స్వధర్మ నిర్వహణకు తిలోదకాలిచ్చి పరధర్మాచరణా నిమగ్నులై, దానినే ఆధ్యాత్మిక సాధనగా భ్రమించి, స్వర్గతుల్యంగా భాసించ వలసిన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటున్న మానవాళిని ఉద్దేశించి ‘సాధ్యమైనదే సాధన” అని ఉపశమన రూపమైన మేలుకొలుపు వాక్యాన్ని అమ్మ అందించారు.
దానిలో అంతర్లీనమై యున్న భావాన్ని గ్రహింపక, మనంగా చేయవలసినదేమీ లేదనే అభిప్రాయానికి మనమంతా వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మనంగా చేయవలసినదంతా చేసిన పిదపనే, “మనం చేయవలసినదేమీ లేదు. అంతా దైవమే జరిపించుకుంటున్నాడు. మనమంతా నిమిత్తమాత్రులమే”, అని మనకు అవగతమవుతుంది.
ఈ అవగాహనమేరకే, సాధనలన్నీను, అలానే కాకపోతే, “ముముక్షుత్వమే మోక్షం” అని అమ్మ చెప్పి ఉండవలసిన అవసరమే ఉండేది కాదు. మానవత్వం ఉన్నవారికి మాత్రమే ముముక్షుత్వం అలవడుతుంది. అసలు అవగాహన అనేది ఒక్కసారిగా మనకు వడ్డించిన విస్తరిలా అందే ఫలం కాదు. అది మన జీవితాంతం ఒక అనుభవం తర్వాత మరో అనుభవం, మరో అనుభవం తర్వాత ఇంకో అనుభవం, (అలా అనుభవ పరంపరలు) అనంతంగా సాగిపోయే జీవనది వంటిది. ఈ ప్రయాణంలో మనం పుణ్యపురుషుల, పుణ్య స్త్రీల దర్శన స్పర్శన సంభాషణాదులను పొంది భాగ్యవంతుల మవుతూ ఉంటాము.
శ్రీరామకృష్ణ పరమహంస తాను జీవించి యున్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటానని అవసాన కాలంలో తన శిష్యులతో చెబుతారు. కాబట్టి, ముముక్షుత్వాన్ని ఒక జీవనదిగా పోల్చవచ్చును.
జీవనదులు ఉరకలు పరుగులతోపోయి పోయి మాతృగర్భంలో ప్రవేశిస్తాయి. నిజానికి అవి సముద్రగర్భం నుండి విడిపోయి, సూర్యకిరణ స్పర్శచేత రూపాంతరం చెంది, ఆవిరియై, మేఘాలై వర్షించి నదులుగా ఏర్పడినవే. అవి అలా, విడిపోయి నదులుగా ఏర్పడుట వలన లాభంగాని, నామరూపాదులను కోల్పోయి మరల సముద్రంలో కలియటంవలని నష్టంగాని ఏమీ లేదు.
లాభనష్టాలు ఉన్నాయనే లౌకిక భావాల నుండి ఉదయించిన భ్రమలను ముముక్షుత్వ జనితజ్ఞానము నిశ్శేషంగా తొలగిస్తుంది. భ్రమలే మనకు బంధాలై జీవితాంతం పీడిస్తూ అశాంతి పాలు చేస్తుంటాయి. అవి ముముక్షుత్వం ద్వారా మాత్రమే తొలగుతున్నాయంటే, మనం భ్రమల నుండి విడుదల అవుతున్నా మన్నమాట. మనం వదలటం కాదు. మనం విడుదల అవటం. ఈ విడుదలనే సంస్కృతంలో “మోక్షం” అనే పదంతో నిబంధించారు.
కర్తృత్వంలో సాధన, కర్తృత్వ రాహిత్యంలో సాధ్యము – రెండు ఉన్నాయి. కాని ఉన్న వస్తువు ఒక్కటే. విడుదల. భ్రమల నుండి విడుదల. కాబట్టి ముముక్షుత్వమే మోక్షము. ఈ రహస్యం అర్థం అయిన తక్షణం, మనకు బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మయే అమ్మ, అమ్మయే బ్రహ్మ.
“జయహో మాతా”