1979-1984 మధ్య ఐదేళ్ళకాలం, నాజీవితంలో స్వర్యయుగం. జిల్లెళ్ళమూడి నా ప్రయాణం. సర్వజ్ఞ సంకల్పము. అతిశయోక్తి – కించిత్తు కూడా లేనిది.
1976-1979 మధ్య మూడేళ్ళ కాలం అగాధంలో కూరుకుపోయిన దశ. ఇంటర్ తప్పాను. వ్యవసాయం చేసాను. ఆరోగ్యం చెడిపోయింది (అజీర్ణవ్యాధి). అటు చదువుకి ఇటు వ్యవసాయానికి దూరమైన స్థితి. పట్నం అయితే ప్రక్కింట్లో ఏమి జరిగినా తెలియదు. పల్లె గనుక ఏమూల ఏమిజరిగినా ఊరంతా అల్లుకుంటుంది. మధ్యస్థంగా వున్న నన్ను చూచి ఊళ్ళో వారంతా గేలి చెయ్యడం మొదలెట్టారు. ఆకారణంగా 1978లో అనారోగ్యంగా ఉన్నా! ఇంటర్ పూర్తి చేసాను. చివరికి ఊరు విడిచి పెట్టాలన్న ఆలోచనలోనే చదువు పట్ల మమకారం పెరిగింది.
అప్పటికే మా ఊరి దగ్గరలో ఉన్న కొందరు జిల్లెళ్ళమూడిలో చదువుతున్నారని తెలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ మిత్రుడి ఇంటిలో దట్టమైన నీలిరంగు శారీ చైతన్య స్ఫూర్తితో ఉన్న ‘అంఆ’ క్యాలండరు చూసిన సమయం విలువైనది, వెలకట్టలేనిది. మిత్రుడు అక్కడి విశేషాలతో పాటు దరఖాస్తు పెట్టే విధానం వివరించాడు. ప్రొద్దుపోయింది. ప్రక్క ఊళ్ళో బంధువులింటికి చేరుకున్నాను. మా మామయ్యతో జిల్లెళ్ళమూడిలో చదువుటకు నిర్ణయించుకున్నాను. దరఖాస్తు రేపు పెడు . తున్నానని చెప్పాను. వెంటనే, మా శేషగిరిరావుకి కూడ దరఖాస్తు వ్రాయమని చెప్పడం, వ్రాయడం జరిగిపోయింది. రెండవరోజు ఇంటికి చేరుకుని దరఖాస్తు పూర్తిచేసినా, పోస్టు చెయ్యడం మిగిలింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేనైతే ఇంటర్ పూర్తి చేసాను. కాని 10వ తరగతి పూర్తి అయితే చాలు. మఱి ఎలా ! నాకైతే మరో రెండేళ్ళు వృధా అవుతుంది. పైగా 10వ తరగతి అయిన వాడితో సమంగా కూర్చోవాలి. తర్క వితర్కాల ఫలితం జిల్లెళ్ళమూడి వెళ్లకూడదని నేనుగా నిర్ణయించుకున్నాను. మూడురోజులు గడిచింది.
ఇంతలో మా మామయ్య రావడం, శేషగిరిరావు ధరఖాస్తు పంపించాడని చెప్పి, నువ్వు పంపించావాలేదాఅని అడగడం జరిగింది. లేదు మామయ్య అని చెప్పి కారణ మంతా వివరించాను. ఇక్కడే ఒక తమాషా జరిగింది. నేనుగా వెళ్ళకూడదని దృఢసంకల్పంతో వున్నాను. ప్రేరణ మామయ్య రూపంలో తరుముకొచ్చి వీడు ఎలాగూ పోస్టు చెయ్యడని గుర్తించి, తానే స్వయంగా నన్ను కోపించి దరఖాస్తు తీసుకొని పోస్టు చేయడం జరిగిన చమత్కారం. ఈ జరిగిన పరిణామాన్ని అవలోకించే జ్ఞానం లేని ‘గుడ్డు’ స్థితి నాది అప్పట్లో. తరువాత రోజుల నుంచి, చైతన్య స్ఫూర్తితో క్యాలండర్లో గోచరించే ఆ దివ్యమంగళ స్వరూపం చుట్టూ మనస్సు అలముకోవడం ఆక్రందించడం, ఆరాధించడం ఫలితంగా పిలుపురావడం, వేరే ఆలోచన లేకుండా “అంఆ” సన్నిధికి చేరుకోవడం చకచక జరిగిపోయింది.
అలమటించి ఆక్రందించిన చోట సర్వాంతర్యామి ఏ స్థితిలో ఉన్నా శరణార్థులను ఆదుకుంటాడనే సత్యాన్ని కారణజన్ముడు గజేంద్రమోక్షం ద్వారా లోకానికి ఎప్పుడో వివరించాడు. కాలగతిలో విశ్వాసం ద్విగుణీకృతం అవుతూ వస్తుంది. ఇటువంటి ‘అంఆ’ చర్యల ద్వారా ‘నేనుగా కాదనుకున్నా! తానుగా రప్పించుకొన్నది. నన్ను మలచిన తీరే అద్భుతం. చేరిన నాటికి అజీర్ణవ్యాధి నన్ను వెంటాడుతూనే ఉంది.
జిల్లెళ్ళమూడి చేరిన రోజే సాయంకాలం 4 గంటలకు, భాషా ప్రవీణ అనుకొని చేరిన 25 మంది విద్యార్థులం శ్రీ సత్యనారాయణమూర్తిగారి నేతృత్వంలో ‘అఆ’ దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఇక్కడే మహిమాన్వితమైన ప్రయోగం మాపైన చేసిన విషయం ఆ క్షణం మాకెవరికీ తెలియలేదు. ముఖ్యంగా నా విషయానికి వస్తే నేను అజీర్ణవ్యాధితో వున్న నన్ను దగ్గరకు చేరదీసి ఉసిరిక పచ్చడి సమ్మిళితమైన అన్నం కాదది, నా పాలిట దివ్యౌషధం. ప్రసాదరూపంలో నోటికందించి, దీర్ఘకాలిక వ్యాధులన్నింటికి ఈ ఒక్క చర్య ద్వారా శస్త్రచికిత్స చేసిన తీరు అద్భుతం. రెండవ రోజు నుంచి నా శారీరక స్థితిలో గణనీయమైన మార్పులు జరిగాయి. ఉరుకులు, పరుగుల ఉత్సాహభరితమైన దిశలో 5 సంవత్సరాల కాలం అద్భుతంగా గడిచింది.