(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు. అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
“ఇంతకు వీరి చేరు వారు ధన్యులు”
‘అమ్మ’ యన నెవ్వరో స్వయముగా అనుభవము చేయజాలరనియు, తదితరులకు సామాన్య స్త్రీ వలెనో, కొంత శక్తిగల సాధకురాలుగనో, ఎట్లో వారి వారి మానసిక పరివర్తన, కొలతల ప్రకారము పొడసూపు చుండును. నేటికిని ‘ఆమె’ సామాన్య స్త్రీ కంటే తక్కువేయగునని ఎంచువారును కలరనిన, అమ్మ స్వస్వరూపము తెలియపరచుట లేదనుట నిర్వివాదాంశము.
ఐన ఇంత దనుక ఎవ్వరేని గ్రహించిన వారలు కలరా? అనుసంశయము పొడము సహజము – శ్రీ రమణమహర్షి
- తండ్రి పూజలు సేయుట.
- బామ్మ అవసాన సమయమున, అనేకమార్లు ‘నీవు అమ్మవే’ అనుట.
అమ్మ 1936-37లో పుట్టినింట నుండుతరి పొన్నూరులో గల “అమెరికన్ మిషనరీలు” లావుపాటి దొరసాని ఒకరు, కత్తిరింప బడిన జుత్తుగల సన్నని ఆమె ఒకరు, వీరిరువురు తిరువణ్ణామలై వెళ్లుచు అమ్మను కూడ తమవెంట గొంపోయిరట. అప్పుడు స్వామి వారికి అమ్మ “దేవి” స్వరూపములో తన్నుకుమారునిగా ఎత్తుకొని, వెంట ఒక పెద్ద పాముతో సహా ‘ఉన్నట్లు దర్శనమొసంగిట ఆ దర్శనమైన పిదపనే తనకు భౌతిక దేహమొసంగిన తల్లిగాను సిద్ధిపొందు సమయమున, కరస్పర్శచే జ్ఞానమొసంగి, వారి సమాధిపై “మాతృ భూతేశ్వరుని” ప్రతిష్టించి ఆలయమేర్పరచిరట. దీనిలోని అంతరార్థము తన ‘అమ్మ’యగు మాతృ భూతేశ్వరి యనియు, భౌతికము నొసంగిన తల్లియు కారణమయ్యెనట. అమ్మయన నెవ్వరో అమ్మకును తమకు గల సంబంధమును స్వయముగా గ్రహించి యుండుటయేగాక, స్వయముగా ప్రత్యక్షముగా చూచుటయు తటస్థించెగదా! అమ్మ అందువల్లనే భగవాన్ వారి ప్రసంగమొచ్చి నపుడెల్లను ‘నా బిడ్డడు’ అను సంభోదనలు విని యున్నారము.
- శ్రీ మౌన స్వామి (కుర్తాల పీఠాధిపతి) : చీరాలలో వారికై ప్రత్యేకముగా కట్టించబడిన డాబాలో యుండగా, అర్థరాత్రి సుమారు 12గం.ల సమయములో తలుపు తట్టగా, తెరచి, అమ్మను చూచినంతనే తానుపాసించు రాజరాజేశ్వరి దేవి రూపములో నగుపించ వారెన్నియో సంవత్సరములనుండి, అనుసరించుచున్న మౌనము వీడి ‘అమ్మా! నీవా?’ అనుటయే గాక, కొంత మాట్లాడుటయు జూడ ఏమనుకొనవలయును. శ్రీవారు తమ ఆశ్రమమందు 11 గురు దేవతా ప్రతిష్ఠలు జరిపించి, గొప్ప మంత్రసిద్ధులని పేర్వడసిన వారు కదా? వీరి ఉపాస్యదైవము ‘శ్రీ రాజరాజేశ్వరి’ యని ఎల్లరెరింగినదే.
