1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 1
Year : 2023

(గత సంచిక తరువాయి)

మహోదధిలో మణిరత్నాలు – 141

సీతారామయ్యగారు దగ్గరకు వస్తారు.

అమ్మ: “ఏం బాబూ కోర్టుకు వెళ్ళలా?” అని అడుగుతుంది.

సీతారామయ్య ఆయన మామూలు పిచ్చి ధోరణిలో మాట్లాడతాడు. అమ్మ ఆయన దగ్గరకు వెళ్ళి పొట్టమీద చెయ్యివేసి “ఏం బాబూ భోంచేసారా?” అని అడుగుతుంది.

అమ్మ సీతారామయ్య గారి పొట్టమీద చెయ్యి వేసి ఏవేవో ప్రశ్నలు వేస్తూ ప్రశ్నకు తగిన సమాధానాలు వస్తూ వుంటే మాట ద్వారా వ్యక్తపరచుకోకుండా మనస్సుతో సమాధానం చెప్పుకుంటున్నట్లుగా ఆనందాన్ని అనుభవిస్తారు చిదంబరరావు  తాతగారు.

సీతారామయ్య గారు ఏ ఆలోచనా లేకుండా అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేస్తారు. ఆయన పిచ్చి నయమయిపోతుంది.

తాతగారు: ఎందుకురా? ఏం కనిపించి నమస్కారం చేశావు సీతారాముడూ?

సీతారామయ్య: మా ఇలవేల్పు కుమారస్వామిలా కనపడ్డది.

తాతగారు: నీవు అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికి గుర్తుతో వచ్చావా? అప్పటికి ఇప్పటికి తేడా వున్నదా?

సీతారామయ్య: వచ్చేటప్పుడు ఎట్లా వచ్చానో తెలియదు గాని, ఇప్పుడు నా తల్లోనుంచి బరువు తీసివేసినట్లు వున్నది.

సీతారామయ్యగారు ఆ రోజు నుండి మామూలుగా కోర్టుకు వెళ్ళి వస్తూ వుంటారు.

మహోదధిలో మణిరత్నాలు – 142

చిదంబరరావు తాతగారితో పున్నమ్మగారు “నాకు బాలా త్రిపురసుందరి విగ్రహం. ఒకటి పెద్దది చేయించి పెట్టండి” అని అడుగుతుంది.

“అంటే ఎంత పెద్దది కావాలి” “మూడు అడుగులు వుండాలి”.

“మనకు వేరే మూడు అడుగుల విగ్రహమెందుకు? మూటికి మూలమైంది, త్రిమూర్తుల కాధారమైందీ, త్రిలోకముల లేనిదీ, త్రిపుటిని రహితం చేసేటటు వంటి బాలాత్రిపురసుందరీ నిగ్రహంగల విగ్రహం ఇంట్లోనే తిరుగుతున్నది. ఆ విగ్రహానికి వేళకు అన్నం, నీళ్ళు చూస్తే చాలు. అన్నిటికి ఆధారమై తన ప్రత్యేక స్వరూపాన్ని ధరించి వున్నది. అటువంటి వాళ్ళు వాళ్ళకై వాళ్ళు కావాలని వస్తారు గనుక మనతోపాటు అతి సహజంగా వుంటారు. వాళ్ళను గుర్తించటం మహా కష్టం”. వాళ్ళే కారణజన్ములు.

“అంటే ఎవరో చెప్పండి. నిగ్రహం గల విగ్రహ మంటిరి. అంత గొప్ప స్థితిగల విగ్రహమెవరో చెప్పండి. అటువంటి విగ్రహానికి ఆకలిదప్పులుండవుగా?”

“మన ఇంట్లో మూడు అడుగుల పిల్ల ఎవరు చెప్పు? గుండ్రటి చేతులు, ఆ పొట్టి పొట్టి పరికిణీలు, ఆ బంగారపు ఛాయ, వంటి నిండా బంగారం, పెద్ద జడ, ఎర్రగా, పల్చటి పెదవులు, పొడవైన కోల కళ్ళు, చక్కటి చిట్టి ముక్కు, పిచ్చిక పొట్లకాయ లాంటి చేతులు. తామరపువ్వు లాంటి హస్తాలు, పారిజాత పూలకన్నా మించిన మెత్తదనం గల పాదాలు ఎవరికి వున్నాయో చెప్పు మన ఇంట్లో?

