1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 1
Year : 2022

(గత సంచిక తరువాయి)

మహోదధిలో మణిరత్నాలు – 112

అమ్మ – మౌనస్వామి – 1

అమ్మ మౌనస్వామి వారిని ఎవరూ లేకుండా కలుసుకోవాలని ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి వెళుతుంది. అందరూ వెళ్ళిపోయిన తరువాత దొడ్డివాకిలి గుండా లోపలికి అడుగుపెట్టగానే, స్వామి అమ్మను చూసి మాట్లాడతారు. 

“లోపలకు రా అమ్మా ! వాకిట్లో ఎవరూ లేరా”? 

“ఎవరూ లేరు”

అమ్మ స్వామివారి దగ్గరకు వెళ్ళి మౌనంగా నిలుచుంటుంది.

“స్వామీ! మౌనం అంటే ఏమిటీ?” అమ్మ ప్రశ్నిస్తుంది.

“అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి ఈ మౌనం ఆధారం” 

“మీరు మన్నవలో వేసిన యంత్రం రాజరాజేశ్వరా? రాజ్యలక్ష్మీ యంత్రమా?” 

“రాజరాజేశ్వరీ యంత్రమే”

“మీరు అసలు మాట్లాడతారో, మాట్లాడరో అనుకుంటూ వచ్చాను”

“నిన్ను చూడగానే మాట్లాడాలి అనిపించిందమ్మా. ఇంకొకటి కూడా అనిపిస్తున్నదమ్మా! నీవు దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్నావు! నీరాక చాలా గోప్యంగా వుంచుకుంటానమ్మా. నీతో మాట్లాడినట్లు తెలిస్తే వీరంతా 

నన్ను విసిగిస్తారు. నేను మౌనం ప్రత్యేక సాధనగా పెట్టుకోలేదు. కొన్ని అవసరాలు మౌనవ్రతాన్ని ప్రోత్సహించాయి”

(మౌనస్వామి వారు శృంగేరి స్వామి వారి ఆదేశంతో కుర్తాళంలో పీఠం ఏర్పాటు చేసి స్థాపించినవారు)

మహోదధిలో మణిరత్నాలు — 113.

అమ్మ – మౌనస్వామి – 2

అమ్మ మౌనస్వామి గారితో “అది సరేగానీ మీరు అందరికీ బాల మంత్రం యిస్తూవుంటారా? మీరు బాల చెప్పినవాళ్ళందరికీ నేను అజపం చెపుతా.”

స్వామి ఆశ్చర్యంగా అమ్మను చూస్తూ అక్కడున్న రుద్రాక్షమాల ఇటునుంచి అటు తిప్పేస్తారు. “ధన్యోస్మి, ధన్యోస్మి” అంటారు. “అజపమంటే యేమిటమ్మా?”

“నోటితో వుచ్చరించనిది.”

“అటువంటి దానిని యెట్లా చెపుతావు?”

“చెప్పటమంటూ వచ్చినప్పుడు మాటలతో చెప్పినా చేసేటప్పుడు మాటలు లేకుండా చేసేది.”

ఇంతలో ఎవరో వస్తున్నట్లుగా శబ్దం అవుతుంది. “వెళ్ళమ్మా, వెళ్ళు” అని స్వామి అమ్మను త్వరబెడతారు.

“ఎందుకూ వెళ్ళటం? నన్నేమయినా అంటారనా? మిమ్మల్నేమయినా అంటారనా?” అడుగుతుంది అమ్మ. అంతటి స్వామిలోనూ కాస్త కంగారు. “ఎవరూ ఎవరినీ ఏమీ అనరు. నా నిష్ఠకు భంగం వస్తుందని.”

ఇంతలో బందా ఆదినారాయణగారు వచ్చి తలుపులు గట్టిగా నెడతారు. 

స్వామివారు మామూలుగా ఎప్పుడూ లోపల గడియ పెట్టుకొనరు. కానీ ఆనాడు తలుపులు తెరుచుకోవటంలో జరిగిన ఆలస్యానికి ఆయన ఆశ్చర్యపోతారు. అంతలో అమ్మ దొడ్డివాకిలి గుండా వెళ్ళిపోతుంది. స్వామి గడియ తీస్తారు.

మహోదధిలో మణిరత్నాలు – 114

అమ్మ పినతల్లి శేషమ్మగారు అమ్మకు తలంటి పోసి క్రొత్త పరికిణీ, చొక్కా, తొడిగింది. పూరీలు చేసి మరిడమ్మగారినీ, అమ్మనూ పిలిచింది పెట్టేందుకు.

