శ్రీ శంకరభగవత్పాద విరచిత “సౌందర్యలహరి” శక్తి స్తోత్రరత్తాకరముగ ప్రజాబాహుళ్యంలో పేర్గాంచినది. అనవద్యాంగియైన అనసూయేశ్వరి మాత కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించిన బిడ్డలు ప్రశాంతచిత్తులై వారి దర్శనాలు వివరిస్తుంటే అమ్మ అవతార విశేషాలు నేటితరాల వారికి మార్గదర్శకాలుగా ఉపయోగపడుతున్నాయి. కేనోపనిషత్తు తృతీయ భాగములో దర్శనాల గురించిన ప్రస్తాపన యొకటి కనపడుతుంది. దేవతలు అసురులను యుద్ధభూమిలో గెలిచితిమని గర్వముతో ఉన్న సందర్భంలో జగదంబ వారిముందు నిలిచి ఒకచిన్న దర్భపుల్లను వారిముందుంచి దానిని దహించి గాని, కదిల్చి గాని, ఎగురగొట్టిగాని చేయుడని సవాలు వారి ముందుంచి నది. దానికి అగ్ని, ఇంద్రుడు మరియు వాయువు ఆ సవాలు స్వీకరించారు. కానీ వారు ముగ్గురు ప్రయత్నించి అత్యంత ఘోరంగా విఫలమైనారు. అంతవారు గర్వభంగం పొంది నీవెవ్వరవని ప్రశ్నింపగా ఆశక్తి యొక స్త్రీ రూపమున వారి ముందు ప్రత్యక్షమయినది. ఆమెయే ఆదిపరాశక్తి. ఆమె విలాసము తెలుసు కొనవలయునన్న చిత్తశుద్ధి లోపించని ఆత్మార్పణ భావము అవసరము. మానవ శరీరము సత్త్వరజస్తమోగుణముల పరిణామమేకదా! స్థూల రూపము తమస్సు నుండి, క్రియాత్మకమైనది రజస్సు నుండి జ్ఞానాత్మకమైనది సత్త్వమునుండి ఏర్పడుచున్నది. ఆధ్యాత్మిక సాధనకు అవసరమయిన ఈ శరీర నిర్మాణము చర్మము మాంసము, అస్థులతో ఏర్పడి, ఆదిపరాశక్తి స్వరూపాన్ని వీక్షించటానికి ఆమె అపారమైన ప్రేమరస మాధుర్యాన్ని గ్రోలడానికి యొకపనిముట్టుగా మారి పోయింది. మరి ఈ శరీరానికి అహంభావపు పోకడలు అలవాటుచేస్తే అమ్మ
దివ్య దర్శనాలు, అమ్మ ప్రేమాభిమానాలు సాధకులైన మనకి ఆలస్యంగా చేరుతవి. క్రమబద్ధమైన శరణాగతి అలవర్చుకొనకపోతే సుసాధ్యమైన అమ్మ అంతరంగం అర్ధమవదు.
