1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మెతుకే బతుకు!

మెతుకే బతుకు!

V S R Moorty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

కృతయుగం అస్థిగతం. త్రేతాయుగం మాంసగతం. ద్వాపరయుగం రక్తగతం. కలియుగం అన్నగతం.

ఇదంతా యుగలక్షణం. పరిణామక్రమాన్ని గమనించినపుడు, కలియుగమే పుణ్యకాలంగా అనిపిస్తుంది.

ఉన్నదంతా పరమాత్మేనన్న భావంతో కృతయుగ మానవుడు, తాను ఉన్నంతకాలం తన మూలంతో తనను తాను అనుసంధానం చేసుకుని తపస్సు, ధ్యానం, యోగం వంటి స్వీయసాధనా బలిమితో పూర్ణాయుర్దాయంతో జీవించాడు.

త్రేతాయుగంలో సాధకుడు, యజ్ఞయాగాదుల ద్వారా పరమాత్మను చేరుకోగల సాధనా మార్గాన్ని ఆశ్రయించాడు. మాంసగతమైన ఆహారాన్ని ఆలంబన చేసుకున్నాడు.

ద్వాపరలో భీమ ప్రతిజ్ఞ వంటి సందర్భాలు, రక్తగత విషయాన్ని స్పష్టం చేస్తుంటయ్.

కలియుగంలోనూ పై విధానాలున్నా, నాగరకతా ప్రభావంతో జీవుడు అన్నగతుడైనాడు. ఈ నేపథ్యంలో, అమ్మ నోటి నుండి వెలువడే మొదటి మాట, “భోజనం చేసి రా!”

డొక్క నిండనివాడు వేదాంతం వినడు. నైతిక సిద్ధాంతాలు వాడికి అవసరం లేదు. ఆకలి తీర్చు కోవటం, ప్రాణం నిలబెట్టుకోవటం ప్రధానం. ఆపైనే మిగిలినవన్నీ!

మానవుడికున్నవి పంచకోశాలు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. దేహం నిలబడాలంటే అన్నం కావాలి. ఆ మెతుకులు దయతో, ప్రేమతో, కరుణతో, అన్నింటినీ మించి వాత్సల్యంతో దొరికితే పదార్ధ శుద్ధి కలిగి, పరమార్థ చింతన వైపు నడిపిస్తయ్. ఏ భావంతో అన్నం తయారైతే, ఆ భావమే ప్రాణం పోసుకుంటుంది. దైహిక, ప్రాణశక్తులు సమన్వయంగా ఏర్పడేవే అన్నమయ, ప్రాణమయ కోశాలు.

నడిచే దేహం, అది నడవటానికి కావలసిన శక్తి కూడినపుడు, అంటే యుక్తాహారం, యుక్త విహారం జమిలి అయినపుడు, మరొక ప్రశాంత, పరితృప్త ప్రసన్న కోశం ఏర్పడుతుంది. అదే మనోమయ కోశం. అనేక ఆలోచనల సమాహారమే మనసు. దానికి రూపం లేదు.

కానీ అతి శక్తివంతమైన భావనాభూమిక అది. దాని పునాది, మూలం అన్నమయ కోశంలోనే ఉంది. మమతా ప్రసాదంగా లభించిన అన్నం నుండీ మమతే మనసుగా రూపుదాల్చి మనోహర పరిమళాన్ని అలదుకుని, మనసు దయాపూరితమౌతుంది. అది తీర్చుకునే ఆలోచనలన్నీ సంస్కార శోభితంగా, ప్రేమమయంగా ఉంటయ్. బలమైన మనసు నుండీ, కరుణాకరమైన మనసు నుండీ అటువంటి ఆలోచనలే కలిగి, సాధకుణ్ణి సాధువును చేస్తయ్. సమాజంలో సహజీవనం, మానవీయమైన తలపులు, సహనం, శాంతి, నిబ్బరం సాధించుకున్న మనసే, బద్ధత్వం నుండీ బుద్ధత్వం వైపు నడిపిస్తుంది. బంధనకీ, మోక్షానికీ మనసే కారణం.

