(గత సంచిక తరువాయి)
‘మహోదధి’లో మణిరత్నాలు – 106.
అమ్మకు 10వ సంవత్సరము వస్తుంది.
అమ్మను తెనాలి తీసుకువెళ్లటానికి సీతాపతి తాతగారు నిశ్చయం చేసుకుంటారు. సరిగా ఆ రోజుననే తెనాలి నుండి అమ్మ అమ్మమ్మ జానకమ్మగారు వస్తారు. ఎదురుగా వచ్చిన అమ్మను చూచి ఆమె చేతులు ముందుకు చాచి ఎత్తుకోబోతుంది.
అమ్మ ఆమెకు అందక రివ్వున లోపలకు పరుగెత్తి లోకనాధం బాబాయి చెయ్యి పట్టుకుని దొడ్లోకి తీసుకుని వెళ్ళి, “లోకం – నీతో రోజూ ఎవరు ఆడుకుంటారు? పాపనేమో అత్తయ్య సరిగా చూడదు. వేళకు పాలు ఇవ్వదు” అని బాధపడుతుంది. “మా మీద నీకెందుకు అనసూయా యింత ప్రేమ. మేము నీకు ఏమీ చెయ్యటం లేదుగా!” లోకనాధం బాబాయి అడుగుతాడు అమాయకంగా.
“ప్రేమ నాకు సహజం లోకం. ఎవరు కష్టపడుతున్నా నాకు అట్లాగే వుంటుంది. మీరు నాకేదో చెయ్యాలని నేను ఎప్పుడూ కోరుకోను.” అని బాబాయి చెయ్యి పట్టుకుని “నీవు దిగులు పడవద్దు. పాపను జాగ్రత్తగా చూడు నీవయినా” అని బుజ్జగిస్తుంది అమ్మ.
‘మహెూదధి’లో మణిరత్నాలు: 107.
అమ్మను తెనాలిలో పదిరోజులు వుంచుకుని నంబూరు తీసుకు వెళతారు పినతల్లి భాగ్యమ్మగారు.
నంబూరులో మామూలుగా వున్న అమ్మను ఏదో విశేషమున్నట్టుగా చూడటానికి వస్తారు చుట్టుపక్కల వారు. చాలాసేపయిన తరువాత భాగ్యమ్మగారు వారితో “పొద్దుగూకింది, ఇంటికి వెళ్ళండమ్మా” అంటుంది.
వచ్చినవారు “ఏమీ లేదమ్మా! విడిచి పెట్టి వెళ్ళలేకుండా వున్నాం” అంటారు.
“ఎందుకు అంత వెళ్ళలేకపోవటం?” భాగ్యమ్మగారు ఆశ్చర్యపోతారు.
“ఏమోనమ్మా! ముఖములో ఏదో వదలిపెట్టలేని శక్తి లాగుతున్నదమ్మా!”
‘మహోదధి’లో మణిరత్నాలు – 108.
అమ్మ అస్వస్థత – 1
నంబూరులోవున్న అమ్మకు జ్వరం తగులుతుంది. వొళ్ళంతా పెద్ద పెద్ద దద్దుర్లు ఎక్కుతాయి. నాలుగు రోజులకు దద్దుర్లు తగ్గినా, జ్వరం అట్లాగే వుంటుంది. ఆ జ్వరం రెండు నెలల దాకా వుంటుంది. నార్మల్కు రాదు. అమ్మ దిగులు
పడిందేమోనని సీతాపతి తాతగారు అమ్మను బాపట్ల తీసుకెళదామని వస్తారు. భాగ్యమ్మగారు తాతగారితో “స్టేషను దాకా కూడా నడిచి పోవటం కష్టం. ఓపిక లేని పిల్ల. లంకణాలు. జ్వరం” అంటుంది.
భాగ్యమ్మగారి అబ్బాయి సుబ్బారావు “నేను బండి పిలుచుకొస్తాలే” అంటాడు.
