గ్రంథకర్త : సద్గురు శ్రీస్వామి శివానందసరస్వతీమహరాజ్
వ్యాఖ్యాత : పూజ్యశ్రీ స్వామి కృష్ణానంద
అనువాదము: శ్రీస్వామి హంసానంద
దొరుకు చోటు: దివ్యజీవన సంఘము, శివానందనగర్ 249 192
ఉత్తరాఖండ్ జిల్లా (హిమాలయములు)
సద్గురు శ్రీ శివానందస్వామివారు సుప్రసిద్ధ పండితులైన అప్పయ్యదీక్షితుల వారి వంశములో జన్మించారు. వైద్యవృత్తిని స్వీకరించి మానవశరీరములకే కాక మనస్సులకూ చికిత్స చేయవలసి ఉన్నదని భావించి జ్ఞానదానం చేయటం మొదలు పెట్టారు. ఋషీకేశ్లో శివానందాశ్రమాన్ని స్థాపించి యోగిగా, ఋషిగా, జీవన్ముక్తునిగా, దివ్యజీవనసంఘాన్ని నెలకొల్పి యోగవేదాంత శిక్షణల ద్వారా ఎందరినో విజ్ఞానవంతులను కావించారు. 300కు పై గ్రంథాలు వ్రాశారు. ప్రపంచమంతటా వీరిశిష్యులు వ్యాపించి ఉన్నారు.
శ్రీస్వామివారు వ్రాసిన ‘మోక్షగీతా’ గ్రంథం భగవద్గీతతో సమానమైనది. భగవద్గీత 700 శ్లోకాలలోని భావాన్ని వీరు 124 శ్లోకాలలో పొందుపరిచారు. 18 అధ్యాయాల భగవద్గీతను 12 అధ్యాయాలలో ముగించారు. గీతలోని అధ్యాయాలకు సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము అన్న రీతిలో నామకరణం జరుగగా వీరి మోక్షగీతలో బ్రహ్మజిజ్ఞాసాయోగము, జ్ఞానమార్గ యోగము, మాయాతత్వయోగము, జీవన్ముక్తి యోగము, ఫలప్రాప్తి యోగము వంటి నామాలు పెట్టారు. శ్రీకృష్ణపరమాత్మ జీవుడైన అర్జునకు భగవద్గీత బోధిస్తే ఇందులో గురుశిష్య సంవాదరూపంలో గుదిగుచ్చారు. శ్రీకృష్ణుడు జగదాచార్యుడు. శ్రీ శివానందస్వామి జగద్గురువు. గీతా శబ్దము కూడా రెండింటికి సరిపోయినది. గీత అంటే గానము చేయబడినది. ఇది భగవత్తత్వాన్ని భగవత్ర్పాప్తి మార్గాలను వివరిస్తే ఇది కూడా మోక్షప్రాప్తి మార్గాలను సాధనలను వివరించింది. కనుక మోక్షగీతగా అతికినట్లు సరిపోయినది. భగవద్గీతను ఉపనిషత్తుగా, బ్రహ్మవిద్యగా, యోగశాస్త్రంగా ప్రతిఅధ్యాయం చివర ఉటంకిస్తే స్వామి కూడా ఇందులో అవే పదాలు వాడారు. అంటే రెండూ ఒకే విషయాన్ని చెబుతున్నాయని తెలుస్తున్నది.
ఇక గ్రంథంలోకి వెళ్ళితే భగవద్గీతలోని మొదటి శ్లోకంలోని మొదటి శబ్దం ‘ధర్మ’ క్షేత్రం – ఇక్కడ మొదటి శబ్దం “భగవన్”. అంటే ధర్మస్వరూపమే భగవంతుడని
ఇరు గ్రంథాలు చెప్పాయి. అందులో ధృతరాష్ట్రుడు మాయాపాశబద్ధుడు. “నావారూ”, పాండవులూ కురుక్షేత్రంలో ఏం చేశారు? అని అడిగాడు. అలాగే ఇక్కడ శిష్యుడు గురువుగారిని ‘నేను’ జననమరణములనెడి భయంకర సముద్రంలో పతితుడనై తాపత్రాయాలలో దహింపబడుచున్నాను. ఈ సంసార సాగరాన్ని ఎట్లా తరించాలో చెప్పమంటాడు గురువును. ధృతరాష్ట్రుని కన్నా ఈ శిష్యుడే నయం. గుర్తించాడు తానున్న పరిస్థితిని.
