద్ద పెద్దగా అరుస్తూ ఇద్దరూ పాదాలమీద పడపోతారు. అమ్మ : నాకేం తెలియదు నాయనా! మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరో ముసలమ్మ వచ్చి తిన్నదేమో!

21 మస్తాన్ః అమ్మ మీద వున్న విశ్వాసం దొడ్డది. నేను ఇంతవరకూ ఎవరికీ దణ్ణం పెట్టి ఎరుగను. అమ్మను చూడక ముందు నేను చాలా తప్పులు చేసేవాడిని. ఇప్పుడు అమ్మ తప్ప మరేమీ గుర్తుకు రావటము లేదు. అమ్మను చూస్తూ వుంటే చాలు. మనం ఇంటి వద్ద వున్నప్పుడు కూడా అమ్మ యిట్లాగే కనపడితే హాయిగా వుంటుంది. ఏమి చేస్తే అమ్మ అట్లా కనపడుతుందో?

అంకదాసు : మన మనేది పోయి, అంతా అమ్మ అయితే అట్లా వుంటుంది. మస్తాన్ అంతా అమ్మ అయితే ఆనందమేమున్నది? “అమ్మ అమ్మగా వుండి మనం పిల్లలుగా వున్నప్పుడే ఆనందం”.

అమ్మ ఏమీ మాట్లాడకుండా దూరంగా కూర్చుని వుంటుంది. “ప్రొద్దుగూకింది. మనం యింటి దగ్గర మాట్లాడుకుందాం. లే!” అని, అమ్మను యింటి వద్ద వదిలిపెట్టి వెళ్తూ రేపు మళ్ళీ అమ్మ దర్శనమయినప్పుడు ఇంకా కొంత తెలుసుకుందాం అనుకుంటూ వెళ్ళిపోతారు.

  1. అంకదాసు : “అమ్మ వంక చూస్తున్నావా మస్తాన్ ! అమ్మ తేజస్సు రకరకాలుగా మారిపోతున్నది. శరీరధారి అయిన రూపాలే కాకుండా, కొండలు, నదులు, నిధులూ కూడా ఈ సమయంలో రకరకాలుగా కనపడుతున్నది. వొళ్ళు పులకరిస్తున్నది. ఆనాడు కృష్ణుడు యశోదకు చూపించినది ఇదేనేమో! అది నిజమని వొప్పుకోవాలంటే ఈనాటి అమ్మే ఆనాటి కృష్ణుడుగా పుట్టివుండాలి. ఈ అదృష్టము ప్రతి ఒక్కరికి కలగాలి, కలగాలి అని పెద్ద కేకలెడతాడు. నేను బాల్యంలో లక్ష్మీనరసింహ శతకము చదువుకొనేవాడిని. ఇంతకంటే నాకేమీ దైవచింతన లేదు. భక్తిలేనివారికి విముక్తి లేదంటున్నారు. “భక్తిలేనివారికి ముక్తి వున్నదనీ, భక్తి ముక్తీ కూడా తానేనని ఋజువు చేస్తున్నది అమ్మ”. లేకపోతే, నేను చాలా దుర్మార్గుడినే, సరియైన వృత్తులు లేవు. నాకా ఇన్ని మాటలు, ఇంత స్తోత్రము, ఇటువంటి దర్శనము!!” అని అమ్మ పాదముల మీదపడి నమస్కారము చేస్తూ చాలాసేపు లేవలేదు.

మస్తాన్ సాహెబ్ కళ్ళుమూసుకుని అంకదాసు అనేవి అన్నీ వింటూ తనలో వున్న జీవం లేచి అమ్మలో ప్రవేశిస్తున్నట్లుగా భావించి, తను లేను వున్నదంతా అమ్మే అనుకుంటాడు.

  1. లోకంలో ఇన్ని పేర్లు ఉండగా ఆ పేరునే నీవు ఎందుకు కోరుకున్నావమ్మా? ఆ పేరుకు అర్థమేమిటమ్మా?”

అమ్మ ఏమి చెపుతుందోనని ముగ్గురూ (అంకదాసు, మస్తాను, ముసలి తాత) అమ్మ వంక చూస్తూ వున్నారు. తెల్లచీర కట్టుకుని, తెల్లరవిక తొడుక్కుని సొమ్ములూ ముఖాన బొట్టుకూడా లేకుండా తల విరబోసుకుని పద్మాసనం వేసుకుని అమ్మ కనుపించింది.

“రాగద్వేషాసూయలను పారద్రోలేదే అనసూయ; అదే అనసూయత్వం, ఈ అనసూయతత్త్వం”

మస్తాన్ ఒక్కడికే అర్థమవుతుంది. తక్కిన ఇద్దరికీ అర్థం కాదు. 

అంకదాసు “నాకర్థం కాలేదమ్మా!” అంటాడు. తాత అది కూడా అడగడు. 

మస్తాన్ “ఇంటికి పద. తరువాత నేను చెప్తాను” అంటాడు.

అంకదాసు : “నీవు చెప్పినా ఇట్లా వుండదులేవోయ్! ఆ ధ్వని మధురం. ఆ తత్త్వమే అమ్మ అయి వివరిస్తుంది. కనుక అర్థం కావటం సులభం.”

(సశేషం)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!