1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 20
Month : April
Issue Number : 2
Year : 2021

సేకరణ : కామరాజు

90. సత్యనారాయణస్వామిగా దర్శనం

మన్నవలో అమ్మ ప్రతిరోజూ సాధ్యమయినంత వరకు దేవాలయంలోనో, గంగరాజు పున్నయ్యగారి తోటలోనో కాలక్షేపం చేస్తూ వుండేది. పున్నయ్యగారి తోటలో ఒకరోజున అమ్మ చింతచెట్టుపై ఒక కొమ్మ మీద కూర్చుని వుంటుంది. తురుమెళ్ళ వెంకటప్పయ్యగారు చింతచిగురు కోసుకునేందుకు అక్కడకు వస్తారు.

అమ్మ ఎక్కిన చెట్టు క్రిందకు వచ్చి తల పైకి ఎత్తుతారు. ఆయనకు అమ్మ అమ్మగా కనపడక, నిత్యమూ ఆయన ఆరాధించే సత్య నారాయణ స్వామిగా కనపడి, అంతలోనే ఎవరో మాలపిల్లవాడు గొడ్లను కాయటానికి వచ్చి చింతచెట్టు ఎక్కినట్టుగా కనపడుతుంది.

వెంకటప్పయ్యగారు “నీవు ఎవరబ్బాయివిరా? ఇందాకటి నుంచి చెట్టుమీద వుంది నీవేనా?” అని అడుగుతారు కానీ వాడు పలకడు. సమాధానం వినిపించక పోయేసరికి “ఎవరో కుర్రవెధవలే” అనుకుని, “ఏమయితేనేం. నా స్వామి నాకు ప్రత్యక్షమయినాడు” అనుకుని ప్రక్క చెట్టు దగ్గరకు వెళ్ళి చింతచిగురు కోసుకోవటం ప్రారంభిస్తారు. అమ్మ చెట్టుమీద నుండి చివాలున దూకుతుంది. మామూలు గౌనుతో.

వెంకటప్పయ్యగారు అమ్మ వంక చూస్తారు. అమ్మ దూకి గబగబా పరుగెత్తుతుంది. ఆయన కూడా వెంబడిస్తారు. “ఇదేమిటి? ఇన్ని రకాలుగా కనపడ్డది” అనుకుంటూ, కోసుకున్న చింతచిగురు నేలపాలు చేసి ఇంటికి పరుగెత్తారు. అమ్మకూడా పరుగెత్తి సరాసరి వెంకటప్పయ్యగారి ఇంటికే వస్తుంది. వెంకటప్పయ్యగారు అమ్మను చూసి “చెట్టు దూకింది నీవేనా అమ్మా” అని అడుగుతారు. “నేనే మావయ్యా” అమ్మ సమాధానం.

“మాలపిల్లవాడికి ఎటువైపున కూర్చున్నావు” 

“మాలపిల్లవాడిని నేను చూడలేదు” అమ్మ జవాబు.

“నన్నన్నా చూచావా?” మళ్ళీ అడిగారు. “నిన్ను చూసాను” అమ్మ చెప్పింది. 

“నన్ను చూచినప్పుడు మాలపిల్లవాడు ఎందుకు కనపడలేదు” అంటూ వెంకటప్పయ్యగారు అమ్మ చెవి పట్టుకుంటారు. వెంటనే అమ్మ అదృశ్యమయి ఎదురుగా మళ్ళీ సత్యనారాయణస్వామి కనపడతాడు. ఆయన పెద్దగా కేకవేసి క్రిందపడి పోయి కళ్ళు మూసుకుని “నా ఇష్టదైవం కనపడ్డాడు. అనసూయ మామూలు పిల్లకాదు” అని కేకలు పెడతారు.

91. తురుమెళ్ళ వెంకటప్పయ్యగారు చాలా పేదబ్రాహ్మణుడు. నీళ్ళబిందెలు మోసుకుని బ్రతుకుతుంటాడు. అమ్మ ఆయనకు సత్యనారాయణస్వామిగా దర్శనం ఇచ్చినప్పటినుండీ ఆయనకు అన్ని విషయాల్లో బాగా కలిసిరావటం మొదలయింది. సత్యనారాయణ వ్రతము కథలో చెప్పినదంతా నిజమేననీ, దాని వలననే తనకు ఇట్లా కలిగినదనీ భావించి, ఎప్పుడయినా వ్రతం చేసుకునేవాడు కాస్తా ప్రతి ఏకాదశికీ వ్రతము ఏర్పాటు చేస్తాడు.

