1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 21
Month : April
Issue Number : 2
Year : 2022

(గత సంచిక తరువాయి)

మహోదధిలో మణిరత్నాలు – 121

బ్రహ్మయ్యగారితో పాటు అమ్మ వారిబండిలో దొప్పలపూడి వరకు వస్తుంది. వాళ్ళ ఇంటి సమీపానికి వెళ్ళి బండి ఆగుతుంది. అమ్మను గూడ దించటానికి ప్రయత్నిస్తారు. అమ్మ “నేను దిగను నాయనా” అంటుంది కాని, బ్రహ్మయ్యగారి

బలవంతం మీద దిగి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతుంది. బ్రహ్మయ్యగారు అమ్మను బండిలోనే మన్నవ వెళ్ళమంటారు.

అమ్మ “వద్దు నాయనా! నడిచి వెళతాను. వెన్నెట్లో బాగుంటుంది” అంటుంది.

బ్రహ్మయ్యగారి పాలేరు “ఏమిటమ్మా నీవు నడిచేది? బుల్లి పాపాయివి!”

అని అమాంతం యెత్తుకుని వెళ్ళి కూర్చోపెడతాడు.

“చూడటానికి పొట్టిగా వున్నాను గాని, చాలా వయస్సుంది”

“చాలా అంటే యెంతమ్మా నీ వయస్సు” అడుగుతుంది బ్రహ్మయ్య గారి కూతురు.

“ఇంత అని చెప్పలేను”

“ఏదీ చెప్పలేను, చెప్పలేను అంటావేమిటమ్మా?” జీతగాడి అయోమయం.

“చెప్పేది కాదు గనుక. చెపితే తెలుసుకుండేది కాదు నాయనా! తెలుసుకుంటే తెలిసేది”

అమ్మ అపూర్వ వివరణ.

మహెూదధిలో మణిరత్నాలు – 122

అమ్మ : నాయనా! ఏమిటి ఆలోచిస్తున్నావు?

జీతగాడు : నామీద నీకు ఇంత ప్రేమ ఎందుకా అని ఆలోచిస్తున్నానమ్మా!

అమ్మ : నాకు ప్రేమ వుండటం సహజమే నాయనా! నా ప్రేమను నీవు గుర్తించటం విశేషం.

జీతగాడు : అయితే నీవు మరియమ్మవా!

అమ్మ : “నీవు ఏసయ్య వేనా?” అనగానే అమ్మ వంక అతను చూస్తాడు. వెంటనే అమ్మకు ముద్దు వచ్చి దగ్గరకు వెళ్ళి “నాన్నా!” అని తలకాయ లాక్కుని గుండెల్లో పెట్టుకుని చెక్కిళ్ళు సవరిస్తూ “పరిశుద్ధాత్మ” అంటే యిదే నాన్నా! అంటే అర్థమయిందా?”

జీతగాడు : లేదు తల్లీ!

అమ్మ : నిన్ను నేను దగ్గరకు తీసుకున్నప్పుడు నీ మనసు ఎట్లావుంది?

జీతగాడు : అమ్మ దగ్గర వున్నట్టు వున్నదమ్మా!

అమ్మ : నేను నీ అమ్మనని అనిపించలేదా? జీతగాడు : చెప్పటం చేతగాదమ్మా, ఆ భావాన్ని వ్యక్తపరచలేను. చెప్పలేక ఇట్లా అంటున్నా!

ఆ జీతగాడి పేరే మంత్రాయి.

మహోదధిలో మణిరత్నాలు – 123

అమ్మ మంత్రాయికి కమలాపళ్ళు ఇస్తుంది.

అమ్మ : నేను వలిచి నోట్లో పెట్టనా?

మంత్రాయి : వద్దమ్మా, నేను వొలుచుకు తింటా, నీకు యెంగిలి అవుతుంది.

మీరు బ్రాహ్మలు గదా. యింత దగ్గరకు తీసుకుంటావేమ్మా!

అమ్మ : అడుగడుగునా నీ భావాలు మారిపోతుంటయ్యా నాయనా? ఒకసారి అమ్మ అంటావు. ఒకసారి బ్రాహ్మలు అంటావు.

మంత్రాయి : “నాకు అనేకరకాలుగా తోస్తుంటుందమ్మా. రాత్రి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నీవు దేవుడువేమో అనిపించింది. నిన్ను చూచేటప్పుడు ఒకరకంగా తోస్తుంది. నిన్ను గురించి ఆలోచించేటప్పుడు ఇంకొకరకంగా తోస్తుంది”. 

