(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ: దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు. అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
గత సంచిక తరువాయి)
ఇక అవతార పురుషుల గురించి కొంత విచారింతము – వీనిలో ‘సద్యో’ అవతారములనియు “పూర్ణావతారము లనియు రెండు విధములట. మొదటి అవతారము ఏదో నొక పని నిమిత్తమావిర్భవించి, అది నెరవేరినంత ఉపసంహరింపబడునట. మత్స్య – సోమకు నుండి వేదములు విడిపించుట, కూర్మ – భూమినెత్తుట, వరాహ – హిరణ్యాక్షవధ, నరసింహ – హిరణ్యకశిపువధ; వామన – బలి నిష్క్రమణ, పరశురామ క్షాత్రము నడచుట, ఇక శ్రీరాముడు 1 శ్రీకృష్ణుడు – ఈ రెంటిని పూర్ణావతారము అనుచున్నారు.
ఎ) శ్రీరాముడు – రామ శబ్దమునకు ‘రమ’ అనగా ఆనందమే స్వరూపముగా కలవాడు. కావున ఎచ్చటెచ్చట ఆనందము కల్గు చుండునో అనగా ‘సమాధి స్థితి’ అచట నెల్లను ‘రాముడు’ కలడనుట సహజము. దేవీ పరముగా చెప్పుకొను సమాధ్యవస్థకు ‘రామానందమను’ పేరు కలదు. ఇక “పుంసాన్మోహనరూపాయ” అను దానికి పురుషులను సహితము మోహపెట్టగల రూపలావణ్యములు కలవాడని కదా? పురుషుడనగా ఎవరు? వయస్సు పైబడి నంతనే మగవారిలో కలుగ గల భౌతిక భేదము ననుసరించి గడ్డములు, మీసములు వచ్చుటయా? కాదు. “పురుషుని కనుగొనినవాడే పురుషుడు” అనగా పరమాత్మను పొందినవాడే, అట్లగుట “ పుంసాన్ మోహన” అన పరమాత్మను కనుగొని వాని యందు ఆనందమనుభవించువారే అనియు అట్లనుభవించువారు అట్టి సుఖమును వదలి యుండ నొల్లరనికదా ద్యోతకము? ఇది ఆత్మసౌందర్యమేకాని పాంచభౌతికదేహము కానోపకుండును :
బి) శ్రీకృష్ణుడు :- ఇట్లే ‘క్రిష్’ ధాతువునకు కృషి అనియు, ఆకర్షణ అనియు అర్థములు చెప్పుదురు. ‘కృషీవలుడు’ ప్రయత్నము సేయువాడు. భూమి నుండి
అనుభవ యోగ్యమగు ధాన్యమును, పంటను, పండించుటకు అని తేలును. ఇక కృషి అనుదానికి ‘కర్మ’ అనిన, ఎట్టిదీ కర్మ? అను ప్రశ్న ఉదయించును. దీనికి ‘నిష్కామ కర్మయే’ అను అర్థము ననేకులు బాలగంగాధర తిలక్ వంటి వారితో సహా నిరూపించి యున్నారు. ఎట్టిస్థితిలో ‘నిష్కామ కర్మ’ సాధ్యపడునన ‘సర్వధర్మములు త్యజించి, నేను అనునది నశించి, సర్వము పరబ్రహ్మ స్వరూపముగా చూచుకొనగల “జీవన్ముక్తులుసేయు కర్మయే నిష్కామ కర్మ” యగును. అందువలననే, ఉత్తీర్ణులైన వారు సేయు కర్మయే, “తామరాకుమీది నీటి బిందువు వలె” అననగును. ఇంతవరకు ప్రస్థానత్రయమని పిలువబడు “వేదములు – ఉపనిషత్తు – గీత” వీని నుండియే వారి వారి అనుభవముల పురస్కరించుకొని, అభిప్రాయములు ఇచ్చు చుంట పరిపాటియై నందుననే త్రిమతాచార్యులు సహితము, అనుభవ మొకటైనను వివరణ భేదములు కల్గియుండిన వన్న, తక్కుంగల వారల నెన్న నవుసరము లేదు.
