భారతీయ సంప్రదాయంలో ఒక విశిష్టమైన స్థానం కలిగినది యోగము.
‘మాతృశ్రీ’ అని రమణమహర్షిచేత సంబోధించబడి, ‘విశ్వజనని’ అని భక్తుల గుర్తింపు పొందిన బ్రహ్మాండం అనసూయాదేవి (1923-1985) స్వయముగా యోగ సంపూర్ణ మూర్తి. యోగ విద్య విజ్ఞానం గురించి అమ్మ సంపూర్ణ అవగాహన కలిగినవారు.
త్యాగ, శాంతి, ప్రేమ త్రిపుటి సమన్వితమైన కర్మయోగాన్ని,
శాంభవీత్యాది ముద్రా సమన్వితమైన క్రియాయోగాన్ని,
భ్రూమధ్య ధ్యానం, శ్వాస మీద ధ్యాస వంటి వానితో కూడిన హఠయోగాన్ని అమ్మ అనుష్ఠానం చేశారు.
సాధనలో ఉండే ఇబ్బందులు తెలిసి ఉండినవారవడం వల్ల “సాధ్యమైనదే సాధన” అన్నారు. ధ్యానము, ఆరాధన, మననము అనే వానికి అమ్మ తన యోగ విధానంలో ఎంతో గుర్తింపు నిచ్చారు. కచ్చితంగా నిర్వచించారు.
“ధ్యాసే ధ్యానం” అని తన ఆరవయేట చెప్పారు. శక్తిని సమర్థవంతంగా ఉపయోగించడం ఆరాధన అన్నారు. ప్రతి మాట మననం చేత మంత్రమౌతుంది అని మంత్ర స్వరూపం చెప్పారు. యోగమునకు లక్ష్యం సుగతి అని అన్నారు.
తన శరీరంలో గల పంచభూతాల గతిని గమనించి యోగనిష్ఠయై శాంభవీముద్రలో ఉండి అంతర్ముఖత్వాన్ని సాధించారు. చెప్పేది సాంఖ్యం, చేసేది తారకం, చూసేది అమనస్కం – అని సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణాత్మకమైన రాజయోగానికి తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు.
మనస్సు, నేను, కరుణ, కాలము, చైతన్యం, అసలు, స్పందన, మరుగు అనే అష్టతలాల అధిగమనమే యోగప్రక్రియ అని ఆచరణలో చూపించారు. ఆరవయేట తురీయాతీతము సాధించారు. దానితో వారికి విశ్వచైతన్యంతో అవిభక్త సంబంధం ఏర్పడింది. దాని వలన సర్వజ్ఞత్వం, సమానత్వం, స్వేచ్ఛ అనే మూడు ఫలాలను సాధించారు.
స్థూల శరీరంతో వాయు స్తంభన వంటివి సాధించి చూపించారు. అమ్మ తనను తాను అమ్మగా మాత్రమే ప్రకటితమైనారు, సత్య విజ్ఞాన సౌందర్య యోగసిద్ధి పొందారు.
(“అమ్మ జీవిత మహోదధి నుండి)