వైభవం, విభూతి వంటి పదాలన్నీ ఎంతో పేరు పొందినవి. విభుడు అంటే విశిష్టమైన పుట్టుక గలవాడు. వానియొక్క లక్షణం వైభవము. వైభవము అంటే అట్టహాసంగా అలంకరించడం కాదు, ప్రదర్శించు కోవడం కాదు. అదే విధంగా విభూతి అంటే విశ్వ పరమైన సౌందర్యం. దాన్ని గుర్తుగా చేసుకుని అనేక మంది దాన్ని కీర్తించి నిర్గుణమైన పరమధామమును చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ రకమైన సిద్ధినే పురుషోత్తమ ప్రాప్తి అనడం జరిగింది.
ఈ వ్యాసంలో మాతృశ్రీగా గుర్తింపు పొందిన శ్రీమతి బ్రహ్మాండం అనసూయాదేవి వైభవాన్ని, విభూతిని ఎలా దర్శించాలి అనే దానిపై రేఖామాత్రంగా వివరణ ఇవ్వడం జరిగింది.
28-03-1923 బుధవారం రాత్రి మన్నవ సీతాపతి, రంగమ్మ దంపతులకు జిల్లెళ్ళమూడి అమ్మ జన్మించారు. అది ఒక విశిష్టమైన పుట్టుక. దాన్ని అవతారము అనడానికి వీల్లేదు, అమ్మను అవధూత అనో, గురువు అనో కీర్తించడానికి వీలులేదు. ఆమె పుట్టుక నిసర్గనిర్గుణమర్మసౌందర్యానికి ప్రాతిభాసికమైన ఒక పాంచభౌతిక శరీరం ఆవిష్కరణ మాత్రమే. శరీరం కాలముచేత అవిచ్ఛిన్నంగా ఉంటుంది. కర్మధర్మములు అనే బంధాన్ని కలిగి ఉంది. జననము మరణము అనే పరిమితులు కలిగి ఉంటుంది. నామము, రూపము అనే నిర్వచనాలకు లొంగినది. అనంతము పరిమితమైంది. బ్రాడీపేటలో ఉన్న గుండేలురావు గారి మాటల్లో అసాధారణం సాధారణంగా వచ్చింది. బ్రాహ్మణ కోడూరులోని వాసుదాసస్వామి ప్రకారం ఆ రాముడే ఈ రూపంలో పరుగెత్తుతున్నాడా అన్నట్టు ఉన్నది.
అమ్మ నామం నిర్వచనాలకు అందదు. అమ్మ రూపం అనన్వయాలంకారం. అమ్మ తత్త్వం మనోవాచామగోచరం.
ఇన్ని లక్షణాలు గల అమ్మ పుట్టుకను విశిష్టమైన పుట్టుక అనవలసిందే గదా! అమ్మ తాతమ్మ మరిడమ్మ తాతమ్మ గారి మాటల్లో గర్భంలో పడ్డప్పటినుండి అన్నీ మహాపురుష లక్షణాలే.
పాలు తాగదు,అన్నం అడగదు, ఆకలి లేదు, గాలి కూడా పీలిస్తే పీలుస్తుంది. ఇటువంటి ఆమెను కన్నతల్లి కూడా అర్థం చేసుకోలేకపోయారు. మిగిలినవాళ్ళెంత? అమ్మ మాటల్లోనే అన్నట్లు పందులను దూరంగా తరిమివేసి వాటి స్థానంలో వచ్చిన భక్తులు, ఈమె నిజంగా నిసర్గసత్యమేనా? జన్మతః అద్వైత సిద్ధి పొందినదేనా? ఈమె సాక్షాత్తు గాయత్రీ దేవతా? వంటి ప్రశ్నలు కలిగిన సాధకులు, ఈమె సంసారం చేస్తూ బిడ్డలను కన్న తల్లి గదా! ఈమెకు తురీయాతీతస్థితి, నిత్యనిర్గుణస్థితి ఏమి తెలిసి ఉంటాయి? ఈమె ఏమి బోధించగలదు? అనుకొనే ఇన్ని వర్గాల వారికి ఆమె ఏమి అర్థం అవుతుంది? వారు అమ్మతత్త్వం గూర్చి ఏమి చెప్పగలరు?
అమ్మకు ప్రవృత్తి, నివృత్తి వేరు కాదు. అమ్మ నిత్యనూతన మనోహరప్రతిభాసమన్విత. అమ్మ ఆత్మచింతనామగ్నాంతరంగ. అమ్మ సకలార్తజనత్రాత. ప్రేమైకమూర్తి.
ఆమె సాంఖ్యమును ఆశ్రయించి, యోగమును ఖండించి, సుగతి ఖరారు చేసిన మౌనవ్రతి. కర్మసన్యాస యోగానికి అమ్మ జీవితం ఒక ఉదాహరణ. విభూతి యోగానికి అమ్మ కార్యకలాపాలు ఒక దర్పణం. పురుషోత్తమ ప్రాప్తియోగానికి అమ్మస్థితి ఒక ఉదాహరణ. మాతృశ్రీ జీవిత మహోదధి కలి యుగానికి ముఖ్యంగా 21వ శతాబ్దానికి భగవద్గీత.
అమ్మ వసంత ఋతువుకు పూత నేర్పి, కోకిలకు పాటనేర్పింది. సూర్యునికి వేడినివ్వడం, మేఘాలకు వర్షించడం నేర్పింది. ఆమె దశమహావిద్యలు దాటిన పదకొండవ మహావిద్య.
ఇదే మాతృశ్రీతత్త్వం, విభూతి, వైభవం….