- నాగుల చవితికి పుట్టలో పాలుపొయ్యటానికి వూరంతా కలసి రైలుపేటలో అద్దంకివారి తోటకు వెళతారు. అందరూ పుట్టలో పాలుపోసి వచ్చే సమయంలో అమ్మ వెళ్ళుతూ చిదంబరరావు తాతగారిని కూడా తీసుకు వెళుతుంది. “అయినా నేనెందుకమ్మా యీ పండక్కు” అంటూ వెళతారు.
అందరూ పాలుపోస్తే అమ్మ నీళ్ళు పొయ్యటానికి పోతుంది. అట్లా నీళ్ళు పోసే సమయంలో నాగేంద్రుడు బయటకు వస్తాడు. నాగేంద్రుడే కాక తతిమ్మా పురుగులన్నీ అమ్మ రాగానే బయటకు వచ్చి నిలుచుంటాయి. శాస్త్రయుక్తంగా మంత్రాల పూజ చేసే బ్రాహ్మణుడు భయపడి అవతలకు వెళ్ళిపోతాడు.
అమ్మ పాము దగ్గరకు వెళ్ళి పాము ముఖములో ముఖము పెట్టి చిదరంబరరావు గారితో “తాతగారూ! భయము లేకుండా చూస్తున్నారుగా! పాము తలమీద చేయిపెడతారా?”
చిదంబరరావు గారు నవ్వు ముఖముతో కంటివెంట ఆనంద బాష్పములు కారుస్తూ, “నువ్వు పెట్టిస్తావా?”
అమ్మ తన అరచేతి మీద తాతగారి చేయి వేసుకుని “ఏమి నాయనా నాగేంద్రా! అని చేతితో సవరిస్తూ, “నా కోసం బయటకు వచ్చావా? పాలుపోసే ప్రతి పుట్టలో నీవుంటావా. ఈ పుట్టలోనే వున్నావా?”
నీవున్న చోటల్లా నేనున్నా నన్నట్లు ఎగిరి అమ్మ భుజము మీద వాల్తుంది – పిల్లలు భుజము మీద పడుకున్నట్లుగా!
చిదంబరరావు గారు కొయ్యబారిన శరీరం కలవాడై కళ్ళుమూసుకుని అమ్మ రెండో భుజము మీద వాల్తారు. కొద్దిసేపు తర్వాత అమ్మ పాముతో ‘పోరా’ అంటుంది. వెంటనే భుజము మీద నుంచి లేచి పాదాల మీద వ్రాలి పుట్టలోకి వెళ్ళిపోతుంది.
- అమ్మ: “అందరూ మానవుని జీవిత గమనానికి ఆధారం నవగ్రహాలంటూ వుంటే నాకు రెండే కనబడుతున్నాయి”
చిదంబరరావు గారు: “ఏమిటి ఆ రెండూ? రాహు కేతువులా?” “కాదు, రాగద్వేషాలు”
“రాగ ద్వేషాలకు మించి మరేమీ లేదా?”
“ఆ రెండూ జీవితానికి ఆధారం. ఆ రెంటికీ ‘నేను’ ఆధారం. రాగమంటే ‘కావాలి’ అని కదా! ఒక విధంగా ద్వేషం కూడా రాగమే. ఉదాహరణకు – ఒకరిని చంపాలి అనేది ద్వేషం. ఆ చంపడం అనేది కోరికేగా! అంత త్వరగా మార్చేస్తావు?”
- చిదంబరరావుగారు: “ఒకప్పుడున్న అభిప్రాయాన్ని మరొకప్పుడు ఎందుకమ్మా అమ్మ: మనస్సు యొక్క లక్షణమే అది.
చిదంబరరావు గారు: “అది నాకు తెలుసు మహా!” “ఎందుకు అట్లా చేస్తావని అడుగుతున్నాను”
అమ్మ: అడిగేది చెప్పేదానికి అందేది కాదు. అడిగేది చెప్పేది కానిది – పొందేది. ఆ పొందింది మాటల్లో పెడితే ఆ పొందింది చెప్పలేడు. అనుభవైకవేద్యం మాత్రమే. దానిని మాటలలో పెట్టేటప్పటికి యదార్థం మరుగున పడి ఏదో చెప్తాము. విన్నవాళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు.
