వాత్సల్యామృతవర్షిణి ‘అమ్మ’ పాదపద్మములకు నమస్సుమాంజలులు. ‘విశ్వజనని’ తత్వమును నరనరాల జీర్ణించుకున్న అమృతరూపిణి మాకు అమ్మ – అందరికి దుర్గపిన్ని.
మా చిన్నతనము నుండి ‘అమ్మ’ మీద భక్తి, ప్రేమ ఉగ్గుపాలతో రంగరించి పెంచింది నా తల్లి. జడవేస్తూ నామము, సుప్రభాతము; స్కూల్ నుంచి వచ్చాక సంధ్యావందనము చేయించేది. సంప్రదాయము, కుటుంబ విలువలు, పెద్దల ముందు మెలగవలసిన విధానము నేర్పించిన మా అమ్మ మాకు దొరికిన పెన్నిధి.
నాకూ మా అక్కకూ అత్తవారింట కోడలుగా మెలగవలసిన పద్ధతులు నేర్పి అత్తవారింట మంచి కోడళ్ళుగా పేరు తెచ్చుకునే విధంగా పెంచిన మా అమ్మకు ఎంతో ఋణపడి వుంటాము. “కోడలిని కూతురిని ఒకే విధంగా చూడాలని” చెప్పిన అందరమ్మ వాక్యాన్ని తు.చ. తప్పకుండా పాటించింది మా అమ్మ. ఎవరికి అనారోగ్యము కలిగినా, ఇబ్బందులు వచ్చినా ‘అమ్మ’ కు 11 రోజులు అభిషేకములు చేయించేది. జిల్లెళ్ళమూడి అన్నయ్యలు అక్కయ్యలు అందరూ మా కుటుంబ సభ్యులు అనే మనస్తత్వము మాకు కలిగే విధంగా మమ్మల్ని పెంచింది మా అమ్మ. తన బిడ్డలు ఐదుగురిని ఇప్పటివరకూ, ఇక ముందూ ఒకే తాటిమీద నడవాలని నేర్పింది.
మా అక్క అకాలమరణము మా అమ్మను కృంగదీసింది. అక్క, అమ్మ ఇద్దరు ‘అమ్మ’ ఒడిలోకి చేరారు. మా కుటుంబము తీరని దుఃఖంలో మునిగి పోయింది. ‘నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి బద్ధుడే’ అన్న ‘అమ్మ’ నిర్ణయము ఇట్లు వుంది.
మా నాన్నగారు, అమ్మ, అక్క లేని లోటు మాకు ‘అమ్మ’ తీరుస్తుందని విశ్వసిస్తున్నాను.