ఈ మధ్య రవి, నేను మాట్లాడుకొనేటప్పుడు “అంతకాలం క్రితమే మాష్టరుగారికి (రవి మా నాన్నగారిని అలానే అంటాడు) ఇవన్నీ డైరీలుగా వ్రాసుకోవాలనీ, భవిష్యత్తులో ఇవి అవసరమవుతాయనీ ఎలా ఊహించారో ఆశ్చర్యం వేస్తుంది. పైగా అన్ని సంభాషణలు, వివరాలు ఎలా వ్రాయగలిగారో” అన్నాడు. ఆ సంభాషణ అంతలో ఆగి వేరే విషయాలమీదకు మళ్ళింది.
తరువాత నాన్నగారి కాగితాలలో వేరేవ్యాసం ఏది ఈ నెలకు పంపుదామా అని చూస్తుంటే ఒక చిన్న నోట్బుక్లో సన్న అక్షరాలలో a, b, c …. అని చిన్న చిన్న పొడిమాటలతో వ్రాసిన సూచిక ఒకటి కనిపించింది. వాటిని కొంచెం జాగ్రత్తగా చూస్తే ‘అమ్మ’ మా నాన్నగారి జీవితంలో ఎన్ని రకాల ప్రేరణలు (ఈ జన్మలోనే!!) కల్పించిందో చూసి ఆశ్చర్యమనిపించింది. వాటికి కార్యకారణ సంబంధం అన్వయం చేసికొన్నవిధానం ఇంకా ఆశ్చర్యమనిపించింది. ఇందులో రెండు ముఖాలున్నాయి. ఒకటి మా నాన్నగారి విశ్వాసం, రెండు అమ్మ జరిపించే విధానం అని నాకు అనిపించింది. మీరే చూడండి.
- బాపట్లలో కంభంపాటి తాతగారు రిటైరైన పిదప ఇనుపకుతికల వారు నియమింపబడుట’ (ఇదేదో నాకూ అర్థంకాలేదు. అప్పటివారికెవరికైనా తెలిసి ఉండవచ్చు)
- రంగాచార్యులుగారి కుమారుడు నరసింహాచార్యులు మా క్లాసులో ఉండుట – వడ్లకొట్టులో ఉండుట.
పొగడదండ, గట్టుపల్లి సత్యము, చెరువు సూర్యనారాయణ, రాధా నాతో చదివి యుండుట.
- చంద్రమౌళి సత్యనారాయణ మా సంఘమున కధిపతి అయినందున వారి అన్నదమ్ముల నందరిని నేనెరుంగుట. వారి ద్వారా చిదంబరరావుగారి నెరుగుట.
- దేశిరాజు రంగారావుగారు మా మాస్టరైనందున వారు ధర్మకర్తగా ప్రతి రోజు ఆలయమునకు వెళ్ళుట. చలపతి గూడ ధర్మకర్తయగుట.
- దేశిరాజు అప్పారావుగారింటి వెనుక గదులలో నుండుట వెంకమ్మ, – సుబ్బమ్మల నెరుగుట.
- ఖగ్గా పున్నయ్యగారింటిలో నాలుగు సంవత్సరములు ఉండుటచే దావాల సంగతి తెలియుట (శేషయ్య).
- బ్రాహ్మణ కోడూరు కంపెనీ యజమాని సుబ్బారావు గారిని తెలియుట.
- వేటపాలెములో సంబంధము చేయుటచే అమ్మ ఎచ్చటెచ్చట ఉండినది. తెలియుట నాన్నగారిని చూచి యుండుట.
- చి॥ సుబ్బారావు, రవి మా వద్ద యుండుటచే మూడు తరములు తెలియుట – డాక్టరు రంగారావు, చిదంబరరావు, లక్ష్మయ్య, పిచ్చమ్మల సంగతులు తెలియుట.
- మేము జిల్లెళ్ళమూడి చేరుట, ఎందరో విరమించుకొని యుండ నేటి వరకు 18 ఏళ్ళు విరామము లేక తిరుగుట.
- ఎన్నో విషయములు మరచుచున్నను జిల్లెళ్ళమూడి విషయములు (ప్రతి అక్షరము) జ్ఞప్తియందుడుటచే నన్ను ఈ విషయానేకముల సేకరణకై నియమించి యుందురనుకొంటిని.
- మంత్రి కిష్టయ్యగారితో కలిసి పనిచేయుట బందావారి ఆడపడుచు వీరి భార్య యగుట. ఆమెకు అమ్మ ఇదివరకే తెలిసి యుండుట.
