(గత సంచిక తరువాయి)
- పావులూరి ఆంజనేయస్వామి దేవాలయం పూజారి రామాచార్యులు గారు అమ్మను గురించి చిదంబరరావు తాతగారితో “ఈ అమ్మాయిని గురించి చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారండీ. ఈ అమ్మాయి అందరికీ పచ్చళ్ళూ, అన్నాలూ దానం చేస్తుందట. మావూరు చాకళ్ళు చాలా ఆప్యాయతగా చెప్పుకుంటారు. అదీగాక అమ్మాయి వర్చస్సులో చక్కటి ప్రశాంతత, ఆదరణ మూర్తీభవిస్తుంది. బీదలంటే చాలా ప్రేమ!”
చిదంబరరావు తాతగారు: ఎవరు ఎట్లా గుర్తిస్తే అట్లా మూర్తీభవిస్తుంది ఆ తేజస్సు. మొన్నటివారం నేను వచ్చినప్పుడు కొండారెడ్డి అనే కుర్రవాడు యిక్కడున్నాడు. వాడు నాతో “నేను ప్రదక్షిణం చేసే ఆంజనేయ స్వామిలా యీ అమ్మాయి కనపడుతూ వుంటుందండి” అని అన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు నమ్మటానికి అనేక నిదర్శనాలు కూడా చెప్పాడు.
రామాచార్యులు గారు: అదంతా యేమో కానీండి. ఆ అమ్మాయి దగ్గర చిన్నపిల్లల లక్షణాలు యేమీ వుండవు. మొన్న క్షయరోగపు అతను చేతిలో డబ్బు లేక చాలా దూరం నుండి నడిచి వచ్చాడు. ఆ రోజు అతని చరిత్ర అంతా విని, అతని దగ్గర ఒంటరిగా చాలాసేపు కూర్చుంది. తరువాత విచారిస్తే తన మెడలో వున్న కాసులు రెండు తీసి యిచ్చిందని తెలిసింది.”
- భారతాంబ గారు కడగా వుండి దేవాలయంలో ప్రదక్షిణలు చేయటానికి వీలులేక పావులూరులో కవిదేశయ్య గారి ఇంటికి వెళతారు అమ్మా, అన్నపూర్ణమ్మగారు, భారతాంబ గారు. రామాచార్యులు గారు ఇంట్లోకి వెళ్ళి ఫలానావారు వచ్చారని చెపుతారు. దేశయ్యగారు వాకిట్లోకి వస్తారు. రాగానే అమ్మను చంకనేసుకుని లోపలకు రండమ్మా అంటూ అమ్మను లోపలకు తీసుకు వెళతారు. భార్యను కేకేసి “ఏమే! ఈ అమ్మాయిని చూడు. అంతా బాలా త్రిపురసుందరల్లే వుంది.” అంటారు.
ఆయన భార్య రుక్మిణమ్మ చేస్తున్న పని మానుకుని చేతులు కడుక్కుని గబగబా వచ్చి, దేశయ్యగారి చంకలో వున్న అమ్మను తను ఎత్తుకుంటుంది. ఆమె అమ్మను పదే పదే ముద్దులు పెట్టుకుంటూ, “ఈ అలంకారం, ఈ అందం…. అంతా అమ్మవారల్లేనే వుంది” అని ధృవపరుస్తుంది.
- మూడు రోజులనుకున్నది దేశయ్యగారింటిలో పదిరోజులుంటారు. అమ్మావాళ్ళు. నిత్యమూ వారింటిలో పండగగా జరిగిపోతుంది. వారు అక్కడి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అందరికీ బట్టలు పెడతారు. వచ్చే రోజున భారతి అత్తయ్యకు తెరలు అధికంగా వస్తాయి. అన్నపూర్ణమ్మగారు విచారగ్రస్తయై “ఎందరు దేవుళ్ళకు మొక్కినా ఫలితం కనపడటం లేదు” అని బాధపడుతుంది. “అత్తయ్యా! నేను ఒక మాట చెపుతాను. చేస్తావా? పిన్నికి జబ్బు తగ్గిపోతుంది. నూరు కొబ్బరి కాయలు కొడతాననీ, వెయ్యిమంది బీదలకు అన్నదానం చేస్తాననీ దణ్ణం పెట్టుకో తగ్గిపోతుంది” అంటుంది అమ్మ.
“నేను పెట్టుకోవటమెందుకు? ఆ దణ్ణం నీవే పెట్టుకో తగ్గితే చేద్దాం. బాల వాక్యం బ్రహ్మవాక్యమని కదా – ఒకవేళ తగ్గుతుందేమో” అంటుంది అన్నపూర్ణమ్మగారు. దేశయ్యగారు పకపకా నవ్వుతూ, “ఇంతకూ ఏ దేముడికి మొక్కుకో మన్నావో. చెప్ప లేదు” అంటారు. “దేముడన్నాను గాని, ఇంతమంది దేముళ్ళుంటారని నాకు తెలియదు. అదేదో మనకు మించింది, మనకు అర్థం కానిది. ఆ శక్తికి కొట్టమన్నా కొబ్బరికాయలు” – అంటుంది అమ్మ. అన్నపూర్ణమ్మగారు అంగీకరించింది. ఆ పూట నుండి మూర్ఛలు రావు భారతాంబ గారికి.
