(కీ.శే. రాజుపాలెం రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్ధమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహననను సరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెం శేషగిరిరావు గారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
రాజమ్మగారి వద్దకు వెళ్ళిన సందర్భము
ధర్మ స్వరూపము నిర్ణయము చేయునెడ ‘ధృతి (సంతోషము) 2. క్షమ (ఓర్పు) 3. దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) 4. అస్తేయము, 5. శౌచము (బాహ్యంతరములు) 6. ఇంద్రియ నిగ్రహము, 7. ధీ (నిత్యానిత్య వస్తు వివేకము) 8. విద్య, 9. సత్యము (అనశ్వరమైనది) అనగా నాశనము లేని పరమాత్మ స్వరూపము నందే నిలువ గల్గు సామర్ధ్యము 10. అక్రోధము (ప్రేమ స్వరూపి యగుట) అనునవి శాస్త్ర సమ్మతముగా దెలిపి, వీని సాధించు క్రమాభ్యాసముగా, దేవతా పూజా విధానము తెలిపిరి.
- మూర్తి :- “చిన్మనస్యా ద్వితీయస్య, నిష్కళస్యా శరీరణ : ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనాః సాధకానాం హితార్థాయ బ్రహ్మణోరూప కల్పనా” – నానా విధ రూప భేదము ఒక్క పంచదార అనేక రూపములైన అచ్చులలో పోసినట్లు, నిర్గుణోపాసనమనువారు కూడ, మానసిక రూపమునే కల్పించు కొందురు. (ఇష్ట దేవత).
- మంత్ర చైతన్యము :- మంత్రము, దేవత, గురువు ఒకటి యగుట పరమార్థము. ఈ మంత్ర చైతన్యము పర, పశ్యంతి, మధ్యమా, వైఖరీ రూపములలో నాదమగును. ఇక అక్షర మాలలో గల అకారాది క్షకారాంతము నాద శక్తి యగును. ఇది దేహమంతట నున్నను, మీదకి నడచుదారి మూలాధారాదినుండి, సుషుమ్నాంతర్గత మనియు – దేవీపరమైన సప్త మాతృకలు. దీనినే వీణాదండ మనియు తెలిపిరి. ఈ సప్త ధ్వనులే
- ఘట స్థాపన :- తానారాధించు ముఖ్య దేవత గాక, అంగదేవతల కొరకందురు. ఇందు ఘటము హృదయము. (హృది + అయమ్) ఆత్మ అనుటలో ఇచట దేవతలుద్భవింతురట – పల్లవములగు మామిడి, రావి, జువ్వి, వేగు, మేడి సాంకేతికము) టెంకాయలోని ఊర్ధ్వశిఖ (పీచు) జ్ఞానమనియు, కొబ్బరి మస్తిష్కమనియు, కన్నులు మూడు అఖండ జ్ఞానమగును. అనగా భూత భవిష్యత్ పంచకర్మేంద్రియముల దెల్పును. ఫలము = నారికేళము (బుద్ధి, జ్ఞానమునకు వర్త మానముల సాంకేతికములు. ఇందుండు జలము భావములకు ప్రతినిధిగను, కలశముంచు పంచ ధాన్యములు తన్మాత్రల భావనలు.
- ఆచమనము : విష్ణు స్మరణ వలన బాహ్యాభ్యంతర శుద్ధి కలుగునని రక్తమాంస, శల్యములలో గూడ గలిగిన ఆకాశమును గుర్తించుటకే “పుండరీకాక్ష’ యగును.
- ఆసనము : ఆకాశ పరీవృతమైన నేను తల్లి ఒడిలో నుంటినను భావము పరమాణువుగా సైతము పోకుండ (తల్లి – భూమి) తన ఆకర్షణచే కాపాడు చున్నది. గాన.
- యోగము : యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ సమాధియను ఎనిమిదింటిని యోగాంగములుగా చెప్పుదురు. యోగమన ఒక దానితో మరి యొకటి చేరుటయే అగును. యోగము లేక ఎట్టి జాగరికతా కార్యము కూడ నెరవేరుట లేదు! (ఇంద్రియములతో + విషయము కూడుట కూడ యోగమే) 2. మనస్సు + బుద్ధితో గూడుట యోగమే. 3. బుద్ధి + ఆత్మతో కూడుట యోగమే. 4. ప్రత్యగాత్మ + పరమాత్మ చేరుటయు యోగమే. కనుక పై జెప్పిన అష్టాంగములున్నూ, మనకు తెలియకనే ఒకదాని వెంట మరి యొకటిగా, ఒకేసారి సమిష్టిగా జరిగినప్పుడే సఫలమగు చున్నవి.
