శ్రీ వఝ సీతారామాంజనేయ ప్రసాద్ (వఝ ప్రసాద్) గారితో నాకు గత ఐదు దశాబ్దాలుగా పరిచయం ఉన్నా, 2008 నుంచి సన్నిహితంగా మెలిగే అవకాశం లభించింది.
2008లో ‘అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాల’ సందర్భంగా హైదరాబాదులో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొని ఆయన కార్యదక్షత గమనించాను.
2011 లో ‘జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి – హైదరాబాద్’ కి ఆయన అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యారు. నన్ను ఒక కార్యవర్గ సభ్యుడుగా నియమించారు.
కొందరు సోదరుల సహకారంతో సేవా సమితి తరఫున 2011, 2012 సంవత్సరాల్లో హాస్పిటళ్లు దగ్గర అన్న ప్రసాద వితరణ జరిగింది. సమితి బ్యానర్ పెట్టి, అమ్మకి పూజ, నివేదన జరిపిన తర్వాత మాత్రమే ప్రసాద వితరణ జరిగేలా ఆయన చూసేవారు.
2013 అక్టోబర్ లో జరగబోయే ‘శ్రీ నాన్నగారి శత జయంతి’ లోపు హైదరాబాద్ లో కనీసం 20 అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరపమని ‘శ్రీవిశ్వజననీపరిషత్’ కోరింది.
అన్న, వస్త్ర, ప్రసాద వితరణ కార్యక్రమాలకి ‘ప్రేమార్చన’ అని ఒక అద్భుతమైన నామకరణం ‘శ్రీవిశ్వజననీ పరిషత్’ చేసింది..
బ్యానర్ పైన ‘అన్న వితరణ, వస్త్ర వితరణ’ అని ఉన్న బ్యానర్లు తీసేసి, ‘ప్రేమార్చన’ అని పెట్టి బ్యానర్లు చేయించారు . ఇదంతా ఆయన స్వంత ఖర్చుతో చేయించారు. సమితి అకౌంట్లో నుంచి ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పినా ఆయన ఒప్పుకునే వారు కాదు. ఇదే కాదు, ఒక్కో ప్రేమార్చనకి, పూజా ద్రవ్యాలకి కనీసం 200 రూపాయలు అయ్యేది. అంతా తనే భరించారు. ప్రేమార్చనకి ఆర్థిక సహకారం అందించిన దాతలకు కూడా ఈ ఖర్చులు గురించి చెప్పేవారు కాదు.
2012-13 సంవత్సరంలో శ్రీ విశ్వజననీ పరిషత్ వారి ఆదేశం మేరకు హైదరాబాదులో వీలు అయినన్ని ప్రేమార్చనలు జరపాలని సంకల్పించాము.
అన్నయ్య కార్య దక్షత ప్రస్ఫుటంగా కనబడ్డది ఎక్సిబిషన్లో సేవా సమితి స్టాల్ నిర్వహణలోనూ, చలికాలంలో అర్థరాత్రి నగరంలో రోడ్ల మీద పడుకున్న పేదలకు రగ్గుల వితరణ కార్యక్రమాల్లోనూ. ఇది అందరూ అంగీకరించిన, మెచ్చుకున్న విషయం.
2012 నుంచి ప్రసాద్ అన్నయ్య సారథ్యంలో స్టాల్ నిర్వహణ జరిగేది. ఈ విషయంలో అన్నయ్య కృషి, పట్టుదల అద్వితీయం.
ఆరు నూరైనా, ఎంతోమంది పులిహోర పంపిణీ ఎందుకు, హుండీ ఎందుకూ అని వ్యంగ్య ప్రశ్నలు వేసినా అమ్మకి ప్రీతికరమైన అన్నప్రసాద వితరణ పులిహోర రూపంలో పంపిణీ జరగాల్సిందే అని నిర్మొహమాటంగా తెల్పి జరిపారు.
ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. స్టాల్ నిర్వహించిన 40 రోజులూ జరిగిన పులిహోర పంపిణీ ఖర్చు తనే భరించారు. ఆ ఖర్చు, బహుశః సంవత్సరానికి కనీసం రు.15000 ఉంటుంది. ఎవరైనా దాతలు ప్రసాదంకి విరాళం ఇచ్చినా అది సమితి అకౌంట్కి జమ చేశారు. బహుశః, సమితికి ఆర్థిక పరిపుష్టి కలగాలని ఆ విధంగా చేశారు.
ఎందుకంటే, మే 5న జరిపే ‘అమ్మ నాన్న గార్ల కళ్యాణ దినోత్సవంకి’ ఖర్చు భారీగా ఉంటుంది.
ఇదే కాదు, స్టాల్ తయారు చేసిన కార్పెంటర్ కి ప్రతి సంవత్సరం తన డబ్బుతో బట్టలు పెట్టారు.
తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పులిహోర Cans మోసుకుని మోటార్ సైకిల్ మీద కూర్చుని 75 ఏళ్లు పైబడిన వయసులో వచ్చిన సందర్భాలు అనేకం.
అన్నయ్యకి కొన్ని రోజులన్నా మధ్యలో విశ్రాంతి ఇవ్వాలని, స్టాల్ నేను చూసుకుంటాను మీరు రావద్దు అని చెబితే బలవంతం మీద ఒప్పుకునేవారు.
2021 లో కరోనా వల్ల స్టాల్ లేక పోవడం అన్నయ్యకి ఒక విధంగా విశ్రాంతి నిచ్చింది. 2022 జనవరిలో మాత్రం స్టాల్ చాలా ఆలస్యంగా తయారు అయింది. కనీసం కొన్ని రోజులు నిర్వహించేలా చూశారు.
ఈ సంవత్సరం స్టాల్ జనవరి 3న ఇచ్చారు. నిర్మాణం చేయించడానికి వెళ్లే పరిస్థితులు ఆయనకి అనుకూలించక ఆయన అమ్మలో ఐక్యం అయిన రోజు కూడా స్టాల్ తయారీ, నిర్వహణ గురించి చాలా మధన పడ్డారు.
ఈ విషయం ఆరోజు కూడా మాట్లాడుకున్నాం. నాతో తన కష్ట సుఖాలు కొన్ని తరచూ పంచుకునేవారు. ఎవరైనా తనని బాధించే మాటలు మాట్లాడినా ఎవరితోనూ వైరం పెట్టుకో లేదు.
75 ఏళ్ళు పైబడిన సమితి సభ్యులుకి సన్మాన కార్యక్రమం రెండు మూడు సంత్సరాలపాటు నిర్వహించారు. ఎవరైనా రాలేకపోతే వారి ఇంటికి అరుణ అక్కయ్యతో వెళ్ళి సన్మానించారు.
ఎంతో మంది దాతలు మా సేవా కార్యక్రమాలు చూసి తరచూ విరాళాలు పంపిస్తున్నారు.
ఇది అంతా ‘అమ్మ దయే’ కదా !
ప్రతి సంవత్సరం సమితి నిర్వహించే కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ‘అమ్మ నాన్న గార్ల కళ్యాణ దినోత్సవం’- నిర్వహణ శోభాయమానంగా ఉండాలని ఆయన చేసిన ప్రణాళికా రచన, కుటుబసభ్యులు చూపే శ్రద్ధాభక్తులూ గురించి ఎంత చెప్పినా తక్కువే. జిల్లెళ్ళమూడి బంధువులు అందరికీ ఈ విషయాలు తెలుసు.
బహుశః, అమ్మ ఆయనకి ఈ తాపత్రయాలు నుంచి విముక్తి ఇవ్వాలని తనలోకి తీసుకుందేమో! అన్నయ్య, ఆయన కుటుంబ సభ్యులు అందరూ
నన్ను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. ఇది కూడా అమ్మ నాకు ఇచ్చిన వరం.