శ్రీ ప్రసాదరాయకులపతిగారు 1961లో రచించిన సాహస్రులలో “అంబికా సాహస్రి” ఒకటి. ఇందులో మూడు వందల శ్లోకాలు, ఏడువందల పద్యాలు ఉన్నాయి. అందుకే స్వామి వీటికి “అమరీత్రిశతి” “ఆంధ్రీసప్తశతి” అని పేర్లు పెట్టారు. ఇది విశ్వజననిగా, రాజరాజేశ్వరి అవతారంగా లోకంలో చాలమంది ఆరాధించే ఒక దివ్యమానవిని స్తుతించిన గ్రంధం. జిల్లెళ్ళమూడిలో “మాతృశ్రీ అనసూయా దేవిగా” వ్యవహరింపబడింది. అందరూ “అమ్మ” అనే పిలుస్తుంటారు.
భావయామ్యద్య పూజ్యాం త్వాం అనంతప్రేమవాహినీం
ఆశ్చర్యకరవాత్సల్యాం అరగ్రామ నివాసినీం
దివ్యావేశ మహత్వాం త్వాం దేవీరూప సముజ్జ్వలాం
అనసూయాం జగద్గయాం వందే మాతర మద్భుతాం.
(అంబికాసాహస్రి 15వ పేజీ)
ఈ రకంగా మొదలైన అమరీత్రిశతిలో ఎన్నో రకాల ఛందస్సులతో అమ్మ అనంత వైభవం వర్ణింపబడింది. ఒక దివ్యావేశ భక్తిభావ విలసితుడైన మహాకవి ఆనంద పారవశ్యంతో శబ్దాలను నృత్యం చేయించినట్లుంది కవిత్వంలో. దీనిలో ఆధ్యాత్మి జిజ్ఞాస సర్వేసర్వత్రా ద్యోతక మౌతున్నది’ ఆవేదనే ఆరాధన’ అనే అమ్మ మాటలు కావ్యంచదువుతుంటే జ్ఞాపకం వస్తున్నవి.
అమ్మ అనంత వాత్సల్యాన్ని గూర్చి పల్కుతూ
లౌల్యములే దొకించుకయు లౌకిక వాసన లేదు చిత్తచాం
చల్యము చెందనీ దమృతసాగర శీతలచంద్రచాంద్రియున్
తుల్యము గాదు నీ నిరత నూతన దివ్య విచిత్ర చిత్ర వా
త్సల్యము తల్లి ! మా హృదయ సంచయముల్ కదిలించి వేసెడిన్.
(అంబికాసాహస్ర – 33వ పేజీ)
అనీ, “పలుకులు రావు నీ పరమవత్సలభావము గూర్చి వర్ణనల్ సలుపుదమన్న” అనీ చెప్పుతారు. అయితే కేవల వాత్సల్యంతో తృప్తి లేదంటారు.
తృప్తిని చెందబోను జగదీశ్వరి కేవల వత్సలత్వ సం
ప్రాప్తిని ప్రేమభావ పరివర్ధిత శీతల శాంత దృష్టినిన్
సుప్తిని ముని సత్యమును చూడగజాలని నాకు నిత్యమౌ
దీప్తిని గుర్తెఱుంగ గల దివ్యతర స్మృతి నీయవేడెదన్.
(అం.సా – 34వ పేజీ)
నిత్యమైన, సత్యమైన వెలుగును తెలుసుకోగల దివ్యస్మృతి ప్రసాదించమని అమ్మను ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను అమ్మ స్వీకరించింది. వారు కోరింది ప్రసాదించింది కూడా. ఎవరికైనా జన్మగతమైన సంస్కారం కొంత ఉంటుంది. ఈ జీవలక్షణం ప్రతిఫలిస్తుంటుంది. వారి మాటలలో, “కులేశ్వరం – భార్గవరామ దివ్యతేజోంశ సంజాత మనంత వీర్యం” అంటారు. శ్రీ కులపతిగారు స్వామి భార్గవరాముని దివ్యతేజోంశతో పుట్టారుట.అంతేకాదు
“కాల సర్పమ్ము తటుకున కాటువేసె
భయము లేదులే దివ్యాస్త్ర పరమసిద్ధి
ఈ కులేంద్రుని కున్నంత దాక జనని” వారికి
దివ్యాస్త్రసిద్ధి ఉన్నది. అందువల్ల కాలసర్పపు కాటుకు కూడా భయపడరుట.
“ఐంద్రీ మహావిద్యయను పేర ఏ తల్లి వేదవీధులు లోన వెలయుచుండు” అనీ, “ఐంద్రీ శక్తి విలాసా” అనీ, “ధేనుం తాంత్రిక సంకేతే రేణుకాం ఛిన్నమస్తకాం” అని ఛిన్న మస్తక విద్యను గూర్చి చాల చోట్ల ప్రస్తావించారు. ప్రచండ చండీవిద్య, షష్ఠీ విద్య, తారావిద్య, పాశుపతదీక్ష, పాదుకాంతదీక్ష, సమాధియోగం, కుండలినీ యోగం, అంటూ యోగవిద్యలను గూర్చి కావ్యంలో ఎన్నో చోట్ల ప్రస్తావించారు అమ్మ విభూతులు వర్ణిస్తూ.
