1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘రాజుపాలెం’ డైరీల నుండి (ఈ సూత్రమే (మంగళ) ఆ సూత్రమును తెల్పినది)

‘రాజుపాలెం’ డైరీల నుండి (ఈ సూత్రమే (మంగళ) ఆ సూత్రమును తెల్పినది)

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 5
Month : July
Issue Number : 3
Year : 2006

(కీ.శే. రాజుపాలెం రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్ధమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహననను సరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెం శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

  1. ‘అంఆ’ యన అంతులేనిది, అడ్డులేనిది, ఆధారమైనది

పరమాత్మ అన్ని నామములు తనవగుట, అన్ని రూపములు తనవేయగుట నామరూప రహితుడయ్యును, అనుభవైక వేద్యుడని దెల్పుచు ప్రణవ వాచ్యుడనిరి. ఇందు సర్వ శబ్దములు ప్రణవమే యగును. ఇక ‘ఓం’కారము నందు అ, ఉ, మల సమ్మేళన గలదనియు, సృష్టి, స్థితి లయముల కివియే ఆధారభూతము లనిరి. ఆకాశము నుండి బడులునది శబ్దమగుట, ఇదియు తొలుత పర, పశ్యంతి, మధ్యమ, వైఖరీ రూపముల అంతరము నుండి, బహిర్గతమగు పర్యంతము, ఆధారము నుండి యే ఉద్భవించుటం జేసి వేర్వేరు అవస్థలను (మార్పులను) వేద్యులు దెల్పిరి.

‘దీనినే నాదాను సంధానము చేయువారు, రాగిణులను పేర, స్థాన పర్యాయముల దెల్పి, వారిని రంజింప జేసిననేగాని, ‘లయము’ అగుటకు వలను పడదనిరి. ఇట్టి అను సంధానముననే పరమాత్ముని చేరనగునని త్యాగరాజాదులు ధృవపరచిరి. (స, రి, గ, మ, ప, ద, ని)

యోగులు కుండలినీ జాగృతి లేక ప్రబోధమను పేర, మూలాధారము నుండి ప్రకోపితమైన జ్యోతి స్వరూప గమనము షట్చక్రములని తెలుపబడిన నాడీ కూడలుల యందు విశ్రాంతి స్థానములుగా వారలనుభవించిన నాదరూపమునే, దళములు, బీజాక్షరములు, తదధి దేవతలనియు, ప్రాణాపానవాయు సంఘట్టనచే అగ్ని నాడిని జాగృతి గావించి తెలిపిన విషయములు ఇచట గమనము. మండూకము, పాము, శంఖు (Spiral) అని కూడా తెల్పిరి. (Plexes, Vortices etc.)

రాజయోగులగువారు తారక మనియు, నాద, బిందు, రేఫ మనియు, వారి వారి అభ్యాసాను సారము ఆసనములు, ముద్రలు (శాంభవి, ఖేచరి మొ॥) ప్రధానములని తెల్పి, దీన నాద, బిందు నధిగమించి, అతీత స్థితి పొందవచ్చు ననుట దెల్పిరి.

మంత్ర శాస్త్రజ్ఞులు ప్రథమతః గాయత్రి యన సంధియనియు, ఇదియే పరమాత్మ స్థానమనియు, ఈ త్రిసంధ్యల కవ్వల నుండునది బ్రహ్మగాయత్రి అనియు, మనము నిత్యమనుష్టించునది త్రిపదా గాయత్రి యనియు, ఇందలి సంధి స్థానముల నెరుగునది ప్రణవమే యగుట దీనిని సేతువనిరి.

ఇక సాకారోపాసన చేయుతరి, ప్రథమతః తమ ఇష్టదేవతాస్వరూపము, శబ్దమగు మంత్రము, గుర్తు చెప్పిన గురువు అను త్రిపుటితో అంగన్యాస, కరన్యాసములను పేర, తమ ఇష్ట దేవతను, తన యందే న్యాసము గావించుకొని, ఆ త్రిపుటీ రహితమైన దేవతా స్వరూపమున తాదాత్మ్యము చెందుటయే మంత్రానుష్ఠాన మందలి విషయము.

ఇప్పుడు ప్రస్తుతాంశమున వైఖరీ రూపములో కంఠము నుండి నోటి ద్వారా బహిర్గత మగు శబ్దములు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ…. అం, ఆః అను వానిని అచ్చులు గను (ప్రాణము కలవిగను) మిగిలిన తాలవ్యములు దంతవ్యములు, ఓష్టములు వగైరా హల్లులుగను, వీనికి అచ్చు పరంబైననే అక్షరములగునని దెల్పిరి. ఇట్టి శబ్దమయమునకే అచ్చుల సంయోగ మొనర్చినంత అక్షరములగును (క కార అ కారం క) కనుక ప్రాణము కలవి బీజాక్షరములనిరి. అట్లు అనేక మంత్రము లుత్పన్నములైనవి. ఏవియో కొన్ని అక్షరములకే శక్తి యుండు ననుట సంశయాస్పదము. శక్తి లేని అక్షరములు భాషలో నుండ నేరవు.