ఇంతదనుకు అమ్మ నెవ్వారలనైన అనుగ్రహించిరా? అనునది మరియొక ప్రశ్న. శ్రీ కల్యాణానంద సరస్వతీ స్వాముల దర్శన సమయమున శ్రీవారికి, బాలగనో, రాజరాజేశ్వరిగానో తోచుటయు శ్రీరాజమ్మ బామ్మగారికి కాశీ అన్నపూర్ణగానోపుననియు తోచుట చేతను, ఇక అమ్మ జీవిత విశేషములలో తెలుపబడు 1. ఆండాళం 2. నాగలక్ష్మి 3. శారద 4. శకుంతల 5. మౌలాలీ 6. రహిమాన్ 7. మోసీను – జాకోబు 8. నల్లి 9. దుర్గ – సీత పలు సందర్భములలో సీతగానో, తులసిగానో, జ్యోతిర్మూర్తిగానో, క్రీస్తుగానో అగుపడి వారి నాశీర్వదించి మనదేశంలో అచ్చటచ్చట నిల్పియు, ఖండాంతరములను అమెరికా, స్వీడన్, టర్కీ మొదలయిన దేశముల నుంచి తమ విధానము నెట్లు నెరవేరు చుండినదియు గ్రహింపనగును. ఇక రాబోవు కాలములో ఎచ్చటెచ్చటనో తప మొనర్చుచు సతము సుక్ష్మానుసంధానము చేయుచున్న వారలు పెక్కురు వచ్చుట కూడ తటస్థించిననేగాని, మన బోంట్లము నిజమెరుంగ నేరము.
అమ్మ జననము 1923 ఐనను శ్రీ బెల్లంకొండ రామారావుగారు 1918లో మద్రాసు చికిత్సకై పోవుతురి తెనాలి సత్రములో విడిసియున్నప్పుడు, ఈ యమ వారితో జరిపిన సంభాషణలు గమనించియు, తన స్వకీయ అవతారమే ఐనందున బ్రహ్మానంద సరస్వతీ వారల మంగళగిరిలో అనగా ఈ జన్మకు పూర్వమే కలిసికొని యుంటినని తెలుపుటయు, శ్రీవారు అవసానదశ సంప్రాప్తమగుడు కాశికేగనెంచి, తొలుత మంగళగిరి వెళ్లి ‘లక్ష్మి’ నృహసింహదర్శనము గావించుకొని కాశికేగనెంచి భౌతికము చాలించుటయు వినినారము. బహుశః శైవ సంప్రదాయములో మృత్యంజయమెట్లో, వైష్ణవ సంప్రదాయములో లక్ష్మీ నారసింహయై యుండనోపునని తోచెడిది. శ్రీ ఆదిశంకరలు కాళ్లు చేతులు దహనమైనతరి “లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్” అను మకుటముతో ప్రార్థించుటయు స్వస్థత చేకూరుటయు మనము విని యున్నారము కదా! అట్లే ఈ స్వామి వారును, భౌతికము వదలు సమయమాసన్నమగుట ఎరింగి తొలుత మంగళగిరి వెళ్లిగానీ కాశీ వెళ్ల లేదు, ఈ సమయముననే గుంటూరు దత్తు స్నేహితులతో సహా బాలాంబగారి సత్రమున ఉన్నప్పుడు ‘అమ్మ’ తనను చూచిన జ్ఞాపకమని చెప్పుట విని ఆశ్చర్యపడుట. ఈ రెండు విషయములను ‘అమ్మ’ ప్రస్తుత జన్మకు రాకముందు జరిగియుండుటచే ఈ యమగారికి పూర్వ, పర జన్మల విషయము తెలిసియుండనోపునను అనుమానముత్పన్న మగుట. ఇక పై స్వాములవారికి ‘ఖండ విద్య’ అని గాని ‘విశల్యకరణి’ అనిగాని పిలువబడు విద్య తెలిసియుండెనని ప్రతీతి. ఇట్టిది “సాయిబాబా” “గుంటూరు కాలామస్తాన్ ర”లు ప్రదర్శింపగల్గిరని వినియుంటిమి. వారి ఖండముల జూచి పలువురు సంభ్రమాశ్చర్యముల నంది పలువుర పిలుచులోవున యథాతధముగా నుండిరని వినియున్నారము..