సీతాపతి తాతగారు “వాడేం బండి పిల్చుకొస్తాడు గాని మోతాదును పిలిపించు. ఎత్తుకుని తీసుకొస్తాడు” అంటారు.
అమ్మ “నేను నడుస్తాలే! మోతాదెందుకు? అతనికి మాత్రం నేను బరువు కాదూ!’ అంటుంది. ఆ మాట వినగానే భాగ్యమ్మగారికి ఏడుపు ఆగదు.
భాగ్యమ్మగారు మోతాదును పిలిచి చెపుతుంది. తెల్లవారుజామున ప్రయాణము నిశ్చయించుకుంటారు. బయలుదేరి వెళుతుంటే ఇరుగు పొరుగు అంతా ఎవరో పెద్దవారు ఊరెళుతుంటే వచ్చినట్టుగా వస్తారు.
అందరూ “ఇంత జ్వరము, ఇన్నాళ్ళనుంచి అన్నం లేకపోయినా ఆ ముఖం చూడు ఎంత కళకళలాడుతూ వుందో! నోటి పుండు, గొంతువాపు పైకి కనపడుతూనే వున్నది. అసలు జబ్బు ఒకటి మందు ఇంకొకటి అయిందల్లే వుంది. డాక్టరు గారికి అర్ధం కాలేదు.” అనుకుంటారు.
మోతాదు యెత్తుకోకుండా అమ్మే నడిచి స్టేషనుకు వెళుతుంది. రైలు ఎక్కి, మోతాదును దగ్గరకు పిలిచి, భాగ్యమ్మ పిన్నిగారిచ్చిన అయిదు రూపాయలు అతని చేతిలో పెట్టి “ఏమయినా కొనుక్కో నాయనా” అంటుంది.
మోతాదు “నాకొద్దు అమ్మాయిగారూ! నేను నీ చేతిలో పెట్టాల్సింది. నాకెందుకమ్మా!” ఆశ్చర్యపోతాడు.
“పెద్దగా అరవకు. మాట్లాడకుండా తీసుకో” అంటుంది అమ్మ.
సీతాపతి తాతగారు “ఏమిటది” అడుగుతారు.
అమ్మ: “ఏమీ లేదు నాన్నా! భాగ్యం పిన్ని యేదో యిస్తేనూ, అది అతనికిస్తున్నా, యేమీ లేదు.”
‘మహోదధి’లో మణిరత్నాలు – 109.
అమ్మ అస్వస్థత 2
బాపట్లలో చిదంబరరావు గారికి అమ్మను చూడగానే దుఃఖం ఆగదు. నోట పుండుకు అక్కడ మందు యిప్పిస్తారు. తాతగారు అమ్మతో ‘ఈ పుండు ఏం పండమ్మా!” అమ్మ “మిమ్మల్ని వదిలి పెట్టి నంబూరులో ఉండవలసి వచ్చెనే అనే పుండు”
“మమ్మల్ని వదిలి పెడితే నీక్కూడా దిగులుటమ్మా?”
“నాకు అంత వాత్సల్యం లేకపోతే మీ దగ్గర ఎట్లా ఉంటాను?” “వాత్సల్యం అంటే తల్లికో తండ్రికో వరిస్తుంది. నీవేమో పసిపిల్లవు కదా! అమ్మాయివి కదా! అదేం మాట?”
“మాయి అంటే అమ్మే!”
“ఈ పుండు కూడా అట్లాంటిదేనా?”
“కాదు”
“పోనీ అంత దిగులుగా వుంటే వచ్చెయ్యకూడదూ, ఆ పాడు మందులన్నీ “మింగవలసిన విధి వుంటే ఎట్లా తప్పుతుంది? అప్పుడే ఏమయింది
నాపని?”
‘మహోదధి’లో మణిరత్నాలు – 110.
అమ్మ అస్వస్థత – 3
తెల్లవారేటప్పటికి అమ్మకు కాళ్ళూ చేతులూ ఉబ్బి ఉంటాయి. చిదంబరరావుగారు చూచి గాభరా పడతారు.