ఇట్లు అకారముతో మొదలిడిన అక్షరములు, పెదవులు మూసిననే గాని ‘మ’ కారము పలుకనేరదు. గాన ‘అ’ కారము ఆది. (గీతలో చెప్పినట్లు) ‘మ’కారము పూర్ణాను స్వారము, అంత్యము. గాన ఈ మధ్యగల సర్వ శబ్దములనే మనము నాలుకకుపై అంగిలి మొదలు పండ్ల వరకు గల పై భాగములోని గుంటలలో నాలుక చేర్చుటచే పలుక గలుగుచున్నాము. కనుక అకారము ఆదియైన ‘o’ పూర్ణాను స్వారము. ఇతర సర్వ శబ్దములగును. ఇందు ‘అ’ కారము ఆవర్తనం, పూర్ణాను స్వారము వివర్తన, తిరిగి అకారము ఆవర్తన. దీనినే ‘ఒకపరి జగముల వెలిగిడి, ఒక పరిలోపలికి గొనుచు, ఉభయము ‘తానై’ అనునది. దీనికి ‘ఆత్మములు’, ఆవర్తన (Evolution) వివర్తన (involution). ఆత్మమూలుగనుట Revolution. గొప్ప మార్పు. అనతి కాలమున పొందుట అనగా అనాదిగాగల జీవత్వము నశించి శివత్వము నందుట క్షణికమని అభిప్రాయము.

శివపరమైన ఆగమములలో సత్యం, శివం, సుందరం అనియు, వైష్ణవాగమములలో సాక్షిత్వమున కంటే ఎక్కువగు వ్యూహములు 1. వాసుదేవ, 2. సంకర్షణ, 3. ప్రద్యుమ్న, 4. అనిరుద్ధ గలవనియు వీటికన్నింట అనపాయినిగా లక్ష్మి ఉండుననియు డెల్ఫి ఇవి క్రమతః శ్రేష్ఠమనిరి. వీనిని పరిశీలించిన వాసుదేవ తత్వమన సర్వవ్యాపకమైన ఆకాశతత్వమనియు సంఘర్షణవల్ల వేడి, వెలుగు, విద్యుత్తు కల్గుటచే ప్రద్యుమ్న – విశేషమైన (అని అర్థము) ఆ విద్యుత్తే భౌతిక శాస్త్రానుసారము (వేడి, వెలుతురు, విద్యుత్తుల నుండి) మానసికముగా సంకల్పములు (Thought waves) నిర్ధారణ చేసినవి. ఈ అనిరుద్ధ వ్యూహమునకు ఆటంకము, అడ్డులేనిది యగుట అగును.

ఏదోవొక దానికి ఆది యుండిన అంత్యముండి తీరవలయును. సమన్వయమున వైఖరికి పూర్వము, మధ్యమ – దీనికి పూర్వము పశ్యంతి అంతకు పూర్వము పర యగుట – ఈ పరకు సహితము పరగా నుండి ‘పరాత్పరి’ యగును. అనగా పరమ వ్యక్తము, బోధన చేయునది. పరాత్పరి యను బిందువు ఛేదించుకొని నాదరూపమున, కళ యగు జీవుని పొందెనని తెలిసికొని యున్నారు. మరియొక విధమున అణోరణీయాన్ – మహితో మహీయాన్. దీనినే తంత్ర శాస్త్రము నందు శ్రీ చక్రమునగల కేంద్రమును బిందువుగను, ఈ బిందు ఆవర్తననే ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తుల త్రిభుజాకారముగా నేర్పడు యోని బిందు వందురు. తదనంతర మావర్తనలు గల్గి, సృష్ట్యాది, బ్రహ్మాండంతర్గతము నావరింప జాలి యుండును. (Microcosm & Macrocosm) ఇట్టి వ్యాకోచములో బిందువు చేరగల్గిన మూల కారణమున్నూ, ఆవర్తనలో బ్రహ్మాండముల నావరించుటయు తెలియునట (With centre everywhere & Circumference nowhere).

Sum total of energy remains constant Matter in mind అమానుషములుగా కనిపించు యోగశక్తులు మానసిక శక్తులే అగును. (Supra Sensory – Supra – mental) వీని కవ్వల Transcendental. దీనిని వీడి బిందువు చేరిన వారి శక్తి, సామర్థ్యము లెట్లుండునో ఊహింపలేనివి. వారికి సర్వమూ సామాన్యమే – తాను అసాధ్యముగాన తనకు సాధ్యము కానిది లేదు. సాధ్యమేతను.

ఉదకమందు ద్రవత్వము – అగ్నియందుష్టత్వము రాతి యందు కాఠిన్యము ఇతరముల వలన కలుగక, స్వభావ సిద్ధము లైనట్లే ‘అంఆ’ అను మాయా స్వరూపిణి యందు అఘటనా ఘటనమగు శక్తి స్వతస్సిద్ధమై యున్నది. గాని మరియొక దాని వలన కలుగలేదు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!