(గత సంచిక తరువాయి)
మహోదధిలో మణిరత్నాలు – 126
అమ్మ “నాన్నా మంత్రాయి! అన్నం తినవూ?” అని గడ్డం పట్టుకుని అడుగుతుంది.
“ఎందుకమ్మా ఈ మాలవాడికి ఇంత ముద్దుపేరు?”
“నీవు మావాడివి. మాలవాడివి కాదు.”
మంత్రాయికి ఆనందంతో కళ్ళవెంట నీళ్ళు వస్తుంటాయి.
అమ్మ అన్నం పొట్లాం విప్పి పొట్లకాయ పెరుగు పచ్చడి, వంకాయ కూర, గోంగూర పచ్చడి వెన్నపూస కలిపి ఒక్కొక్క ముద్ద నోట్లో పెడుతూ వెన్నపూస నంజుకోను పెడుతూ వుంటుంది.
మంత్రాయి ఒక్కొక్క ముద్ద తింటూ వెక్కుపట్టి ఏడుస్తూ వుంటాడు.
“అమ్మా! నేను పుట్టి ఇంతకాలమయింది గాని ఈ రకం భోజనం ఎప్పుడూ చేయలేదు. ఆ లేత చేతులు చూడు అన్నం కలిపితే ఎట్లా కందిపోయినయ్యో! కలపటమే కాకుండా నోట్లో కూడా పెడుతుంటే వేళ్ళు పళ్ళ కింద పడతయ్యేమో అని భయమేస్తుంది.”
మహోదధిలో మణిరత్నాలు -127
అమ్మ స్నానం చేసి తోటలోకి వెళుతుంది. సాయంకాలం 5 గంటలవుతుంది. చెట్టెక్కి చింతచిగురు కోసుకు తిని చెట్టుకొమ్మల మీద పడుకుని వుంటుంది. ఒక కోకిల అమ్మ పక్కనే కొమ్మ మీద నిలుచుని కూస్తూ వుంటుంది. కాకులు కూడ అమ్మ దగ్గర చేరుతాయి. అవి అమ్మవంక చూస్తూ వుంటాయి. అమ్మ నిద్రపోతూ వుంటుంది. నిద్ర లేచేటప్పటికి ఒక కోయిల, చాలా కాకులు అరుస్తూ వుంటాయి. అమ్మ గురించి చెప్పుకుంటున్నట్టుగా ఒకసారి అమ్మవంక, ఒకసారి తమలో తాము చూసుకుంటూ అరుస్తూ తలలు వూపుతూ చెప్పుకుంటూ వుంటాయి. అమ్మ కోయిల వంక చూస్తుంది. అది వెంటనే ఇంకా దగ్గరకు వచ్చి చెవిలో కూస్తుంది. కాకులు అమ్మ నిద్ర లేచిందనే సంతోషంతో రెక్కలు కొట్టుకుంటూ ఇంకా దగ్గరకు వస్తాయి. అందులో ఒక కాకికి కాలు కొంచెం కుంటి. అది వచ్చి అమ్మ వొళ్ళో కూర్చుంటుంది. అన్నీ వచ్చి ఒకేసారిగా అమ్మ వొళ్ళంతా వాలుతాయి. ముద్దు పెట్టుకున్నట్టు ముక్కులు తాకించి లేచిపోతాయి. చిటారు కొమ్మను వున్న గూడు యే గాలీ లేకుండానే అకస్మాత్తుగా అమ్మ వొళ్ళో పడుతుంది. వొళ్ళో కూర్చున్న కుంటికాకి చివాలున ఎగిరిపోతుంది. ఆ గూట్లో వున్న కాకిపిల్ల అమ్మ పాదాలమీద వాలుతుంది. అమ్మ పిల్లను తీసి ముద్దుపెట్టుకుని గూడులో పెడుతూ వుండగా పిల్ల తల్లి వస్తుంది. అమ్మ వొంటినివున్న చొక్కా విప్పి పక్కవేసి కాకిపిల్లను అందులో పెడుతుంది. కోయిల కళ్ళుమూసుకుని తలవంచకుండా ధ్యానంలో వుంటుంది. అమ్మ దాని రెండు కళ్ళ మధ్య నెమ్మదిగా వత్తుతుంది. ఒత్తగానే అది లేచి అమ్మ వంక చూచి మళ్ళీ తలవంచి నమస్కారం చేస్తుంది.