“పిన్నీ – నాకు పెట్టేబదులు… ఆ విస్తళ్ళలో ఏరుకు తింటారే వాళ్ళకు పెట్టరాదూ వాళ్ళకు విస్తళ్ళలో ఏనాడూ ఇలాంటి పదార్థాలు దొరకవు గదా. మనం ఎప్పుడయినా తినవచ్చును” అన్నది అమ్మ జాలిగా.

“ముందు నువ్వు తినమ్మా.. తరువాత వాళ్ళ విషయం చూద్దాము”

“వాళ్ళు తింటే నేను తిన్నట్లే పిన్నీ. ముందు వాళ్ళు తింటే తరువాత నా విషయం చూడవచ్చునులే.”

శేషమ్మగారు యింకేమీ మాట్లాడలేక యింకా నాలుగు పూరీలు అమ్మ చేతిలో పెట్టింది. అమ్మ సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళి వాటిని యానాదులకు పెట్టి, ఇంట్లో వున్న తన చొక్కా పరికిణీ కూడా తీసుకు వెళ్ళి యిచ్చి వాళ్ళు ఆ పూరీలు తింటూవుంటే వారి కళ్ళల్లో మెరిసే కృతజ్ఞతా పూర్వకమైన తృప్తినీ ఆనందాన్నీ చూసి తాను కూడా మురిసిపోయింది.

మహోదధిలో మణిరత్నాలు – 115

అమ్మ, మరిడమ్మ తాతమ్మా మన్నవ నుంచి చేబ్రోలు బయలుదేరతారు. భోంచేసి, మూటలు కట్టుకుని నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుంటూ ముందు తాతమ్మగారు, అమ్మ తాతమ్మ కన్నా మెల్లగా రెండు ఫర్లాంగుల వెనుకగా కాలవల్నీ, చెరువుల్నీ, కట్టల్నీ, చూచుకుంటూ “ఇదంతా నేనే” అనుకుంటూ లాకుల దగ్గరకు వెళ్ళింది. అక్కడకు చేరేటప్పటికి పడవకాస్తా వెళ్ళిపోతుంది. ఆ రోజు లాకుల దగ్గరే పడుకుని వెళదామనుకుంటుండగా ఇంకొక పడవ కొత్తది ఆరోజే ప్రారంభం చేస్తారు.

పడవ మనిషి అమ్మదగ్గరకు వచ్చి “అమ్మాయి! మీరు ఏవూరు వెళతారు?” అని అడుగుతాడు.

“మేము అక్కడ నుండి వచ్చేలోగా పడవ కాస్తా వెళ్ళిపోయింది. చేబ్రోలు వెళ్ళాలనుకుంటున్నాము.”

“మా పడవ చేబ్రోలే పోతుంది. ఈరోజే మొదలు పెట్టాం. బోణీ కొడుదువుగాని రామ్మా” “నేనెక్కితేనే బోణీయా? ఎవరెక్కినా బోణీనేగా?”

“ఎవరెక్కినా బోణీయే అనుకో. వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అయినా నీవు యెక్కితే బాగుంటుందనిపిస్తున్నది.”

మహోదధిలో మణిరత్నాలు – 116

మరిడమ్మ తాతమ్మతో పాటు మంత్రోపదేశం పొందిన సుబ్బాయమ్మ గారు సన్యాసిని. ఆమె పోయిందనే వార్త విని తాతమ్మ, అమ్మ చేబ్రోలు వస్తారు. సుబ్బాయమ్మ గారితో పాటు సీతాయమ్మ గారని ఒక ఉగ్ర తపస్విని 12 సంవత్సరాలు నేల భోషాణంలో వుండి లేవకుండా తపస్సు చేసిందని ప్రసిద్ధి. ఆమె తీవ్రమైన కోపదారి. క్షుద్రమంత్రాల యందు ఆసక్తి ఎక్కువ.

అమ్మ ఆమెతో “మీకు ఎవరో క్షుద్రమంత్రగాళ్ళు కోపమనే గ్రహాన్ని పంపకం చేసినట్టు వున్నారు. అదీగాకపోతే ఎవరో క్షుద్రమంత్రగాళ్ళు చచ్చిపోయి మీకు పట్టివుంటారు. అది మీకు నయంకాదు. పీల్చి పిప్పి చేస్తుంది. ఏ భూతవైద్యుల వల్ల కాదు. ఏ డాక్టర్లవల్ల కాదు. ఆగ్రహాన్ని నయం చేయాలంటే నిగ్రహం కలవాళ్ళ వల్లే కావాలి. కోపదారులను జయించాలంటే శాంతము గలవాళ్ళే జయించాలి.”

