(1970లో అమ్మ తన గతాన్ని గుర్తు చేస్తూ యజ్ఞ యాగాదులపై విమర్శనాపూర్వకంగాను, పతివ్రతా ధర్మాన్ని ప్రస్తావిస్తూనే 1952లో మర్రిపూడిలో శ్రీ యాజులు గారితో చేసిన సంభాషణ చదువరులకు ఆసక్తికరంగాను, ప్రయోజనకరంగాను వుండగలదని విశ్వసిస్తూ ఈ క్రింద పొందు పరుస్తున్నాము.
-సంపాదకులు)
అమ్మ ఒకరోజు గతాన్ని గూర్చి ఏవో కబుర్లు చెప్తూ మట్టిపూడి వీరయ్య గారింటికెళ్ళినప్పటి సంగతి చెప్పింది.
1952వ సంవత్సరంలో అమ్మ, బామ్మ, హైమ, రవిలతో అప్పికట్ల నుంచి మట్టిపూడి శ్రీ నూతలపాటి వీరయ్య గారింటికి వచ్చింది. ఆనాడు సాయంత్రం 7.30 ని॥లకు వీరయ్య గారింటికెదురుగా ఉన్న సోమయాజులు గారింటికి వెళ్లింది. యాజులుగారు అన్నారు. “అమ్మా! మీరేనా ఈ మధ్య అప్పికట్లలో ఉన్నది. లోపలికి రండి ఎప్పుడు వచ్చారు?” ఇంతలో యాజులు గారి భార్య సోమిదేవమ్మ గారు రండమ్మా రండి నా పౌండరీకుని చూద్దురు గాని అని ఆహ్వానించింది.
అమ్మ :- పౌండరీకుడు పుట్టాడా అమ్మా !
సోమి :- ఔనమ్మా యజ్ఞమైన తర్వాత పుట్టినబ్బాయి.
యాజు :- మీరు యజ్ఞానికి రాలేదా అమ్మా! అని చాప వేసి కూర్చోండమ్మా,
మంచి తీర్థం తాగుతారా!
అమ్మ :- అక్కర్లేదు నాయనా, త్రాగి వచ్చాను. : యాజు :- మా యజ్ఞశాలంతా చూస్తారా?
అమ్మ :- చూస్తాను నాయనా, మా అత్తగారు కూడా వాకిట్లో నిల్చుని వున్నారు. అని బైటికి వెళ్ళి బామ్మను కూడా పిల్చుకు వచ్చి పోదాం రండి, యాజులుగారు యజ్ఞశాలంతా హోమాలూ, హోమాలు చేసిన గుండాలూ, అధిదేవతల స్థానాలు అన్నీ చూపిస్తూ శ్లోకాలు చదివి అర్థాలు చెప్పారు.
యాజు :- అమ్మా! శాస్త్రం నమ్మాను. చేస్తున్నాను. చక్కని మేక దొరికితే మనస్సు ఊరుకోదమ్మా. ఇప్పటికి 24 ఎకరాలు యజ్ఞాల క్రిందనే అమ్మాను. ఇంకా రెండెకరాలున్నది. ఎవరైనా వేదం చదువుకున్న కుర్రాడు దొరికితే 8 ఏండ్ల అమ్మాయి ఉన్నది నాకు. కన్యధారపోస్తే అక్కడికి అది కూడా తీరిపోతుంది. మొన్న మళ్ళీ 4 మేకలు చూచాను. మళ్ళీ యజ్ఞం పెట్టుకోవాలనుకుంటున్నా నమ్మా! అన్నింటికీ ఈవిడ కూడా ఉండాలిగా. ఈమె బాలింత. బెజవాడ వెళ్ళి, అక్కడ్నుంచి కాశీ వెళ్ళి వచ్చి వీలుగా ఉంటే ప్రారంభిస్తానమ్మా! అన్నారు.
మౌనంగా అరగంట కాలం గడిపారు.
అమ్మ :- మేక కనపడితే దానిని వధ చేసిందాక తోచదా ?
యాజు :- ఏమిటమ్మా అట్లా అన్నావ్. శాస్త్రం నమ్మాను.
