1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 19
Month : October
Issue Number : 4
Year : 2020

77. తిరువళ్ళూరులోని సత్రంలో వాకిట్లో గదిలో ఒక పహిల్వాన్తో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ. అమ్మతో కాసేపు మాట్లాడిన తరువాత పహిల్వాన్ “చా లోతుగా మాట్లాడుతున్నావే” అంటాడు.

అమ్మ: మీరు అడిగిన వాటికి సమాధానమేగా! మీరు ఎంత లోతుకు తీసుకువెళితే అంతలోతుకు వచ్చి వుంటాను. అమ్మ మాటల్లోని ఆ భావగాంభీర్యానికి అతడు సమ్ముగ్ధుడై అమ్మను తన ఒడిలోకి తీసుకుని అమ్మ చుబుకం పట్టుకుని తనవైపుకు తిప్పుకుని ఆ లేత బుగ్గలపై ముద్దుపెట్టుకుంటూ, “నీవు నా ఇష్టదైవానివా అమ్మా?” అంటాడు. నీ ఇష్టదైవమెవరో నాకేమి తెలుసు? “ఎవరో కాదు. అదుగో వాడే. మురళీ కృష్ణుడు! ఆ స్వామి ఎదురుగా వచ్చి మాట్లాడాలని కోరుకుని ధ్యానం చేసేవాడిని. నీకు ఆ ఫొటో చూపించినప్పుడు నీలో ఆ ఫోటోలో వున్న వైఖరి కనుపించింది. క్రమంగా మారిపోయి పూర్తిగా వారే అయినారు. మారకుండా ఎప్పుడూ నాలో ఇట్లాగే వుండవా” అని ఏడుస్తాడు. “నాయనా కృష్ణా! శక్తి స్వరూపం కూడా నేవేనా! పిల్లగా వచ్చావు. రాధవయి వచ్చావా? అని అరచి పడిపోతాడు.. అతనికి ఆ లోకాతీత స్థితిలో ఎటు చూచినా ఏమి చూచినా కృష్ణ దర్శనమే అవుతుంది. తర్వాత లేచి లోపలికి వెళ్ళి కెమెరా తీసుకొచ్చి ఫోటో తీస్తాడు. నాలుగు ఫొటోలు తీసిన తర్వాత, అమ్మ చీర కట్టుకుని కొప్పు, పెద్దబొట్టు పెట్టుకుని, అన్నపు పళ్ళెము చేత పట్టుకుని అందరికీ వడ్డిస్తున్నట్లుగా కనిపిస్తుంది. వెంటనే కెమెరా క్రిందపెట్టి, “అమ్మా! ఆదిలక్ష్మీ! జగజ్జననీ! ఎక్కడనుండి వచ్చావు. నాకీ రూపమంటే చాలా ఇష్టం” అంటూ కౌగలించుకుని ఎత్తుకుంటాడు. ఎత్తుకోగానే మామూలు అమ్మ అయిపోతుంది.

78. అమ్మా, మరిడమ్మ తాతమ్మ గుంటూరు బ్రాడీపేట మూడోలైనులో చింతపల్లి రామచంద్రరావుగారి ఇంటిదగ్గరకు వెళతారు. ఆ ఇంట్లో రామచంద్రరావు గారి తమ్ముడయిన గుండేలురావు అనే ఆయన పక్షవాతంతో 20 సంవత్సరాల నుంచీ బాధపడుతూ వుంటారు. అమ్మ వాకిట్లో బండి దిగి సరాసరి గుండేలురావు గారి మంచం దగ్గరకు వెళు తుంది. అమ్మ ఒక నారింజపండు గుండేలురావుగారికి ఇస్తుంది. చేతికి ఇస్తే వల్చుకోలేనంటాడు. అమ్మ వల్చి నోట్లో పెడుతుంది. మూత్రవిసర్జనతో కలుషితమైన వస్త్రాలు తీసి శుభ్రవస్త్రాలు పక్కలో పరుస్తుంది. ఆయన రామభక్తుడు కావటంతో తన ఇష్టదైవమే తనను అనుగ్రహించే నిమిత్తం ఇట్లా ప్రత్యక్షమయినాడని భావిస్తాడు. “నా బాధ నివారణ చేయటానికి వచ్చావా నాయనా రామచంద్రా!” అని నంగి మాటలతో అంటాడు. ఆ సంబోధన అన్నగారైన రామచంద్రరావు గారు విని తననే పిలుస్తున్నాడనుకుని తమ్ముడిని సమీపించి “పిలిచావా” అంటాడు. గుండేలురావు : పిలువలేదు నాయనా! ఊరికే అనుకున్నాను “రామచంద్రా” అని.