సీతాయమ్మ: “ఇవన్నీ తెలిసిన మాటలా, తెలియని మాటలా?”

అమ్మ: “ఎవరివి”

“నీకు తలతిక్క ఎక్కువల్లే వుందే అమ్మాయి!”

“నాకున్న అన్నిపాళ్ళు నాకంటే కాస్త ఎక్కువుంటే కాని నన్ను కనుక్కోలేరు”

మహోదధిలో మణిరత్నాలు – 117

అమ్మా తాతమ్మా చేబ్రోలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఉదయం పదిన్నరకు భోంచేసి చేబ్రోలు వంతెన మీదకు వెళతారు. అక్కడ వారిని విచారిస్తే పడవలు వెళ్ళిపోయినవని తెలుసుకొని నడిచిపోవటానికి నిశ్చయించుకుంటారు. కొంతదూరం పోయిన తరువాత అమ్మకు దాహం వేస్తుంది.

తాతమ్మ “కూర్చోమ్మా చూస్తాను. కాసేపు కూర్చుంటే అలసట తీరుతుంది. పొరపాటు చేశాను. మరచెంబులో మంచినీళ్ళు తేవలసింది. నడిపించటమే కాకుండా వెన్నపూన వంటి పాదాలు, ముఖము చూడు. కుంకుమ రంగయిపోయింది” అని బాధపడుతూ మూటలో ఉన్న ఒక్క నారింజపండూ అమ్మ చేతికి ఇస్తుంది. అమ్మ అది వలుస్తుండగా జారి క్రింద పడి తీసుకోటానికి వీలులేనంత దూరంలో పోయి ఆగుతుంది. అది ఆగినచోట కొండచిలువ చుట్టుకుని పడుకుని వుంటుంది.

అమ్మ మరిడమ్మ తాతమ్మతో: “కాలవ నిండా నీళ్ళు వున్నా రేవు లేదు. ఇంత కాలవలో నాకు కావలసిన చెంబుడు మంచి నీళ్ళు దొరకలేదు. నామీద ప్రేమ గలదానివి నీవు వున్నావు. కాలవనిండా నీళ్ళు వున్నాయి. నారింజకాయ ఇస్తే జారిపోయింది. పడవకొస్తే అది అందలేదు. ఎంత ప్రేమగల వాళ్ళు ఉన్నా, యెన్ని వున్నా బాధపడే యోగ్యత వున్ననాడు ఎవరూ తప్పించలేరు.”

మహెూదధిలో మణిరత్నాలు – 118

అమ్మ, మరిడమ్మ తాతమ్మ చేబ్రోలు నుండి ప్రయాణం చేస్తూ దారిలో సంకా ప్రకాశరావు గారింట్లో ఆ రాత్రి బస చేస్తారు. ప్రకాశరావు వదిన అమ్మ దగ్గర వున్న నగలపై కన్నేసి అమ్మకు హాని తల పెట్టటానికి కూడా వెనుకాడడు. ప్రకాశరావు భార్య ఆమెతో “అబ్బా! అట్లా అనబోకు, నేను వినలేను. ఆ అమ్మాయిని చూస్తే ఏదో దేవతా కళగా వుంది. ఆ వొళ్ళు చూశావా ఎట్లా మెరుస్తున్నదో! మైదాపిండి మాదిరిగా వుంది ముట్టుకుంటే!” అని మనసులో “ఏ దేవతన్నా అడ్డుపడి ఈ బిడ్డను కాపాడితే బాగుండు” నని అనుకుంటూ అమ్మ కాళ్ళు వత్తుతుంది. అమ్మ నిద్రపోతున్నది అనుకుని “బంగారు తల్లి చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నదో! ముఖం పాలు గారుతున్నది” అనుకుంటూ అమ్మ ముఖం వంక చూస్తూ కూర్చుంటుంది. అమ్మ తలకు వెనక భాగంలో ఒక చక్రం తిరుగుతున్నట్లుగా కనపడుతుంది. ఆమెకు చూస్తున్న కొద్దీ సూర్యకిరణాలు మాదిరిగా ఆ చక్రంలో నుంచి తన హృదయంలోకి జొరబడి పోతుంటాయి.

ప్రకాశరావుగారి భార్య “ఎంత దివ్యానుభూతి పొందుతున్నాను! కాలచక్రం తిరిగిపోతున్నదని చెప్పటమా? ఏమీ తెలియటంలేదు” అని పరవశించిపోతుంది. 

