సేకరణ : కామరాజు
- కళ్యాణానందభారతీ స్వామి అమ్మతో “అబ్బా! యేమి అమ్మవమ్మా! నీవు ఎందుకొచ్చావో చెప్పు. నీ వూరేమిటి? నీ తల్లి పేరేమిటి?”
అమ్మ: “మా అమ్మ పేరు ఆధారం. మా నాన్న పేరు అవకాశం”
కళ్యాణానంద భారతీ స్వామివారు సుమారు రెండు గంటల సేపు ఆలోచించి,
కళ్ళ వెంబడి నీరు కారుస్తూ పడుకున్నారు. రెండు గంటల అయిదు
నిముషములకు “నీ యథార్ధస్థితి చెప్పమ్మా” అన్నారు.
అమ్మ: యథార్థమే నా స్థితి.
కళ్యాణానంద అమ్మను దగ్గరకు తీసుకుని “మొత్తం మీద మీ వాళ్ళకు నీ స్థితి చెప్పి నిన్ను అట్టేపెట్టుకుంటానమ్మా”
అమ్మ: నా స్థితి అన్నారు కదా! నా స్థితి తెలిసిందా ఏమిటి?
స్వామి: స్థితి తెలియకపోయినా, సంభాషణ వల్ల నే ఒక స్థితి నిర్ణయించుకున్నాను. అది నీవే చెప్పావుగా, మనస్సు కొలతబద్ద అని.
- సమభావం – సామ్యవాదం – 1
అమ్మ తెనాలిలో నెలరోజులు వున్న సమయంలో అమ్మకు తీవ్రమైన జ్వరం వస్తుంది. మూడోరోజు జ్వరం కొంచెం తగ్గుతుంది. జ్వరం జారగానే వాకిట్లో కూర్చుంటుంది.
ఒక పాకీ బండి వీధి వెంట వెళ్ళుతున్నది. పాకీవాడు బండి తోలుతున్నాడు. పాకీది వీధులు చిమ్ముతూ, కసువు బండిలో పోస్తూ, బండివెంట నడుస్తున్నది. వారి మూడేళ్ళ పిల్లవాడూ తల్లివెంట నడుస్తున్నాడు. అదలింపబడిన ఎద్దు పరుగెత్తింది. బండిని అనుసరిస్తూ పాకీది పరుగెత్తింది. తల్లికోసం పిల్లవాడూ పరుగెత్తాడు. కాలికి రాయి తగిలి పిల్లవాడు పడ్డాడు. వెనక్కు చూడని పాకీది ముందుకే వెళ్ళింది. వాకిట్లో కూర్చున్న అమ్మ ఆ పిల్లవానిని చూచింది. అంతలో ఆ దారిని రెండు గేదెలు పరుగెత్తుకు వస్తూ కనుపించాయి. అమ్మ చివాలున లేచి శరవేగంతో పిల్లవానిని సమీపించి ఒక్క ఊపులో వానిని లేవదీసి భుజాన వేసుకున్నది. వెంకటసుబ్బారావుగారు ఆశ్చర్యంగా చూస్తూ “దీనిలో భూతదయ కనపడుతున్నది. జ్వరంతో ఉండికూడా ఎంతవేగంగా పరుగెత్తిందో చూడండి” అంటూ లోపలవున్న జానకమ్మ గారిని కేకవేశాడు.
పాకీది ముందుకు వచ్చి చెయ్యిజాపి బిడ్డను పిలుస్తూ “దొరసానీ! నీవు ఎత్తుకుని వచ్చావా? నా బిడ్డ ఎంత అదృష్టవంతుడమ్మా! బ్రాహ్మలెత్తుకున్నారు?” అని పరవశమై పోతుంది.
“మా బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది. ఇంకా ఏం మాట్లాడుతావులే? నీ పిల్లవాడిని నీవు తీసుకుపో” అని రుసరుసలాడుతుంది జానకమ్మగారు. “అవును. బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది కనుకనే మీరు ఆ పిల్లవాడిని
ఎత్తుకోలేదు” అన్నది అమ్మ గంభీరతా పూర్ణమయిన కంఠ స్వరంతో.