రామచంద్రరావు: ఈ అమ్మాయి ఎవరు?

గుండేలురావు: ఎవరో నాకూ తెలియదు. అమ్మై ఆదరిస్తోంది. రాముడై రక్షిస్తున్నది.

79. అమ్మ చేత 15 రోజులు సేవచేయించుకున్న అదృష్టవంతుడు గుండేలురావు గారు. ఆయనకు తన అంత్యకాలం సమీపించినట్లు అవగతమవుతుంది. ఆ సమయంలో అన్నను దగ్గరకు రమ్మని అమ్మ రెండు చేతులు తన ముఖము మీద పెట్టుకుని అన్నగారి చెయ్యి చేతిలో పెట్టుకుని, “నేను ఈ అమ్మలో కలిసిపోతున్నాను. వచ్చినప్పటినుండి క్రమేపీ కలుపుకుంటున్నది. నేనేదో అంటున్నానను కోవద్దు. ఇది సత్యం. అమ్మ సామాన్యురాలు కాదు. అసాధారణం సాధారణమైన తత్త్వంగా వచ్చింది. బంధువులెవరూ అర్థం చేసుకోలేదనుకుంటాను. ఇటువంటి వాళ్ళ స్థితి ఇట్లాగే వుంటుంది. వాళ్ళు అంతా నమ్మినా నమ్మకపోయినా, నీవు మాత్రం ఈ అమ్మను నమ్ముకో. నేను ఏదో చెపుతున్నానని అనుకోవద్దు. బ్రతికివుంటే కొంత కాలానికి నీవే వింటావు. అటువంటి అనుభవాన్ని అనుభవించాను. అమ్మను గురించి ఇంకా చెప్పాలనుపిస్తున్నది. కానీ మాట రావటంలా. ఎవడికి మంచి తరుణం వస్తే వాడు నమ్ముతాడు. మంచి తరుణం వచ్చినవారు నమ్ముతారు” అని కన్ను మూస్తాడు. అమ్మలో కలుస్తాడు.

80. అమ్మ గుంటూరులో వున్న సమయంలో కొన్నిరోజులు శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి కళ్యాణానంద భారతీ స్వామి ఆశ్రమానికి వెళుతుంది. వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతుంది.

30 రోజులు గడచిన తరువాత స్వామి అమ్మను దగ్గరకు పిలిచి అడుగుతారు.

“అమ్మా నీవెవరు?” 

అమ్మ: నేను ఎవరో నాకు తెలియకనే తెలుసుకుందామని వచ్చాను.

స్వామి: మీది ఏ కులము?

అమ్మ: శుక్ల శోణితాలకేదో అది.

స్వామి: మంత్రము చెపుతా చెప్పుకుంటావా?

అమ్మ: ఎందుకో?

స్వామి: ఇందాక నేను ఎవరో తెలుసుకుందామని వచ్చానంటివే?

అమ్మ: అంటే – దానికి మంత్రమే కావలెనా? అసలు మంత్రమంటే ఏమిటి? స్వామి: కొన్ని పవరుగల అక్షరాలు కలిపి కొన్ని వాక్యాలు చేసి వాటికి కొంత శక్తి ఇచ్చి అది మాబోటివారు రహస్యంగా మీకు చెప్పేది మంత్రము.