పున్నమ్మగారు “మీరు చెప్పినవన్నీ లేకపోయినా, కొన్ని లక్షణాలు అనసూయ దగ్గర కనపడుతున్నాయి” అని ఒప్పుకుంటుంది.

“కొన్నేగాదు. చెప్పిన లక్షణాలు అన్నీ వుంటాయి. గుర్తించు. ఇంకా నేను చెప్పటం మర్చిపోయినా, ఇంత చిన్న తనంలో కుంకుమ బొట్టు కనుబొమల మధ్య ఎవరు పెట్టుకుంటారు? అమ్మాయి నడుస్తుంటే చూచావా? ఎంత సువాసన వస్తుందో! ఎప్పుడైనా దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకుంటేగా తెలిసేది?”

మహోదధిలో మణిరత్నాలు – 143

అమ్మ మెల్లగా బయలుదేరి నడచిపోతూ వుంటుంది. భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద చింపిరి గుడ్డలతో ఒక సాయిబు ఎదురు వస్తాడు. అమ్మను చూచి అమ్మ ఎటు నడుస్తుంటే అటు తలతిప్పుతూ కన్ను ఆర్పకుండా అమ్మ వంకనే చూస్తాడు. అమ్మ అతని దగ్గరకు వెళ్ళి “ఏం నాయనా” అని అనగానే చేతులు చాచి అమ్మను తన పొట్టలోకి తీసుకుని తలను గుండెలకు అదిమి పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. “దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత చిన్నపిల్ల వయినావమ్మా! ఇందాక చాలా భారీ మనిషిలాగా కనిపించావు. ఎందుకమ్మా ఇంత త్వరగా మారిపోయావు” అంటాడు.

అమ్మ: నీకు ఏంకావాలో చెప్పు నాయనా?

సాయిబు: నాకు నీవే కావాలమ్మా!

అమ్మ: నేను వచ్చానుగా ఎందుకు ఏడుస్తావు?

సాయిబు: ఏడుపు కాదమ్మా ఆనందం. నేను పుట్టటం సాయిబు ఇంట్లో పుట్టినా ఒక కోమటింట్లో పెరిగాను. ఆ ఇంట్లో అందరూ బ్రహ్మంగారి భక్తులు. అందువల్ల నాకు ఈశ్వరమ్మ అంటే చాలా ఇష్టం. ఈశ్వరమ్మను గురించి చదివేటప్పుడు ఒక రూపాన్ని నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకున్న రూపమే మీలో చూచాను. మీలో చూడటం ఏమిటి? మీరేననుకున్నాను. మీ రూపం చూస్తుంటే క్షణక్షణం జరిగే మార్పు చాలా చిత్రంగా వుంది. ఆ సాయిబు పేరే మౌలాలి.

మహోదధిలో మణిరత్నాలు – 144

చిదంబరరావు తాతగారు: నీవు తల్చుకుంటే ఈరోజు పద్యాలు రాయలేవూ?

అమ్మ: పద్యాలూ రాయలేను, గద్యాలూ రాయలేను.

చిదంబరరావు తాతగారు: ఏం రాస్తావు?

అనసూయోపనిషత్తులు వ్రాస్తావా?

అమ్మ: అనసూయోపనిషత్తులు కావాలి గాని, అనసూయోపనిషత్తులు వ్రాయట మేమిటి?

చిదంబరరావు తాతగారు: అవునమ్మా..! నాకు కనీసం ఆ భావన కూడా రాలేదు.

మహోదధిలో మణిరత్నాలు – 145

అమ్మ భారతాంబగారి చిదంబరరావు తాతగారి కూతురు) కాళ్ళు పిసుకుతూ వుంటుంది. ఇంతలో చిదంబరరావు తాతగారు వచ్చి అమ్మను పిలుస్తారు.

అమ్మ “వస్తున్నా తాతగారూ! పిన్నీ! వెళ్ళి రమ్మంటావా?” అని అడుగుతుంది. “వెళ్ళు. త్వరగా రా! బజారుకెళ్ళి బజ్జీలు తేవాలి. ఉత్తరం పోస్టాఫీసులో వేసిరావాలి” అమ్మ చిదంబరరావు తాతగారి దగ్గరకు వెళ్ళి “ఎందుకు పిలిచారు తాతగారూ?” అని అడుగుతుంది.

