1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : April
Issue Number : 2
Year : 2023

(గత సంచిక తరువాయి)

మహోదధిలో మణిరత్నాలు – 149

అమ్మ మౌలాలీతో “ఏమిటి మౌలాలీ నీలో నీవు మాట్లాడుకుంటున్నావు?” అని అడుగుతుంది.

“ఏమీ లేదమ్మా! నేనుకూడ భగవంతుడ్నేనని గుర్తిస్తున్నాను. అదే బ్రహ్మంగారి తత్త్యాలలో చెప్పేది. నేనే బ్రహ్మనురా అనేగా!”

“అయితే నీవు బ్రహ్మవైనావన్న మాట.”

“నిన్ను బ్రహ్మంగా గుర్తించాను గనుక నేను బ్రహ్మనైనాను. ఏమిటోనమ్మా ఇప్పుడు అంతా తెలిసిపోయినట్లుంది. ఎక్కడా గోడలు అడ్డం లేవు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వుండగలనమ్మా!”

“నిన్నటికీ, ఈ రోజుకూ వచ్చిన మార్పేమిటి మౌలాలీ?” 

నిన్న యీ స్థితి లేదుగదా! నీకు తెలియకుండా నాకు తెలుసా అమ్మా? ఏదయినా నీవు ప్రసాదించిందే.” “నాకేం తెలియదు నాయనా!”

“అవును పాపం! నీకేం తెలుసు చిట్టితల్లివి. అనేక రూపాలతో ప్రపంచం చుట్టూ ముట్టడేశావు.”

మహోదధిలో మణిరత్నాలు – 150

అమ్మ అన్నం తీసుకుని తోటలోకి వెళుతుంది. మౌలాలి భోంచేస్తాడు. ఇంకా చాలా జంతువులకు కూడా ఆహారం వేస్తుంది అమ్మ. అది చూసి మౌలాలీ అమ్మతో “నీ వాలకం చూస్తే కాశీ అన్నపూర్ణమ్మ తల్లివలే వున్నావమ్మా!” ఒక్కరికి అన్నం తెచ్చి ఇంతమందికి పెట్టావు. ముందు ముందు అంతే చేస్తావనుకుంటా” అంటాడు.

అమ్మ: నీకే నయం మౌలా! రాబోయే సంగతులు తెలుస్తున్నాయి. మౌలాలీ: నీ దయవుంటే తెలియకేమమ్మా! అమ్మ: నా దయ ఏమిటి?

మౌలాలీ: నీ దయ లేకపోతే… ఎక్కడో తోటలో కూర్చుని భగవంతుడితో అన్నం తెప్పించుకు తింటున్నానమ్మా! నిన్ను గుర్తింపజేశావు కదా! అసలు యథార్ధం చెప్పమంటావా? నిన్ను చూడకముందే నాకు బాగా దృష్టి దోషం కూడా వుంది. నాకు స్ఫోటకం పోసి చూపు పోయింది. నిన్ను చూడటమే నా దోషం పోవటం.

అమ్మ: దృష్టి దోషమంటే చూచేదా? చూచి గ్రహించే దృష్టా? మౌలాలీ: చూచేది వేరు, చూచి గ్రహించేది వేరా అమ్మా? అమ్మ: చూచేది కళ్ళు. చూచి గ్రహించేది మనస్సు.

