(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము
– ఎడిటర్)
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా……
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే”
పై శ్లోకమును ప్రస్థాన త్రయములోని బ్రహ్మసూత్ర, ఉపనిషత్, గీత భగవద్గీత నుండి, పలువురు తరుచు కనుపరుచు చుండెడి ప్రామాణ్యము. అందుచే ప్రస్తుతము పై శ్లోకము నందలి ‘గ్లాని’, ‘యుగేయుగే’ అను పదములు కొంత విచారింప వలసి యుండును. ‘గ్లాని’ అన ‘అపకారము’ ‘హాని’ అని మొదట ఏర్పడిన అర్ధమునే సరీగా స్ఫురింపజేయు చున్నట్లు తోచదు. కాలక్రమేణా ప్రాముఖ్య విషయములకు స్వస్తి చెప్పి, బాహ్యాడంబరములగు ‘ఆచారవ్యవహారములే” ధర్మమున కర్ధముగా తోచియుండ వచ్చును. ఇట్టిది ప్రాధాన్యమైన పోషక పదార్ధము వదలి, పొట్టును మాత్రమే స్వీకరించి నట్లగుట, ముఖ్యోద్దేశ్యము వదలి బాహ్యేంద్రియాచరణాత్ గూడిన కర్మ ఆచార నామములో మిగిలిన జుట్టు, కట్టులనే మిగులుటయు, ఇవి నిజమైన ధర్మమను పదమునకు దూరమై నందునను, ఎప్పటికప్పుడు ఏదో సద్యో అవతారములు వచ్చి, ప్రాముఖ్యములు స్థిరపరచి యుండవచ్చును. ‘యుగేయుగే’ అనుటలో ప్రతి కొన్ని కోట్ల వత్సరములని తోచుటలేదు. ఇది కాల పరిణామమునకు పెట్టిన పేరై ఉండనోపును. మనలో ప్రతిక్షణమును పరివర్తన జరుగుచునే ఉన్నందున ఉదాహరణకు మన మొక పుస్తకములోని ఒక పేరా మొదలిడి దానిని ముగించుసరికి, మనము మొదలు పెట్టినప్పటి దశకును, ముగించునప్పటికి గల దశకును వ్యత్యాస మెంతో యుండవచ్చును. ఈ క్షణములో మనలోని మార్పులను మనము గమనించి యుండనేరము. కాలప్రవాహములో మనము బ్రహ్మాండములోని గోళములన్నియు ఎంత వేగముగా గమనము చేయుచున్నవో, అంత వేగముగా పరివర్తనము చెందుచున్నారము. అందుచే యుగే యుగే అనుటలో ఎప్పుడెప్పుడు అవసరమగునో అప్పుడెల్లను అనితోచును.
అందుచే పురాణ యుగముల నాటి రామ, కృష్ణా దృవతారముల గూర్చి పఠించి, పరిశీలించి, విమర్శించు కొనుటకు, తగినంత మంది, పురాణేతి హాసములలో పెక్కింటిని వక్కాణించి యున్నందున, వాటిని గురించి చెప్పుకొనుట చర్విత చర్వణ మగుట అగత్యముగా తోచదు. వారిలో కూడా సద్యో అవతారములని, వారు ప్రత్యేకించి ఏదో ఒక పని నిమిత్త మావిర్భవించి, అది నెరవేరగనే ఉపసంహరింపబడిన వనియు విందుము. ఈ పరిణామము అనవరతము ఎల్లెడల జరుగుచునే యున్నను ఇట్టి ఆవిర్భావములు పెక్కు మందిచే గ్రహింప గల్గునంతదను పెక్కు కాల ముండిననే, అవతార మూర్తిని, అవతార ప్రయోజనమును గమనింపు చున్నారము. అందుచే పూర్వము నుండియు, అనితరసాధ్యమైన మహత్తర కార్యములు నెరవేర్చి, మానవాతీత గుణగణములు, శక్తి స్తోమతలు కలవారల నెల్ల అవతారముగా చెప్పుకొనుట పరిపాటియైనది. అందున పరమేశ్వరుని అంశయుండిననే తప్ప వారి కట్టివి సాధ్యపడవు కదా! కావున ముక్తి పదార్థమెరిగి ప్రకృతి బద్దులు, గుణబద్ధులు కాక సామాన్య, మానవులకు దుష్కరములని తోచు పనులు నెరవేర్చిన వారల నందర ‘అవతార మూర్తులని చెప్పుకొనుటయు విని యున్నారు”.
శ్రీ ఆదిశంకరులు:
మనము నవీన వర్తమాన యుగములో ‘ఆదిశంకరులను’ ‘శివాంశ’ సంభూతుడని చెప్పుకొనుచున్నాము కదా! ఎందువలన? వారు (జన్మించిన అవతరించిన కాలమును, అప్పటి పరిస్థితులను గమనించిన అవతారమేల ఔసరమో తెలిసికొని, ఏ ప్రయోజనము సాధించెనో తెలుసుకొనుచున్నాము. వారు జన్మించిన కాలము నాటికి, మన దేశమున ‘షణ్మతముల’ పేరిట, ప్రప్రథమమున మత ప్రవక్తలు, స్థాపకులు ఉద్దేశించిన, పథము వీడి బాహ్యమున పెక్కు మార్గములుగా అక్రమార్ధమును గూర్చి ప్రచారములు సలుపుచు, పలుమార్లు కయ్యములకు దిగుచుండి రనియు, దీనిని బాసటగా గొని కొంతమంది రాజులును, ఏదేనొక పక్షము పూని, తరచు మతము పేరిట యుద్ధములు జరిపించి, జననాశన మొనర్చినదియు, బలాత్కరించి మతముల నంగీకరింప జేయుటయు ఎరుంగుదుము కదా! అట్టి యెడ శ్రీ ఆదిశంకరులుద్భవించి, తనకు 32 సంవత్సరములు పూర్తియగు లోపుననే దేశదిగ్విజయ యాత్ర సాగించి, పలువురు పండితుల నోడించి, తమ శిష్యులుగా గైకొని, అద్వైత మత స్థాపన చేయుటయు, ఆ పిన్న వయస్సుననే బహు భాష్యముల వ్రాసి, అనేకములైన సాకార దైవముల యెడ స్తోత్రము లొనర్చి మత స్థాపన మొనర్చి, మన భారతదేశములోని, నాల్గు మూలల పీఠముల స్థాపించుటయు అందరము వినియున్నారము కదా!
(సశేషం)