1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృశ్రీ మరుజన్మ సిద్ధాంతం

మాతృశ్రీ మరుజన్మ సిద్ధాంతం

Annapragada Lakshmi Narayana
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : March
Issue Number : 8
Year : 2011

‘అమ్మ సంభాషణలలోని చతురత అసామాన్యం. అనితరసాధ్యమని తేలిన ఆమె వాదకుశలత అనుపమం. అమ్మ మాట మృదుమధురంగా ఉంటుంది. అయితే ఆ మాట సూటిగా మన హృదయాన్ని తట్టి లేపుతుంది. ఆమె వాదన ఎంతో గంభీరం. ఎదటివాడిని ప్రక్కకు తప్పు కోనివ్వదు. అమ్మవాదన, వాదనగా కనిపించదు. చూచే వాళ్లకు అది వాదన అనిపించదు. చెవుల్లో ఎవరో వేణువు ఊదినట్లు వుంటుంది. అవతలవాడు ఎంత పండితుడైనా సరే, అమ్మ మాటల మాధుర్యంలో పడి ముగ్ధుడై తన వాదన గాలికి వదలి వేసి అమ్మమాటకు తలూపాల్సిందే!

అమ్మ, తన తరంలో, కొన్ని విలక్షణమైన, వినూత్నమైన, ఆధ్యాత్మిక భావజాలానికి పునాదులు వేసింది. నవయుగప్రవక్తగా అవతారమెత్తింది. యుగయుగాలుగా మనలో పాతుకుపోయిన కొన్ని సనాతన వేదాంత సిద్ధాంతాలకు, తనదైన శైలిలో మృదుమధురమైన వాక్యవిన్యాసంతో వినూత్నమైన వ్యాఖ్యానాలు రచించింది.

ఈనాటివరకు, బహుళ ప్రచారంలో ఉన్న, ప్రాచీన సిద్ధాంతాలను కొన్నింటిని, అమ్మ గట్టిగా ప్రశ్నించింది. వునర్జన్మ వాదనను, కర్మసిద్ధాంతాన్ని, అమ్మ అంగీకరించలేదు. ఆత్మకు లేని పాపపుణ్యాలు, జీవుడికి ఎక్కడనుంచి సంక్రమించాయని సంప్రదాయ వేదాంతాన్ని, నిలదీసింది. ఈ సృష్టి ఆరంభమైనప్పుడు, జీవులందరికి, వారి వారి ప్రధమ జన్మలకు కారణంగాని, పాపపుణ్యాలు, ఆ తరువాత ఆ జీవుల జన్మలలో ఎలావెంటబడ్డాయని, నిగ్గదీశారు అమ్మ. జీవుడికి అసలుకర్తృత్వమే లేనప్పుడు అన్నింటికి ఆ మహాశక్తియే మూలకారణమైనప్పుడే ఆశక్తి అన్ని ప్రేరణలను కల్పిస్తున్నప్పుడు, ఇక పాపపుణ్యాలు చిక్కుముడి జీవుడికి అసలు ఎక్కడనుండి వచ్చింది ? ఎలా వచ్చింది ? ఎప్పుడు వచ్చింది ? అని సూటిగా ప్రశ్నించింది అమ్మ.

శాస్త్రాలు, పురాణాలు, పునర్జన్మను గురించి, అనేకములైన కథలు, గాథలు, కల్పించి, ప్రచారం చేస్తుంటే, మనిషికి పునర్జన్మ అనేది కేవలం ఊహాజనితమేనని వివరించింది అమ్మ. సముద్ర మధ్యంలో నిరంతరం లేచిపడే కెరటాలనే ఉదాహరణంగా చూపించింది. సముద్రంలో నున్న నీరు, పెద్ద పెద్ద కెరటాలుగా మార్పు చెంది, మరల ఆ సముద్రంలోనే కలిసిపోయినట్లుగా, విశ్వంలోని అనంతశక్తి నుండి సృష్టింపబడిన, ఈ పరిమితమైన రూపాలన్నీ మరలా ఆ అనంతశక్తిలోనే లీనమౌతున్నాయని, ఇక జన్మలని, పునర్జన్మలనీ విభజన ఎక్కడ ఉన్నదని, అమ్మ ప్రశ్న!

జననం, మరణం అనేవి, అనంతకాలంలో అనంత విశ్వంలో రోజూ సహజంగా జరిగే పరిణామాలే. అందుకే నాన్నగారు ఆలయ ప్రవేశం చేసినప్పుడు అమ్మ “నాన్నగారు ఎక్కడికీ వెళ్లలేదు. వెళ్ళరు గూడా. ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. సృష్టిలో సహజమైన పరిణామమే జరిగింది. దీనికై ఎవ్వరూ దుఃఖించాల్సిన పనిలేదు” అని ధైర్యంగా చెప్పింది.