ఒకరోజు అమ్మ కూడా ఆ వ్రతము దగ్గరకు వెళుతుంది. “నేను పుట్టింది ఏకాదశి నాడే” అంటుంది నవ్వుతూ.

“అయితే నీకు పుట్టినరోజు పండుగ చేయమంటావా?” అని ఆయన భార్య రంగమ్మగారు అడుగుతుంది.

“ఈరోజు ఆశ్లేషా నక్షత్రము కదా! మీరు చేసేది నా పూజేగా!” అంటుంది 

అమ్మ. రంగమ్మగారు : “మేము చేసేది సత్యనారాయణ వ్రతమమ్మా” అంటుంది. 

అమ్మ: సత్యమయిన వ్రతమంతా నాకే.

వెంకటప్పయ్యగారు “చిన్న పిల్లయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నదే ” అంటారు.

92. అమ్మల గన్నయమ్మ

బ్రహ్మాండం సుబ్బారావు గారు (నాన్నగారి తండ్రి) తీవ్రమైన అనారోగ్యంతో బాపట్లలో వైద్యం నిమిత్తం చిదంబరరావు గారింట్లో వుంటారు. ఆయనకు అమ్మ అంటే విపరీతమైన ప్రేమ, వాత్సల్యం. వారి కుమారుడు నాగేశ్వరరావుతో అమ్మ వివాహం చేయాలని కోరిక.

ఒకరోజు సుబ్బారావు తాతగారు అమ్మతో “ఎందుకమ్మా అక్కడే నుంచున్నావు? ఇటురా! దగ్గరకు రా! చెప్పు! తప్పకుండా చేసుకుంటావా బావను? నీకు మీ అమ్మలేదు. వాడికి నాన్న లేడు.”

అమ్మ వెంటనే “మీరున్నరుగా, లేరంటారేం? తల్లి వున్న వాళ్ళకు ఒక్కతే తల్లి. తల్లిలేని వాళ్ళకు అందరూ తల్లులే!”

సాయంకాలం సుమారు నాలుగు అవుతుంది. చిదంబరరావు గారు కోర్టునుండి అప్పుడే వస్తారు. రాగానే గదిలోకి వచ్చి ఈ మాట విని ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి. ఇంకా ఆమెకు తల్లి ఎందుకు?”

సుబ్బారావు తాతగారు: “ఇప్పుడన్న మాట మళ్ళీ అనండి”

చిదంబరరావుగారు: “ఏమున్నది. ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి అన్నాను. అది అంటే తెలిసేది కాదు. కంటే తెలుస్తుంది.”

సుబ్బారావు తాతగారు: “ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ ఆ అమ్మాయి ప్రశాంతత వర్ణించటానికి వీలులేనంతగా వుంటుంది. మాటలు వచ్చినట్లు వుండదు. అంటే రావని కాదు.”

93. బ్రహ్మాండం సుబ్బారావు తాతగారు అమ్మతో: “మీ బావను చేసుకున్నా, చేసుకోకపోయినా ముందు ఈ పిల్లలను అలవాటు చేసుకో అమ్మా, దిగులు పడకుండా, మీ అత్తయ్యకు సుఖమంటే యేమిటో తెలియదమ్మా. చిన్నప్పటి నుంచీ కష్టములే.”

అమ్మ: సుఖపడటం తెలియని మనిషికి సుఖపెట్టటం ఏం తెలుస్తుంది? ఒకరకంగా ఆలోచిస్తే సుఖమనేది ఒకరు పెట్టేది కాదు. ఎన్ని వున్నా సుఖపడలేరు. సుఖమనేది మనస్సుకు సంబంధించినది.

సుబ్బారావు తాతగారు: “చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే! దగ్గరకు రా!” అమ్మ వస్తుంది. తన పొట్టమీద పడుకోబెట్టుకుని, “నీవు తప్పకుండా బ్రహ్మాండం వారి కోడలివి కావాలని వుంది. మీ అమ్మకు నేనంటే చాలా ప్రేమ. ” 

అమ్మ: కావాలని వుంటే అవుతానుగా.