- వర్షం కురుస్తూ వుంటుంది. చిదంబరరావు గారింటి వరండాలో కొంతమంది బిచ్చగాళ్ళు తలదాచుకోవటానికి వస్తారు.
అమ్మ గబగబా వంటమనిషి దగ్గరకు వెళ్ళి “నాకు కొంచెం అన్నం పెడతారూ!” అని అడుగుతుంది. వంటమనిషి “అయ్యో! నా తల్లీ! ఎందుకు పెట్టనూ! అసలు అన్నమే అడగవు”
అమ్మ: ఆకలవుతున్నది. పెద్ద విస్తరి వేసి చాలా అన్నం పెట్టండేం. తాతగారు భోంచేయరట ఆ అన్నం కూడా నాకే పెట్టండి.
ఇంతలో చిదంబరరావు తాతగారు వస్తారు. “ఎవరికమ్మా అన్నం?” అమ్మ తాతగారి చెవులో రహస్యం చెపుతుంది. “అట్లాగే తీసుకెళ్ళు” అని తాతగారంటారు.
తాతగారు ఆ మాట అనటంతోనే వంటమనిషి మరికాస్త అన్నం పెడుతుంది. అమ్మ ఆ అన్నం తీసుకెళ్ళి బిచ్చగాళ్ల జోలెలో తడిసిపోయిన అన్నం కుక్కలకు పందులకు వేసి ఈ అన్నం జోలెల్లో వేసి చేతికిస్తుంది. “నాయనా పులుసు ఇస్తా వుండండి. గిన్నెతో తీసుకెళుదురుగాని” అని నెయ్యి, పులుసు తీసుకువెళ్ళి వారికిచ్చి, “నాయనా! మీకు ధోవతులు లేవా? మీకు అమ్మాయిలున్నారా? వాళ్ళకు చొక్కాలున్నాయ్యా?”
బిచ్చగాళ్ళు: కడుపులోకి తిండే లేకపోతే ధోవతులు ఎట్లా వస్తయ్యి తల్లీ! అమ్మ గబగబా దొడ్లో బాదమాకులు ఏరుతున్న తాతగారి దగ్గరకు వెళ్ళి ఆయనను అడిగి బీరువా మీద వున్న మూడు తలగుడ్డలు, నాలుగు ధోవతులు, ఒక కోటు, అమ్మవి నాలుగు చొక్కాలు అన్నీ తీసుకుని వాళ్ళ చేతులకిస్తుంది. వాళ్ళు సంతోషంతో “మా బంగారు తల్లి. కడివెడు సంతానం కలిగి ఆ తల్లి కడుపు చల్లగా పదికాలాల పాటు వర్థిల్లాలి” అంటూ వెళ్ళిపోతారు.
- అమ్మ, సీతాపతి తాతగారు, రాఘవరావు మావయ్య, తదితరులు తిరువళ్ళూరు. వెళతారు. అమ్మ కోనేటిలో ఈత కొట్టుకుంటూ మండపం మీదకు వెళ్ళి కూర్చుంటుంది. చిన్న పిల్ల కోనేటిలో పడ్డదని అందరూ భయపడి కేకలు వేస్తారు. అమ్మ మాత్రం ఒక చోట మునిగి మండపం దగ్గర తేలి మండపం మీదకు వెళ్ళి కూర్చుంటుంది. అందరూ విభ్రాంతులై చూస్తూ ఉండి పోతారు.
అక్కడ మూగిన జనంలో కాషాయగుడ్డలు కట్టుకున్న ఒక మనిషి సీతాపతి తాతగారు దగ్గరకు వచ్చి “ఇందాక మండపంకి వచ్చిన అమ్మాయి ఎవరు?” అని అడుగుతారు.
తాతగారు: “మా అమ్మాయేనండీ” అంటారు.
సాధువు: “ధన్యుడివి నాయనా, ధన్యుడివి. దేవతను కన్నావు” అని తొందరగా వెళ్ళిపోతారు.
సీతాపతి తాతగారు ఆయన వెంటపడి ఏమిటి మీరన్నది ఏమిటి మీరన్నది అంటాడు. సాధువు కనపడడు. అదృశ్యమౌతాడు. సాధువు గొంతు ఆడగొంతు ధ్వనిలా వుంటుంది.