వెంకటసుబ్బయ్య తాతగారు ఆ మాట విని “ఎంత దూరం వేసిందో చూసారా?
బ్రాహ్మణత్వం ఆమెకే వున్నట్లు తేల్చింది” అన్నారు.
అమ్మ “బ్రహ్మ తత్త్వమే బ్రాహ్మణత్వ” మని మరిడమ్మ తాతమ్మ అంటుంటే విన్నాను. అన్నది చిన్నగా.
- సమభావం – సామ్యవాదం – 2.
అమ్మ మాతామహులు చంద్రమౌళి వెంకట సుబ్బారావుగారి జీతగాడు అంకాలు అమ్మ గురించి:
“ఆమెకు కులభేదం లేదు. మొన్న ఒకరోజున అరుగుమీద ఉన్న అమ్మాయికి
మీరు ఇడ్లీ పంపిస్తే నాకు పెట్టి తాను తిన్నది. నాకు నోటిలోనే పెట్టింది. స్వయంగా” అని వివరించాడు.
“నీకు పెట్టిందే తిన్నదా? జానకమ్మగారు ఆశ్చర్యం ప్రకటించింది.
“అట్లా తినలేదు కాని, అట్లా తినటంలో కూడా సందేహించేటట్లుగా లేదు. అందుకని కులభేదమే లేదని అన్నాను”.
అమ్మ: ‘కులభేదం లేదు కనుక నీ నోటిలో పెట్టానంటున్నావు. గుణభేదం ఉంటే వీరి ఇంటిలోనే ఉండేదాన్ని కాదు. గుణభేదమే లేనప్పుడు కులభేదం లేకపోవటంలో విశేషమేమున్నది?.”
ఆ మాటల్లోని హృదయ వైశాల్యం అంకాలుకు అర్థం కాకనూ యితరులకు సమాధానం తోచకనూ – అందరూ మౌనంగానే వున్నారు.
- సమభావం- సామ్యవాదం – 3.
అమ్మ: పాకీ అంటే ఏమిటి తాతగారూ? పనికిరాదనా?
వెంకట సుబ్బయ్య తాతగారు: అంతదూరం ఆలోచించలేదమ్మా, పాకీ అనటం తప్ప.
అమ్మ: మన కడుపులో వున్న అశుద్ధానికి అంటు లేకపోయే. దాన్ని బాగుచేసిన ఆ తల్లికి అంటు వచ్చింది. అసలు అంటు అంటే ఏమిటో! అంటు అంటే
వదలనటువంటిదని నా వుద్దేశం. ఎవరూ మాట్లాడకుండా ఆలకిస్తూ వుంటారు.
తాతగారు: ఇందాక ఏమిటమ్మా అంటూ అంటే అన్నావు?
అమ్మ: వదలనటువంటిది. దాదాపు ఒక ‘మాటు’ లాంటిదని నా వుద్దేశ్యం. అంటే ఒక రంధ్రం వున్నదనుకో. దానికి ఏ వెలిగారమో పూసి ఆ రంధ్రం కనపడకుండా చేస్తాము. ఒక లోపాన్ని మరొకదానిచేత మరుగుపెట్టి దాన్ని ఉపయోగించుకుంటూ వుంటాము. దూరము పోలేము. దగ్గరలో బైటికెళ్ళాలి. నడువలేకనే ఈ దొడ్లు నిర్ణయించినది. మనం నిర్ణయించుకున్న దానికి అనేక రకాల జీవనోపాధులున్నాయి. అందులో ఇది ఒక వృత్తి కాబట్టి వాళ్ళకు జీవనాన్ని కల్పించి, వాళ్ళను మనకు ఆధారం చేసుకుని, వాళ్ళకు పావలా డబ్బులకు మనము ఆధారమయి, మనకు పనికివచ్చే పాకీతనానికి పనికిరానితనాన్ని అంటకడుతున్నాము.
- సమభావం – సామ్యవాదం – 4
రాఘవరావు మావయ్య వివాహనికి సీతాపతి తాతగారు అమ్మను చేతబెట్టుకుని వూరంతా పిలుస్తారు.