“ఏం లేదమ్మా! రేపు వూరికెళతావు కదా!”

అమ్మ: “బజారుకెళ్ళి బజ్జీలు తెచ్చి, వుత్తరం రాస్తుందట. పోస్టాఫీసులో వేసి వస్తా.’ “నీవు కాకపోతే ఎవరిచేతనైనా చేయించునో కూడదూ? వీరాస్వామిని పంపిస్తాలే” అని మనిషిని పంపిస్తారు.

అతడు తిరిగి వచ్చి “అమ్మాయిగారు వద్దంటున్నదండీ” అని చెప్తాడు.

అమ్మ: “నేను వెళ్ళి కొని ఇచ్చి వస్తాలే తాతగారూ! ఎంతలోకి వస్తాను? మళ్ళీ వచ్చి తెల్లవార్లూ మాట్లాడుకుందాం. రేపు 11 గంటలకు గదా ప్రయాణం.”

తాతగారు: “అయినా దానికి అంత పట్టుదల ఎందుకు? నీవు బజారుకు వెళ్ళకు.”

అమ్మ: మనకు కూడా అంత పట్టుదల వున్నట్లేగా! మనం వదిలి పెట్టింది. యేముంది? “ఎక్కడికక్కడ నోరు మూస్తావు. సరే నీ యిష్టం. పోయిరా. రేపు ఎవర్ని పంపుతుందో చూద్దాం మూర్ఖురాలు”.

మహోదధిలో మణిరత్నాలు – 146

పున్నయ్యగారి తోటలో అమ్మ 11 రోజులు ఒకే చెట్టుకింద లేవకుండా కూర్చుంటుంది. 12వ రోజు కళ్ళు తెరిచేటప్పటికి నాలుక విరుచుకు పోతుంటుంది. దగ్గరలో ఎక్కడా మంచి నీళ్ళు లేవు. ఆ చెట్టు మాను వంకనే ఒక అరగంట చూస్తూ కూర్చుంటుంది. మాను పగిలిపోతుంది. ఆ పగిలినప్పుడు వచ్చిన ధ్వని ”ఓంకార ధ్వనిగా, పెద్దమోతగా పిడుగు పడినట్లుగా వూరంతా వినిపిస్తుంది. వెంటనే మేఘాలు పట్టి పెద్ద వర్షం కురుస్తుంది. వూరంతా చల్లబడుతుంది. ఆ సంవత్సరం ఆ గ్రామానికి అదే తొలకరి వాన. అయిదురోజుల కల్లా భూమి అంతా పచ్చబడుతుంది. అమ్మ ఆ వానలో అక్కడే వుంటుంది. అది పగిలినప్పుడు దానిలోనుంచి నురుగు నురుగుగా కారుతూ వుంటుంది. అమ్మ పోయి దోసిళ్ళతో రసం తాగుతూ వుంటుంది. అమ్మ దాహం తీరేదాకా రసం కారుతుంది. దీనినే “తింత్రిణీ సుధ” అంటారు.

“ఆ చింతల్లోని చింతే నా దాహాన్ని తీర్చింది” అనుకుంటుంది అమ్మ. “ఎప్పుడూ నాకు చింతలే కావాలి. చింతే నీడ ఇచ్చింది. చింత అండన యెండ తీర్చుకున్నాను. చింతరసమే దాహం తీర్చింది. రేపు నేను ఈ వూరినుండి వెళ్ళేటప్పుడు కూడ యీ చింతే తీసుకెళ్తా. ఈ చింత నా చెంతనుండి నా మనసుకు ఏ చింతా లేకుండా చేస్తుంది.” అని ఒక పరికిణీ, చొక్కాతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే ఇంకా పదకొండు రోజులు గడుస్తాయి. మహోదధిలో మణిరత్నాలు – 147

మౌలాలికి ఏవేవో కొత్తకొత్త అనుభవాలు కలుగుతూ వుంటాయి ఏ రోజుకు రోజు. “ఈ తల్లి ఈశ్వరమ్మ తల్లికంటే గొప్పది. ఈ తల్లి ఇట్లా లోపల్లోపల ఎంతమందిని తరింప చేస్తున్నదో!” అని అనుకుంటూ వుంటాడు. అమ్మతో “ఏవమ్మా! ఏనాటికైనా ప్రపంచానికి తెలుస్తావా? నీకు తెలియకుండానే నీ శక్తులే బయటకు రప్పిస్తాయిలే అమ్మా! నిన్ను గురించి ఏవేవో ఊహలు వస్తున్నాయి గాని వర్ణించుదామంటే చదువు రాదమ్మా.”.

