“నేను తల్లి ధర్మం కోసం వచ్చాను అనుకుంటున్నాను. మీరు నన్ను వెతకటం కాదు. నేనే మిమ్మల్ని వెతుక్కోవాలి. నా బాధ్యత అల్లాంటిది. ‘అందరికీ సుగతే’ అన్నానంటే మీదేమీ లేదు కనుక, మీరు బురద పూసుకున్నా ఏం పూసుకున్నా. దాన్ని కడిగి శుభ్రపరచవలసిన బాధ్యత నాది. దానికి మాతృత్వం కావాల్సి వచ్చింది” ఈ మాటలు అమ్మ తన నోటితో అన్నది. ఎన్ని సార్లు అన్నదో చెప్పలేము కాని ఎన్నిసార్లు తల్చుకున్నా తప్పు లేదు. (‘శ్రీవారి చరణసన్నిధి’; వసుంధర 16.) అమ్మ నిర్హేతుకమైన అవ్యాజప్రేమ ప్రవాహం ఎట్లా కట్టలు తెగి హద్దులు దాటి ప్రవహిస్తుందో, ఎట్లా తన ప్రేమలో బిడ్డల్ని ముంచెత్తి వేస్తుందో మనకి అర్థం అవుతుంది. అమ్మ తన పిల్లలు కనీసం అవసరమైన సాధన చేసే శక్తి సామర్థ్యాలు కలవారుగా వుండాలని ఆశించలేదు. ఆ శ్రమా బాధ్యత కూడా, తానే వహించి వాళ్ళకు సుగతి నిస్తానని హామీ ఇచ్చింది. ఇంతకన్న సౌలభ్యమూ, సులభ గుణంకల విశాలహృదయం కల దైవాన్ని మనం ఈ జీవితంలో కాంచ గలమా?
మనం దేవుళ్ళ కోసం తీర్థయాత్రలు చేసినట్లు అమ్మ తన దగ్గరకు రాలేని బిడ్డలను చూడటం కోసరము కొన్ని యాత్రలు చేసింది. వసుంధర వ్రాసిన ‘శ్రీవారి చరణ సన్నిధి’ అనే గ్రంధం రూపంలోని డైరీ పుణ్యమా అని నాకు అందులో విశేషాలను పాఠకులకు అందించే సదవకాశం లభించింది.
అమ్మ 27.5.1962 సాయంత్రం జిల్లెళ్ళమూడిలో బయలు దేరి చీరాల వచ్చింది. జిల్లెళ్ళమూడి నుంచి రెండు బస్సులతో 2 లారీలతో, చిన్న కారులు, మేనావాహనం, బాజాభజంత్రీలతో, వేద ప్రవచనంతో, నామ జపములతో, బీజాక్షరాలు చదువుతూ వుండగా 200 మంది మించిన పరివారంతో అమ్మ చీరాలకు విచ్చేసింది. పెద్ద మహోత్సవంలా వున్నది. వాడరేవులో రెండు బంగళాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆహ్వానించిన వారి ఇళ్ళకు, ఆహ్వానించని వారి ఇళ్ళకు, పల్లెకారులు ఇళ్ళకు, లలితానంద ఆశ్రమానికి పలుచోట్లకు వెళ్ళి వారిపై తన అనుగ్రహాన్ని ప్రసరింప చేసినది. ‘శ్రీవారిచరణ సన్నిధి’లో ‘మాతృహదయం’ అనే విభాగం 22 పేజీ) ఒక రోజు బాపట్ల సమీపంలో ఉన్న కుష్టు రోగుల ఆసుపత్రికి వెళ్ళింది. వారికి పెట్టటానికి ప్రసాదం చేయించి తన వెంట తీసుకు వచ్చింది. వారందరికీ పెట్టి వారిని పలుకరించి వారిని ఆదరించింది. అక్కడే మంచంలో వుండి కదలలేక భయంకర కుష్టువ్యాధితో పీడింపబడుతూ పదిహేను సంవత్సరముల నుండీ ఒకే చీరతో దయనీయమైన స్థితిలో ఉన్న స్త్రీని చూచింది. అమ్మ వెంటనే ఆప్యాయతతో పలుకరించగానే ఆమె సంతోషంగా “యేసయ్యా! ఇట్లా వచ్చావే” అని అన్నది ఆనంద భాష్పాలు రాలుస్తూ. దీనిని బట్టి అమ్మ తనలో ఎవరికి ఏ ఇష్టదైవమో ఆ దైవాన్ని తనలో దర్శించేట్లు అనుభవ మిస్తుందని అనేక సందర్భాలలో తెలుస్తున్నది. అమ్మ ఆ కుష్టురోగిని అటూ ఇటూ కదల్చటంతో అమ్మ చేతికి మలం అంటుకున్నది. అమ్మ అసహ్యించుకోలేదు. ఆమెకు వళ్లు శుభ్రంచేసి ప్రసాదం పెట్టి ధైర్యం చెప్పి, బయలుదేరగానే ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి (‘శ్రీవారి చరణ సన్నిధి’ 22వ పేజి). దీనిని బట్టి అమ్మ సకల మతాల సకలదేవతల సమన్వయస్వరూపమని మనకు అర్ధం అవుతుంది. తననే స్మరించమని ధ్యానించమని అమ్మకోరలేదు. ఎవరి మనసైనా కొంత సేపైనా వారి ఇష్టమైన రూపంపై ఏకాగ్రంగా నిలుపకలిగితే ఆరూపం వారికి అమ్మలో కనిపిస్తుంది. ప్రేమసాధనకు అమ్మ ఏ రూపంలోనైనా సమాధానమిస్తుంది. మనిషికి నిస్వార్థమైన పరమప్రేమకన్న వేరే గొప్ప గుణం ఏమీ లేదు. నిష్కళంకమైన ప్రేమ గంగాజలంలా అన్ని మాలిన్యాలను, కాలుష్యాలనూ, కడిగివేస్తుంది.