మహోదధిలో మణిరత్నాలు – 151

మౌలాలీ: సరేగాని అమ్మా! మొన్న నీ నెత్తిన గొడుగల్లే పాము ఉన్నదే ఎందుకని? అమ్మ: ఏమో మౌలాలీ! మొన్న ఈ మధ్య నాకు కూడా అంతటా పామే కనపడ్డది. చివరకు శివాలయం వాకిలి ముందర నుంచున్నా ధ్వజం వంక చూస్తే ద్వారం పొడుగునా కనపడ్డది. నా పాదాల దగ్గర నుండి గుడి వాకిలి దాకా వున్నది. చివరకు ఇదేమిటని తోచింది. ఇదంతా నాలోదేననిపించింది. నాలో ఎక్కడున్నదని నాలో నాకే ఆలోచన వచ్చింది. పాము చుట్టలు చుట్టుకుని పడగ ఎత్తి నుంచున్నప్పుడు ఎట్లా వుంటుంది? మనిషి కూర్చున్న ఆకారంగా వుంటుంది. అదే “బ్రహ్మదండి” అంటారు. వెన్నెముక క్రిందుగా వుంటుంది ఆనాడి. అదే “సుషుమ్న”. పాము ఆకారం ఎట్లా వుంటుందో మన శరీరంలో వుండే “సుషుమ్నానాడి” అట్లాగే ఆపాదమూ వుంటుంది. దానికి కేంద్రస్థానము నడుము దగ్గర్నుంచి శిరస్సు దగ్గరకు చెప్పారు. అంత మాత్రం చేత నీ శరీరమంతా లేదని కాదు. కొందరు సాధకులు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా గుర్తిస్తారు. అదే “కుండలినీ ప్రబోధమని” పడుకున్న పామును కొడితే తలెత్తి బుసకొట్టినట్లుగా! అదే సహస్రారానికి వెళ్ళిందంటారు. స్థానాల్లో కేంద్రీకరణ ఎందుకంటే ఒకే స్థితికి అనేక సదుపాయాలు. ఒక మేడకు నాలుగువైపుల మెట్లు వేసినట్లు. మౌలాలి: అయితే బయట సర్పమల్లే కనపడటమెందుకమ్మా?

అమ్మ: లోపల ఏదో వెలుపలా అదేనని. రెండు కాదని.

మహోదధిలో మణిరత్నాలు – 152

మౌలాలీ అమ్మతో: “ఇవన్నీ నాకొద్దమ్మా! నీవు దేవుడివి… కాదు కాదు, నీవు అమ్మవు నేను బిడ్డను. అన్నీ నీవు చేయిస్తున్నావు. నేను చూస్తున్నాను అనేది చాలా హాయిగా వుంటుంది. ప్రతిదీ దానంతటది కలుగుతుందన్నారుగా అమ్మా. సరేగాని నా చేత ఇట్లా గుర్తింప చేశావనుకో. నిన్ను ఇట్లా గుర్తించని వాళ్ళు కూడా వుంటారుగా. ఎవరు ఎట్లా వున్నా నీ కరుణ ఒకటేగా అమ్మా! అందరూ ఒకటిగానే ఒక్కసారిగా నిన్ను గుర్తించే రోజు వస్తుందా అమ్మా? అది నేను చూస్తానా అమ్మా! అబ్రహ్మదండిని కూడ సృష్టించింది నీవేకదా! అది నీకు కనపడటమేమిటి? మాకు బోధచేయటం కోసం ఇవన్నీ ఆధారంగా తీసుకుని చెపుతున్నావు. సూదిమోప సందులేకుండా వున్న అమ్మవు. సూదై కూర్చుంటివి. “నిన్ను సరిగా వాడుకోవటం కార్యభారం, ఈ యాతన ఎందుకమ్మా?” అమ్మ: భరించలేనప్పుడేగా బాధ? భరించలేనిదే బాధ.

చేతకాకపోతే విరగదీసి పెడతాం”. ఇన్ని ఎందుకు పెట్టుకున్నావు? ఇంత

మహోదధిలో మణిరత్నాలు – 153

మౌలాలీ : అమ్మా! నీకు కూడా పెళ్ళి అవసరమా?

అమ్మ: ఇప్పుడేగా చెప్పావు. సూదినయి కూర్చున్నానని. సూది అయిన తరువాత అన్నీ కుట్టాలన్నావు కదూ?

మౌలాలీ : ఏమిటో పిచ్చి ప్రశ్నలు నావి! ఏ ఆదర్శం కోసం అమ్మా పెళ్ళి? నీకు ఆదర్శమే కానీ చూచేవాళ్ళకు బాధే. మొన్న మీ వాకిటికి మధూకరానికి వచ్చినప్పటినుంచీ ముందు ముందు ఎక్కువ బాధలే సృష్టించుకున్నావేమో అనిపిస్తున్నది. అమ్మ బంధువులనందరినీ ఇలా సృష్టించుకున్నదేమో అనిపిస్తున్నది. తనకోసం బాధపడే తల్లిని ముందుగానే పంపించింది అని. ఇవన్నీ నాలో నాకే తోస్తూ వుంటాయి తల్లీ! నేను మెట్రిక్యులేషన్ చదువుకునేటప్పుడు ఒకరోజు స్కూలుకు వెళ్ళివస్తుంటే మొదటిరోజు మీరు కనిపించిన దృశ్యం కనుపించింది. మళ్ళీ ఎంత చూద్దామనుకున్నా కనుపించలేదు. నాకు తెలియకుండానే “అమ్మా” అనే నామం ఆరోజు నుండి జపం అవుతూనే వుంది. ఆనాడే కనపడి మంత్రోపదేశం చేసి అదృశ్యమయినావు. ఆ జపం ఈనాడు ఫలించింది.

