(కీ.శే. రాజుపాలెం రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్ధమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహననను సరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెం శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
నేడు అనంత పద్మనాభవ్రత దినము. అనంతనామరూప భేదముల నలరారు ఆ పరాత్పరుని గూర్చిన సద్విషయములు ఇంతదనుక అచ్చటచ్చట వ్రాసుకొనినవి క్రమ బద్ధము చేయనిచ్చ జనించుట. ఇక మీదట సహితము ఎవ్వారుగాని, ఎచ్చోటగాని, ఏనామరూపములగాని కీర్తించి, గ్రహించి, అనుభూతులు చెందినదియు ఒకే ఒక సత్ పదార్థ వస్తువునే గదా? అట్లగుట హిందూ సాంప్రదాయానుసారము ఏదైవాంశను, ఏ పేరిట చెప్పుకొనినను, వారల నుపాసింపు తరి, వారలకే ప్రథమస్థానమొసంగుటయు, సర్వము ఆ దేవతా స్వరూపముగానే స్ఫురింప చేసుకొని సాకార సిద్ధి వడయుట జరిగినది. నిర్గుణ పరబ్రహ్మమును సాకారముగా ఆరాధన చేయు తరి రామకృష్ణాద్యవతారములుగా గాని, శైవ సంప్రదాయానుసారము పరమ శివ, గణేశ, సుబ్రమణ్యాద్యవతారము లుగాగాని, శక్తి పరముగా శ్రీ రాజరాజేశ్వరి, లలిత, బాలా, ఛిన్న మస్తకాద్యవ తారముల గాని, ఈ ఏకీభావమే స్పురించును. ఇట్లే “వాగర్ధా” అను కాళిదాస శ్లోకానుసారము నిర్గుణ పరబ్రహ్మ గూర్చిగాని, తన ప్రథమ స్పందనమగు శక్తిని గురించిగాని అభేద ప్రతిపత్తియు వివరించిరి. కావున అక్షర సముదాయము బాలురకు గరపుతరి, తొలుత పెద్ద అక్షరముల దిద్ద బెట్టి క్రమతః చిన్నవి చేసి కడపట కలము, కాగితముల మీద సన్నగా వ్రాయించునట్లు పూర్వమునుండియు వారి వారి యోగ్యతానుసారము, ఇష్టానిష్టములగు ద్వంద్వముల నాధారముగనే మొదలిట, ఏకత్వమునకే నడిపించుట సాంప్రదాయము. ఇట్లగుట తొలుత గల ‘స్త్రీ, పుం’లింగ భేదములు గుణ పరిమితములగు ‘నీ’ ‘నా’ భేదములు లేని స్థితి దేహాత్మ జ్ఞానము నశించినంతనే తొలగుటంజేసి, ‘సర్వమునీవే’ అని గాని లేక “సర్వము నేనే” అని గాని ప్రారంభించి, పర్యవసానమున ‘నీవు’ అనుటలో గ్రహించినది, అనుభూతి నందినది ‘నేను’ అనునది నశించి, సర్వము నీ స్వరూపమే అను విభూతి ననుభవించుటగాని (అభేదప్రతిపత్తి), ‘నేను’ అనుటలో ‘నీవు’ అను భేద బుద్దినశించి, ‘నేను’ అను అద్వైతభావమే మిగులుట గమనింప దగ్గది. ఇంత దనుక ప్రవచించిన శాస్త్రముల సర్వము నీవు అనిగాని, లేక ‘శ్రీరమణ’ ప్రవచించిన ‘నేను’ ఎవరు? అను ప్రశ్నోదయము. పర్యవసానమున ‘సర్వమునేను’ అను అద్వైత సిద్ధినే ఎరిగించుచున్నవి కదా! సాధకుల ఉపయోగార్ధమే ఇన్ని తెరంగులు చెప్పబడిన వనియే తెలుసు. సత్యమిట్లగుట ‘మీ మా’ మతములనియు, మీ మా దైవతములనియు వాదులాడుట ఎంత అసహజమో, అసంగతమో విదిత మగు చునే యున్నది. వాదులాడుట ‘మమత’ యున్నందునకే కదా? ఇది లేనినాడు. సర్వమతములు సామాన్యధర్మమునే ప్రతిపాదించి, నిత్యమైన ఒకే సత్యమును ప్రవచింపు చున్నవని తెలియును.