అమ్మ ఒక మహాప్రేమకడలి. ఆ ప్రేమ కడలి పొంగి, వరదలైపారి అనేక జీవరాసుల్ని ముంచెత్తి సుగతికి తీసుకుపోతుంది. ఇదే ఆమె బిడ్డలకు చేసిన వాగ్దానం. ఇంతకంటే ఎవరైనా కోరుకునే దేముంది? సూర్యుడి ముందు చిన్న దివిటీలలా మన సొంత సాధనలు ఏమి వెలుగు నిస్తాయి. ఆమె చెప్పిన ప్రేమ సాధనలో వున్న వారికి ఆమె కరుణవల్ల విశ్వప్రేమ మనలో జనించి మనకు అనుభవంలో జీవితమంతా ప్రేమమయమూ, మధుర మయమూ అయిపోయి, సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందస్థితిలో మనల్ని నిలుపుతుంది.
27.3.75లో అమ్మ మద్రాసు పర్యటన చేసింది. 29వ తేదీన అక్కడ విలేఖరుల గోష్టి జరిగింది. ఇది చాలా ఆసక్తిదాయకంగా నడిచింది.
విలేఖరి : “అమ్మా మీరు మద్రాసు రావటంలో ఆలోచన ఏమిటి?
అమ్మ : అమ్మను అనుకున్నాక ఆలోచన ఏముంటుంది ?
విలేఖరి : ప్రపంచానికి మీదర్శనమే కాక మీరు చేయగలిగిన మంచి ఏమిటి?
అమ్మ : తల్లి ప్రత్యేకించి చేసే దేముంది? మీకు శిష్యకోటి వున్నదా? అని అడిగితే శిశు కోటివున్నారు అని సమాధాన మిచ్చింది.
ఇంకా ఆ విలేఖరి “మీ దగ్గరకు విదేశాల నుంచి ఎంతో మంది వస్తారు. వారికున్న మతాన్ని వదలి ప్రత్యేక మతాన్ని అవలంబిస్తున్నారా” అని అడిగితే “వారి మతాన్ని గురించీ అభిమతాన్ని గురించీ నాకు ఆలోచన లేదు. వారికి ఏది తృప్తి నిస్తుందో, ఏది ఉపకరిస్తుందో అదే అనుసరించమంటాను. వారికి కావాల్సిన వసతి చూడటమూ, ఆకలి అయినప్పుడు అన్నం పెట్టడమూ తెలుసునాకు” అని అన్నది. అమ్మకు అవకాశవాదం లేదు. కేవలం మెట్ట వేదాంతం చెప్పడం కాక, మనిషి కనీస అవసరాలయిన తిండి, ఉండటానికి వసతి ఇస్తానని ఒక తల్లిగా మాట్లాడుతున్నది. ఇంత వరకూ ఎంత మంది ఉపన్యాసాలివ్వలేదు? గ్రంధాలు రాయలేదు? సంస్థానాలు స్థాపించలేదు? వీటిని మించినది అమ్మలో వుంది అది వ్యక్తం చేయడానికి వీలులేని అవ్యక్తస్థితి. అమ్మ తనను మాటలతో తాను వ్యక్తం చేసుకోలేనని, తన అవ్యక్త స్థితి అనుభవంలోనే ఎవరికైనా రావాలని అనేకసార్లు చెప్పింది. ఈ అవ్యక్తస్థితిని వేదాలు గూడా ‘యతో వాచో నివర్తంతే” అని వాక్కులతో వర్ణించలేనిది అని ఒప్పుకున్నాయి. మాటలు అనుభవాన్ని ఇవ్వలేవు. ఎవరికి వారు ‘తరుణం’ వచ్చినపుడు తెలుసుకుంటారన్నది ఒకసారి నాతో “ఏ ఒక్కటి తెలుస్తే అన్నీ తెలుస్తాయో ఆ ఒక్కటీ తెలుసుకోవాలి. మిగతాదంతా వృథా ప్రయాస” అని అన్నది దానికి నేను “అమ్మా! ఆ ఒక్కటి నాకు చెప్పవా?” అని గారాబంగా అడిగాను. “దేనికైనా తరుణం రావాలి” అంది ఎటో చూస్తూ. బహుశా కనుచూపు మేరలో, నా ‘తరుణం’ అమ్మకు కన్పించలేదేమో! సూర్యుడు చీకటిని పటాపంచలు చేసినట్లు అమ్మ తేజమును దర్శించిన మాత్రం చేత అనేక మంది జీవులు అంధకారాన్ని తొలగించుకుని చైతన్యవంతులు అవుతారు. తన దగ్గరకు రాలేని అనేక మందిని చైతన్యవంతులను చేయడానికే అమ్మ తన శిశువులను వెతుక్కుంటూ యాత్రలు చేసింది.