జీవులందరికీ తొలి జన్మ అంటూ ఒకటి ఉన్నది. అంటే తాను మొట్టమొదటి లోకంలో వచ్చిన జన్మ ఈ జన్మలో పునర్జన్మలు ఉన్నాయని కాసేపు అనుకుందాం. జీవులకు తమ తమ తొలిజన్మలు సంప్రాప్తమైనప్పుడు, ఆ జన్మలో జరిగిన కర్మాచరణ కోసం, ప్రేరణ ఇచ్చింది. ఆ అనంతశక్తియే. కాబట్టి చిట్టచివర వరకూ మనమెత్తే అన్ని జన్మలలోను మనం అనేక కర్మలు చేయటానికి ప్రేరణ కల్పించేది కూడా అదే శక్తి గదా ! ఆ కర్మల నుండి వచ్చే కర్మఫలప్రాప్తిగూడా, మనం చేసే ఆయా కర్మలు చేయటం జరిగింది. ఆ మహాశక్తి ప్రేరణచేత చేసే కర్మల వల్ల లభించే కర్మఫలం గూడా జీవులకు ప్రాప్తించిందే గదా ! అంతేగాని, జీవులకు కర్మలు చేయటంలో స్వాతంత్ర్యంగాని, స్వంతగా కర్తృత్వంగాని ఎక్కడ ఉన్నది? ఇదే అమ్మ సిద్ధాంతం. అంటే ఏతావాతా అన్నది ఏమంటే అంతా ఆ అనంతశక్తియే చేస్తున్నప్పుడు, ఇక పురుష ప్రయత్నం గాని, పురుషకారం చూస్తాడు”. గానీ, ఎక్కడ ఉన్నదనీ ? అమ్మవాదన. అందుకే అమ్మ (జీవుడు) దేనికైనా తన ప్రయత్నమంటూ ఉందనుకోవటమే, ఈ తాపప్రతయాలన్నింటికీ కారణం” అంటుంది.

మరి మనమంతా చేస్తున్న పాపపుణ్యాలు మూలంగా, మనకు జన్మలు, పునర్జన్మలు, సంప్రాప్త మౌతున్నాయనుకుంటే, అమ్మ దీనికి ఒక కౌంటరు వేస్తున్నది. మరి జీవుడు మొట్టమొదటిగా జన్మ ఎత్తినప్పుడు, అంతకుముందు జన్మ లేదుకదా, ముందు ఒక జన్మ లేనప్పుడు, జీవుడు ఇంతకు ముందు చేసిన పాప పుణ్యాలంటూ ఏమీ లేవుగదా ! మరి అటువంటి కర్మఫలానికి ఏమాత్రమైనా అవకాశమున్నదా ? జీవుడికి సంప్రాప్తించిన ఆ తొలిజన్మకు, ఎప్పటి పాపపుణ్యాలు కారణమైనాయి ?

“శక్తి, దైవం, భగవంతుడు ప్రేరణ, స్వభావం, ఏదైనా అదేకదా ! మరి తనకు తానుగా, మూలం జీవుడు స్వయంగా చేసిన ఒక కర్మ అంటూ ఏమున్నది ?” ఒక వేళ మొదటివంటి కర్మ ఏదైనా ఉన్నా, నీవు కేవలం పనిముట్టువు మాత్రమే. నీ చేత చేయించే శక్తి, చేయించే కర్త ఒకడు వేరుగా ఉన్నాడు. నీవు చేసే కర్మకు ఫలితం గూడా వాడికే చెందుతుంది గాని, నీకు మాత్రం చెందదు. 

“మన జన్మకు కారణం మనమే అనుకుంటే, మరి జన్మ, పునర్జన్మ మనచేతిలో ఉన్నట్లే. లేదా ఎవరో ఒక శక్తి గాని భగవంతుడు గాని, ఉన్నాడనుకుంటే వాడి వల్లే మనం భూమి మీదికి వచ్చామనుకుంటే, నీ తొలి జన్మకు, మళ్లీ జన్మకు ఆ భగవంతుడే కారణమవుతాడు” నీవు మాత్రం కాదు గదా !

“ఆత్మ ఎప్పుడూ, అంతటా నిండి ఉన్నప్పుడు, మరి ఆత్మకు లేని ఈ జన్మలు, జీవుడికి ఎలా వచ్చాయి? ఎక్కడ నుండి వచ్చాయి?”

“జన్మలున్నవి అనుకునేవాడు చావులోని పుట్టుకను చూస్తాడు.