- అమ్మ పావులూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేద్దామని, ఏమి పెట్టి ప్రదక్షిణము చేయనా అని ఆలోచిస్తుంది. పక్కనే వున్న చేలోకి వెళ్ళి వేరుశనక్కాయలు కోసుకుందామని వెళ్ళి కాయలు కోయటం ప్రారంభం. చేస్తుంది. వొళ్ళోకి ఒక గిద్దెడు కాయలు కోసుకుంటుంది. దూరాన్నుంచి ఒక మనిషి కర్ర భుజాన పెట్టుకుని కేక వేస్తాడు. అమ్మ తనను కాదన్నట్టు ఇంకా కోస్తూనే వుంటుంది. ఆ మనిషి ఒకసారి పెద్ద కేకవేసి కర్ర విసిరివేస్తాడు. ఆ కర్ర అమ్మకు తగలకుండా ఒక జానెడు దూరంలో పడుతుంది. ఇంతలో అతను అమ్మను సమీపిస్తాడు.
అమ్మ అతడిని చూసి ‘వొళ్ళో కాయలు యివే కోసుకున్నాను’ అన్నట్టుగా కింద పోస్తుంది. అతడు అమ్మవంక నిశ్చేతనంగా చూస్తూ వుంటాడు. అమ్మ కాయలు కిందపోసి ఆ చెట్టు వేరున ఉన్న మట్టిగడ్డలను వలుచుకొని ఒడిలో వేసుకుని ముందుకుసాగుతుంది. అతని మనస్సులో ఏవేవో భావాలు స్ఫురిస్తాయి. నిత్యమూ తన చేనును కాచే వనదేవతయా యీ అమ్మాయి – అన్న ఆలోచన కలిగి, తాను అపచారము, అపరాధము చేశానని బాధపడతాడు. వెంటనే పరుగు పరుగున అమ్మకెదురుగా వచ్చి ముకుళితహస్తుడై “ఆ మట్టిగడ్డలు పారబోయమ్మా
నీకు కావలసినన్ని శనగకాయలు నేను కోసి యిస్తాను. దుర్మార్గుడిని కృతఘ్నుడిని. నీకు అపకారం తల పెట్టాను” అంటాడు గజగజా వణుకుతూ.
“నేను మట్టిగడ్డలు పారబోయను. వేరుశనక్కాయలు వద్దు. మట్టిగడ్డల్లో వుండే గుణం తెలియక వేరుశనక్కాయల కోసం వచ్చాను. మట్టిగడ్డలు నివేదన చేస్తే యిక్కడ పండే పంటలన్నీ నివేదన చేసినట్టే” అంటుంది అమ్మ. అతను ఇంకా బ్రతిమలాడుతూ వున్నా వినకుండా మట్టిగడ్డలు తీసుకుని పరుగెత్తుతుంది.
అమ్మ పరుగెత్తుతుంటే, భాగవతంలో చెప్పిన కృష్ణుడు పరుగెత్తినట్టుగా వుంటుంది. అమ్మ వెళ్ళి మట్టిగడ్డలు ఆంజనేయస్వామి దగ్గర పెట్టి 108 ప్రదక్షిణలు చేసి, మట్టిగడ్డలు నివేదన చేసి తలాకాస్తా ప్రసాదంగా పెడుతుంది.
వారు చేతిలో పడ్డ మట్టిగడ్డను చూచి నివ్వెరపోతారు. కానీ ఆ మట్టిగడ్డ నుండి వచ్చే పరిమళానికి ఆకర్షితులై ఆ మట్టిగడ్డలనే నోటిలో వేసుకుని ఆ రుచికి సమ్ముగ్ధులై పోతారు. ఆ అపూర్వ సంఘటనకు కొండారెడ్డి అనే అతడు విస్మితుడై “ఎక్కడినుండి తెచ్చావమ్మా ఈ మట్టి” అని అడుగుతాడు.
“ఆ మట్టి ఉన్నచోటనుండే” అంటుంది అమ్మ నెమ్మదిగా.
- చిదంబరరావు తాతగారు, అన్నపూర్ణమ్మగారు, భారతి అత్తయ్య, అమ్మా అందరూ చందలూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళతారు. అక్కడ అర్చకుడు చల్లా లక్ష్మీనారాయణ గారు అమ్మవారి దగ్గర చెవిపెట్టి ప్రతిదీ ఆమె చెపుతున్నట్లు ప్రశ్నలు చెపుతారు. అక్కడ అమ్మణ్ణిని భారతి అత్తయ్యను గురించి ప్రశ్నిస్తే ఆమె లక్షణాలూ, గృహపరిస్థితులూ వివరించి గ్రహపీడన ఉన్నట్లు వాక్కు ప్రసాదింపబడుతుంది.
చివరకు ఆ అర్చకుడికి అమ్మను చూపించి “ఈ అమ్మాయిని గురించి ఏమయినా చెపుతారా?” అని అడుగుతారు.
తాతగారు అడగటంలో అమ్మ సంగతి వీళ్ళ ఇద్దరకూ వినిపించాలనే వుద్దేశంతో అడుగుతారు.
“అమ్మణికి ఏమీ వాక్కు రావటంలేదు” అంటారు అర్చకులు లక్ష్మీ నారాయణ గారు.
చిదంబరరావు గారు పట్టలేని సంతోషంతో “చూశారా! అమ్మాయే అమ్మణ్ణి అయితే మరి అమ్మణ్ణికి యిక వాక్కు ఏమి వస్తుంది” అంటారు అన్నపూర్ణమ్మగారితో.
(సశేషం)