అట్లగుట ‘సర్వద్వంద్వములు’ తానయై, సర్వద్వంద్వములకు ఆధారము సహితము తానయై, పలువురకు తెలిసినా తెలియక పోయినా, నమ్మినా, నమ్మక పోయినా, చూచినా చూడకపోయినా ఒకే ఒక శక్తి గలదనియు, సర్వము తానే నిర్ణయానుసారము జరిపించు కొను చుండుననియు ‘ఎరిగించుటయే’ ఇందలి రచనోద్దేశ్వము.
కాని సూర్యుని, ఒక చిన్న దివ్వెతో చూప ప్రయత్నించి నటుల, ఈనా ప్రయత్నము అనాలోచితమని ఎరింగియు, నాకు కలిగిన ఊహలను తెలుసుకొన్నవి, తెలుపబడినవి, పెక్కులు గ్రథిత పరచుకొని యుండిన, పారాయణ కనువగుననియు, పలుకులు చూచుకున్నంత, ధారణారూపమగు ఆరాధనగా నోపు ననియు, మాత్రమే వ్రాసుకొనడమైనది.
ఏదేని పఠించునపుడు పఠించు పంక్తులుగాక, వీని గర్భితమగు భావమే ప్రధానమైనట్లు, ఇందుగల విషయానేకములన్నియు, ఇదివరలో సంస్కృత శ్లోక రూపమున అనేక ఉద్గ్రంథముల శాస్త్రరూపమున చెప్పబడినవే అగుట, వాటిని తిరిగి ఆ పరిభాషలోనే చెప్పుకొను ఉద్దేశ్యము లేమి పండిత ప్రకాండులు సహజముగా భేదములేకున్ననూ పండిత, పామరులను విభేదములలో, పామరుల శ్రేణికి చెందిన మాబోంట్లకుపయోగార్ధము సహజముగా మాటలాడుకొను గ్రామ్యములోనే వ్రాసుకొనడమైనది.
పండితులాది పామరుల వరకు సామాన్యముగా ‘స్వప్రయత్నమెంత వరకు సంగీతము’ సాధన చతుష్టయ సంపత్తి ఆవశ్యకమగుననుటయు సువిదితమే. కాని వారనుకొను ‘మానవ యత్నము కూడ దైవప్రేరితములే. ‘ఎచటనేనియు పౌరుషమెసగనేని, అదియు దైవయత్నంబు చూచె” అను భారత వచనానుసారము ‘సర్వద్వంద్వముల కాధారమైన ఆద్యశక్తియే’ జరుపుకొనునన్న విశ్వాసముండుటచే, తన్నుద్ధరించు కొనుటకు పాండిత్యమెంత వరకౌసరమగునను ప్రశ్నముదయించినంత, తొలుత జన్మరాహిత్య ముండవలె ననుకోర్కె పొడ సూప, దీని నెరుంగుటకై అనుభవజ్ఞులు అనుభవముల గ్రధిత పరిచిన ‘వేదాంతసాహిత్యము’ మొదలిడి, తనివి చెందక, ఎక్కువగా సాహిత్యావలోకనము చేయుచు, ఇందలి సారాంశముల సమన్వయము అగ్రాహ్యమగుట ‘సంశయములు’ పొడమి, సంశయ విచ్ఛిత్తికి మరీ ఎక్కుడుగా చదివి, చివరకు తాను ఎందులకు మొదలిడెనో ‘రాహిత్యము కొరకు” అనునది విస్మరించి సాహిత్యమును మాత్రము సాధించినవారై, తరుచు వేదికలపై ‘వేదాంత గోష్టియను’ సాహిత్యమును గూర్చి పలువురు, జనరంజకముగా ఉపన్యసించుచు, ఆర్జనాధారముల కూర్చుకొను చున్నారుగాని, తామెందులకు మొదలిడిలో ఆ రాహిత్యమెరుంగకుండుటయు చూచుచున్నారము కదా? మీదు మిక్కిలి వాదోపవాదములలో తమ ప్రతిభావిశేషము కొలదియగునను శంకచే ‘శేషం’ కోపేన పూరయేత్’ అనునట్లు ‘ఆగ్రహానురాలగుటయు’ చూచుచున్నారము.