మహోదధిలో మణిరత్నాలు – 128
అమ్మ సత్రం వెనుక చెరువులో స్నానం చేస్తూ వుంటుంది. తామరాకులు, తామరపువ్వులు, బాతులు, కొంగలు అమ్మ చుట్టూ మూగి వుంటాయి. అమ్మ వాటి మధ్యలో వుంటుంది. ఇంతలో కాకులు, కోయిలలూ కూడా వచ్చి స్నానం చేస్తాయి.
కోయిల, కాకులు, కొంగలు, బాతులు, పూలు, తామరాకులు, నీరు, చింతచెట్లు, అన్నింటినీ ఒకేసారి చూస్తూవుంటే భిన్నత్వంలేని మనస్తత్వం గుర్తుకు వచ్చింది. అమ్మకు.
కొంగ, కాకి ఆడుకుంటూ వుంటే ముద్దు వస్తుంది. అమ్మ వంక కొంగ అరమోడ్పు కన్నులతో, తదేక దృష్టితో చూస్తూ వుంటుంది. కాకి “నాకు నేనే ఏకాకి” అన్నట్టు తలవంచి ఒక కంటితో చూస్తుంది.
అమ్మ బయలుదేరి “వస్తానమ్మా! నేను సాయంకాలం వస్తా. మళ్ళీ సాయంకాలం ఆడుకుందాం” అనగానే బాతులు అన్నీ అమ్మచుట్టూ ప్రదక్షిణంగా తిరిగి నమస్కార సూచనగా తలలు వూపి వెళ్ళిపోతాయి.
అమ్మ ఇంటికి వచ్చేస్తుంది.
మహోదధిలో మణిరత్నాలు – 129
అమ్మకు 10 సంవత్సరాలు పూర్తి అయి 11వ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతిరోజూ మహాలక్ష్మమ్మవారి పురంలోకి వెళ్ళటం, భజన చేయటం, మంత్రపుష్పం చెప్పటం. శుక్రవారం, శనివారం బ్రహ్మాండం భూషయ్యగారి ఇంటికి భజనకు వెళ్ళేది. శనివారం రాత్రిపూట పులిపాక భావనారాయణ గారింటిలో వాసుదాసుగారి కీర్తనలతో భజనలు చేస్తూ వుండేవారు. అమ్మ అక్కడకు వెళ్ళి భజనలు చెప్తూ, చేస్తూ వుండేది. అట్లా క్రమంగా వూరంతా ప్రతి ఇంట్లో భజనలు చేస్తూ వుండేవారు. ప్రతి ఇంటికీ అమ్మ వెళుతూనే వుండేది. ఒక వేళ వెళ్ళక పోతే పిలిపించేవారు. ఏకీర్తనయిన, ఎవరయిన మెదటి చరణం చెప్పినాక రెండో చరణం అమ్మ చెప్పుతుంటే అంతా ఆశ్చర్యపడేవారు. నగర సంకీర్తనకు కూడ వెళుతుండేది అమ్మ.
పోలంరాజు లక్ష్మీనారాయణగారు, అమ్మ, పులిపాక భావన్నారాయణగారు, మన్నవ వెంకటేశ్వర్లుగారు, మన్నవ సీతయ్యగారు, మన్నవ రామచంద్రరావు గారు, మన్నవ రామబ్రహ్మం గారు, యిట్లా దాదాపుగా 50 మంది నగర సంకీర్తన చేస్తూ వుండేవారు.
ఇంట్లో తాతమ్మగారు సర్వకాల సర్వావస్థలయందు పాటలు, తత్త్వాలు,
అద్వైతవిచారణ చేస్తూ వుండేవారు.
వూరు ముందర మన్నవ హనుమంతయ్యగారు ఉపనిషత్తులు, భగవద్గీత వేద ప్రమాణంగా ఎప్పుడూ పురాణం జరుగుతూ వుండేది.
అమ్మ బాల్యావస్థలో మన్నవ స్థితి అది.
మహోదధిలో మణిరత్నాలు – 130.
అమ్మ అంటే లోకనాధం బాబాయి (నాన్నగారి తమ్ముడు) చాలా ప్రేమగా వుండేవాడు. ఒకనాడు అమ్మతో “నీకు నేను చదువు చెపుతాను, చెప్పించుకుంటావా?” అని అడుగుతాడు.
అమ్మ: “చెప్పు లోకం”
లోకనాధం: “నీకు ఓనమాలన్నా వచ్చునా?”
అమ్మ: “ఓం నమః శివాయ” వస్తే చదువంతా వచ్చినట్టే. అంటే వూరికే రావటం కాదు; అర్ధంతో వస్తే!”
లోకనాధం: “అర్ధం అంటే?”
అమ్మ: “అర్థమంటేనే అర్ధం కానివాడివి, ఏమి చదువు చెప్పుతావు?”
(సశేషం….)