1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘ రాజుపాలెపు’ డైరీల నుండి (భాగవతము)

‘ రాజుపాలెపు’ డైరీల నుండి (భాగవతము)

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 6
Month : July
Issue Number : 3
Year : 2007

(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు. అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

(గత సంచిక తరువాయి)

  1. ఇక ఈ భక్తిని ఎట్లా, ఎందులకు చేయవలెను. “దంతి యూధపు చందంబున భక్తి సేయవలె” పలువురు ‘తిలధారావత్’ నూనె క్రుమ్మరించునపుడొకేధారగా ఉండురీతి అందురు. కాని ‘దంతి యూధము’ అనుటలో గజేంద్ర మోక్షములోవలె గజేంద్రుడు ముందు నడచి, తక్కిన ఏనుగులు నొకదాని వెంట ఒకటిగా, వెలితిలేక వరుసలో నడచుట అనిన బాగుండును. దీని వలన ప్రయోజనమేమన, మొదట బయలుదేరు గజము, శక్తివంతమైనది. దానిని రాజు అని చెప్పుదురు. కావున దోవ తీయుటలో, కంటకావృతమైన అరణ్యములో అనేక విధములైన చెట్లు, తీగెలు, పొదలు క్రిక్కిరిసి యుండి మార్గము సుగమముగా యుండదు. ముందు దారి తీయునది చెట్లను విరిచియు, పొదల ముట్టియు, తన వెనుక వచ్చువానికి మార్గము సుగమము చేయును. మొదట గల నాధుడు అనుభవించు కష్టముల నిసుమంతయైనను వాని ననుసరించువానికి లేదు. ఇట్లే మొదటిది “మార్గదర్శి” అని చెప్పవచ్చును. తాను ఇది వరకు పయనించి, గమ్యము చేరి, తిరిగి మన వద్దకు వచ్చిననేగాని, ఎటుల పయనించవలెనో, ఎచటికి చేరవలెనో తదితరులకు తెలియనేరదు. అట్టిది మార్గదర్శికి మాత్రమే వేద్యము, సుకరము. ఇందులకుదాహరణముగా మనము క్రొత్త తావుకు పయనించుత, ఆ మార్గమున తరచు వెళ్లి వచ్చిన వారి ననుసరించిననే తప్ప, దారిలో ఎచ్చటెచ్చట, ఏయే ఆటంకములుండునో, వాని నెచ్చట దాటవలెనో తెలియునుగాని లేనిచో ప్రమాద భరితులమగుటయేగాక, గమ్యము చేర నేరకుండుటయు ఎరింగి యున్నాము. (జిల్లెళ్ళమూడి దారి పొన్నూరు దారి మొ॥) మనకు తెలియకుండినను, మార్గదర్శియెడ అంధవిశ్వాసముంచి నిస్సంకోచముగా అనుసరించుట వలన, సుఖముగాను, త్వరగాను మార్గోపద్రవములు లేక చేరగల్గుచున్నారము కదా? ఇట్లగుట పరమార్ధాను భవము’ లేని వారల ననుసరించుటచే గమ్యస్థానము చేరకుండుటయేగాక ప్రమాదములకు గురియగుచున్నారము. దీని వలన ఎన్ని జన్మలకు గమ్యస్థానము చేరగలమో ఎవరికి వారలము విచారించు కొనవలసినదే కాని ఊహించుటకలవి కాదు. అట్లుగాక అట్టి స్థితి ననుభవించి, మనల మార్గదర్శిగా నడిపింప సమర్థతగలవారు, తటస్థపడినపుడు (వారి వారి పూర్వ జన్మ సుకృతము వలన) వారిని వెంబడించుకున్న గమ్యస్థానము చేరు అవకాశములు తక్కువగునేమో వేరే చెప్ప నౌసరము లేదు.

“ఇక ఎందులకు చేయవలె? ఇదివరలో చెప్పుకొనిన ‘తొమ్మిది’ మార్గములలో చింతనము, సంకీర్తనము అనునవి వదలబడినవి. ముక్తసంగులైన మునులు, దుద్రాక్షులు మొ|| నిష్కారణము సేయుచుందురు. వారి పద చింతనంబు ఎందులకు? అనుదానికి నారాయణుడట్టి వాడు అనునది సమాధానము. ఎట్టివారు చేయుచున్నారు. అనగా ప్రాపంచిక సౌఖ్యములకొరకు గాక, ముక్తి యన నేదియో తెలిసి, ఇక మీదట తెలుసుకొనవలసిన అగత్యము లేనివారలు, ముక్తి ధనమునే అనుభవించువారలు అయ్యు వేరేమియు చేయుటమాని ‘సంకీర్తనము’ భగవద్గుణ విశేషముల సంకీర్తించుచున్నారు. ఎందులకు? ఏ కామ్యము కొరకు కాదు. ‘నిష్కారణము’ అవసరము లేకయే బహుశః వారున్మత్తులై యుందురేమో? కాని వారెట్టి వానిని గూర్చి కీర్తించుచున్నారు? ఆ నారాయణుడు కూడ, పరమాత్మ “అట్టివాడు” అటువంటివాడే అనగా ఆ శ్రీమతికి కూడ కరుణ గల్గుటకు ఏ ఒక్కటి ఏ కారణము కానేరదు. దీనినే అవ్యాజకరుణ; కారణము లేకుండనే కల్గునది అను సాంప్రదాయము కలవాడగుట, వారి నాశ్రయించిన వారు కూడ ఏమియు కారణములు లేకుండనే నిష్కారణముగా సేయుచున్నారు అనుటలో నిష్కామ యోగము గీతాప్రవచనానుసారము, జీవి ముక్తిననుభవించియు, జీవన్ముక్త దశలో ఎట్లుండునో చెప్పబడినది గదా?

