1. Home
  2. Articles
  3. Viswajanani
  4. రాజుపాలెం శేషు చేసిన అమ్మకు అక్షర నైవేద్యం

రాజుపాలెం శేషు చేసిన అమ్మకు అక్షర నైవేద్యం

B Sunder Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : November
Issue Number : 4
Year : 2015

అమ్మ అమృతమాయి

అమ్మ అనంతకరుణామయి

అమ్మ నిరతాన్నదాత

అమ్మ నిత్యశుభప్రదాత !

అమ్మ చూపుల్లోని ప్రసన్నత

మన పాపాలను కడిగేస్తుంది.

అమ్మ ప్రేమ లోని ఆప్యాయత

అమ్మ ప్రేమ లోని ఆప్యాయత

అందర్నీ ప్రాంగణానికి పిలుస్తుంది 

అమ్మను గురించి –

ఆర్.వి. శేషగిరిరావు గారి “రాగబంధం”

అక్షరానికీ అమ్మకూ వున్న అనుబంధం.

“రాగబంధం” లోని ప్రతిపంక్తిలో

అమ్మ కురిపించిన అమృతం వుంది

అమ్మ మాటల్లోని మమకారం వుంది

అమ్మ చల్లనిచేతితో పెట్టే

అన్నం మెతుకులోని మెత్తదనం వుంది

అమ్మ కరస్పర్శలోని కొత్తదనం వుంది

‘రాగబంధం’ ప్రతిఅక్షరంలోనూ

అమ్మ ప్రేమలోని ఆత్మీయత వుంది.

ప్రతిపదంలోనూ

అమ్మ హృదయనాదం వుంది

ప్రతిపాదంలోనూ అమ్మపాదాల పారాణి వుంది.

ప్రతి అభివ్యక్తిలోనూ

రచయిత ఆత్మనివేదన వుంది

మానవాళి హృదయవేదన వుంది

 

మాతృప్రేమ తప్ప మరేమీ కనపడని

అమ్మ చల్లని చూపులోని

అనంత ఐశ్వర్య విభూతి వుంది.

ఆకలి తీర్చే అక్షయపాత్ర వుంది

రాయడం ఒక గొప్పకళ అరుదైన నైపుణ్యం

రాసేవాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు

గొప్పవాళ్ళంతా రాయలేరు

రాయకపోయినా గొప్ప వాళ్ళున్నారు.

రాసింది చిన్ని పుస్తకమే కావచ్చు

అందులో లోకం ప్రతిఫలించాలి

అందులో మహనీయుల మూర్తిమత్వం ప్రతిబింబించాలి!

శేషగిరిరావుగారు చేసింది.

గొప్ప అక్షర యజ్ఞం

ఇచ్చింది ప్రపంచమంత జ్ఞానం !

ఏ పేజీ తిప్పినా 

కరుణామృతసాగరంలో మునిగినట్లుంది.

ఏ అక్షరం తడిమినా

ప్రేమాన్విత స్పర్శానందం ముంచి వేస్తుంది.

చందన తరువు నీడన సేదతీరినట్లుంది.

నిండుపున్నమి వెన్నెల్లో విహరించినట్లుంది.

పండివాలని ఫలవృక్షం తీయని ఫలాలు ఆరగించినట్లుంది

 

నిజమే!

సృష్టిలో మానవజగత్తు మహాజగత్తు రెండేవున్నాయి

మానవజగత్తును ఆవరించిందే మహాజగత్తు

ఇహాన్ని ప్రక్కన పెట్టి

అహాన్ని ఆవలకు నెట్టి

మనోనేత్రాన్ని విప్పార్చుకుంటే

మహాజగత్తు సాక్షాత్కరిస్తుంది.

 

మనల్ని అంధత్వం నించి

బధిరత్వం నించి విముక్తం చేయడానికి

ఆధ్యాత్మిక లోకం వాకిళ్ళు తెరిచే వుంటాయి

మనల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ వుంటాయి

 

జనం ఎక్కడ నిద్రపోతున్నారో

శేషగిరిరావుగారు అక్కడే మేలుకున్నారు.

అమ్మ ఆశీస్సులతో

మనకు అభయముద్రవేసిన “రాగబంధం”

బతుకుపూదోటలోనికి పిలిచి

సంస్కార సుగంధాన్ని మనపై విరజిమ్ముతుంది 

 

దేవాలయగోపురం మీద వున్న గుడ్లగూబ

లోకాన్ని చూస్తుంది

దేవుణ్ణి చూడలేదు

ఒంటె ఎడారిలో వున్నా

ఒయాసిస్సులో నీళ్ళు తాగలేదు

నీళ్ళలో ఈదే చేప

సముద్రవైశాల్యాన్ని తెలుసుకోలేదు.

మానవుడూ అంతే !

వీడో మరగుజ్జు.

స్మృతులూ, శ్రుతులూ బిగమాలు, శాస్త్రాలూ

ఉపనిషత్తులు, ఉపన్యాసాలూ

కళలూ, సాహిత్యం

అన్నీ మనకోసమే !

మనల్ని సంస్కరించడం కోసమే!

నెమలికి వేయికళ్ళున్నా

పురి విప్పిన పింఛాన్ని తను చూడలేదు

చుట్టూ జ్ఞానప్రపంచం వున్నా

మానవుడు ఈ ప్రపంచాన్ని తెలుసుకోలేడు.

దీపం తన క్రింద చీకటిని తొలగించుకోనట్లే

మానవుడు తన అజ్ఞానాన్ని తరమలేకపోతున్నాడు

లోకం ఇంతే !

మన శోకం ఇంతే !

ఎదురుగా అద్దం వున్నా

మనల్ని మనం చూచుకోలేనపుడు

“రాగబంధం” ఓ వెలుగురేఖలా కన్పించింది.

రాజవీధిలో వెళ్లే రథంలా మార్గం చూపించింది.

చివరిపేజీ చివరి వాక్యం ముగియగానే

అమ్మ పాదాల వద్ద ఒరిగిపోవాల్సిందే!

అనుభూతి స్వర్గంలో కరిగిపోవాల్సిందే!

రవీంద్రగారూ !

శేషగిరిరావుగారిని విశ్వకవి రవీంద్రుడు ఆవహించాడు

కవిత్వమధుమాసాన్ని తెచ్చి

మనముందుకుప్పలు పోశారు

భగవంతుని కోసం వెతకడం ఎందుకు?

శేషగిరిరావుగారే ఒక తర్జనిగా మారి

జిల్లెళ్ళమూడికి దారిచూపించారు

దారి తప్పిన వాళ్ళందరికీ

“అమ్మ” అంతిమగమ్యాన్ని చూపిస్తుంది

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!