పూర్ణాను భవము పొందినవారు ఎట్లు తమ తావు వీడక ఒకే చోట భౌతికమును స్థిరముగా నుంచి, తామనుగ్రహింప దలచిన వారల నెట్లు తమ వద్దకు ఆకర్షించుకొని, ఎట్లను గ్రహింపు చుండినదియు’ శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీసాయి, శ్రీరమణ మహర్షి మొదలగు వర్తమాన యుగ పురుషుల జీవితముల నుండి గ్రహించియే యున్నారము. ఇంతకు తక్కువ అనుభవము కలవారలు మాత్రమే తరచు తమ స్థానము వీడి ప్రయాణము లొనర్చుచు, తామనుకొను తమ విశిష్టత ప్రకటిత మొనర్చుకొనుచు, జనసామాన్యమునకు తమంతట తామే ప్రకటించుకొనుచు, బోధల నొసంగుచు శిష్య, ప్రశిష్యుల గ్రహించుటయు చూచుచున్నారము. దీనిని ‘రత్నముగల తావును రాజువెదకి కొని వచ్చునా? రాజును రత్నము వెదకి వచ్చునా? అను సామెత ఋజువు పరచును కదా? అట్లు తమ్ము తాముద్ధరించు కొననేరని వారు శిష్య, ప్రశిష్యుల చేర్చుట “కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులే కానని భంగి” అనునట్లు తాము అగాధములో పడుటయేగాక తమ్మనుసరింపువారల సహితము పడదోయుటగాక మరేమగును? సూర్యుడు ఉదయించినంత ఎల్లవారలు సూర్యోదయమైనదని గుర్తించుటయేగాని సూర్యుడు తనకు తానై ఉదయించినట్లు చెప్పుకొనుట లేదు కదా? ఈ సందర్భమున శ్రీరామకృష్ణ పరమహంస సెలవిచ్చినది స్ఫురించును. సాధకుడైనవాడు అనగా సాత్విక భక్తుడు, తన ప్రయత్నమితరులు కెరుక పడకుండ, ఏ అర్థరాత్రముననో ఒంటి, తన పడక మీదనే సాధనల చేయుచుండ, తరియగుడు, తన కనువగు గురూత్తముని “శివుడు గురు రూపమున వచ్చి చెప్పుకున్న” అన్నట్లు, భగవానుడే గురురూపమున అరుదెంచి సక్రమ పథమున పెట్టును గదా? బాహ్యమునకు తెల్పిన, మన కంటే ఏ కొలదిగనో ఎక్కువ గ్రంథ పరిచయము గలవారలు మనల, సులభముగా లోబరచుకొన గల్గుట. సరియైన మార్గదర్శకులు లభింపకున్నారలు.
ఇక ప్రకృతము అనంతుడన “అంతము లేనివాడు” అని కదా? ఆది యుండిన ప్రతి వస్తువునకు అంత్యముండి తీరవలె. కావున ఆది అంతములు లేని పురుషు నుండి, తన శక్తిని ‘ప్రకృతిని’ వేరు పరచలేముగాన’ ప్రకృతి పురుషు’ల నునవి రెండును అనాది’ యనిన బాగుండును. ఆది అంతములు లేనందుననే ‘ఆది ‘అమ్మ’ – ఆదెమ్మయగును దీనినే ‘తల్లి’యను పదమున కర మిచ్చునపుడు ‘తొల్లి’ కానోపుననుట, పురుష శబ్దములో అనంతుడుగును – అనంతులు – ఆది రహితులు – అనంతరూపములు – అనంతనామములు – అనంత లీలలు కలవారై యుండనోపుదురు. ఇట్టివి పారలౌకికములగుటయు, అనుభవైక వేద్యములే అగుటయు అభేద ప్రతిపత్తి, అద్వైతానుభూతికల్గునంతదనుక అగ్రాహ్యములు అగుట పలువురు పలువిధములుగా చెప్పుకొనినను, అనుభవము మాత్రమొక్కటి యే ఐనందునను, ఇవి ప్రకృతము ‘అమ్మ’ యెడ ఎంత వరకు సాధ్యములై, ప్రకటిత మగుచుండెనో ఎరుంగుటయే ఇందలి ప్రధానాంశము. సర్వము తానయై, తానే ఆధారమై, తన నిర్ణయానుసారమెట్లు జరిపించు కొనినది, జరిపించుచున్నది, జరుపనున్నది తెలియుటయే ప్రాముఖ్యము మరి యొక సారాంశముగా ‘సర్వము చెప్పుట కాదు – చేయుట’ ప్రధాన విషయమైనందున దీనంగల సూక్ష్మ ధర్మములు గ్రంథ చోదితములే యగుట’ అనుభవసార సంగ్రహమే యగును.