ఇక అందరెరింగినవి అమ్మ ‘భృకుటి’ ‘శిరస్సు’ చిట్లి అనగా బ్రహ్మరంధ్ర భేదనమై యుండుట. అట్లు చిట్లగా వెలువడిన రక్తము తన బొటనవ్రేలితో నొక్కగా, భస్మరూపమగుటయు, దానిని ప్రసాదముగా తమ భర్త కిడుటయు వినియున్నారము. ఇవి ఒక మారుగాక పలుమార్లు జరుగుటయు కూడా విని యున్నారము. ఇట్లు జరుగుటకెట్టి వారలకు సాధ్యమగుననునది శ్రీ మిన్నెకంటి గురునాధ శర్మగారు వ్రాసిన దానిని బట్టి, ఒక్క కావ్య కంఠ గణపతి శాస్త్రిగారలకే వశమయ్యెనని చెప్పియుండిరి కదా! ఇక ప్రసాదరావుగారు, (శ్రీ ప్రసాదరాయ కులపతి, ప్రస్తుతము కుర్తాల పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి) అది తమ ఉపాస్యదైవమగు ‘చిన్న మస్తకీదేవి యైననేవలను పడునని గ్రహించి, ఇచటికి వచ్చినతరి. అమ్మ జ్యోతి స్వరూపమును అందుండి చండ చండీరూపము చూచితిమని వర్ణించి యుండిరి కదా? తొలుత ఇట్లు జరిగిన ప్రమాద సూచకమగునని యెంచి, అమ్మగారి వినమామగారైన శ్రీ పులిపాక చలపతిరావుగారు బి.ఏ.బి.ఎల్.గారును తదితరులును సాక్ష్యమొసంగు చున్నారు. కదా?
మరి యొకపరి తన మరది ‘లోకనాధం’గారి వివాహ సమయమున, గుంటూరులో, ఒక పెద్ద గంగాళమును క్రింద నుండి మేడపైకి చేర్చుట ఎట్టులో యనుకొనుచుండ, ఈ యమగారప్పటికే ‘ఆహారము’ విసర్జించి యుండియు, ఆమెగారొక్కరే సునాయాసముగా మేడపైకి చేర్పగల్గియుంటయు, శ్రీ చలపతిరావుగారు ప్రత్యక్షముగా చూచియే యుండిరి కదా! ఇట్టివి ఆమె యెడ బహుస్వల్పమయ్యును, అప్పుడప్పుడు కనబరచుచున్నను, బంధువర్గములో చాలామందిలో ఎవ్వారలకైన అమ్మ ఎవ్వరై యుండనోపుదురో యను యనుమానమైనను కల్గకుండుట జూచి, తొల్లి శ్రీ కృష్ణుడు తన ముఖ గహ్వరమున, సకల బ్రహ్మాండముల యశోదకు జూపి, విశ్రాంతి చెందియుండ, వెంటనే తన మాయావివశను చేసిన రీతి, ఈమెయు వారల తన మాయా వివశుల చేయుట తక్కమరేముండును.
