1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 3
Year : 2023

(గత సంచిక తరువాయి)

మహోదధిలో మణిరత్నాలు – 161

గోపరాజుగారు అమ్మతో “అసలు నీవు అన్నావా లేదా బావను చేసుకుంటానని?” అని అడుగుతారు. అమ్మ బదులిస్తూ “మీతో ఎవరన్నారు?” అంటుంది. “మీ నాన్న”.

అమ్మ : మీ దృష్టిలో మా నాన్న అబద్ధాలు చెపుతారని వుందా? నేనబద్ధం ఆడేదా, నాన్న అబద్ధం ఆడాడని చెప్పేదా? పెద్దవాడిని నాన్ననే అడిగి తెలుసుకోండి. పోనీ తెలిసో తెలియకో నేనన్నానే అనుకోండి! ఆ మాటను ఏం చేయాలి? సావిత్రి (గోపరాజుగారి అమ్మాయి) చేసిందనుకోండి. అప్పుడు మీరు ఏమి చేస్తారు?

గోపరాజుగారు అమ్మను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని “ఏం మాట్లాడుతున్నావమ్మా! ఇంత చక్కగా మాట్లాడతావని తెలియదే! సరే ఆడుకో పో!” అని అన్నమ్మ గారిని పిలిచి “ఏమండీ వదినగారు! సావిత్రి చేత అడిగిస్తామంటిరే! నాకే నోరు తిరగలా. ఏమీ సందివ్వలేదు. తేలిగ్గా మాట జారే పిల్లకాదు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచీ అమ్మాయి ఏదో ఒక పెద్దగా అనిపిస్తున్నది గాని, చిన్నపిల్ల అని అనిపించటం లేదు. ఏదో ఒక పవిత్రభావం కలుగుతున్నది అమ్మాయి మీద.” అంటారు.

అన్నమ్మగారు : మాటలకేమి లెండి. మేనత్తల వలే మాటకారి కావచ్చు.

అమ్మ మంచము మీద పడుకుని వుంటుంది. ఆ మాటలు విని “మేనత్తలేమో పినతల్లుల పోలిక అంటున్నారు. పినతల్లులేమో మేనత్తల పోలిక అంటున్నారు. నాకు ఎవరి పోలిక లేదు. నా పోలికే నాది” అని ప్రకటిస్తుంది.

మహోదధిలో మణిరత్నాలు – 162

ప్రేమ – కోపం

అమ్మ : కోపమంటే వేరే ఏమున్నది? ప్రేమ ప్రకోపించినప్పుడు ఏం చేస్తాడు?

ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు వచ్చినప్పుడు దగ్గరకు రాకపోతే కోపమొస్తుంది.

ప్రేమే కోపానికి మూలమయింది.

మహోదధిలో మణిరత్నాలు – 163

అమ్మ, సీతాపతి తాతగారు, చిదంబరరావుగారు, భారతమ్మ భోజనాలకు కూర్చుంటారు. అమ్మ తలవంచుకుని అన్నంలో ఏమిటో ఏరుతూ కూర్చుంటుంది. చిదంబరరావు తాతగారు అమ్మతో “ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు. అన్నం తిను. ఏమిటి ఏరుతున్నావు? మాకు ఎవరికీ రానివి అన్నంలో నీకు వచ్చినయ్యా?” అని అడుగుతారు.

అమ్మ నోటితో మాట్లాడకుండా చేతులతో తీసి చూపిస్తుంది. మట్టి గడ్డలు, వడ్లు. తాతగారు “ఇదేమిటి? ప్రత్యేకం పోసి వండినట్లున్నయ్యే!” అని వంటమనిషితో “ఏమిటి సీతారావమ్మ గారూ! ప్రత్యేకం పోసి వండారేమిటి వడ్లు, మట్టిగడ్డలు?” అంటారు.

సీతారావమ్మ గారు : “ఏమో బాబూ. నాకు తెలియదు. అన్నీ ఒకటిగానే వండాను. గింజలు అమ్మాయిగారి చేతిలో కనపడుతున్నాయి.”

చిదంబరరావు తాతగారు: “అన్నంలో వడ్లు, మట్టిగడ్డలు ఎట్లా వున్నయ్యో నీ చుట్టూ కూర్చుంటే మేము అట్లా వున్నామమ్మా.” భారతమ్మగారికి కష్టం తోస్తుంది. “నీ మనుమరాలు అన్నమూ, మేము మట్టిగడ్డలమూనా?”

తాతగారు : కాదు కాదు. నేనన్నది ఆ వుద్దేశం కాదు. మాలో వున్న దుష్టత్వాలు అన్నీ అట్లా తీసివేయమని.

మహోదధిలో మణిరత్నాలు – 164

చిదంబరరావు తాతగారు అమ్మను దగ్గరకు తీసుకుని పక్క గదిలోకి తీసుకెళ్ళి “ఏవమ్మా! ఈ జీవితం ఇట్లా జరగవలసిందేనా? ఏనాటికయినా మార్పు వున్నదా?”