అమ్మ :- శాస్త్రం యజ్ఞం అంటే మేకలను కొయ్యటమేనని చెప్పిందా? ఏ జంతువులూ పనికిరావా? మేకలనే బలి యివ్వటానికి కారణమేమిటి? వాటిని మోక్షానికి పంపడానికే అయితే తతిమ్మా వాటికి మోక్షం అవసరం లేదా? వాటి మోక్షమే కారణమైనప్పుడు మేక కంటే అన్యాయంగా ఉన్న మనుషులున్నారుగా లేక అది కాదా, కారణం లేక వాటినే ఇవ్వటానికి మీరు చెప్పేది కాక వేరే కారణమున్నదా? అసలు యజ్ఞమెందుకు? యజ్ఞం చేసినందువల్ల ప్రయోజనమేమిటి?
యాజు :- చెప్పానుగా అమ్మా! బ్రాహ్మణునికి యజ్ఞం ధర్మమని చెప్పి ఉన్నది. విన్నాను, చేస్తున్నాను.
అమ్మ :- బ్రాహ్మణులలో పురుషులకేనా ? స్త్రీలకు కూడా ఏమైనా ధర్మాలున్నాయా!
యాజు :- పురుషులు చేసే ప్రతి పనిలో ప్రక్కన ఊరికే నిల్చుండటమే.
అమ్మ :- ఇష్టమున్నా లేకపోయినా! అంతేనా! ఇంకేవైనా స్త్రీలకు ప్రత్యేక విధానాలూ…
యాజు :- పతివ్రతా ధర్మమే. అంతే.
అమ్మ :- మీరన్నది ఏది కావాల్సిన వారికి అది ఇవ్వటమే పతివ్రతా ధర్మమనేగా.
జ :- ఔను.
అమ్మ :- తాగుబోతు వాడున్నాడు – కల్లు ముంత యిస్తుంది. దురవృత్తి కలవాడున్నాడు – వాటికి సహాయపడ్తుంది, పేకాడే వాడున్నాడు . పేక తెచ్చిస్తుంది. వాడి అవసరాలకు ఇంకేమైనా చేసైనా అంటే దొంగతనంగా కానీ, వ్యభిచరించి గానీ తెచ్చి ఇవ్వవచ్చుగా. అక్కడ దోషం ఆపాదిస్తుందా?
యాజు :- ఏది ఇష్టమయిన వారికి అదల్లా ఇవ్వటమే.
అమ్మ :- మీరు యజ్ఞం చేసేవారు కనుకన మీ ప్రక్కన సోమిదేవమ్మ నిల్చుంది. ఇంకా సంధ్యావందనం చేసేవాళ్ళయితే ఉద్ధరిణి, పంచపాత్ర హరివేణం ఇంకా కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధపరుస్తారు. ఉద్యోగస్తులకు వారికి కావలిసింది చూస్తారు. ఇంకా ఇతర వృత్తులు అనేకం వున్నవారు ఉన్నారు. వారికి కావలసనివన్నీ చేకూర్చడమేనా వారి ధర్మం. అందులో ఇదీ అదీ అని విచక్షణ లేకుండా. యాజు :- అటువంటి స్థితి ఎక్కడా లేదు.
అమ్మ :- అయితే మీరిక్కడ కూర్చుని సర్వాన్నీ చూస్తారా? పరిమితి లేకుండా?
యాజు :- కాదమ్మా! అటువంటి స్థితి సామాన్యంగా ఉండదన్నాను. అమ్మ :- అప్పుడెక్కడైనా ఉండవచ్చనేగా యాజు :- కనీ వినీ నేనెరుగను
అమ్మ :- నాదీ ఊహ. ఉభయులం ఇట్లా వుంటే ఏమిటి? అని ఆలోచిద్దాం.
యాజు :- చెప్పి చేస్తే దోషమేమున్నదబ్బా! అమ్మ :- చెప్పి చెయ్యటం వేరు. చెపితే చేయటం వేరు చెప్పక చేసి చేసి చెపితే వేరూనా లేక అన్నీ ఒకటేనా –
యాజు :- ఏమమ్మా చాలా అగాధమైన సమస్యలో పెట్టావే !