జిల్లెళ్ళమూడికి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న అమ్మభక్తులు సాయంత్రపు వేళలో అమ్మను గురించి యొక సత్సంగంలో చర్చించు కుంటున్నారు. అది వారికి నిత్యం అలవాటు. అమ్మ ప్రేమ వర్షంలో తడిసి ముద్దయిన వారు ముగ్గురు మనందరికీ సుపరిచితులే. వారిలో ఒకరు స్వర్గీయ కేశవశర్మగారు, శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు మరియొకరు శ్రీ తంగిరాల శాస్త్రిగారు. (శ్రీ శాస్త్రిగారిని ఈ వ్యాసరచయిత. గుంటూరులో కలిసి వారిని అమ్మను గురించి ముఖ్యసంఘటన మీకు సంబంధించినది యొకటి చెప్పమని ప్రాధేయపడితే డెభైమూడు సంవత్సరాల శ్రీ శాస్త్రిగారు అమ్మ అపార ప్రేమను వర్ణించటానికి తను ఇరవైయేండ్లు బాలకుమారునిగా మారి రమారమి యాభైసంవత్సరాల క్రిందట జరిగిన విషయాన్ని వివరించారు. వారికి ధన్యవాదములు) వీరు ముగ్గురు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో జరిపే సత్సంగంలో అమ్మను గురించి యదార్ధవిషయములు శ్రీ కేశవశర్మగారి నుండి వింటుంటే శ్రీ తంగిరాల వారికి యొక వింత అనుమానం వచ్చింది. “మనం నిత్యం అమ్మను గురించి మాట్లాడు కుంటున్నాము గదా? అమ్మ ఎప్పుడైనా ఈ సమయంలో మన గురించి ఆలోచిస్తుందా? చాలా విచిత్రమైన ప్రశ్నయే కదా? కారణం నిత్యం భక్తుడు భగవతి గురించి తపన పడుతాడని చెప్పగలం గాని భగవతి నిత్యం ఒక భక్తునికి అవసరమైనప్పుడు, భక్తులు ఆర్తితో పిలిచినప్పుడు లేదా
భక్తునికి కష్టము వచ్చినప్పుడు అమ్మ తన బిడ్డల గురించి తప్పక ఆలోచిస్తుందని చెప్పగలము. కానీ అమ్మను గురించి
మనం మాట్లాడుకుంటున్నాము కనుక అదే సమయంలో అమ్మ మన గురించి కూడా ఆలోచిస్తుందా! అంటే అమ్మ మనగురించి ఆలోచిస్తుందనే సమాధానం శ్రీ తంగిరాల వారి స్వానుభవం. అసలు అమ్మ స్వరూపం, అమ్మ అనుగ్రహం, అమ్మ ప్రేమల గురించి, ఆ “దదానే ధీనేభ్యః” గురించి చెప్పాలంటే ఒకసారి శ్రీ శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరి” లోని యొక శ్లోక వివరణలోనికి వెళ్ళి శ్రీ తంగిరాల వారి అనుభవాన్ని తెలియచేస్తాను
శరజ్యోత్స్నా శుభ్రాం శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరామ్,
సకృన్నత్వంనంత్వా కథమిష సతాం సంనిదధతే
మధుక్షీర ద్రాక్షామధురిమధురీణా భణితయః
ఇక్కడ అమ్మ శరత్కాలమందలి వెన్నెలవలె అత్యంత నిర్మలమైనది. చంద్రునితో కలిసిన కేశకలాపమే కిరీటముగా గలది. అభయ ముద్రలతో కూడినది, స్ఫటికములతో నిర్మితమైన జపమాలమరియు పుస్తకము హస్తమునందు కలది అయిన అమ్మకు నమస్కరించిన యెడల పాలు యొక్కయు, ద్రాక్షపండ్లయొక్కయు మాధుర్యము కలిగిన మధుర వాక్కులు ఎట్లుకలుగకుండును? కనుక తప్పక కలుగునని శ్రీ భగవత్పాదుల వారి విశ్వాసము. అలాగే ఈ భక్తత్రయము (శ్రీనాధులవారు వాడిన” యతిత్రయం” అనే పదాన్ని తిరిగి నేను భక్త త్రయమని వాడుతున్నాను. క్షమాపణతో) ప్రతి నిత్యము అమ్మకునమస్కరించుకొని అన్యమైన విషయము లెవ్వియు చర్చించరాదని నియమముతోడ అమ్మను గురించి మాత్రమే సత్సంగము జరుపుకొను వీరిపై అమ్మ అనుగ్రహం ప్రవహించకుండా ఎలా వుంటుంది.
శ్రీ తంగిరాల శాస్త్రిగారికి తమ కంఠ స్వరంలో ఇబ్బంది యున్నది. కొద్దిపాటి బొంగురు తనంతో రెండు కంఠ ధ్వనులుగ వచ్చే ఇబ్బంది యున్నది. వీరి మాట యందు పాటయందు రెండు ధ్వనులు వినిపిస్తుంటాయి. వీరికి చిన్నతనం నుండి సంగీతము నందిష్టము. అమ్మవారికి ప్రసాదించింది. మా అందరికీ ఆ అదృష్టము కటాక్షించ వమ్మా! అని ప్రార్థిస్తున్నాము.