మనస్సు ద్వారా ఆత్మ శరీర రూపముగా వ్యక్తమైనట్లే బ్రహ్మమే మాయ ద్వారా ప్రపంచముగా వ్యక్తమౌతున్నది. “విదేహ మమరం మచ్చాగ్ అవాఙ్మనసగోచరమ్” అది అవాఙ్మనసగోచరము. “యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసాసః” వాక్కులకు మనస్సుకు కూడా అందని పూర్ణత్వమది. ఈశ్వరుని ఉపాధిమాయ. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. మాయ కప్పిన జీవుడు అజ్ఞాని. ఎందువల్ల నంటే జీవుని త్రిగుణములు, పంచభూతములు, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస గంధములు) వశపరచుకొని ఆడించుచున్నవి. అద్దంలో నీకు బాహ్యంగా నీ శరీరం కనిపిస్తున్నట్లు మాయ వల్ల ప్రపంచం కూడా బయట ఉన్నట్లు కన్పిస్తున్నది. కాని అసలు ఎక్కడ ఉన్నది? నీలోనే నీ ఆత్మయందే ఉన్నది. శంకరాచార్యుల వారు :
“విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా
యఃసాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానుమేవాద్వయం” అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్లు స్వప్నంలో వచ్చిన జగత్తులో తాను రకరకాలుగా విహరిస్తుంటాడు జీవి, మెలకువరాగానే ఆ జగత్తు అంతా పోయి తానే మిగులుతారు. అలాగే మాయ అవరించిన నామరూపాత్మకమైన ఈ ప్రపంచం అంతా నిద్రలాంటిది. వివేకమనే సూర్యోదయంతో నిద్రలేవగానే ఈ ప్రపంచం నశించి ఆత్మగా తానే మిగులుతారు. అయితే ఆ వివేకం అంత తేలికగా కలుగుతుందా? చంచలమైన మనస్సును జయించగలమా? ఏకాగ్రత సాధించగలమా? అంటే నిరంతర నామస్మరణ, ధ్యానము, బ్రహ్మ విచారము వల్లనే అది సాధ్యము. అది మాత్రం అంత తేలిగ్గా అబ్బుతయ్యా అంటే స్వామి చెపుతారు :
“సమదృష్ట్యా వివేకేన సత్సంగత్వేన స్థిరేణచ
చిత్తేన న తర్విచారేణ సులభం పరమం పదమ్” అని అంటే
సమదృష్టి, మానసిక స్థైర్యము, వివేకము, సత్సంగము ఉన్నచో దొరుకుతవి. అందుకే శంకరుల వారు
సత్సంగత్వేనిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః” అన్నారు.
అలా కనుక ఋషితుల్యుల సేవలో నిరంతరం చేసే ప్రతి పని భగవంతుని పనిగా చేస్తూ దాని యందు అసంగుడవై, కర్మఫలత్యాగియై ఉంటే
“స్వయం భూర్భహ్మచాస్మీతియో భావయతి తత్వవిత్
పజ్ఞానీచ మహర్షిశ్చ సముక్తో భవ బంధనాత్ ॥
నేను దేహమును కాను, నేను సర్వవ్యాపకుడను, నిర్వికారుడను, మహర్షిని, సచ్చిదానంద బ్రహ్మమును అని తలచే స్థితి వస్తుంది. వాడే భవబంధనాల నుండి విముక్తుడై ఉంటాడు.
“నాహందేహో నేంద్రియాణ్యన్తరంగో
నాహం కారః ప్రాణవల్గోనబుద్ధిః
దారా పత్యక్షేత్ర విత్తాది దూరః
సాక్షి నిత్యం ప్రత్యగాత్మా శివోహమ్” అని ఆచార్యుల వారు అద్వైత పంచరత్నాలలో సెలవిచ్చారు.
యస్యదుఃఖేష్వనుద్విగ్నం సుఖేష్వప్రమదోజ్జ్వలమ్ – కునశ్చసోZవ్యసందేహం జీవన్ముక్తః ప్రకీర్త్యతే
ఎవని మనస్సు సుఖదుఃఖముల యందు పొంగక కృంగక ఉందునో అతడు జీవన్ముక్తుడు.
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయకోశానికి ప్రయాణించి ఆత్మజ్ఞానముచే సచ్చిదానంద పరబ్రహ్మమును చేరవచ్చును. అటువంటి అవినాశమగు తురీయావస్థను పొందినచో ద్వంద్వములు అంటని జీవన్ముక్తుడగును. సర్వతంత్ర స్వతంత్రుడగును.
ఇటువంటి సంప్రదాయ వేదాంత సందేశాన్ని ఈ మోక్షగీతా గ్రంథంలో వివరణాత్మకంగా అందించబడింది. ఈ గ్రంథంలో 4వ వంతు శ్లోకాలు సాధనా విధానాన్ని విపులంగా వివరించింది. అందరూ చదివి అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టవలసిన విషయాలెన్నో సూక్ష్మంగా తేటతెల్లంగా వివరింపబడ్డాయి. శ్రీ స్వామి శివానంద సరస్వతులు ఈ గ్రంథాన్ని వ్యాఖ్యానం చేసిన శ్రీ స్వామి కృష్ణానందులు, అనువదించిన శ్రీస్వామి హంసానందులు తెలుగువారికి ఎంతో మేలు చేశారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు తప్పక చదువవలసిన గ్రంథం మోక్షగీత.