అమ్మ :- ఇటువంటి సమస్యలతోనే నిండి ఉన్నదీ ప్రపంచం :
యాజు :- కేవలం ప్రపంచానుభవమేనా అమ్మా ఇది. :
అమ్మ :- ఈ మాట అనటంలో ఏ రకమైన అనుభవం కలిగి ఉన్నారు?
యాజు :- అమ్మా ! ఆ పలుకుల్లో, ఆ ధ్వనిలో, మూర్తిలో ప్రపంచంలోనిదనీ అంటే తమదని కాదు, తమరు చూచి ఉండవచ్చనీ, ఊహలు కావనీ తోస్తున్నదమ్మా.
అమ్మ :- ఈ దోషం. వీరికి ఆపాదిస్తుందా? అట్లా చేయవచ్చునా! : చేయకూడదా?
యాజు :- అబ్బ పెద్దసమస్య తల్లీ!
అమ్మ :- పోనీ ఈ భాగాన్ని వదలి అటునుంచి వద్దాం. పురుషులకు పాపపుణ్యాలు లేవా? ధర్మం లేదా? సంఘంలో ఉండే తప్పు ఒప్పు
యాజు :- లేకేమమ్మా ఉభయత్రా ఉన్నాయి.
అమ్మ :- సత్యమూ, ధర్మమూ ఒకటేనంటారా ? రెండా?
యాజు :- రెండూ ఒకటేనమ్మా అమ్మ :- రెండు ఒకటైనప్పుడు పేర్లు వేరుగా ఉంటున్నాయి కదా! రెండింటికీ నిర్వచనం చెప్పండి.
యాజు :- ధర్మం అంటే శాస్త్రరీత్యా చెప్పిన ప్రకారం ఎవరి ధర్మాలు వారికి నిర్ణయించే ఉన్నాయి. ఆ ప్రకారం నడుచుకోవటం ధర్మం.
అమ్మ :- సత్యం అంటే?
యాజు :- అందులో ఇమిడే ఉన్నది.
అమ్మ :- ఉన్నాయ్ సరే! అయితే మీరు పెద్దవారు. నాకు అడగటం చేతకాదూ, నడవడం చేతకాదూ, విన్నది అర్థం కాదు. విన్నంత వరకు సత్యమని తోచదు. ఇదీ నా స్థితి.
యాజు :- పోనీ నీవు చెప్పమ్మా నేను వింటాను.
అమ్మ :- సత్యమంటే నిత్యమైనదనే!
యాజు :- ధర్మమంటే ?
అమ్మ :- సంఘం కట్టుబాటని ఒక అర్థం. రెండు విధి ప్రకారం తను తప్పించుకుందామన్నా తప్పనిదేమోనని ఉద్దేశం. అయినా ధర్మంలో సత్యం ఇమిడే ఉన్నదన్నారే! రెండూ వేరు వేరనుకుంటున్నాను. ఒక దానిలో ఒకటి చెప్పేటంత వరకు ఇమిడి లేదు. చేసే దానిలో కలుస్తుందేమో చేసేవాడికి విచక్షణ లేదు.
యాజు :- ఎందుకు లేవో చెప్పమ్మా !
అమ్మ : అయినా మీరనుకుండే సత్యమేదో చెప్పండి. అయినా ఉండే సత్యం, అనుకునే సత్యం, నడిచే సత్యం. మూడు స్థాయిలలో ఒకటిగా ఉండే సత్యం. ఆ సత్యమే నిత్యమైన సత్యం.
యాజు :- ఇంతేనా? ఇంకేమైనా ఉందా? నేననుకుంటే సత్యం అబద్ధమాడక పోవటమమ్మా!
అమ్మ :- నేకొక చిన్న సందేహమడుగుతా చెపుతారా? ఒక స్త్రీ ఉన్నది కారణాల చేత భర్త ఇంట్లో ఉండీ లేడనిపించవచ్చు లేక ఉన్నట్లనిపించవచ్చు. పదిరూపాయలు చేతిలో పెట్టి ఎవరైనా వస్తే లేదని చెప్పు. ఇది నీవు వాడుకోమని చెప్పిపోవచ్చు. చాలాబాధతో ఉండి వారు కూడా ఉపవాసాలతో ఉండి అడగవచ్చు. ఈమె ఇవ్వడం ధర్మమా? లేక లేదనడం ధర్మమా?
(ఇంకా వుంది…)