‘ఎందుకు వస్తున్నారో తెలియదుగాన ఏమి పొందుతున్నారో తెలియదు. ఈ భక్తి చేయుటకు నియమాదులేవైన కలవా?’

“పానీయంబులు ద్రావుచున్ మొ॥” అనుటలో మనమేయేకార్యము లొనర్చుచున్నను, లౌకిక, పారమార్థ భేదములు లేక సర్వకాల సర్వావస్థలయందును తన ఇష్టదైవమైనవారి యందు భక్తి సేయవచ్చునని కదా? ఇప్పుడు దీనిలో ఏది లౌకికము, ఏది పరమార్ధము అనినచో మనము చేయు ప్రతి పనియందును పరమార్థమనుననది ఒక్కటియే నిలుచును గదా? దీనినే గీతయందు ‘అనన్యాశ్చింత మొ||” “శరణం ప్రజ” అనుదానికిని భేదముండునా? అట్టివారి యోగక్షేమముల నెల్ల, తాను స్వయముగా స్వీకరింతునని కదా గీతా ప్రవచనము? దీనితో ‘ధర్మక్షేత్రమున’ ప్రారంభించిన అభ్యాసము కడపటి శ్లోకమున అంతమొందుచున్నది కదా? అమ్మగీత విషయమై చెప్పునప్పుడు ఈ రహస్యమునే వెల్లడించుట మనమెరింగియున్నారు. దీనినే మరియొకప్పుడు ‘ధ్యాసయే ధ్యానము’ అను చిన్ని మాటలలో చెప్పి యుండిరి.

  1. ఇక మరియొక కారణమగు “ఆపదగడుపం బెట్టగ మొ॥” అనగా మనకనేక ఆపదలు కలుగుచున్నవనియు, ఆ ఆపదలు సులభముగా తొలంగు ననుటయే ఉద్దేశ్యమైన, ఆ ‘ఆ’ ‘పద’ అను పదము విచారింపవలెను. ఒక ప్రవాహ వేగములోపడి, నట్టేట కొట్టుకొని పోవుచున్నాడని యూహింతము. దీని యర్ధమేమి? తాను కొట్టుకొని పోవుట వలన పర్యవసానమేమి? చనిపోవుటయే కదా? అట్లు చనిపోయినవాడు తిరిగి జన్మకు రాడను ఆశయేమైన కలదా? లేదు. కానదీనివల్ల ఋజువైన దేమన ఏదేహికి దేహత్వసంబంధముగా ఏర్పడిన ‘ప్రాణముపై’ తీపి అని చెప్పక తప్పదు. ఇట్లే రామక్రిష్ణ పరమహంస ‘ఈషణత్రయముల గూర్చి’ చెప్పిన గాధయు జ్ఞప్తియందుంచుకొనవలెను. మొదట పుత్రుని, రెండవసారి భార్యను, మూడవసారి గాని ధనమును వీడకుండుటలో, ఏది ఎంత మానవునికి సన్నిహితత్వమో తెలియును. దీనను ప్రాణమే యెక్కుడని తేలును.

కాని ఈ ప్రాణము ఎచటినుండి వచ్చినది? ఎచటికేగగలదు? అను విచారణ సేయక ‘ప్రాణమునకు, ప్రాణాధారమైన’ అనగా జీవి ఎవ్వరు? జీవికి, పరమాత్మకు గల సంబంధమెట్టిది? అనునది తెలియక పోవుటయే “ఆత్మ విధ్వంసకము” తనను తాను చంపుకొను ఆత్మహత్య అగును. దీనినే పాపములలో కెల్ల ఎక్కుడగుననుట. ఈ ధర్మమును పరిశీలించినచో “తన్ను తాను తెలిసికొనుట”, ఆత్మధర్మము. మిగిలినది పరధర్మమనియు తేలును. స్వధర్మమే శ్రేయమని గదా గీతా ప్రవచనము. కావున ‘ఆత్మ’ యన నెట్టిదియో తెలియనేరకుండుటయే “ఆపద”” అను దాని కర్థము. ఈషణ త్రయములమించినది Self అని తెలియనగును.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!