వీనిలో విషయేంద్రియ యోగమే కర్మము. జీవుడే యోగి.
ఎట్టి మహాయోగి గాని, మహేశ్వరుని హృదయమందు గల యోగీశ్వరితో,
యోగచ్యుతి గల్గిన ఏ అణువు గూడ నిలిచి యుండదు.
ఉదాః కర్మయోగము – ఆహారము తినుట
- యమము : భోజనమునకు ముందు చిత్తమును ఇతరముల నుండి వేరు చేయుట.
- నియమము : మడి, వడ్డన, క్రమముగా జరుపుకొనుట.
- ఆసనము : సుఖముగా పీటవైచి కూర్చుండుట (సుఖాసనము)
- ప్రాణాయామము : దీర్ఘము హ్రస్వముగాని (మంచి, చెడు గాని) శ్వాస 5. ప్రత్యాహారము : భోజనము తప్ప, ఇతర ఇంద్రియ వృత్తుల నిరోధించి యుండుట.
- ధారణ : తృప్తి, భోజనానంతరము, ఆకలికాకుండుట.
- సమాధి : పర్యవసానముగా క్షణికముగా సుఖమనుభవించుట. మనస్సు ఆజ్ఞా చక్రమును దాకి, మరలుచుండుటచే, ప్రతికర్మయు చేయగల్గుచున్నాము. కావున బుద్ధి యోగ ఫలముగా, చైతన్యమయ, మహాకాశమండల మందు (చిద్దగన మందు) అలవాటు పడిన వెనుకనే, సమాధియని ఎరుంగునది.
ఏకాదశ రుద్రులు : 5 కర్మేంద్రియములు + 5 జ్ఞానేంద్రియములు + మనస్సు. ఇవియే జనన మరణ రూప బంధ హేతువులగు (దుఃఖమును కలుగజేయు కర్తలు (రోద ఇతిరుద్ర) ఇట్లయ్యు ఇంద్రియములు, మనస్సు, నిద్రించిన సుషుప్తిలో నైనను ఆత్మసత్తా ననుభవింప నేరకున్నాము. అట్లే మనసుతో దేనిని విచారించుచున్నామో, ఇంద్రియములచే దేనిని గ్రహించు చున్నామో అది అంతయు సత్య, స్వరూపాత్మయొక్కపని అని గ్రహింప నేరకున్నాము.
- అష్టవసువులు : వీనినే ఐశ్వర్యములందురు. విశిష్ట సత్య మైనపుడు కలుగు గగుర్పాటు, కన్నీరు, వణుకు, గద్గదము, బహిర్లక్షణములు. కావున దేవకీ వసుదేవులుగాని, కౌసల్యా దశరథులుగాని, వీరల పూర్వజన్మలు వసువుల వని గాని, మనువు వని గాని చెప్పుట (తన్మయము పొందు పూర్వము భక్తుని లక్షణములు)
- ద్వాదశాదిత్యులు : అదితి నాశరహిత, ఈమెయే మూలప్రకృతి, త్రిగుణాత్మిక. ఈ అదితికి కల్గినవారు ద్వాదశాదిత్యులు. అనగా (మనస్సు + బుద్ధి + చిత్తము + అహంకారము) ప్రకృతి యందు కల్గినవి స్ఫురింపగా 4 x 3 = 12. ఆదిత్యులైరి. ఇందు సత్వగుణాధిక్యముగలది బుద్ధి. కావున మనస్సు హంశ జ్ఞానమే కర్మేంద్రియోన్ముఖ మైనపుడు (రుద్రుడు) దుఃఖము. ఈ హంశ జ్ఞానమే బుద్ధికి (మహత్తత్వమునకు) అభిముఖమైనపుడు సుఖదాయకము (అదిత్యుడు) అగును.
అదితి : దేవతల, రాక్షసుల (positioned negative faces)
- విశ్వదేవులు : ఈ చైతన్యము, విశ్వరూపమున విరాజిల్లుచున్నది. వీనిలో గల విశ్వదేవతా మూర్తులలో గూడ ‘నేను’ ఆత్మయే నిత్యము ప్రకాశించును. కాన మనకేది జగద్రూపముగా గోచరించునో అదియు సత్యమే. మన కింద్రియములచే తెలియబడునది కూడ సత్యమే.