ఈ ప్రయత్నము ‘అమ్మ’ యన ‘అవతారమూర్తి’ యనునది తెలియపరుప బడి, సర్వమునకు ‘తానకర్తయై’ కార్యకారణముల నెరుంగ కుండినను, తన నిర్ణయాను సారమనుభవముల నెట్లొసంగు చుండినదియు కొంతమేర గ్రహించుకొన గలుగ చేసిన కృతకృత్యులైనట్లే. ఇందు తెలుపబడిన వానిలో నతిశయోక్తులను మంతయులేక అన్నియు ఈ యమగారి జీవితగాధ నుండి యే గ్రహించిన వగుడు. ‘ప్రతి అవతార పురుషుని జీవితము నందలి ప్రతిక్షణము – అనగా భౌతికధారణ మొదలు పతన పర్యంతము ఒకే సిద్ధి ప్రదర్శనమనిన సరియగును. ఇట్టివారలలో జీవన్ముక్తులైన వారలు, ఒక తెప్ప కొయ్యమాదిరి తమ్ముద్ధరించుకొని, మరియొకనినో, ఇద్దరినో ఉద్ధరింప గల్గియుంట, అవతార పురుషులన్న ఒక స్టీమరు మాదిరి అనేకుల నొకే పరి సంసారాబ్ధి నుండి గడు పం బెట్ట గల్గుటయు, వారి వారి స్వప్రయత్నములు లేకయే నిశ్చింతగా స్టీమరులో నెక్కి ‘తమ నెత్తిన గల ప్రారబ్ధమను బరువును, లోన చేరియు, తామే మోయుచున్నామను అజ్ఞానము వీడి క్రిందనుంచి మిన్న కుండిన (అనగా ఆత్మార్పణముగావించి) తమ ప్రారబ్ధ బాధితులుగాక, తాము సునాయాసముగా అవ్వలి గట్టు చేరగల్గుట విదితమగును. సర్వము తన నిర్ణయమైనందున (అట్టివారే) భారము వహింప గల్గియుండుటయు విదిత మగును.
ప్రపంచమునంగల మతములు, వాని ప్రబోధములు పేర ఉపోద్ఘాత రూపమున వ్రాసియుంట, ఆ విషయికములే ఈ యమగారి జీవితమునందెట్లు ఋజువు పరచు చున్నదియు తెలిపి, నేటిదనుక శక్తి స్తోమతలు గల్గికారణ జన్ములైన వారల అనుభవములే గ్రధిత పరిచిన ఉద్గ్రంధములగుట, చదివి, ఆనందించు చున్నారమేగాని, అట్టివి జీవితానుభవములో ఎట్లు ప్రయోగ పూర్వకముగా ఋజువు చేయు చున్నది ఇందలి విశేషము ‘చెప్పుట కాదు చేయుట.’
శ్రీ కైవల్య పదంబు చేరుటకునై……… ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులుసోక”
అను విభాగవతానుసారమైనందున, ప్రారంభోద్దేశ్యము మొదటిది. రెండువదానిలో గుణగణముల కీర్తించి, పారాయణ ఫలితము, కామ్యము కానేర కుండిన మోక్షమే ” అనుభవించుట, అనుభవింప జేయుట” ప్రధానము