ఆ రోజు రాత్రి 8 గంటలకు సుబ్బారావు తాతగారు అమ్మ ముఖంలో ముఖం పెట్టి అమ్మ వైపు చూస్తూ కళ్ళు మూస్తారు. తాతగారి ప్రాణం పోగానే ఒక మెరుపు మెరిసినట్లుగా, అది అమ్మలోకి వచ్చినట్లు కనపడుతుంది చిదంబరరావు గారికి.

94. అమ్మ : “బాలా త్రిపురసుందరి” అంటే, బాల అంటే “పుటక” – త్రిపురసుందరి అంటే “బాల్య, యౌవన, కౌమార” స్థితులు కలిసినటువంటిది. అంటే, సృష్టి స్థితి లయలు. భూత, భవిష్యత్ వర్తమానాలు, సర్వమూ ఆమె రూపమే. ఆమె అంటే చేతులు, కాళ్ళు, చీర, రవికా కలిగిన ఆమె కాదు. శక్తి. అంటే ప్రతిదానిలో గర్భితమయిన శక్తి, ఆ శక్తియే ఆమె.

చిదంబరరావు గారు: ఇదివరకే అన్నావు గదమ్మా! వస్తు రూపము పురుష తత్త్వమనీ, దానిలో వున్నది శక్తి అని, “రెండింటినీ విడదీయలేని స్థితే శ్రీవిద్య” అనీ పుస్తకాలు చెపుతూనే వున్నాయి.

అమ్మ: “విడదీయలేని స్థితి కాదు. ఆ రెంటి సంయోగంలో వుండే సంధికాలమే” – అదే అవాజ్మానసగోచరము.

95. అమ్మ చిదంబరరావు తాతగారితో: “తాతగారూ! శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టటమేనా? అంతేనా?”

తాతగారు: నీకు తోచినదానికి తిరుగేముంటుందమ్మా! అదే అందరికీ రక్ష.

96. పెమ్మరాజు సత్యనారాయణ మూర్తి గారిని పంపించటానికి అమ్మ బాపట్ల రైలు స్టేషనుకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు గేటు దగ్గర టిక్కెట్టు కలెక్టరు “ఏయ్ అమ్మాయి! టికెట్టు ఏది?” అంటాడు.

అమ్మ టికెట్టు ఇచ్చేలోగా పొడుగాటి మనిషిగా, తన స్నేహితుడుగా కనపడుతాడు. టికెట్ మాస్టారు గారు: అయ్యో మీరా! పిల్ల అనుకున్నానే. పిల్ల అనుకుని టిక్కెట్టు ఇయ్యమన్నాను.

“నిజమే. ఒక పిల్ల ఇక్కడ నిలుచున్న మాట నిజమే. నేనూ చూచాను. ఆ పిల్ల వెనుకనే నేను వచ్చాను” అని ఒకాయన సాక్ష్యం ఇచ్చాడు.

ఇంతలో టిక్కెట్ కలెక్టరు రోడ్డుపైపు చూచాడు. ఆ అమ్మాయి కనపడుతుంది. గబగబా పరుగెత్తుకొచ్చి అమ్మాయిని పట్టుకోబోతాడు. పట్టుకోబోయేటప్పటికి అమ్మ చిక్కకుండా అదృశ్యమవుతుంది. టిక్కెట్టు కలెక్టరుకు ఆశ్చర్యం వేస్తుంది. భయమూ కలుగుతుంది. తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి, ” ఆ అమ్మాయి నడిస్తే నేను పరుగెత్తాను. అయినా ఆ అమ్మాయిని అందుకోలేక పోయాను. ఇదంతా చూడగా నాకు ఆశ్చర్యంగా వుంది. మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు అనాదిగా త్రిపురసుందరీ ఉపాసన, శ్రీచక్రపూజ వుంది. నాకీ రూపంగా దర్శనమిచ్చిందేమో ననుకుంటున్నా!” అంటాడు.

97. మన్నవ వూరి ముందర సత్రం దగ్గర పెద్ద పాము పడగవిప్పి ఆడుతూ ఎదురుగుండా నిలుచుంటుంది. అమ్మ తలవంచుకుని దాన్ని చూడకుండానే, దాని మీదుగానే వచ్చేస్తుంది. పక్కనే వున్న రాఘవరావు మావయ్య “ఓ మొద్దూ! పాము. చూడకుండానే నడుస్తావేం?” అంటాడు.

