శ్రీ జయంతి చక్రవర్తి విశ్వకుటుంబ సభ్య సమ్మేళనంలో ప్రస్తావించినట్లు అమ్మ మనకు అందించిన మంత్రాలను పురశ్చరణ చేసుకునేందుకు వీలుగా శ్రీ అనసూయా మహాదేవి మూలమంత్ర హోమవిధానం అన్న గ్రంథం వెలువడింది. గ్రంధం సవివరంగా ఉన్నది. అమ్మ మన అందరకు అంఅ అని అంతా అని, ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అని “జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అని ఉపదేశించినట్లే లెక్క ఎన్నోసార్లు తన సమక్షంలోనే మనచేత అనిపించింది కదా. పురశ్చరణ ఈ మూడు మంత్రాలూ చేయవచ్చు. గ్రంథంలో ప్రచురించిన రీతిగా మాతృగాయత్రిగా నామ మంత్రం చేసుకోవచ్చు. అందులో ప్రకటించిన ఇతర మంత్రాలనూ స్వీకరించవచ్చు.
పురశ్చరణ ప్రక్రియ కాలక్షేపంగా ఉండకూడదు. మంత్రాన్ని రెండు గంటలో అంతకంటే ఎక్కువ సమయమో జపిస్తేనే జపం బలంగా సాగేది. దీక్షాకాలం పరిమితంగానే ఉండాలి. అంటే 11, 21 మండలము రోజులలో లక్ష జపం పూర్తి చేయాలి. ధాన్యాభిషేకం నాడు దీక్షాస్వీకారం చేసి అమ్మ జన్మదినానికి గాని ఆ మరునాడు గాని హోమం చేసుకోవచ్చు. అలాగే అమ్మ జన్మదినం నాడు దీక్ష తీసు మే 5ననో, ఆ మరునాడో హోమం చేసుకోవచ్చు. అదే విధంగా మే 5న మొదలు పెట్టే అనంతోత్సవం నాడు హోమం చేయవచ్చు. అనంతోత్సవం నాడు దీక్షాస్వీకారం చేస్తే అన్నపూర్ణాలయ వార్షికోత్సవం నాడు ఆగష్టు 15న హోమం చేసుకోవచ్చు. ఆగష్టు 15 చేపట్టే దీక్ష నవరాత్రులలో ముగించవచ్చు. నవరాత్రులలో మొదలు పెట్టి డిసెంబరులో పూర్తిచేయవచ్చు. ప్రతిపండుగకు జిల్లెళ్ళమూడి రావచ్చు. అమ్మ మంత్ర హోమం చేసుకోవచ్చు. సిద్ధంగా యాగశాల ఉన్నది. ఋత్విక్సహాయం లేకుండానే హోమం చేసుకునే ప్రక్రియ చెప్పబడింది. ఒకేసమయంలో రెండు మంత్రాలు పురశ్చరణకు తీసుకొనవచ్చు. అంఆ, ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం రెండూ కాని, అమ్మనామం అంఆ రెండూ కాని, ఓంఐం క్లీం హ్రీం శ్రీంఓం, అమ్మ నామం రెండూ కాని చేపట్టవచ్చు.
అమ్మ మనకు అందించిన ఈ మూడు మంత్రాలను సిద్ధమంత్రాలుగా చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు ఏ రకమైన అవసరం వచ్చినా అప్పుడు మూడు మంత్రాలలో ఏదైనా ఒకటి ఎంచుకుని అవసర ప్రబలతను పట్టి సంఖ్యానిర్ధారణ చేసుకుని ఆ సంఖ్యకు జపహోమాదులు చేసి అవసరం తీర్చుకోవచ్చు. దేనికైనా పట్టుదల ముఖ్యం. వయసులో చిన్నవాళ్ళు, తీరిక ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, సోదరీసోదరులెవరైనా పెద్దసంఖ్యలో ముందుకు వచ్చి ప్రతిపండుగకు అమ్మ మంత్రపురశ్చరణలు చేసి హోమాలు జరుపుకునేందుకు కృతనిశ్చయులు కావలసిందిగా కోరుతున్నాం. క్షీరతర్పణం చేసుకునేందుకు వీలుగా మనకు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వెండి ప్రతిమలున్నాయి. శ్రీ అనసూయా మహాదేవి బీజాక్షర యంత్రం రాబోతున్నది. ఆసనాలు, పట్టుబట్టలు అన్నీ మీకు అందుబాటులో ఉంచబడుతాయి. వాని మూల్యం చెల్లించి నిరాటంకంగా దీక్షలు కొనసాగించుకొనవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఫిబ్రవరి 17న మాతృగాయత్రి అంటే “ఓం జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి, శ్రీ పరాత్పరి స్వాహా” మంత్రదీక్ష యర్రచందనమాలతో సహా ఇవ్వబడుతుంది. ఆ దీక్షా స్వీకారం చేసి లక్షసంఖ్య జపం పూర్తి చేసినవారికి ఆ అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా హోమం చేసుకొనే ఏర్పాటు చేయబడుతుంది. సోదరీసోదరులు ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ముందుగా జపం పూర్తి చేసి శ్రీ విశ్వజననీ పరిషత్కు తెలియచేసిన వారికి తగు ఏర్పాటు చేయబడతాయి. అధికసంఖ్యలో పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.