‘నేను’ అవ్యక్త రూపము – ప్రపంచము వ్యక్త రూపము.
- మిత్రా + వరుణులు : మిత్రుడన సూర్యుడు. ద్వాదశాదిత్యుల లోని ప్రధానాంశమే అనగా అంతః కరణ యొక్క సత్యగుణ ప్రకాశమే సూర్యుడు. (మిత్రుడు). ధర్మమే మిత్రుడు. వరుణుడు జలాధి దేవత. జీవుని (మనస్సులో కోరికల ప్రతీక?) అనగా తనకు స్వతః లేని సంసార అధిబంధము కల్గించువాడు. ఈ మిత్రా వరుణులిర్వురు ‘నేను’ అను వానికి బంధకారకులు (ఉపదేశము నీట నుండగా చెప్పుటలోని అంతరార్థము) విమోచన కారకులు.
- ఇంద్రాగ్నులు : సుఖ + దుఃఖ స్వరూపులు. ఇంద్రుడు మోహముచే అగ్ని దాహజనకత్వముచే దుఃఖము కలిగించును.
- అశ్వినులు: ప్రాణాపానములను, గమన స్వభావము కలవారు.
- చంద్రుడు : మనస్సున కధిపతి. కామక్రోధాది వృత్తుల గెల్చునది. 15. (ఎ) త్వష్టా : చైతన్యమూలముగా ఈ విశ్వఘటనము, బహునామ రూపములు గలది.
(బి) పూషన్ : పుష్టిరూప చైతన్యము, దేహమును, మనస్సును పోషించునది
(సి) భగ ఈశ్వరత్వము, షడ్గుణేశ్వర్య సంపత్తి.
- కుమ్మరి, కుండ అను ఉపమానములో, నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండు కలవు. ఇక ‘నేను’ అను ఆత్మలో ఉభయ కారకత్వము ఆత్మదే కనుక ‘నేను’ ఒక్కటియే ఐనను అనేక భావములతో వెలయు చున్నది. చైతన్య స్వరూపాత్మనైన ‘నేను’ సర్వ కర్మ రూపముగాను, కర్మోపయోగ వస్తురూపముగాను, కర్మ సంస్కార రూపముగాను, కర్మఫలరూపముగాను వెలయు చున్నాను.
కావున టెంకాయ అను వస్తువుతో పని లేదు. కర్పూరము భాతి నిశ్శేషమగుటే యగునని తోచును. అమ్మ రాజమ్మగారి వద్దకు వెళ్ళినపుడు ఋజువు పరచి, వారి కద్వైత సిద్ధి కల్గించినది. నేను నేనైన నేను అనుటయు ఇదియే. పూర్వము నుండియు ఎట్లు లౌకికమున నుండియే ప్రారంభమై, సోపాన క్రమమున క్రమతః పారమార్థికమగు అజ్ఞానముగా పరిణతి చెంది, ఆధ్యాత్మికానుభవములు (అద్వైతానుభూతి నందుట) కాననగును.
మాతృదేవి యెడ విశ్వాసము, ప్రాచ్య, ప్రతీచీ దేశముల ప్రథమతః సామాన్యముగా వచ్చుట, సంఘ స్థితిలో క్షేత్ర ప్రాధాన్యము పరిగణింపబడుటయు, ఆర్యులు, అనార్యులు సహితము దేవీ పూజ చేయుచుండి రనుట శాక్తేయమునకు దోహదమొనర్చినది. వేదములు సహితము దేవీ సాంప్రదాయమును కొనియాడెను. అనాది నాగరీకులగు, సింధు, బెలూచిస్థాన్, పర్షియా, గ్రీసు, మెసపటేమియా సిసిలీ, బాల్కన్, ఈజిప్టువారు సహితము దైవమును మాతృమూర్తిగనే చెప్పుకొనిరి.
ప్రధమమున భూమాతను మాతృమూర్తిగను, ఆకాశమును తండ్రిగను వీరిరువురే తమ సంతతియగు సకల జీవరాశులకు సర్వము ప్రసాదింప గల్గి సుఖము – సంతోషము – పరాక్రమము – సంతానోత్పత్తి, దీర్ఘాయువుల నొసంగ గలవనుట, జపాన్, చైనాలలోని ‘షింటాఇసమ్ వోఇసమ్’ మతములవారు సహితము అంగీకరించిరి. ఇందు “ప్రేమ – హృదయ వైశాల్యము ఓర్పు” మాతృగుణములు గాను స్వీయ జాత్యాభివృద్ధి తొలుత ఆకాశమును పిమ్మట అందుండు సూర్యుని కొసంగబడినది.