ఈ సందర్భముననే లోకనాధముగారి వివాహము ముగించుకొని 49 ఆగస్టు 15న ఇంటికి తరలు సమయమున, అందరు రైలుబండి కొరకు స్టేషన్ వద్ద యున్నతరి, ఎచటనుండియో ఒక యోగి “చిరుతల తనముఖమున పుండగు నంతవరకు కొట్టుకొనుచు వచ్చి “అమ్మా! మీరుపోవు పని మంచిది. ఇక మీదట మీరు బయట పడవలసిన సమయమాసన్నమైనది “అని చెప్పుట, పలువురు ఆ గ్రామవాసులుండి వినియు, మరచియుండుట జూడ. ఈయమగారు, వారల తన మాయావృత్తుల జేయుటగాక మరియేమి? వీరే తొలుత బామ్మగారికి “జిల్లెళ్లమూడిలో స్తలనిర్దేశము చూపినవారు” ఈ వచ్చినపిదప రెండు మూడు దినములైన పిదపనేకదా అమ్మ శ్రీరాజమ్మ బామ్మగారిని దర్శించుట. బామ్మగారికి అమ్మకు జరిగిన సంభాషణ జీవిత ఘట్టములలో, పొందుపరుపబడినది. బామ్మగారు ‘అమ్మ’ను ఇతరుల కుపదేశింపనాజ్ఞాపింప, అట్టిది అప్పటి సాధ్యపడజాలదనియు, తన 33వ సంవత్సరము పూర్తి యగుడు జరుగునేమో యనుటయు, సర్వజ్ఞత్వముకాక మరియేమి? అటులనే గదా ఎవ్వరేని అమ్మదరిజేరుట, వినుట, ఉపదేశములొందుట తటస్థించినది. ఇంకను పంచామృత సాక్షిగా తామనుభవించు ఆనందమితరులచే పొందింప సమర్థత కల్గిననే, ఉపదేశమిడుటయు చూడ అమ్మ ఉపదేశమిడిన వారలనే కొంతయులేక వారల బాధ్యత అమ్మయే స్వీకరించెనని ఎరుంగునది.
ఒక పర్యాయము అమ్మ చెప్పినట్లు ‘సాంప్రదాయ గురువులు శిష్యులచే ‘గురుబ్రహ్మ’ యను శ్లోకము చెప్పించి, తాము బ్రహ్మ విష్ణు, మహేశ్వరగాని మీ పర్యవసానమగు ‘సాక్షాత్పరబ్రహ్మస్వరూపము కానందుననే కదా రామ, కృష్ణ, బాల మొదలగు ఇతర దేవతల మంత్రము లొసంగుట? కానిచో పరబ్రహ్మ స్వరూపులుగు, గురువులు, తమయందే, శిష్యుని ఇష్టదేవతామూర్తుల చూపజాలి యుందురు కదా? ఇందుకు తార్కాణముగా శ్రీ సాయినాధుని దర్శించిన భక్తులలో పెక్కురికి తనలో ‘గణేశ, శివ, రామ, కృష్ణ, దత్త, మారుతి’ ఇత్యాది సాకార రూపముల జూసియుంటిరని వినియున్నారము కదా? అట్లు సాకారముల చూప కున్నను, బ్రహ్మ పదార్దమెట్టిదియో ఎరుకపరచి, అనుభవింపజేయ గల్గుదురు కదా? ఇట్లగుడు ‘అమ్మ’ దరిజేరు వారలకు వారి వారి సంస్కారానుసారము, సమయమగుడు ‘నివృత్తి’ నొసంగ జాలియుంట నిర్వివాదాంశము.
అమ్మ తన యందే 1. తులసి – బీహారుపిల్ల విషయమునను 2. ‘సీత’ యగుట శ్యామల విధానములోను 3. ‘అన్నపూర్ణ యగుట రాజమ్మగారి వద్దను 4. కృష్ణుడగుట నాగమణి విషయమునను 5. రాజరాజేశ్వరియగుట కల్యాణానంద మౌనస్వామి విషయమునను కనపరచినది గ్రహించి యున్నారు.
తిరుత్తణి యందు సర్పాకారము దాల్చి, శిలగా మార్చుకొనుట మొదలైనవి వినియుంట, ఇప్పుడును శక్తి పంచాయతన మను పేర, దేవాలయము నిర్మింపజేయుచు, పూర్తియగుడు ఏమి చేయసంకల్పించుకొనినది ఊహించినపుడు ‘భయము – దిగులు కల్గును. పూర్వము “రామలింగస్వామి, రామతీర్థ” తమ భౌతికముల, పంచభూతములలో వేరే నొకదానియందు లయ మొనర్చుట వినియున్నందున ఏమగునోయను అనుమానము తోపక తప్పదు.