శ్రీల శుభముల నొసగి రక్షింపదలచ
అర్కపురమున వెలసిన అమ్మవైన
నీదు పాదంబులన్ మది నిల్పికొల్తు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
నీ పదంబుల పూజించి నిన్ను గాంచి
సన్నుతించెడి వారికి సకల శుభము
లిచ్చి బ్రోచెదవని విని వచ్చినాడ
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
వారు వీరనుభేద భావంబు మదిని
యెరుగ నేరని తల్లివి – యెల్లప్రొద్దు
సేవలందుచు నలసట జెందబోవు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
భక్తజనులకు పాలించి ముక్తినొసగ
మహిని అవతారమెత్తిన మాతవీవు
ఎల్లవేళల ధ్యానింతు నుల్లమందు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
కన్నబిడ్డల కన్నను ఘనత మీర
సాదరంబున నందరన్ సాకెదీవు
నీదు వాత్సల్యమహిమ వర్ణింపవశమే
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
పవలు రాత్రియు నిన్గన భక్తజనులు
వచ్చుచుండంగ వారల వాంఛితముల
నొసగుచుందువు ప్రేమతో విసుగులేక
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
“ఆత్మ వత్సర్వభూతాని” యనెడి సూక్తి
సార్ధకంబగు రీతిని; సర్వభూత
జాలముల గాచుచుండెడి జనని వీవు –
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
తర్కవేదాంత శాస్త్రాలు తఱచినట్టి
గట్టి పండితు లెందరో గాంచి – తావ
కాత్మశక్తికి మెచ్చి రాహ్లాదమొదవ –
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
పల్లెలన్ పట్టణంబుల ప్రజలు కదలి.
నీదు సన్నిధి దాసులై నిలచినారు
వారి కోర్కెలు ఫలియింప వరము లొసగి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
తల్లివైనను నీవెగా; తండ్రివైన;
దైవమైనను నీవెగా; దలచి మదిని
సన్నుతించెద – పాపముల్ సమయజేసి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
ఇల్లు పిల్లలు బందుగుల్ వల్లభుండు
సర్వమును గల్గియున్నట్టి సాధ్వివయ్యు
నంటకుండెద వన్నింట నాశవీడి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
సారమే లేని సంసార సాగరమున
మునిగిదేలుచు నున్నట్టి మూఢజనుల
నొడ్డునకు జేర్చి గాచెడి దొడ్డతల్లి !
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
ఎన్ని జన్మలు గడచెనో ! యింతవరకు
ముందు జన్మంబు లింకెన్ని పొందవలెనొ !
కర్మబంధంబులన్ ద్రెంచి కలుషమడచి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
తల్లులకు తలివైనట్టి తల్లివీవు
ఆదరంబున సాకెడి అమ్మనీవు
జగతి పాలింప జాలిన జనవినీవు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
పరమపావనమైన నీ పాదములను
ఆత్మలో పావనమ్మైన పాదములను
కష్టములబాపి రక్షించి కనికరించి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
ఎల్లకాలంబు నేదియో యుల్లమందు
నూహజేయుచునుందు వా యూహలేమొ !
యెరుగనేరము తల్లి ! మా కెరుక పరచి;
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
అఖిలవిద్యల మర్మమ్ము లాత్మలోన
దెలిసి యుండియు నేమియు దెలియనట్లు
పల్కుచుండెద వమ్మ ! నిన్ బ్రస్తుతింతు –
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
అమ్మ నీ దివ్యగాధ లహర్నిశమ్ము
చాటుచున్నవి లోకాలు తేటపడగ
మధుర మధురమ్ములైన నీ మహిమలెల్ల
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
భారమైనట్టి విశ్వసంసార గమన
మలుపు సొలుపులనెరుగ కీ వహరహంబు
నెట్లు సాగించుచుంటివో ! యేమొ ! తల్లి !
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
ఒక్క నిముసంబు విశ్రాంతి జిక్క నీక
పవలు రాత్రియు సేవించు భక్తజనుల
కామితార్థంబు లీడేర్చు కల్పవల్లి !
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి!
వందలున్ వేలుగా వచ్చు వారికెల్ల
ముందుగా భోజనంబిడి మోదమలర
సేమ మరయుచునుందు వాశీస్సులొసగి
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
నీవు బ్రహ్మాండముల నెల్ల నిండియున్న
మహిమగలయట్టి లోకైకమాత వగుట
నిన్ను వర్ణింపశక్యమా ! సన్నుతింతు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
దిక్కులేనట్టి వారికి దిక్కు నీవె
యగుచు పోషించుచుండెడి అమ్మ నీవు
నమ్మియుంటిని నీ పాద నలినములను
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
జరిగిపోయిన; జరుగుచు! జరుగనున్న
విషయములు నీకు మదిలోన విశదమగును
నీదు మహిమలు తెలియగా నేర రెవరు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
భుక్తి ముక్తియు నొసగెడి శక్తి గలిగి
భక్తజనముల పాలించు భాగ్యలక్ష్మి
వైన నిన్ గొల్చువాడ భావమ్మునందు
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
చదువలే దెట్టి కావ్యముల్ శాస్త్రములును
నేర్వగా లేదు ఛందస్సు నేర్పుమీర
భక్తితో కూర్చినాడ నీ “పద్యమాల”
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !
అమ్మ నీ పాదపద్మమ్ములందు పద్య
రత్నముల భక్తితో సమర్పణ మొనర్తు
స్వీకరింపుము దయతోడ సాకుమమ్మ
కరుణతో మమ్ముగావుమా ! కన్నతల్లి !