మహోదధిలో మణిరత్నాలు – 119

అమ్మ పినతండ్రిగారయిన మన్నవ రామబ్రహ్మంగారు ఒకసారి అమ్మను శ్రీ వాసుదాస స్వామివారి దర్శనార్థం తీసుకువెళ్ళి అమ్మను కూడా నమస్కారం చేయమన్నారు.

అమ్మ నమస్కారం చేసింది. స్వామివారు అమ్మ శిరస్సుపై చేయి వేసి గోముగా నిమురుతూ “ఎవరీ అమ్మాయి?” అన్నట్లు రామబ్రహ్మంగారి వంక చూచారు. రామబ్రహ్మంగారు “మా అన్నగారి కుమార్తె, తల్లి లేదు” అని పరిచయం చేశారు.

“అట్లాగునా పాపం” అని సానుభూతి ప్రకటిస్తూ అమ్మను తన దగ్గరకు తీసుకుని

అమ్మ తలను తన గుండెలకు అదుముకొని. “ఏమమ్మా – నీకు అమ్మ లేదుగా. అందరికీ నీమీద ప్రేమ ఉండేటట్లు ఆశీర్వదించేదా?” అని స్వామివారు అడిగారు. “వద్దు. నామీద ఎవరికి ప్రేమ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం అందరి మీదనూ ఎల్లపుడూ ప్రేమ ఉండేటట్లు ఆశీర్వదించండి” అన్నది అమ్మ చిన్నగా.

“అదేమిటమ్మా?! నీ కోరిక బలే విచిత్రంగా ఉన్నదే! నీమీద ప్రేమ అవసరం లేకపోవటమేమిటి? నీకు అందరిపైనా ప్రేమ అనుక్షణమూ ఉండటమేమిటి?” అని అడిగారు అత్యాశ్చర్యంతో.

“ప్రేమ అంటే ఏమిటో తెలియాలంటే నాకు ఉంటేనేగా తెలిసేది. ఇతరులకు ఉంటే నాకేమి అర్థమవుతుంది?” అన్నది అమ్మ ప్రశ్నార్ధకంగా.

“పోనీ నీకేమి కావాలో చెప్పు” అని అడిగారు.

అమ్మ ఏమీ ఆలోచించకుండానే వెంటనే “ఏమన్నా కావాలనేది అక్కర్లేకుండా కావాలి” అన్నది. స్వామివారు దిగ్భ్రాంతి చెందారు. వారు ఎన్నో శాస్త్రాలు చదివారు. ఎన్నో వేదాంత గ్రంథాలు పఠించారు. వారి కెక్కడా ఆమాట కనుపించలేదు.

మహోదధిలో మణిరత్నాలు – 120

దొప్పలపూడి వాస్తవ్యులు కావూరి బ్రహ్మయ్యగారు వాసుదాసు గారి దర్శనం చేసుకుని ఎద్దుల బండిలో వస్తూ అమ్మను చూసి బండిలో ఎక్కించుకుంటారు. బ్రహ్మయ్యగారి కూతురు తల్లితో “ఇదిగో ఇప్పుడు చూడు, చూడమ్మా చూడవే, తొందరగా చూడవే, ఆ అమ్మాయి ముఖం చూడు యెట్లా మారుతున్నదో? నేను పూజ చేసుకుంటానే పటము. ఆ పటములో పోలిక వున్నదో లేదో చూడు” 

బ్రహ్మయ్యగారు: ఏమిటో గొడవ. నాకంతగా అర్థం గావటంలేదు. ఎవరి పటం అమ్మాయి నీవన్నది. ఏ పోలికమ్మాయి నీవన్నది. ఇటు తిరుగు అమ్మాయి. ఆ … నిజమేనమ్మా అమ్మా కనకదుర్గా నువ్వేనా?” అంటూ కొడుకుతో ” ఒరే దణ్ణం పెట్టరా. ఇప్పుడైనా నీకు మంచిరోజులు వస్తయ్యేమో” బ్రహ్మయ్యగారి కుమారుడు అమ్మ కాళ్ళమీద పడతాడు. బ్రహ్మయ్యగారి భార్య నమస్కారం చేస్తుంది.

బ్రహ్మయ్యగారి కూతురు అమ్మను చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ వుంటుంది. ఆమె ఒడిలోని మూడేళ్ళ బిడ్డ అమ్మ పాదాల మీద వాల్తాడు.

– (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!