“నీ బాధలే ఆధ్యాత్మిక సాధనగా చూపిస్తావా అమ్మా? నీకు బాధలు లేకపోవచ్చు, మా అందరికీ నేర్పటం కొరకయినా నీవు పడవలసిందే కదా. నువ్వు భగవంతుడివో అవతారానివో నాకనవసరం. నీ బాధల్లోని ఆనందాన్ని చూచి ఆనందపడే స్థితి నాకొద్దు. నిన్ను చూచి ఆనందపడే స్థితి కావాలి. నిన్ను మనుమరాలిగానే చూచుకోవాలని వుంది. మనుమరాలిగా చూచుకుంటే ఎప్పుడూ నీ సుఖమే కావాలి. నీవు కాఫీ ఆలస్యంగా తాగినా భరించలేను.”

మహోదధిలో మణిరత్నాలు – 165

చిదంబరరావు తాతగారు సీతాపతి తాతగారితో “చూడరా సీతాపతీ! అమ్మవంక చూడు. ఆ లేత కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ప్రపంచమంతా తిరిగి పోతున్నట్టుంది. లేత బుగ్గలు వణుకుతుంటే చందమామ చూడు ఎట్లా వణుకుతున్నాడో! పెదిమలు కదులుతంటే గులాబీపూలు ఊగుతున్నట్లున్నై.”

చిదంబరరావు తాతగారికి దేవాలయం తలుపులు మూతలు పడ్డట్టుగానే తోస్తుంది. పైకే అంటారు. “చూడరా! కళ్ళుమూస్తే దేవాలయం తలుపులు మూతలు పడినట్లు కనుపిస్తున్నాయి.”

అమ్మకళ్ళల్లోనుండి ఒక చుక్క కన్నీరు బుగ్గమీద రాలుతుంది. బుగ్గమీద నీటిబిందువు జూచి చిదంబరరావు తాతయ్య శరీరమంతా గజగజా వణుకుతుంది. ఆ నీటిబొట్టులో తాతగారికి ప్రపంచమంతా గిరగిరా తిరిగిపోతున్నట్లు కనపడుతుంది. ప్రపంచానికి భూదేవి ఒక తలుపు రెక్క, ఆకాశం ఒక రెక్కగా, అమ్మ ద్వారంలోకి వచ్చి రెండు తలుపు రెక్కలు రెండు చేతుల్తో పట్టుకుని తను లోపలకు వెళ్ళి రెండు రెక్కలు ఒకేసారి గదిమి వేసినట్లుగా కనపడుతుంది. వెంటనే తాతగారు “ఎంత దివ్యదర్శనాలు ఇస్తున్నావు తల్లీ” అని గుండెల్లో చెయ్యి పెట్టుకుని పడిపోతారు.

మహోదధిలో మణిరత్నాలు – 166

వివాహ ప్రాశస్త్యం :

అమ్మ : శుభలేఖలో వున్న నామాన్ని చేసుకున్నా – ఆ నామం చేస్తే ఆ రూపం దగ్గరకు చేరతానని.

నాన్నగారు : నేను ఏమీ లేనివాడిని. నాకు ఆస్తి ఏమీ లేదు. నిన్ను సుఖపెట్టలేను. ఇష్టమే?

అమ్మ : నేను చేసుకుండేది ఆస్తిని కాదు మనస్సును. నాకు శరీరంతో కూడా సంబంధం లేదు.

మహోదధిలో మణిరత్నాలు – 167

చిదంబరరావు తాతగారి కుమార్తె భారతీదేవిని ప్రసవం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తారు. అందరూ ఆస్పత్రికి వెళతారు. ఎంతసేపటికీ బాధ నివారణ కాలేదు. కొంతసేపటికి కాఫీ తీసుకుని అమ్మ వెళుతుంది. కాఫీ త్రాగగానే ప్రసవం అవుతుంది. ఆడపిల్ల పుడుతుంది. అక్కడ వున్న నర్సులందరూ ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయి మంచిది. ఈ అమ్మాయి రాగానే కాన్పు అయిందంటారు.

అమ్మ వెంటనే పసిబిడ్డను ఎత్తుకుంటుంది. అక్కడ వుండే నర్సులందరూ “కనిపెంచిన వాళ్ళల్లే ఎత్తుకుందే” అంటారు.

మహోదధిలో మణిరత్నాలు – 168

అమ్మ మేనమామ చంద్రమౌళి సీతారామయ్య గారు అమ్మతో (నాన్నగారి గురించి) “వాడికి జీవకళ తక్కువ” అంటారు.

అమ్మ : పోనీలెండి. మీ మాదిరి జీవకళ అక్కర్లేదు. జీవంలేని శిలలకు చూచారూ జీవం కలవారందరూ పోయి మొక్కుతారు. ఈ జీవం కలవారినందరినీ ఆ చైతన్యం లేని శిలారూపం రక్షిస్తున్నది. అట్లాగే వారు (నాన్నగారు) మన అందర్నీ రక్షిస్తారు. ఏనాటికో ఒకనాటికి మీరు అందరూ వారికి మొక్కేరోజు అంటూ రాకపోదు.