ఐత్తిరీయములలో భూమాతను, ఉపనిషత్తులలోని ‘శ్రీ’తో సమపరచి, పురాణములలో ‘శక్తి’ యను నామకరణ మొనర్చుటచే పోషక కర్తృత్వము సర్వవ్యాపకత్వము, విష్ణువంశమగు ఆకాశమున అందుగల సూర్యుని యందారోపించి, శ్రీ, భూ, నీలల, దేవీ స్వరూపములుగా వైష్ణవ పాంచ రాత్రములలో చూపిరట.
పూర్వము శరదృతువులో జరుగు ‘బిల్వ పూజకును’ తదుపరి జరుగు ”నవపత్రి’ పూజకును మాతృదేవిని ‘శాకంభరి” (మూలికామాత) యనిరట. ఇట్టి స్వస్వరూపముల నుండి గ్రహించిన ఆహారమును (అన్నమును) ‘అన్నపూర్ణ’గను, వసంత ఋతువును ‘వాసంతి’గను, భూమినే (మధు = తేనె, నీరు, రసము) ఒసంగ గల్గుట (భ్రమరీ అనియు తదుపరి “అంబువాహి” (నదులు) అనుటలో వర్షాగమనమును, వయస్సు లొసంగుట సరస్వతి (నదిని) తదనంతరము (గంగ) ఈ నదులలో త్రిమూర్తులకు సంబంధము నెరపిరట. ఈ సరస్వతినే జపాన్, జావాలలో జ్ఞానవాహిని అనియు మన దేశమందు (బ్రహ్మ + సరస్వతి) అని యేర్పరచి, వారల సృష్టి కర్తృత్వములను, గంధర్వులీయమను తమ వాద్యముల మీద గానము సేయుట వల్ల ఈ యమకు ‘శిల్పము, విద్య, సంగీతములున్నూ, నిర్మలమైన (తెల్లని) విద్యా స్వరూపిణిగా తెలిపిరట.
గాయత్రీ రూపమున భూమి, సూర్యుడు వీని మధ్యగల ఆవరణ నుండి (భర్గస్ – Cosmos) అనంత శక్తి యున్నదనియు, త్రిసంధ్యల గాయత్రి, వైష్ణవి, సావిత్రి – సరస్వతులు (సరస్ = జ్యోతి) అనియు, తదనంతరము వీరికి హంస, నెమలి, మేక వాహనములనిరట. సింహము, వాహనముగా గల “మంజుశ్రీ, మహాసరస్వతి, ఆర్యవజ్రాసరస్వతి, వజ్రవీణ, వజ్రశారద రూపములు బౌద్ధుల ఆరాధ్య దైవతలైరట. వేదములలోని ‘శ్రీ’ని వైష్ణవ పాంచరాత్రములలో ఎర్రకమలము ”మీద ‘పద్మ’ అనుపేరు (అందము + ఆనందము + కలిమి) ఒసంగు పరదేవతగా చూపి. విష్ణువు నందన పాయి యనియు, సర్వ వ్యాపకత్వము, అనంత శక్తి నారోపించి ద్వంద్వ రహితము, ద్వంద్వ రూపముగా చెప్పిరట.
తదనంతరము రాత్రింబగళ్లు మన తల్లిదండ్రులుగను, భువనేశ్వరి అనియు, అంబిక, దుర్గ, ఉమ, రుద్రయోని యగుటయు – తపస్సు వలదు అనుట ‘ఉమ’ అనియు, తపస్సమయమున ఎండుటాకులనైన గొనకుంట ‘అపర్ణ’ అనియు అనిరట. ఇట్లు పార్వతి = ఉమ= మూలప్రకృతికాగా, శక్తి సర్వత్రా ఒక్కటియేగాన మాతృమూర్తియు (అన్నిరూపములలో నున్న శక్తి స్వరూపము లన్నియు) ఒక్కటియే, దీనిలోవే అని. ఇట్లు దేవీ స్వరూపములలోని 1. సప్త మాతృకలు, 2. నవ దుర్గలు, 3. పది మహావిద్యలు అన్నియు మాతృ స్వరూపమున ఆరాధ్యము
(ఇవి చరిత్రాంశములు)