అమ్మ: నాన్నా! కొన్ని ఇళ్ళు వదిలి పెట్టావేం?
తాతగారు: సాయిబులు, శూద్రులలో ముఖ్యమయిన వాళ్ళను పిలిచాను.. తక్కినవాళ్ళను వదిలేశాను.
అమ్మ: బ్రాహ్మల్లో అందరినీ పిలవటమెందుకు – మిగతావాళ్లను సగం సగం పిలవటమెందుకు? పిల్చేదేదో అందరినీ పిలువు.
తాతగారు: మనవాళ్ళను పిలిస్తే చాల్లేమ్మా.
అమ్మ: మనవాళ్ళంటే గుర్తు ఏమిటి? మనము అనుకోవటమేగా!
తాతగారు: సరే ! అందరికీ శుభలేఖలు పంపుదాములే. ఇల్లు ఇల్లు తిరిగిన మట్టుకు చాల్లే!
- మన్నవలో కోమటి నీలకంఠం కారప్పూస, పకోడీలు తట్ట నెత్తిన పెట్టుకుని వెళుతూ దారిలో అమ్మను చూసి తట్ట కిందికి దించి అమ్మను ఎత్తుకుంటాడు. అమ్మను భుజాన ఎక్కించుకుని మళ్ళీ తట్ట నెత్తిన పెట్టుకుని, అమ్మను తట్టలో కారప్పూస తింటూ కూర్చో అమ్మా అని కారప్పూస పెడుతూ తీసుకెళతాడు. దారిలో బాటసారులు అమ్మను నీలకంఠం యెత్తుకున్నట్లుగానే పిల్లను ఎత్తుకుని ఎదురువస్తారు.
అమ్మ: నీలకంఠం! నీవు నన్నెత్తుకున్నట్లు ఆ అమ్మాయి నెత్తుకున్నాడు గాని, నెత్తిన కారప్పూస తట్ట లేదే! కాస్త పెడదామా? నీలకంఠం యేమీ మాట్లాడడు.
అమ్మ: “నేను కొంచెం కిందికి దిగాలి. దించుతావా నీలకంఠం?”
నీలకంఠం దించుతాడు.
అమ్మ పది గజాలు నడిచిన తరువాత కాస్త కారప్పూస
తీసి అమ్మ వొళ్ళో పోస్తాడు. కారప్పూస పెట్టగానే వెనక్కు తిరిగి “నీవు వెళుతూ వుండు, నేను వస్తాలే” అని చెప్పి, పోయే మనుషుల దగ్గరకు వెళ్ళి కారప్పూస పెట్టి వస్తుంది. నీలకంఠం పోయేవాడు ఆగి, అమ్మ రాగానే ‘భలే అమ్మవమ్మా అమ్మాయీ! పెట్టటం చూస్తే అమ్మవనిపిస్తున్నది. వయస్సుకు అమ్మాయివనిపిస్తున్నది. ఇంకాస్త పట్టు అంటూ వొళ్ళో పోసి, ఎప్పుడూ కారప్పూసేనా, పకోడీలు తింటావా?” అని అడుగుతాడు.
అమ్మ: “ఏది పెట్టినా తింటా తినటం ఎట్లా వున్నా, తీసుకుంటా.”
నీలకంఠం: మళ్ళీ ఎవరికన్నా పెట్టటానికా?
అమ్మ: నాకు పెట్టుకుంటే నీకు ఎంత తృప్తో, ఎవరికన్నా పెట్టుకుంటే నాకు అంత తృప్తి.
- ఆదెయ్యగారితో అమ్మ:
“తాతగారూ – మీ సహనం వంటి సహనం కావాలండీ అందరికీ. సహనమంటే – బాధలుంటేగా సహనం తెలిసేది? సహనమనే దేవతను ఆరాధనగా పెట్టుకుంటే బాధలనే పరికరాలు కావాలి, పూజాద్రవ్యాలు కావాలి. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి.”
ఆదెయ్యగారికి ఆ మాటల్లో అమ్మ కంఠం కాక ఎవరో ఒక మహర్షి అనుభవపూర్వక మయిన సత్యం పలుకుతున్న విధానం స్ఫురించింది.