వారి ఆదుర్దా చూసి అమ్మ నెమ్మదిగా –
“నెత్తురు లేని మీదట ఉబ్బినయ్యిలే. కాసేపటికి అవే తగ్గుతాయి. ఎందుకు మీరట్లా గాభరా పడతారూ? ఇప్పుడప్పుడే నేనెక్కడకు పోతాను తాతగారూ? చేయవలసిన పనులు చాలా ఉన్నాయి” అంటుంది.
“నిజమేననుకో అమ్మా – ఎదురుగా కనపడే బాధను చూసి మనసు నిబ్బరించుకోలేక పోతున్నాను. నీ స్థితి ఎక్కువ అని నాకు తెలుసు. నీ మనస్సు మా మనస్సుకంటే విశిష్టమయిందనీ నాకు తెలుసు. నీ శరీరం మా శరీరం కంటే విభిన్నమయినదనీ నాకు తెలుసు. నిన్ను ఎవరూ.. ఏవీ.. ఏమీ చేయలేరనీ నాకు తెలుసు. అయినా ప్రత్యక్షంగా కనపడేదాన్ని గురించి బాధ లేకుండా వుండలేకపోతున్నానమ్మా!”
“దీనికే బాధపడితే ఎలా! ముందు ముందు వున్నదంతా అదే.”
“ఎంత దేముడని గుర్తించినా, యీ మమకారము మాధవత్వం కంటే మనవత్వాన్నే గుర్తింప చేస్తూ వుంది. ఆ మమకారము కూడా తీసివెయ్యవలసింది నీవే కదా అమ్మా!”.
“నా ఒక్కదానియందు వుండే మమకార మానవత్వాన్ని గుర్తింపచేస్తుంది. సర్వత్రా వుండే మమకారం మాధవత్వాన్ని గుర్తింప చేస్తుంది.” చిదంబరరావుగారు దిగ్భ్రాంతి చెంది “ఏదమ్మా మళ్ళీ అను” అడుగుతారు.
“ఒక చోటనే వుండే మమకారం మానవత్వాన్నీ, సర్వత్రా వుండే మమకారం మాధవత్వాన్నీ గుర్తింపజేస్తుంది.”
మహోదధిలో మణి రత్నాలు – 111
ఒకసారి మౌనస్వామి వారు చీరాలలో నూనె పానకాలుగారి తోటలో విడిది చేస్తారు. అమ్మ – చిదంబరరావుగారితో… అయితే వారు మాట్లాడరా తాతగారూ?” అని అడిగింది.
“మాట్లాడమ్మా” అన్నారు తాతగారు.
“మరి మనతో సంభాషణ ఎట్లా చేస్తారు” అని అమ్మ సందేహం వ్యక్తపరచింది.
“కాగితం మీద వ్రాసి యిస్తారు”
“వారికి మన మాటలు వినబడతాయా”
“వినబడతాయి”.
“మనం అనేవి వినపడి మనకు సమాధానం వ్రాసి యిచ్చేటప్పుడు ఇంకా మౌనమేమిటి?”
“మౌనం అంటే మా దృష్టిలో అంతే. మరి నీవనే మౌనం ఎట్లా ఉండాలి.” అని చిదంబరరావుగారు కుతూహలంగా అడుగుతుంటే పక్కనున్న డాక్టరు సాంబయ్య గారు విసుక్కుని “చిన్న పిల్లవు – నీకేం తెలుసు? నీవు మాట్లాడకు.” అని గద్దిస్తారు. ఆయన మౌనస్వామిని గురువుగా ఆరాధిస్తారు.
కాని అమ్మ మాత్రం చలించకుండా చిరునవ్వులు చిందిస్తూ, “నన్ను కూడా మౌనంగా ఉండమంటారా ఏమిటి? మరి నాకు చదువు రాదుగా వ్రాయటానికి? అని చమత్కరిస్తుంది.
(సశేషం)