శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారి ప్రసంగం
గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వర్తమానంలో ఆదర్శవంతంగా వ్యవహరిస్తూ, భవిష్యత్తును ఉజ్జ్వలంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు వివరించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ‘అమ్మతత్త్వం’ విశ్వమంతా విస్తరించిన రోజున విశ్వశాంతితో పాటు మానవాభ్యుదయం సుసాధ్యమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్నేహపూర్వక పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు, సంస్థల ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, శ్రీ ఎమ్. దినకర్ గారు, శ్రీ యస్.మోహనకృష్ణగారు, శ్రీ బి. రామబ్రహ్మంగారు, శ్రీ టిటి. అప్పారావుగారు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యంగారు తదితర ప్రముఖులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మఱియు సమావేశమందిరంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు, ప్యాట్రన్ బి. రవీంద్రరావుగారు తదితరులు పాల్గొని ‘అమ్మతత్త్వం’ ‘విశ్వజననిగా అమ్మ’ అనే అంశాలపై జరిగిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించి, తమ అభినందనలు తెలిపారు.
– రిపోర్టర్ – శ్రీ టి. మురళీధరరావు
శ్రీరామబ్రహ్మంగారి ఉపన్యాస పరంపర
‘దేహాన్ని’ ఒక దేవాలయంలా పవిత్రంగా, పరిశుభ్రంగా, ఉంచుకోవాలని, జ్ఞానవేదికగా భావించాలని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.యల్.సుగుణగారి పర్యవేక్షణలో మూడురోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో “ఆరోగ్యం – మహాభాగ్యం”, మనస్సు, వ్యక్తిత్వ వికాసం అనే అంశాలను శ్రీ రామబ్రహ్మంగారు వివరించారు. ఈ ఉపన్యాసాలు విద్యార్థులు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి. వారి భావి జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదని డాక్టర్ బి.యల్.సుగుణగారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వెంకటేష్, బాజీవలి, చక్రధరరాజు, అనంతకృష్ణలు నిర్వహించారు. కాగా మరో ప్రసంగంలో ‘మనసు’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ, మనసును నియంత్రించడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని, తద్వారా సమాజప్రగతికి మార్గదర్శకులౌతారని ఆయన వివరించారు. శారీరకంగా, మానసికంగా ఉన్నతులైనవారు ఉత్తమ వ్యక్తిత్వ వికాసంతో రాణిస్తారని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు.
రిపోర్టర్ – శ్రీ అన్నదానం హనుమత్ప్రసాదు