ఐదేళ్ల ప్రాయమందె. తల్లిగారి దేహావసానమందు
“పోయినది మరి దేహమా, ప్రాణమా” యని
విచికిత్స తోన కంట నీరు తేక బందువుల నందర
అబ్బుర బరచిన దివ్య తత్వమ్ము “మా జిల్లెళ్లమూడి అమ్మ”.
అందరయందు ఎట్టి భేదము లేక
సర్వులకెంతొ భేదమ్ము కలిగించు
‘అసూయ’ జాడ్యమ్ము రూపుమాపు గొరకె
“అనసూయ”నామమ్ము చేకొన్న అమృత తత్వమ్మె మా “జిల్లెళ్లమూడి అమ్మ”.
కుల, జాతి భేదమేమి లేకను, “గొల్ల” నాగమ్మ” కు
దివ్య దరిశన మ్మొసగుటె గాక శునక, శ్వపచమ్ములకును
ముక్తి పథమిచ్చిన పరమాత్మ తత్వమ్మె
మా “జిల్లెళ్లమూడి అమ్మ”.
గర్భాలయమందు జేరి, ఆభరణాదుల తొలగించి
దైవమనిన పాషాణమా మరి సర్వ గర్భితమైన శక్తులా
యను శంక తొలగ ద్రోసి సర్వ వ్యాపక శక్తి దర్శనము నందిన
పరమాత్మ రూపమ్మె మా “జిల్లెళ్లమూడి అమ్మ”.
కుల మతములకు అతీతముగాను, అంకదాసు,
మస్తానులకె గాక ఇంటింట భిక్షమెత్తు తాతతోన
“అందరికి సుగతియే”యని ఆనాడె అందరకు
అభయ మొసగిన అందరమ్మ మా “జిల్లెళ్లమూడి అమ్మ”.
రైలు శకటమందు పయనమందిన వేళ పసిబాలుడైన
బాలు నొకనికి తన తత్వ మెరిగించి, పునర్జీవిగ జేయుటయె
గాక వానికిని, తాతకును గూడ మరణ వేళ “సర్వ సృష్టి సంహారకర్తగ”
దరిశనం బొసగి ధన్యుల జేసిన ఆది జనని మా “జిల్లెళ్లమూడి అమ్మ”.
- (సశేషం)
(అనివార్యమైన సాంకేతిక కారణాల వల్ల ఈ నెల ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ ధారావాహికను అందించలేనందులకు చింతిస్తున్నాము.– సంపాదకమండలి )