“కూర్చుంటే ఏదో మైకంగా ఉంటుంది. ఆ మైకంతోనే మాట్లాడక పోయినా నీతో మాట్లాడుతున్నట్లు వుంటుంది. రకరకాల రూపాలు కనపడుతాయి. ఎన్ని రూపాలు కనపడ్డా అన్నీ నీవే అనిపిస్తుందమ్మా! ఎక్కడయినా చెడువాసన వచ్చి మూసుకుంటే వెంటనే అందులోనుంచి మంచి వాసన వస్తుంది. మంచి వాసన గల వస్తువు ముక్కుదగ్గర పెట్టుకుంటే దుర్వాసన వస్తుంది. తీసివేసినా ఆ వాసన పోదు. ఒక అనుభవమేమిటి? ఏదని చెప్పేది? నా తిండి ప్రమాణం కూడా నాకు తెలియదు. ఆకలి లేదుకదా కొద్దిగా తిందామనుకున్ననాడు ఎక్కువయి పోతుంది. ఆకలిగా వుంది తిందామనుకున్ననాడు పోదు. ఇదంతా ఏమిటి? అది సరే! నిన్ను వదిలివెళ్ళి అడుక్కుందామనిపించటం లేదమ్మా. అన్నింటికీ నిన్నే నమ్ముకు న్నపుడు ఆకలి మాత్రం నీవు తీర్చవూ! ఇవన్నీ చూస్తే “నా ప్రయత్నం” లేదని స్పష్టంగా తేలిపోతుంది.

అమ్మ ఇవన్నీ వింటూ కళ్ళు మూసుకుని తలవంచుకుని అట్లాగే కూర్చుంటుంది.

మహోదధిలో మణిరత్నాలు – 148

మౌలాలి అమ్మను చూస్తూ అమ్మలో కలిసిపోయినవాడిలా చైతన్యం లేనివాడిలాగ, కన్ను ఆర్పకుండా కూర్చుంటాడు. అమ్మ వంటి మీద అనేక రకాల పక్షులు వాలిపోతున్నా కొట్టాలని అనుకుంటాడు కాని కొట్టలేడు. అనేక రకాల పురుగులు పాకుతూ వుంటాయి. తీసివేద్దామనుకుంటాడు. చేతులు లేవవు. కాళ్ళు కదలవు. కనురెప్ప కొట్టటానికి కూడ స్వాధీనం కాదు శరీరం. కనపడ్డది గుర్తిస్తాడే కాని ఏమీ సంకల్పాలు కూడ రావు. అట్లా అయిదురోజులు గడిచిపోతాయి. ఆ రోజు నిండు పౌర్ణమి. రాత్రి 12 గంటలప్పుడు అమ్మ చుట్టూరా చుట్టేసుకుని పైన గొడుగులాగ పడగవిప్పి లెక్క వెయ్యటానికి వీలులేనన్ని శిరస్సులతో అమ్మతలకు అర్థగజం ఎత్తున అనేక రంగులతో ఆ వెన్నెల కాంతిలో మెరిసిపోతూ ఆ కాంతిలో తలూపుతూ ఆడుకుంటున్నట్లు కనపడుతుంది. పాము చర్మము గొడుగు గుడ్డలా వుంటుంది. క్రిందివైపున పాము చర్మము గొడుగు కర్రలా వుంటుంది. పామును అమ్మ పట్టుకున్నట్లు, ఇంకా చూడగా శేషశాయి మాదిరిగా అమ్మ పడుకుని కనపడుతుంది. అమ్మకు ఆదిశేషుడు గొడుగై ఎండకు, వానకు కాపాడుతున్నాడను కుంటాడు. ఇంకా చూస్తూ, చూస్తూ వుండగానే అనేక రూపాలు వస్తాయి. అమ్మ వంకనే చూస్తూ వుండగా, రూపాలన్నీ పోయి అమ్మ ఒక్కతే కిరీటం పెట్టుకుని వర్ణించటానికి వీలుకాని రూపంతో అనేకమయిన తలలతో ఒకే అమ్మ కనపడుతుంది.

(సశేషం….)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!