చివరకు అనేక తికమక ప్రశ్నలతో ఆ విలేఖరి అమ్మను ఊపిరి సలపకుండా చెయ్యాలని చూశాడు. “జీవితమంతా తప్పులేచేస్తే” అని ప్రశ్నించాడు. ‘అన్నీ ‘తప్పులే చేయలేవు’ అని అమ్మ అన్నది. అతడు మొండిగా “చేస్తున్నాను” అని వాదించాడు. “దైవమే చేయిస్తున్నదనుకో. ఆ భావం కూడా లేకపోతే అన్నీ తప్పులే చేయి. నాదీ బాధ్యత” అని అన్నది. ఇటువంటి అభయం అమ్మ తప్ప వేరే ఎవరైనా ఇవ్వగలరా? “ఎన్నో అత్యాచారాలు జరిగిపోతున్నాయి దీనికి సమాధానం?” అని అడిగితే “మనస్సు మారటమే, మాటల బలం వుంటే దానంతట అదే జరిగిపోతుంది” అని అమ్మ అన్నారు. ఏది జరిగినా ఆ దైవశక్తేననీ – ఆ శక్తే మంచి, చెడులను జరిపిస్తున్నది అని అన్నది. అమ్మ దృష్టిలో మంచీ, చెడూ సుఖం; దుఃఖం, అనేవి ఈ సృష్టికి సహజం. ఒకటి అనేది రెండయి, అనేకం అవుతున్నాయి. దీనిని ఒక పరిశీలనతో అర్థం చేసుకోవాలే తప్ప మాయలో మునిగితే అంటే ద్వంద్వాలలో చిక్కితే ఒడిదుడుకులు తప్పవు. మనం కూడా అమ్మలమైతే తప్ప అమ్మ స్థితి మనకు అర్ధం కాదు. అంత వరకూ ఆమె చల్లని ఒడిలో జీవులు సేద తీర్చుకోవటం తప్ప మరో మార్గం లేదు. దీనినే శరణాగతి అన్నా మరేమన్నా పదాలు వేరు కాని చేయాల్సింది ఒక్కటే. చివరకు ఆ విలేఖరి మీరిచ్చే సందేశమేమిటంటే “మీ కున్నది తృప్తిగా తిని ఇతరులకు ఇంత ఆదరణగా పెట్ట అంతా దైవమే చేస్తున్నదని నమ్మండి” అన్నది. ఇదే మద్రాసు విలేఖరులకు ఆమె ఇచ్చిన సందేశం. మనందరికీ కూడా ఇదే ఆమె ఉపదేశము. ఒకసారి నాకు అమ్మ వీణ పుచ్చుకుని సరస్వతి లాగ ఉన్న చిన్న ఫొటో, పైన చెప్పిన సందేశమూ నాకు పోస్టులో వచ్చాయి. అమ్మ సరస్వతీదేవి ఎందుకైనదంటే జ్ఞానానికి పై మెట్టులో అమ్మ వుంది అని అనిపించింది. ఈ యాత్రలో అమ్మ యొక్క లక్ష్యం తన దర్శనం అందరికీ ఇవ్వటం ద్వారా వారిలో ‘ఆత్మజాగృతి’ని కలుగచేయటమేనని తెలుస్తోంది. తర్వాత మద్రాసులో మాలతీచందూర్, సుశీల, జానకి, అల్లురామలింగయ్య, సోమేశ్వర్, నందగోపాల్, ఎంబెరుమన్నార్, కేశవశర్మ ఇంకా చాల మంది గృహాలను పావనం చేసింది. పద్మనాభన్, వెంకటేశ్వర్లు ఇంకా మరెంతో మంది భక్తుల గృహాలను తన పాదస్పర్శతో పునీతం చేసింది. తిరువత్తియూర్, మహాబలిపురం కూడా వెళ్ళి అనేక వేల మందికి దర్శనమిచ్చి కరుణ చూపింది అమ్మ యొక్క ఒక్క అనుగ్రహ వీక్షణం చాలు జన్మతరింప చేయడానికి..