మహోదధిలో మణిరత్నాలు – 154

అమ్మ: బాగా పొద్దుగూకిపోయింది. ఇంటికి వెళతాను మౌలా. నంబూరు వెళ్తానేమో నాలుగు రోజుల్లో. నువ్వు కూడా వస్తావా?

మౌలాలీ: నువ్వు రమ్మంటే వస్తానమ్మా! రాకపోయినా వుండగలను ఇప్పుడు. ఇదివరకల్లే కాదు – ఎప్పుడూ సాన్నిధ్యమే గనుక. సాన్నిధ్యాన్ని సాధించాను గనుక చేయిస్తున్నావు. నేను వస్తా. నిన్ను సాధించే పనిలేదు.

అమ్మ: నన్ను సాధించకుండానే నా సాన్నిధ్యం నీకు సాధ్యమైందా? మౌలాలీ: లేదు లేదమ్మా! యేదో వక్రంగా మాట్లాడితే నీ నోటివెంట అనేకరకం మాటలు వినవచ్చు. అమ్మ: ప్రతిదీ నీకు తెలిసే మాట్లాడుతావన్న మాట.

మౌలాలీ: అయ్యయ్యో లేదమ్మా! ఏదో అట్లా వచ్చింది. బయల్దేరమ్మా.

మహోదధిలో మణిరత్నాలు – 155

ఒక చండీ ఉపాసకుడు కొల్లమర్ల సూరయ్యగారు తోటలోకి చింత చిగురు కోసం వస్తారు. వచ్చి అమ్మను చూస్తారు. ఎందుకో చింతచిగురు కంటే అమ్మ దగ్గరే వచ్చి కూర్చుందామనిపిస్తుంది. వచ్చి కూర్చుంటారు. అమ్మను చూస్తూ వచ్చి పని మర్చిపోతాడు. ఆయనకు శ్రీవిద్య, తంత్రవిద్యల మీద మంచి అభిమానం. ఎవరినీ సామాన్యంగా ఒప్పుకోడు. ఎందుకో అమ్మను చూస్తే తన ఇష్టదైవమనిపిస్తుంది. ఆయన అట్లా చూస్తూ వుండగానే అమ్మ శిరస్సులో నుంచి రక్తం చిచ్చుబడ్డల్లే వస్తుంది. అదే సమయంలో భృకుటిలో గుండా వస్తుంది. ఈ రెండూ సూరయ్యగారు చూచి ఆశర్యపడి ఆ రక్తధారకు ఆయన చెయ్యి అడ్డం పెడతాడు. ఆ చేతిలో పడ్డ రక్తం చక్కటి సువాసన గల భస్మం అవుతుంది. ఆ భస్మం కాస్తా నాకేస్తాడు.

మహోదధిలో మణిరత్నాలు – 156

సూరయ్యగారు అమ్మతో “ఇది సామాన్యమైన స్థితి కాదు. తపస్సు ఫలించినవాడికి గాని రాదు. దీనికోసం 6 ఏళ్ళు ప్రయత్నించా. చివరకు పొట్టకూటికోసం ఉద్యోగానికి పోయి అన్నీ మరిచాను. ఏడేళ్ళ వయస్సు నుంచీ ఎంతో భక్తిగా అన్నీ చేసుకుండే వాడిని. 23 ఏళ్ళ వరకు సాగింది. ఇప్పుడైనా ధ్యాసపోలేదు. క్రియ లేదు.” ఇంతలో మౌలాలీ లేచి వస్తాడు.

అమ్మ: ధ్యాస క్రియేగా!

సూరయ్య: ధ్యాస కూడా క్రియేనంటావా అమ్మా? అమ్మ: తప్పకుండా!