నరపధము దాటి దేవతా పరిధిలోన
ఆంతరజ్యోతిరుద్భుద్ధ మౌ మనస్సు
తో నిరంతరమలరారు నా నమస్సు
పొందితివి నీవు జిల్లెళ్ళమూడి అమ్మ
(అంబికా. సా. 50వ పేజీ)
శ్రీ కులపతిగారి యోగసాధన అంతటిది. వారు చిన్నప్పుడే లంబికాయోగం సాధించారు. సిద్ధులు సాధించారు. పద్యవిద్యా వైభవం అనుపమానం. వారిధారాశుద్ధి చూడండి.
ప్రాతర్భాను మరీచిరోచి రుదయ స్వర్ణాయితాంభోరుహ
శ్రీ తారళ్యనవోదయమ్ములు రసార్టీభూత సౌహార్దముల్
జ్యోతిర్మండల కాంతిపూర రమణీ యోంకార ఘంటార్భటుల్
నీ తత్వంబు లనూహ్య సత్వములు తల్లీ ! నేను భావించెనడన్
(అంబిక సా. 40 పేజీ)
అంటూ అమ్మ అనంతవైభవాన్ని ఘంటాఘోషంగా గంభీరవచో గంగా ప్రవాహం ప్రవహింపచేశారు.
ఏ మహాదేవి చండిక ? యేసవిత్రి
పరశుధరమాత రేణుక ? సురభి యెవరు ?
లలిత యెవ రైంద్రి యెవ్వ ? రా లక్ష్యకేంద్ర
మూర్తి వీవేను జిల్లెళ్ళమూడి అమ్మ
(అంబికా సా. 57వ పేజీ)
అంటూ అమ్మ యొక్క సర్వస్వరూప స్వభావాన్నివర్ణించారు.
భిన్న కపాలమున్ లలితవేష మభేద్య నిగూఢ తత్వమున్
సన్నని దివ్యహాసమును – చల్లని స్పర్శ – ప్రసన్నదృష్టి – వి
శ్వోన్నత వత్సలత్వమును ఒక్కట గూర్చిన శాంతమూర్తియై
యున్న సవిత్రి వీవు సుమహోదయ ! నీ దయ నాశ్రయించెదనన్
(అంబికా.సా. 35వ పేజీ)
అమ్మ దివ్యలక్షణాలు కళ్ళకు కట్టినట్టు వర్ణించారీపద్యంలో. శబ్దశక్తి మీద అధికారం కలవాళ్ళు మాత్రమే ఇంత
చిత్రణ చేయగలరు. ఇంతచేసి కూడ
వేయి కులపతులైన నీ వెలుగులోని
ఒక వేయవ వంతైన నూహసేయ
చాలరో తల్లి ! చిత్రమీ సకల హృదయ
చాలనము నీదు ప్రేమారలాలనమ్ము
(అంబికా.సా. 35వ పేజీ)
అనంతదివ్యశక్తి అయిన అమ్మను వర్ణించటంలో తమ అశక్తతను వెలిబుచ్చుతారు. “యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ” కదా ! అమ్మ లీలలు అనంతాలు అద్భుతాలు. మాటలకందనివి. వేదాలలో పురాణాలలో
అవతారాలుగా చెప్పబడిన ఏ రూపాలున్నవో వాటన్నిటికీహేతవైన మూలశక్తి అమ్మ అని వారి విశ్వాసం.
అయితే అమ్మ మాత్రం అమాయకురాలిగా తన వద్ద ఏ శక్తీ లేదనీ, అందరి వంటిదానని చెపుతుంది,దత్తాత్రేయుడిలాగా. కులపతిగారు ఆ విషయాన్నే
మాయయెయైన నీవొక అమాయకురాలి విధమ్ముతోపగా
నాయన! ఏమియున్నయది నాకడ అందరివంటిదాన నం
చేయదియో వచించెదవు చిత్రముగా నిటులన్ మెలంగె
నా
త్రేయుడు మున్ను నీవు నటులే చరియింతువొ? మోసకత్తెవై
(అంబికా. సా. 32వ పేజీ)
దత్రాత్రేయుడు చింపిరిగుడ్డలతో, మాంసం తింటూ, అసహ్యంగా ఉంటూ ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు.. అయితే అంతరశక్తి గుర్తించి సేవించినవారు అష్టసిద్ధులూ సాధించారు. అలాగే అమ్మ కూడా అందరినీ మాయలో ముంచి వేస్తుంది. నేను మీలాగా సామాన్యురాలనే అని. కాని నమ్మినవారు పొందనిది లేదు.
ఏ జగజ్జనయిత్రి కవీంద్రహృదయ
పాలనము చేయుచుండు నా పరమశక్తి
అవతరించెను మనుజ దేహమ్ము నందు
చూడరావోయి జిల్లెళ్ళమూడి లోన
(అంబికా సా.30వ పేజి)
ఒక అనంత వాత్సల్యరూపిణి, జగజ్జనని, పరమశక్తిమనుజదేహంలో అవతరించింది. ఆమెను దర్శించి తరించమని లోకానికి ప్రబోధం చేశారు శ్రీకులపతి.
“మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ” అనీ “స్వస్వరూపాను సంధానం భక్తిరిత్యభిదీయతే” అని ఆచార్య శంకరులు పలికారు. ఆత్మను పరమాత్మను సంధానం చేసేది. భక్తియే. ఈకావ్యమంతా భక్తిశక్తి వైభవం సర్వే సర్వత్రా గోచరిస్తుంది.
(ఈ గ్రంధం వ్రాసినది కవివర్యుడైన ప్రసాదరాయ కులపతి. ఈనాడు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి, జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి వారు)