అమ్మ, తరువాత తిరువన్నామలై వెళ్ళి రమణాశ్రమంలోని చలంగారి కుటీరానికి వెళ్ళింది. వెడుతూనే ఆమె చలంగారి తలను తన హృదయానికి హత్తుకున్నది. ఆయన కన్నులు సజలమైనాయి. జీవితమంతా నాస్తిక వాదియై, ఐహిక భోగాలలోనే శాంతివుందని భ్రమసి వృద్ధాప్యంలో అలిసిపోయి, చివరకు అరుణాచలంలో స్థిరపడి ఈశ్వరాన్వేషణలో కాలం గడుపుతున్న ఆయన స్త్రీ అవతారమూర్తి అయిన అమ్మ ఒడిలో శాంతిని పొందాడు. సంవత్సరాలు ఈశ్వరాన్వేషణ చేశాను. “నేను ఎన్నో ఈసారి ‘ఏడిరా నీ ఈశ్వరుడు’ అని ఎవరైనా అడిగితే చెప్పటం సులభం” అని అమ్మని చూపిస్తూ అన్నాడు.
అమ్మ రమణాశ్రమంలోకి ప్రవేశించగానే అక్కడి మయూరాలు పురివిప్పి నాట్యమాడాయి. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. మూగజీవాలు కూడా అమ్మ దర్శనంతో ఆనందతాండవం చేశాయి. అక్కడున్న సాధువులు అమ్మను దర్శించుకున్నారు. అందులో జేమ్స్ అనే బ్రిటిష్ యువకుడు ఒకడు. ఆ తర్వాత అతడు జిల్లెళ్ళమూడి రావటం జరిగింది. అక్కడున్న అందరికీ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చింది. అక్కడ నుండి గం 11.30లకి కలవాయి గ్రామం చేరింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అమ్మ రాకను తెలుసుకుని ద్వారం వరకూ వచ్చి 15 ని॥లు ముకుళిత హస్తులై నిల్చున్నారు. జయేంద్రసరస్వతీ స్వామి వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడారు. మళ్ళీ మద్రాసు అచ్యుత్ వాళ్ళింటికి చేరుకుని జిల్లెళ్ళమూడి చేరారు.
ఈ యాత్రల రూపంలో అమ్మ తన బిడ్డలను వెతుక్కుంటూ వెళ్ళి వారికి స్వయంగా తన దర్శన స్పర్శన ఆశీస్సులను ఇచ్చి ప్రసాదాలు పంచిపెట్టింది. “అడగందే అమ్మైనా పెట్టదు” అంటారు గాని “అడక్కుండా పెట్టేదే అమ్మ” అని ఋజువు చేసుకొంది. హద్దులు కల ప్రేమ, తన వాళ్ళ మీదా బంధువుల మీదా వుండేది మమకారం. ఇందులో “కారం” వుంది. హద్దులు దాటిన ప్రేమ “అనురాగం”. ఇందులో “రాగం” వుంది. అమ్మ అనురాగమే బిడ్డలకు ఆశీస్సులు. అమ్మ జీవితం ఒక మహాసముద్రం వంటింది. ఎప్పుడో యాత్రీకులుగా వచ్చి స్వల్ప కాలం వుండిపోయే నాలాంటి వారికి అందులోని రత్నాలు లభింపవు. వసుంధర వంటి పుణ్యశాలి జీవితమంతా ఆమె వద్దనే గడిపి అనేక రత్నాలను డైరీ రూపంలో రాసి మనకందించింది. అందులో కొన్ని రత్నాలను ఏరుకుని వరుస క్రమంలో పాఠకులకు అందించటం ఈ విధంగా అమ్మస్మరణ చేయటంలో “దోషం లేదనుకుంటాను”.