- మన్నవ సీతాపతి తాతగారిని బందా ఆదినారాయణగారి ద్వారా ఇది వరకే తెలిసి యుండుట.
౦. బామ్మగారితో పిల్లల నెపమున సంవత్సరము పైగా సన్నిహితముగా
- కోననుబ్బారావుగారు, నోరి వెంకటేశ్వర్లుగారు నాన్నగారి సహోధ్యాయులగుట వీరి ద్వారా కొంత విషయము తెలిసి యుండుట.
ఇన్ని విధాలుగా అమ్మ వారి జీవితంలోకి, మనస్సులోకి ప్రవేశించినది. వారిని అనేక జన్మలుగా తానెరుగునన్నది. బెంగుళూరులో వారు పుష్పమాలలు కట్టి తనకిచ్చే వారని చెప్పిందట. వారికి మశూచి ఎన్నో జన్మలుగా ఉన్నదనీ,
ఇదే ఆఖరు జన్మ అనీ చెప్పింది. మౌలాలీ, రహి వంటి అనేక పాత్రధారులను వారికి చూపించింది. మౌనస్వామివారి వద్ద వారు నేర్చుకున్న మంత్రాలను వారు చెప్పకనే తాను వేగంగా వారికే చెప్పి, ఆశ్చర్య చకితులను చేసి తన సర్వజ్ఞత్వాన్ని తెలియపరచి మనస్సు స్థిరం చేసింది. కాలికి గాయమై సెప్టిక్ డాక్టరు శ్రీధరరావుగారు కత్తితో చీము తొలగిస్తున్నప్పుడు, ఇప్పుడైనా ‘అమ్మ’ అనవయ్యా అబ్బా, అబ్బా అన్నారేగాని ‘అమ్మ’ అనలేదు ఎందుకంటే అమ్మను పిలువ వలసింది ఇందుకు కాదనే దృఢ నమ్మకం ఉండటం చేత. అనేక సంఘటనలను, సంభాషణలను కొన్ని అనేక సంవత్సరాల క్రితం జరిగిన వాటినే అమ్మ వారికి చెప్పడమూ, వాటిని ఆయన యధాతధంగా అక్షరం పొల్లుపోకుండా భద్రపరచడమూ అమ్మ వారియందు చూపిన దయయే.
చివరకు వారు కాలు దెబ్బతిని నడవలేక మంచాన ఉన్నపుడు గూడా మౌనంగా మనస్సులో చేసికొనే ప్రార్థనవిని అమ్మతో “వాడు నన్ను తీసికో నాలోకి అని ఒకటే గోల పెడుతున్నాడు ఏమంటావు” అని మా అమ్మ (సీతారత్నంగారు) అంగీకారంతోనే తనలోనికి తీసుకున్నది. రెండు సార్లు వారిని చూడడానికి అమ్మ స్వయంగా రాత్రిపూట కారులో వచ్చి చూచి వెళ్ళారు. వారి దహన సమయంలో మంచిగంధపు చెక్కను జిల్లెళ్ళమూడి నుంచి పంపారు.
తానెరిగిన సత్పురుషుల సాంగత్యము, చదివిన గ్రంథాల సారమూ, అనేక సంవత్సరాల తరబడి చేసిన సాధనల ఫలస్వరూపమే అమ్మ అనే దృఢ విశ్వాసం లోతైన ఆలోచనలతో ప్రతి మాటనూ తరచి చూడటం – అనుభవసారమే అమ్మ అన్న గుర్తింపు వారి రచనలలోని మూల సూత్రం..
కానీ చిన్న చిన్న పొడిమాటలలో వ్రాసిన డయిరీలను ఏవిధంగా విశ్లేషించాలో తెలియదు. (1) అమ్మ నా జీవితములోనికి ఎట్లు ప్రవేశించినది. (2) అమ్మ అవతారమూర్తి – జరిగించిన విధానములు (3) అమ్మ మాటలు – విశదీకరణ అని మూడు నోటు పుస్తకాలకు శీర్షికలు పెట్టి వాటిలో తాము సేకరించిన వాటిని వ్రాద్దామనుకొన్నారు. కానీ చిత్తు కాగితాలపై వ్రాసిన విడి విడి వ్యాసాలు, పేరాలేగాని సంపూర్ణ రూపం సంతరించుకొన్నవి కొద్ది మాత్రమే. ఉన్న వాటిని అందరితో పంచుకొందామని చేస్తున్నదే ఈ ప్రయత్నం..