“మా వూరుకు అగ్రహారీకులు వచ్చి అప్పుడప్పుడు రామాయణం చెప్పి పోతూ వుంటారు. అది వింటూ వుంటే నాకు సీతమ్మవారి లాంటి అమ్మ ఎప్పుడయినా కనపడితే బాగుండును అని అనుకునేవాడిని. మీరు మంత్రాయి అని పిలిచినప్పుడు మొదట ఆ పేరు నాకు పున్నయ్యగారు పెట్టారు. నేను మీతో ఆ పేరు చెప్పలేదు కదా. మీరు ‘మంత్రాయి’ అనగానే మీవైపు చూసి నిండు రంగు ఆకుపచ్చని చీర, ఎర్రని రవిక ఆ చెట్టు కింద రెండు మోకాళ్ళమీద చేతులు పెట్టి తల వంచుకుని జుట్టు విరబోసుకుని నా కోసముగా కూర్చున్న సీతమ్మ వారనిపించింది. తలమీద చెయ్యి పెట్టినప్పుడు కూడ సీతమ్మవారి లాగానే వున్నావు. లేచి చూస్తే మామూలు చిన్న అమ్మాయిలా కనుపించావు.”

మహోదధిలో మణిరత్నాలు – 124.

అమ్మ మంత్రాయితో “నీకు పెళ్ళయింది కదూ! నీ వయస్సు పదిహేను అని చెప్పావు కదా!”

“అయిందమ్మా!”.

“నీవు చెప్పిన వయస్సు పొరపాటే. దాదాపు యిప్పుడు నీకు 27 సంవత్సరాలు వయస్సు వుంటుంది.”

“నాకు గుర్తు లేదమ్మా! వయస్సుతో మాకు లెక్క యేముంటుంది? నా తరువాత ముగ్గురు పుట్టారని, నలుగురు పుట్టారని అనుకుంటాము.” “నీకొక అమ్మాయి పుట్టిందా మంత్రాయి?”

“అవునమ్మా! మొన్న ఈ మధ్యనే పుట్టి పోయిందమ్మా. నువ్వు ఎవరివో ఏమిటో చెప్పమ్మా. నేను చేసే ప్రతి పనీ చూస్తూనే వుంటావా?”

“నువ్వొక్కడివేనా! అందరూ నీవంటి వాళ్ళేగా!”

“అయితే ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులో, ఏమేమి చేస్తుంటారో, ఎవరికి ఎంతమంది పిల్లలో, అన్నీ తెలుసుగా! నీకు రెండేగా కళ్ళు. చిట్టి చిట్టి కాళ్ళు, చేతులు, రబ్బరు బొమ్మల్లే వున్నావు!”

మహోదధిలో మణిరత్నాలు – 125

అమ్మ గిన్నెలో నానపోసిన మినప్పప్పు తీసుకెళ్ళి దొడ్లో కడుగుతూ వుంటుంది. ఇంతలో సీతాపతి తాతగారు లేచివచ్చి “నువ్వేమిటమ్మా పనిచేస్తున్నావు?” అని అడుగుతారు.

“ఎందుకో ఈవేళ పప్పు కడగాలని బుద్ధి పుట్టింది. అందుకని కడుగుతున్నాను” అని చెప్పి, పప్పు పిసుకుతూ తాతమ్మతో “తాతమ్మా! ఈ నీరెందుకు పచ్చబడ్డది? పప్పు పిసకంగానే పొట్టు వూడుతున్నది. పొట్టుకున్న రంగు నీటికి వచ్చింది. సాంగత్యబలమంటే యిదేనా? నీరేగా పొట్టును, పప్పును విడదీసింది? విడదీయ గలిగింది గాని దాని సహజమైన రంగు మారక తప్పలేదు. ఒక దాని స్వభావము మార్చగల శక్తి మరొకదానికి వున్నప్పటికీ ఆ శక్తిలో మరొక శక్తి కలవక తప్పదు. శక్తి రకరకాలుగా వుంది. చివరకు అంతా ఆ శక్తే. ఈ శక్తేనేమో భగవంతుడంటే! దీనికే తలొక పేరు పెట్టుకున్నారు. పేరుకు కూడా శక్తి వున్నది కదా! భావానికి రూపం వున్నది. రూపానికి పేరు వున్నది. ఆ రూపానికి శక్తి వున్నది. ఇందులో ఏదీ తక్కువది కాదు”

“ఏమిటమ్మా! ఎవరో అడిగినట్టు చెప్పుకు పోతున్నావు?”

“నీకు చెపితే నీవు సమాధానం ఇవ్వలేదు. అందుకని, పప్పుతో, పొట్టుతో, నీటితో, గిన్నెతో మాట్లాడుకుంటున్నా. వాటికీ చైతన్యముందిగా! మాట్లాడాలంటే మనుషులతోనే అక్కర్లేదు. వాటితో కూడా మాట్లాడవచ్చు. వాటి భాష మనకు అర్థం కాకపోవచ్చు. ఒక చెట్టు దగ్గరకు పోతే వచ్చావా అన్నట్టు పలకరిస్తుంది. అది మనం గ్రహించలేం కదా!”

(సశేషం….)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!