మౌలాలీ వింటూ కూర్చుంటాడు. విని, విని “ఆమెకు తపస్సేమిటండీ! తపస్సు అంటున్నారు? ఎవరికి ఏ రూపం ఇష్టమో ఎవరికి ఏ స్థితి వుందో దానికి తగినట్లు దర్శనమిస్తుంది. ఎందుకు ఇవ్వగలుగుతున్నదంటే వీటన్నింటికీ మూలం. మూలానికే మూలం. అమూల్యమైన ఆదరణ గల అవతారం. అమృతత్త్వమైన అవతారమని కూడా అనవచ్చు. ఇది నా అభిప్రాయం పంతులుగారూ!”

మహోదధిలో మణిరత్నాలు – 157

సూరయ్యగారు “వెళ్ళొస్తానమ్మా!” అని నమస్కారం చేస్తాడు అమ్మకు. అమ్మ “నాకెందుకు నాయనా నమస్కారం? నీకు నీవు చేసుకో. అచ్చగా నీకు నీవు చేసుకున్నా భగవంతుడికి చేసినట్లే. కనపడే ప్రతి వస్తువుకు చేసినా భగవంతుడికి చేసినట్లే. ప్రతి వస్తువుకు అంటే అన్నానికీ, అశుద్ధానికి కూడా! సరే! నేను వెళ్ళొస్తా” అని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి దాదాపు ఏడు అవుతుంది.

తాతమ్మ “ఇంత సేపా?” అని అడుగుతుంది.

అమ్మ: వెళ్ళిన తరువాత ఆట పూర్తికావొద్దూ?

మహోదధిలో మణిరత్నాలు – 158

అమ్మ పెదతల్లి అన్నమ్మగారు అమ్మతో “మీ నాయన ఎక్కడయినా మంచి సంబంధం చూచి ఇవ్వండని చెప్పి వెళ్ళాడు. మా నెత్తిన పెట్టితే ఎవరు సంబంధాలు వెతుక్కొస్తారు? తాతయ్య పెద్దవాడు. మావయ్య ఇంటిపట్టున వు. వాడికేం సంబంధం వుండదు. అసలు పసివాడు.”

అమ్మ:మావయ్య పసివాడేంటి? అత్తయ్యలు కూడ వస్తే! అన్నమ్మ: ఎంత హేళనగా మాట్లాడావే మెత్తమెత్తగా వుండి? మొత్తం మీద మన్నవ వారి పిల్లవనిపించావు!

అమ్మ: అనిపించేదేముంది? మొత్తం మన్నవవారి పిల్లనే!

పక్కనేవున్న నంబూరు కరణం గోపరాజుగారు (అమ్మ పినతల్లి భర్త) పకపకా నవ్వుతారు.

అన్నమ్మగారు : ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారయ్యా! అట్లా చూచుకుంటే వాడు ఎంతమందికంటేనో బుద్ధిమంతుడు.

అమ్మ: అటువంటి వాళ్లతో పోల్చుకోవటమెందుకు? మంచివాళ్ళతోనే పోల్చుకోరాదూ? గుణానికి మనకంటే ఎక్కువైన వాళ్ళతో, ధనానికి మనకంటే తక్కువైన వాళ్లతో పోల్చుకోవాలి. మన అబ్బాయి కంటే ఎవరు ఎక్కువ తప్పు చేశారా అని వెతుక్కుంటే ఎట్లా?

మహోదధిలో మణిరత్నాలు – 159

నంబూరులో గోపాలరావు గారు దేవీపూజా దురంధరుడు. నిత్యం కుంకుమార్చన, అఖండం వెలుగుతూనే వుంటుంది. అక్కడ వున్న ఇరవైరోజుల్లో అమ్మ పది రోజులు అన్నం ఆయన దగ్గరే తింటుంది.

ఒకరోజు అన్నం విస్తట్లో పెట్టగానే, “నాయనా ఈరోజు అన్నం నేను కలిపేదీ’ అన్నట్లు గోపాలరావు గారికి వినపడుతుంది. ఉలిక్కిపడి “ఎవరూ ఆమాట అన్నది?” అని మూడుసార్లు అంటారు పెద్ద పెద్ద కళ్ళుచేసి. “ఎవరు ఆ మాట అన్నది మీరేనా … మీకు వినపడ్డదా” అంటారు.