మన సంప్రదాయ వేదాంతులు, మతకర్తలు గూడా జీవుడికి కొంత కర్తృత్వాన్ని ఆపాదించడానికే పురుష ప్రయత్నము, పురుషకారమని నామకరణం చేశారు. మానవులెవరైనా ముక్తిని సాధించాలంటే, స్వయంగా సాధనలు చేసి, ముక్తి సాధించాల్సిందే నన్నారు. జీవులందరు వారి వారి పాపపుణ్యాలననుసరించి, వారి జన్మలు గాని, పునర్జన్మలు గాని నిర్ణయించబడతాయని, సిద్ధాంతం చేశారు. కాని అమ్మ అలా కాదు, జీవులకు స్వయంప్రతిపత్తిగాని, స్వతంత్రంగా కర్తృత్వమంటూ ఏదీ లేదన్నది. సృష్టిరూపంలో మనకు కనిపించే ఆ దైవశక్తి చేతిలో జీవుడు కేవలం ఒకపరికరము మాత్రమే. జీవుడు చేస్తున్నట్లుగా మనందరికి కనిపించే ప్రతి కార్యానికి, ప్రతి ఆలోచనకు, ప్రతి సంకల్పానికి ప్రతి ప్రేరణకు ఒక మహాశక్తియే మూలకారణంగా ఉన్నప్పుడు, ఒక జీవుడు తనకు తానై స్వతంత్రంగా చేసే దేమిటిః చేయగలిగింది ఏమిటి ? జీవుని చేత అన్ని పనులు చేయించేది అతని మనస్సే నన్నది. జీవుని విషయంలో, అతని మనస్సు సంకల్పించిన తరువాత, అదే సిద్ధమై, కార్యరూపం దాల్చి, జీవుని యొక్క లౌకిక వ్యాపారాలకు, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు గూడా మూలసాధమౌతున్నది.

ఇక జీవుని స్వంతపెత్తనంగాని, స్వంత ప్రేరణగాని, స్వంత కార్యక్రమాలు గాని, సాగించటానికి అవకాశం ఎక్కడిది ? అసలు జీవుడికి గలిగిన ప్రధాన సంకల్పమే “నేను”. జీవుణ్ణి చైతన్యవంతం చేసేది ఆ ప్రధమ సంకల్పమైన ఆ “నేనే”. ఆ “నేనే” దైవమనే మహాశక్తి. ఆ చిన్న “నేనే” ఈ “నేను” ఇక ఈ నేను ఆ నేను ఒకటే అయినప్పుడు, ఇక జీవునికి స్వతహాగా కర్తృత్వం ఎక్కడుంది ? ఇటువంటి పరిస్థితులలో, ఇక స్వయంగా, కర్తగా వ్యవహరించని, వ్యవహరించలేని, జీవుడికి పాపపుణ్యాలు ఎక్కడ నుండి సంప్రాప్తమవుతాయి ? ఒక వేళ ఏదైనా పాపపుణ్యాలంటూ ఉంటే అవన్నీ కూడా ఆ మహా “నేను” కు గాని, ఆ మహాశక్తికి గాని చెందాలేగాని, దానికి కేవలం పనిముట్టుగా పనిచేసే, జీవునికెలా సంప్రాప్తమవుతాయి? ఈ విధంగా సాంప్రదాయ వేదాంతాలను నిగ్గదీసింది అమ్మ. కాబట్టి “జీవుడు ఎప్పుడూ ముక్తుడే” అనే క్రొత్త వాదనకు తెరదీసింది అమ్మ. “అందరికీ సుగతే” అని అభయహస్త మిచ్చేసింది అమ్మ.

ఈ రకంగా వేదాంతశాస్త్రంలో విప్లవాత్మకమైన భావజాలానికి సూత్రధారిగా, నవయుగప్రవక్తగా, అవతారం దాల్చింది అమ్మ. “సంభవామి యుగే యుగే”. సామాజిక శాస్త్రంలో గాని, శాస్త్రంలోగాని, విజ్ఞానశాస్త్రంలో గాని, కాలక్రమేణ అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లే. ఆధ్యాత్మిక సిద్ధాంతాలలో గూడా యుగధర్మాలకనుగుణంగా, కాలగతిననుసరించి, కొన్ని మార్పులు రావటం సహజం. ఈ పరిణామాలను ఎవ్వడూ ఆపలేరు.

“చేతలు నీ చేతుల్లో లేవు” అని అమ్మ ప్రబోధం ఇక్కడ కర్మసిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించటం గాదు దానిని ఖండించటమూ గాదు. మారే కాలానికి, మారు తున్న సంఘవాతావరణానికి, అనుగుణంగా ఒక ఆచరణ యోగ్యమైన, సులభగ్రాహ్యమైన ఒక ప్రాక్టికల్ సిద్ధాంతం అమ్మ సందేశంలో తొంగి చూస్తున్నది. భిన్నధృవాలు కన్పించే రెండు విభిన్న మార్గాలను సమన్వయించి చెప్పిందే అమ్మ సందేశం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!