కనుక మోక్షగామియైన సాధకుడు, ముందుగా అన్నమయ కోశాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అందువల్లనే అమ్మ ముందుగా అన్నం పెట్టి, ప్రాణం నిలబెట్టి, మనసును అరికట్టే ప్రయత్నం చేసింది. పైకి ఎంతో తేలికగా కనిపిస్తున్నా, ఆ వాత్సల్యం వెనుక ఒక గంభీరమైన అధ్యాత్మ బోధ ఉన్నది. కలిగిన వారంతా నలిగిన వారిని ఆదుకోవాలి. ఆకలిగొన్న మానవుడూ, అన్నం దొరకక మరణించే జీవులూ ఉంటే, అది నాగరక సమాజం కాదు. సంస్కారానికి నోచుకోని జాతి ఎక్కువ కాలం మనలేదు.

ఎట్టి మెతుకో, అట్టి భావం;

ఎట్టి భావమో, అట్టి భాష;

ఎట్టి భాషో, అట్టి జాతి!

దేహం, ప్రాణం, మనసు ఒక అద్భుతమైన త్రిపుటి. మాధవ సమానుడైన మానవుడు నిరంతరమూ అప్రమత్తుడై ఉండవలసిన స్థితులు. ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులకు మూలం ఇవే.

సర్వజన శ్రేయస్సు, శుభేచ్చగా, సమాజహితమైన నిష్కామకర్మలన్నీ క్రియా శక్తిగా, వివేకము-విచక్షణ జ్ఞానశక్తిగా అనుభవంలోకి రావాలంటే ‘అన్నం’ మూలం. దేహమున్న, ప్రాణమున్న ప్రతి జీవీ అన్నగతమే. అందుకే అమ్మ మాటాడినా, సూచించినా ముందు అన్నం తినమనే!

అందరిల్లు అందరికీ సహపంక్తిని సిద్ధం చేసింది. ఆకలికి కులం, మతం, భేదం లేవు. అరమరికలు లేని, బంధనలు లేని, వివక్ష లేని వాత్సల్యాలయం ఒక అపురూప విజ్ఞానమయ కోశంగా మారటం వెనుక ఉన్న కారణమిదే.

శాస్త్రాల మీద అధికారం, విషయాల మీద పట్టు, విశ్లేషణల మీద పూర్ణావగాహన, అనుష్ఠాన వేదాంతం, విజ్ఞానమయ కోశంలో ఇమిడిన బలాలు. ఆ కారణం గానే విజ్ఞానవేత్తలు, మహాకవులు, పండితులు, పావన ముక్తజీవులు, వేదాంత, తత్వబోధకులు, సంకీర్తనా చార్యులు, ఒకరేమిటి, పాశ్చాత్యులతో సహా జిల్లెళ్ళమూడికి ఆనాడే చేరటం, విజ్ఞానమయ భూమికగా మారటం! ఇన్ని కలిగిన తర్వాత ఉన్నదంతా ఆనందమయమే. పంచకోశ స్థితులను ఉపనిషత్తులు వీక్షిస్తే, వర్ణ, వర్గం భేదం లేకుండా అమ్మ వాటిని అతిసులువుగా ఆవిష్కరించింది.

“అమ్మా! నీ యాభైవ పుట్టినరోజు, ఏం చెయ్య మంటావ్?” అని అడిగినపుడు, “చేయటానికే ముంటుంది. ఒక లక్షమంది కలిసి భోజనం చేయటం చూడాలని ఉంది” అన్నది.

పట్టుమని పదిళ్లు లేని జిల్లెళ్ళమూడిలో, పందిళ్ళలో ఒక లక్షా అరవై వేల మంది భోజనం చేయటం మహిమా? అనుగ్రహమా? అమ్మ ప్రేమా?

“నేను పెట్టేదేముంది? ఎవరన్నం వాళ్లు తిన్నారు”. అన్న అమ్మది అకర్తృత్వ స్థితి. 

బువ్వ పెట్టిన అవ్వలందరూ అమ్మలు కారు.

ఆ పెట్టటం ఒక సహజ మాతృ లక్షణం కావాలి. 

అది నేర్పటమే మాతృబోధ! అందువల్లనే ఆమె మాతృశ్రీ!!

(శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారి ‘అమ్మత్వం’ గ్రంథం నుండి గ్రహించబడినది.)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!