ఇంతలో పదిమందీ పోగవుతారు కర్రలు తీసుకుని. ఆ పాముకూడా ఉత్తరం వైపు ముఖం పెట్టినది తిరిగి దక్షిణపు వైపు ముఖము తిప్పి అమ్మ వంక చూస్తూ అమ్మ నడిచినవైపే నడుస్తూ వుంటుంది. కాసేపటికి పాము అదృశ్యమై పోతుంది. అమ్మా వాళ్ళు ఇంటికి చేరుతారు.

98. మన్నవ శివాలయంలో ధ్వజస్థంభానికి ఉత్తరంగా ఒక పెద్ద పుట్ట ఉన్నది. అందులో ఒక నాగుబాము ఉన్నది. అక్కడ నిత్యమూ సంతానం కోసమో, ఆరోగ్యం కోసమో అనేకులు ప్రదక్షిణలు చేసేవారు. మన్నవ గోపాలకృష్ణయ్యగారి కూతురు ఒక ఆమె చాలా కాలం నుండి కడుపు నొప్పితో బాధపడుతూ, ఆ పుట్టకు ప్రదక్షిణలు చేసింది. ఆమె కడుపు నొప్పి నివారణ మయింది.

ఒకనాడు ఆమె పాలు పోయటానికి దేవాలయానికి వెళ్ళటానికి సన్నద్ధ అయింది. వాకిట్లోకి వచ్చేసరికి అమ్మ ఎదురు పడుతుంది. అమ్మను చూచి తను పాలు పొయ్యటానికి వెళ్ళే నాగేంద్రుడే ఇక్కడికి వచ్చాడన్నట్టు మనసులో ప్రేరణ కలిగి, “నాగేంద్రా! ఇక్కడకే వచ్చావా? నాయందు నీకెంతదయ? ఈ అనాధను కాపాడేందుకు అరుదెంచావా?” అని పెద్దపెద్దగా అరుస్తూ అమ్మను అమాంతంగా ఎత్తుకుని భుజాన వేసుకుంటుంది.

ఆ క్షణంలో ఆమెకు అమ్మ అమ్మాయిగా కనుపించక సాక్షాత్తుగా నాగేంద్రుని వలెనే సాక్షాత్కరిస్తుంది. నాగేంద్రుడు పడగ విప్పి తనకు గొడుగు పట్టినట్లూ తాను తలపైకి యెత్తగా నాగేంద్రుని నోటినుండి అమృతం జారి తన నోటిలో పడ్డట్లూ అనుభూతమై గుటకలు వేస్తూ చప్పరిస్తూ తన్మయమవుతూ నాగరాజులో ఆమె ప్రాణము లీనమయిపోతుంది. మరిడమ్మ తాతమ్మ వచ్చి చూస్తే శిరస్సు చిట్లి వుంటుంది.

బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం పోయిందేమోనని అంటుంది. ఇంతలో అమ్మ మెల్లగా వచ్చి మరిడమ్మ గారి భుజాల మీద చేతులు వేసి వీపు నానుకుని వెనకగా కూర్చుంటుంది.

“నీవు ఎందుకు వచ్చావమ్మా పెద్ద నాపసానిలాగా? నీవు లేకపోతే ఇదంతా జరగదని వచ్చావా?” అని మరిడమ్మ గారు విసుక్కుంటుంది.

“నేను లేకపోతే ఎట్లా జరుగుతుంది? మరి ఇదంతా జరిపింది ఎవరూ… “నేనే” అని అమ్మ నోరారా చెప్పినా అందరూ అమ్మ హాస్యంగా అంటున్నదను కుంటారు కానీ అందులోని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతారు.

అప్పుడు అమ్మ వయస్సు 5 సం.7 నెలలు.

99. అమ్మ వయస్సు 9 సంవత్సరములు.

చిదంబరరావు తాతగారి కుమార్తె భారతాంబ గారి ఆరోగ్యం నిమిత్తం ఇంకొల్లు పావులూరుల మధ్య అంజనేయస్వామి దేవాలయం వద్ద అమ్మ, అన్నపూర్ణమ్మగారు, నలభై రోజులు ఉండటం తటస్థిస్తుంది.