అమ్మ: అక్షరములలో ఏ ఏ అక్షరములు పవరు గలవి? స్వామి: అక్షరములకు శక్తి మేము ఇస్తాము.

అమ్మ: ఇందాక మీరు పవరుగల అక్షరములంటిరే! మీకే ఇచ్చే శక్తి వున్నప్పుడు, గడ్డిపోచకు కూడా ఇవ్వవచ్చుగా!

స్వామి: ఇవన్నీ నీకెందుకమ్మా. చిన్నపిల్లవు. నీవు చెప్పించుకో. అమ్మ: చెప్పేది వింటా, చెప్పించుకోలేను. చెప్పించుకోవట మంటే మీరన్నదల్లా అనాలి. చెప్పేది వింటా.

స్వామి మౌనముగా కూర్చుని కొంతసేపటికి స్నానానికి లేచి, ఇంక నీవు వెళ్ళమ్మా అంటారు.

81. మరొకరోజు అమ్మ కళ్యాణానంద భారతీస్వామి దర్శనార్ధమై వెళుతుంది.

స్వామి: మధ్యాహ్నము నుండి రాలేదేమమ్మా?

అమ్మ: అప్పుడు వచ్చే తరుణం రాలేదు. ఇప్పుడు వచ్చింది, వచ్చాను. 

స్వామి: తరుణమంటే ఏమిటమ్మా?

అమ్మ: తప్పించుకుందామన్నా తప్పనిది. చేద్దామన్నా చేయలేనిది. వీటినన్నింటిని నడిపించేది నాయనా!

స్వామి: నాయనా – అంటున్నా వెందుకు నన్ను?

అమ్మ: అది నా విధి.

స్వామి: విధి అంటే?

అమ్మ: విధి కర్త. విధానము కర్మ. స్వామి అమ్మను ముద్దుపెట్టుకుని 

“నీవు అమ్మాయివే గాని, అమ్మగా వున్నావమ్మా’

అమ్మ: మాయీ అంటే అమ్మే కదా!

82. మూడవరోజు అమ్మ స్వామివారి వద్దకు వెళుతుంది.

 స్వామి: సరే కాని, నేను అడిగింది చెపుతావా అమ్మా? 

అమ్మ: మీరడిగింది చెప్పలేను. మీరడిగేది నాకు అర్ధమయిన దానిని బట్టి చెప్పగలను.

స్వామి: ఎందుకు అర్థము చేసుకోలేవు?

అమ్మ: నేను మీరు కాలేదు గనుక.

స్వామి: ఎప్పుడు అవుతావు?

అమ్మ: నేను మీరయినప్పుడు సర్వము అవుతాను. 

కళ్యాణానంద స్వామి అమ్మను దగ్గరకు తీసుకుని తల గుండెలకు హత్తుకుని, “నీవెవరవు తల్లీ? నీవు తప్పకుండా నా దగ్గర వుండాలమ్మా?

 “నేనుండలేను కాని, మీరుంచుకోండి నాయనా”

స్వామి తియ్యని పాయసం తెప్పించి అమ్మకు ఇస్తారు. అమ్మ త్రాగుతూ ఉండగా స్వామివారు అడుగుతారు “నాకూ ఇవ్వవూ” 

“మీరు నాకు ఎక్కడ నించి తెప్పించి ఇచ్చారో చెప్పండి. మళ్ళీ తెచ్చి ఇస్తాను.”

“నేను గ్లాసెడు ఇస్తే నీవు సగం ఇవ్వలేవు?”

“ఇంత చిన్నపిల్లకే ఇది చాలకపోతే, అంత పెద్ద పొట్టకు అది చాలుతుందా? అందుకని తెచ్చి పెడతానన్నాను.”

“నీకెందుకు. నేను సరిపుచ్చుకుంటాగా.”

“తృప్తిగల మనస్సా? లేక కొద్ది దానిని ఎక్కువ చేస్తావా?”

“తృప్తి అంటే ఏమిటమ్మా?”

“ఇంతకంటే మరొకటి లేదనే స్థితి.”

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!