సీతారామయ్యగారు : ఇంకా నయం. వాడికే (నాన్నగారికి మొక్కుతారన్నావు. నాకే (అమ్మకే) మొక్కుతారనలేదు. బతికించావు.

అమ్మ : ఏ రోజు ఎటువంటి రోజు వస్తుందో మనకేం తెలుసు? ఎవరికి ఎవరు మొక్కవలసి వస్తుందో మనకేం తెలుసు?

సీతారామయ్యగారు : ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావు? అమ్మ : నేను భూమిమీదకు రావటానికి కారణం ఎక్కడో, అక్కడే నేర్చా?

మహోదధిలో మణిరత్నాలు – 169

సీతారామయ్య గారితో నడుస్తూ అమ్మ దారిపొడుగునా ఏవో నీతులు చెపుతుంది. “ప్రతి వస్తువుకు గుణమున్నది. ఒక గుణాన్ని ఒక గుణం నెట్టేస్తుంది. కొబ్బరినూనె వున్నది. శరీరాన్ని మెత్తపరచి మురికిని కదిలించి శరీరానికి జిడ్డయి వుంటుంది. కుంకుడుకాయ రెంటినీ శుభ్రపరుస్తుంది. కుంకుడు కాయలో నురుగు ఇమిడి వున్నదనుకోండి. నీళ్ళుపోస్తే కాని బయటకు రాలా. ఇట్లా ప్రతి వస్తువులో గుణభేదము వుంటుంది. గుణభేదమే మంచిచెడ్డలు.”

సీతారామయ్య గారు : ఇదంతా మరిడమ్మగారి బోధా ఏమిటి?

అమ్మ : ప్రతి మానవునికి, ప్రతిజీవికి పుట్టినప్పటి నుండి తెలివి పెరుగుతూనే వుంటుంది. తెలివితో పాటు భాష పెరుగుతుంది. భావాలు రకరకాలుగా వస్తూ వుంటాయి. జన్మత: ఒక్కొక్కడిలో ఒక్కొక్క గుణం విశేషంగా వుంటుంది. ఒకరు నేర్పేదేముంది?

సీతారామయ్యగారు : ఈ మాటలు మరిడమ్మ నాయనమ్మ భక్తులకు బోధిస్తూ వుంటుందేమో!

అమ్మ : మీ తాతగారు రఘోత్తమ శాస్త్రులు గారు మంచి కవిత్వం చెప్పేవారు. నీకు రాలేదేం?

సీతారామయ్యగారు : తాతగారికి వస్తే నాకు రావాలని ఏముంది? అమ్మ : నాకయినా అంతేగా! తాతమ్మ చెపితే నాకు రావాలని ఏముంది? ఇద్దరూ ఇల్లు చేరతారు.

మహోదధిలో మణిరత్నాలు – 170

నాన్నగారి (బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) కళ్ళు ఆకుపచ్చరంగులో పిల్లికళ్ళవలే వుంటాయి. మనసోదరులలో చాలామందికి తెలుసు. అమ్మ సోదరుడు రాఘవరావు మావయ్య, నాన్నగారు సరదాగా మాట్లాడుకున్న సంభాషణలు. మావయ్య (నాన్నగారితో): ఏమిటిరోయ్! నన్ను చూచి భయపడి పోతున్నావా ఏం? ఎవరో ఒక దొంగ లేచిపోయినట్లు పోతున్నావే?

నాన్నగారు : నీకిదే అలవాటు గదూ! నీకింకో రకంగా ఎట్లా కనపడతానురా?

మావయ్య : నేను తమాషాకి దొంగతనం చేసినా నన్ను చూస్తే దొంగని ఎవ్వరూ

అనుకోరు. నీవు చెయ్యకపోయినా దొంగ అనుకోక వూరుకోరు. నీ కళ్ళే చెపుతాయి.

నాన్నగారు : ఏదీ నావైపు తిరిగి అను.

మావయ్య : ఏం? నీవైపు చూస్తే దడుస్తాననుకున్నావా? మా ఇంట్లో చాలా

పిల్లులున్నాయి.

అందరూ నవ్వుతారు. నాన్నగారు కూడా నవ్వుతారు.

నాన్నగారు : ఒట్టి కోతి, కోతి మాటలు!

మావయ్య : నాకు ఇదివరకు ఇష్టం లేదు గాని (అమ్మని ఇచ్చి వివాహం

చెయ్యటం), ఇప్పుడు ఇష్టమేరా.

నాన్నగారు : నాకైతేనేం. పిల్లికైతేనేం. ఇవ్వరాదూ. :

మావయ్య : అంతకంటే ఎక్కువగా భావించి ఇవ్వటంలా. పిల్లి మెడలో గంట కట్టబోతున్నాం.

నాన్నగారు: గంట మీ చెల్లిలా?

మావయ్య : నాలుగు మూలలా తెలియాలంటే ఆ గంటే వుండాలి.

(సశేషం….)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!