మిరియాలతో రెండుపూటలా 108 ప్రదక్షిణాలు చేసి పూటకు బిందెడు పానకం, 5 కొబ్బరికాయలు, తవ్వెడు. అరసోలెడు వడపప్పు చేసి రెండు పూటలా సహస్రనామార్చన, పూజ, ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెడుతూ చేస్తూ వుంటారు. నివేదన చేసినా బ్రాహ్మలకు తప్ప ఎవరికీ పెట్టేవారు కాదు.

అమ్మ రోజూ ఈ వడపప్పు, కొబ్బరి ముక్కలూ అన్నీ అట్టిపెట్టుకుని అన్నీ కలిపి మధ్యాహ్న సమయంలో వంటబ్రాహ్మణుడయిన రాఘవయ్యగారి నడిగి చింతపండూ, పచ్చిమిరపకాయలూ, ఉప్పూ తీసుకుని పచ్చడి రుబ్బి చెరువుకట్ట మీదనూ, చింతచెట్టు క్రిందనూ కూర్చునే బాటసారులకూ, పావులూరు నుంచి గుడ్డలుతటకటానికి వచ్చే చాకలి వాళ్ళకూ అక్కడ పనిచేసే వాళ్ళకూ, అక్కడ వుండి ప్రదక్షిణాలు చేసే బీదవాళ్ళకూ ఎందరికో పెడుతూ ఉండేది.

ఒకరోజు అమ్మకు వెళ్ళటం కుదరలేదు. ఆ రోజున చాకలి రామన్న అనే అతను వచ్చి, “అయ్యా! ఈ పూట అమ్మగారు లేకపోతే బువ్వలోకి పచ్చడి లేదు. బువ్వలేదు. మా తల్లి ఎంతమంది కడుపుల్లో మంట చల్లారుస్తున్నదో – అన్నపూర్ణమ్మ తల్లి” అన్నాడు గద్గద స్వరంతో.

“ఇప్పుడే యిట్లా ఉంది. ముందు ముందు ఎట్లా ఉంటుందో… రామన్న తమ్ముడు గోపన్న ఊహావిహంగం భవిష్యదాకాశంలో విహరించింది.

100. అందరూ కాఫీలు తాగుతూ అమ్మకు ఇవ్వరు. చిదంబరరావు తాతగారు అమ్మతో “అమ్మా! నీవు కూడా కాఫీ తాగు” అంటారు.

“నాకు అలవాటు లేదు తాతగారూ! కాఫీ సహించదు”

“నీకు సహించదా, వాళ్ళు ఇవ్వరా?”

“ఒకరోజు ఇవ్వవస్తే వద్దన్నట్టున్నాను. అప్పటినుండి వాళ్ళు అడగరల్లే వుంది” చిదంబరరావు తాతగారు గ్లాసులో వున్న కాఫీ చిందిపోయేటట్లుగా నవ్వుతారు.

“రెండూ సందిగ్ధంగానే వున్నాయి. ఇప్పుడు నేను యిస్తా తాగు.” తాతగారు గ్లాసులో పోసి యిస్తారు. అమ్మ తాగుతుంది. అన్నపూర్ణమ్మ గారు: “దీనికి అంతా చంద్రమౌళివారి పోలికలు వచ్చినాయి.” భారతమ్మగారు (చిదంబరరావు గారి కూతురు) అందుకుని “ఆ పోలికలు వస్తే బాగుపడేది”

అన్నపూర్ణమ్మగారు, భారతమ్మగారు ఇద్దరూ చర్చ చేసుకుంటారు. మన్నవ వారి పోలికని భారతమ్మగారు, చంద్రమౌళివారి పోలికని అన్నపూర్ణమ్మగారు తరచుకుంటారు.

వినీ వినీ అమ్మ “నాకు ఎవ్వరి పోలికలు రాలేదు. మా అమ్మ, నాన్న ఇద్దరి పోలికలు వచ్చినాయి.”

చిదంబరరావు తాతగారు పక పకా నవ్వి, “పిట్టపోరు పిట్టపోరు పిల్లి. తీర్చిందంటారు. ఇదే కాబోలు. ఇది అట్లా లేదు. పిల్లిపోరు పిల్లి పోరు పిట్ట తీర్చింది. రెండువైపులా పిల్లుల్ని చేసింది.”

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!