సావిత్రమ్మ: నోరు తెరవలేదు కాని అనసూయ గొంతులో నుంచి వచ్చినట్టున్నది ధ్వని. ధ్వని ఈ గొంతులో నుంచే వచ్చింది గాని అది అనసూయ గొంతులో

ధ్వని కాదు. శబ్దం మార్పుగా వుంది. అమ్మ: శబ్దమే ఒకటి – ధ్వనులు అనేకం.

గోపాలరావుగారు బిత్తరపోయి బిత్తర చూపులు చూచుకుంటూ నాలుగు మూలలా వెతుకుతారు. నాలుగు మూలలా “ఎప్పుడో ఒకప్పుడు తేలక పోతుందీ. ఆ తల్లే ఈ రూపంగా వచ్చిందేమోలే కానియ్యి. కలుపమ్మా కలుపు. అసలు ఈ అమ్మాయిని చూచినప్పట్నుండీ అనుకుంటూనే వున్నా. దేవకళ ఉట్టిపడుతూనే వుందని. ఆ జడ, ఆ పరికిణీలు, బాలా త్రిపురసుందరల్లే వున్నది.”

మహోదధిలో మణిరత్నాలు – 160

గోపాలరావుగారు అమ్మను ఒళ్ళోకి లాక్కుని బుగ్గమీద మూతి ఆనించి కళ్ళు మూసుకుంటారు. అట్లాగే రెండు గంటలుంటారు. పిల్లలు అందరూ ఇంటికి పరిగెత్తి యీ స్థితి అంతా చెప్తారు. అందరూ పరిగెత్తుకొస్తారు. గోపాలరావుగారు ఒక చెయ్యి అమ్మ తలమీద ఒక చెయ్యి అమ్మ వీపుమీద వేసుకుని ఉదయం పదకొండు గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు అలాగే వుండిపోతారు. అమ్మ పినతల్లి భర్త అయిన గోపరాజు గారు డాక్టరుగార్ని పిలిపిస్తారు. డాక్టరుగారు చూచి శ్వాసలేదు – నాడి అందటం లేదు అంటారు.

ఈ జనసమ్మర్దం విని మౌలాలీ వస్తాడు. గోపరాజుగారితో డాక్టరు గారు “తేజస్సు చూస్తే ప్రాణం పోయినట్లు లేదు. నాడి అందటం లేదు” అంటారు.

మౌలాలీ వాళ్ళ గందరగోళం చూచి గడ్డం కింద కర్ర పెట్టుకుని మెల్లగా అంటూ వుంటాడు. “ఆ తల్లి మాయ ఎవరు కనుక్కోగలుగుతారు? ఏ బిడ్డకు ఎట్లా దర్శనం కావాలో అట్లా యిచ్చి తరింపజేస్తుంది. ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా కనపడేటట్టు ఇస్తుంది. ఒక్కొక్కళ్లను మామూలుగా వుంచే వాళ్ళ యొక్క స్థితి వాళ్ళకు తెలియకుండానే తరింపజేస్తుంది.”

మౌలాలీ ప్రక్కనున్న నంబూరు హనుమంతరావు గారు విని గోపరాజు గారితో

“ఆ అబ్బాయి ఇట్లా అంటున్నాడని” మౌలాలీ అన్నవన్నీ చెపుతాడు. ఇంతలో గోపాలరావుగారు తల యెత్తుతారు. అమ్మ తల యెత్తి ఇవతలకు వస్తుంది. గోపరాజుగారు గోపాలరావు గారితో “ఏమిటి అన్నయ్యా? అసలు పరిస్థితి?” అని అడుగుతారు.

గోపాలరావుగారు జరిగిందంతా చెప్పి “అమ్మాయి ముద్దు వచ్చింది నాయనా. ముద్దుపెట్టుకుంటే అతుక్కుపోయినట్టు వుంది. తరువాత ఏం జరిగిందీ తెలియలేదు. అమ్మాయి రూపం మాత్రం ఒకటి ఎదురుగా కనపడుతున్నది. అమ్మాయిని బాలాత్రిపురసుందరిగా భావన చేశాను వచ్చినప్పటినుంచి.” “మనోభ్రమ” అనుకుంటూ గోపరాజుగారు వెళతారు.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!