1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘ రాజుపాలెపు’ డైరీల నుండి (అవతార సమయములు)

‘ రాజుపాలెపు’ డైరీల నుండి (అవతార సమయములు)

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : October
Issue Number : 4
Year : 2008

(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

శ్రీ రామకృష్ణ పరమహంస :

ఇట్లే హూణులు మన దేశమును జయించుటకు పూర్వము, మహమ్మదీయులు జయించి, వీరిరువురు తమ తమ ప్రచారములు ఎందరిని, తమ తమ మతములలోనికి మార్చుకొనినదియు ఎల్లరెరింగినదే కదా! అట్టితరి హిందూమత ప్రాశస్త్యమును చూసిగాని, వారిని నిల్వరించు యోగ్యులు లేనందున, వేద సమ్మతమైన మతముగానే ‘ఏకేశ్వరోపాసన’ ప్రాధాన్యముగా గల ‘బ్రహ్మ సమాజము ఆర్య సమాజము’, అనునవి స్థాపింపబడుటయు ఎరింగి యున్నారము. అప్పటికీ విద్యాలంకారులైన ‘ఈశ్వర చంద్ర విద్యాసాగర్’ మున్నగు గొప్ప పండిత ప్రకాండులే పై మతములు విజృంభణము నెదుర్కొన జాలని సమయమున, శ్రీ రామకృష్ణ పరమహంస ‘గదాధరు’ పేరట ఒక కుగ్రామములో నుద్భవించి, దక్షిణేశ్వర కేంద్రముగ ఎందరినో దైవ నియోజితులు శిష్యులుగా గైకొని, తాము స్వయముగా అన్ని మతములలోని ధర్మములు పాటించి, ఆచరించి, గమ్యము చేరగల్గి, చివరకు ‘ఒకే గమ్యస్థానము చేరుటకై గల అనేక మార్గము లీమతములు’ అని సర్వమత సమ్మేళనము తెల్పుటయు, అసత్యమయ్యెను కదా! ఇట్టి వానిని పరికించిన ‘గ్లాని’ యెట్టిదో ‘యుగేయుగే’ అనగా నేమో కొంత వరకు గోచరమగును. వీరు పలుపుర శిష్యుల చేకొని, మన దేశముననే గాక, ఖండాంతర దేశముల ‘హిందూమత ప్రాశస్త్యము నెట్లు చాటింపించినదియు అందరమెరింగియే యున్నారము. వీరి శిష్యులెల్లరు సన్యాసాశ్రమము స్వీకరించిన, గొప్ప మత యోధులగుట నిక్కము.

(వీరిని అవతారముగా చెప్పుకొనుట కద్దు కదా?)

శ్రీ సాయిబాబా: 

ఇట్లే హిందూ, మహమ్మదీయులు, వారివారి మత ప్రాశస్త్యముగ్గడించు కొనుట, అంతః కలహములు చెలరేగుచున్నతరి, శ్రీసాయిబాబా ‘షిర్డీ’ యందవతరించి, ఇరువుర నెట్లు తన ‘ద్వారకామాయి’ అను పాడుబడ్డ మశీదు నందు చేర్చి, ఇరుతెరంగుల వారిచే, వారి వారి మతానుసారము, ప్రార్థనల సల్పించి అనుభవముల నెరింగించ, సోదర న్యాయమును బోధించినదియు ఎరిగియున్నారు. వీరు ‘సన్యాసి’ యయ్యు, తమ శిష్యుల సన్యాసాశ్రమము స్వీకరింప చేయలేదు తాము తన యందు “శివ, రామ, కృష్ణ, మారుతి, దత్త మొదలగు సాకారముల జూపుటయు విని యున్నారము. (వీరిని సహితము అవతారమూర్తి యనిరి) 

భగవాన్ రమణ మహర్షి :

వీరును అట్లే అవతరించి ప్రాక్, పశ్చిమ వాసుల పెక్కండ్ర ఖండాంతరముల నుండియు ఆకర్షించి, అన్ని మతముల గల సామరస్యము నెరిగించి జీవునికి, పరమాత్మకు గల అవినాభావ మెరుంగుటయే ముఖ్యమని ప్రవచించిరి గదా! పై నుదహరించిన పురుషులు “సహజ సమాధి” అననేమో అనుభవించియుండినను, శ్రీవారలకొక్కరికే “సహజ సమాధి” స్థిరత్వ మొసంగి యుండుట కూడ గమనించి యున్నారము. (వీరు కుమారస్వామి అవతారమని ప్రతీతి) 

ఉపాసిని బాబా :

వీరు ‘సాయి’ శిష్యులలో అగ్రగణ్యుడగుననిన, వీరిని కూడా ఒక అవతార పురుషునిగా భావింపు చున్నారు కదా! వీరిని ‘సాయి’ తన వద్ద 4 సం||లు ఉండవలసిన దనియు, తనంత వానిని చేసెదనని చెప్పుటయు, వారట్లు చేయనేరక గడువుదాటుటకు పూర్వమే 5, 6 మాసముల ముందుగనే వెడలి యుండుటయు విని యున్నారము. వీరు మధురభక్తి కన్యలకు మాత్రమే సుకరమగునని యెంచి, కన్యల ప్రథమమున శ్రీకృష్ణ పరమాత్మునకుద్వాహమొనర్చుటయు, పిదప తామే ఉద్వాహ మగుటయు, దాని ఫలితముల సహితము విని యున్నారము.

-(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!