ఇక భాగవతమునకును, శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రకును అవినాభావ సంబంధముంట, కృష్ణ చరితమే ముఖ్యమగును. దీనిని వేదవ్యాసులు తొలుత సంస్కృతమున రచించిన వారయ్యు, తెనిగించినవారు పోతనామాత్యులగుట, తెలుగున భాగవతమనిన ఇదియే స్ఫురించును, తరువాత అనేకులు తెనింగించినను, వారి వారి నామములు ముద్రలుగా పేరు చెప్పుకొని యుండిరి. ఇట్లే ‘రామాయణ’ మనవాల్మీకమే తోచును. ఇక తెనింగించిన వారు అనేకులు. “భాస్కర, మొల్ల, .” మొదలగు నామములు కలిపి రామాయణమనుచున్నారము.
మూలము నుండియే భాగవతమును తెనింగించియు భాగవతమెట్టి స్థితి యందుండి (inspired) పల్కబడినదో, అట్టి స్థితిలో ‘చెప్పిననే, భావస్ఫూర్తి కలదు. లేనిచో పాండిత్యమగును. ఇక భాగవతమునకు, అందు తెల్పబడిన శ్రీకృష్ణ చరితమునకు అభేద ప్రతి పత్తియు కలదు. కావున దీనిని ‘అమ్మ భాగవతము అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. జనసామాన్యముకేగాక, పండితులకు కూడ దురూహ్యమైన లీలలచే నడుపుచున్న ఈ లీలలకు “అమ్మ భాగవత మనిన సరియగు
పురాణేతి హాసములలో చెప్పినట్లు “పుంసాన్ మోహన రూపాయ” ఐనందున, ఎన్నివేల సంవత్సరముల నుండియో, ఇంద్రియములు తపింప జేయుచు ఎండుటాకులు, నీరు, గాలి వీనిలో ఒక దానిని భక్షణ చేయుచున్న బుష్యాదులు శ్రీరాముని ఆలింగనము చేయనుత్సగించినపుడు అట్టిది ఆ అవతారములో సాధ్యపడదనియు (ఏకపత్నీవ్రతుడగుట) రాబోవు అవతారములో ‘కృష్ణావతారములో’ సాధ్యమగుననియు చెప్పినట్లును, అట్లే శ్రీరాముడు శ్రీకృష్ణునిగను, ఋష్యాదులు గోపికలుగను అవతరించిరని చెప్పుటయు కద్దు. కాని గోపికలన ఎవ్వారలగుదురో, శ్రీకృష్ణుడన ఎవ్వరగుదురో, వారి భావము లెట్టివో, ఆపరమాత్ముని గుణవిశేషములెట్టివో పరికించిన, పై చెప్పిన ప్రామాణ్యముల కతీతమైనదొండు ఉండవచ్చునను సంశయము పొడచూపును.
వ్యంగ్యముగా ‘గోపికలన’ పాలను చిలికి, దాని నుండి వెన్నను తీయువారని తోచును అనగా శుద్ధ సత్వములో మధించి జ్ఞానమను వెన్నను తీయువారు. ఈ వెన్న తయారైన పిదప, అది దేని నుండి వచ్చినదో అట్టి పాలలోను, మరియొక దానిలో అనగా ‘నీటిలో’ను కలియనేరదుగదా! అట్లే జ్ఞానధనులగువారు సహితములోక సామాన్యముగా ద్వంద్వబుద్ధి, భేదబుద్ధి కలిగియున్నట్లగుపడియు, సాంసారిక జ్ఞానము కల్గినట్లగుపడుచుండినను, తాము మాత్రము పరులుగానే యుందురని తోచును. ఇక పురుషుని కనుగొనినవాడే పురుషుడని చెప్పియుంట, పురుషుని కనుగొను పర్యంతము తనలో స్త్రీత్వముండుననియు, స్త్రీవాచ్యులగు గోపికలుగా, సాధకులు చెప్పియుండిరేమో అను అనుమానము తోచును. కానిచో శ్రీకృష్ణచరితమును 3 భాగములుగా విభజించిన తరి 1. బృందావనము, 2. మధుర, 3. ద్వారక అనువానిలో బృందావన గాధలు కృష్ణునికి 9 సం॥లోపుననే జరిగిన తెలియును. షుమారు 10 లేక 11 సంవత్సరములలో ‘కంసవధ’ తదుపరిగాని వీరు ‘సాందీపుని వద్ద శిష్యులుగా చేరి విద్యనభ్యసించి యుండలేదు. కాబట్టి ‘గోపికలన’ వెన్న విడదీయువారు లేక సాధకులు ఇట్లే ‘హంస’ యునుపాల నుండి నీటిని విడదీయు శక్తి కల్గియుండ పరివ్రాజకులైన సన్యాసులలో గొప్పవారిని, ‘పరమహంసలని పిలుచుచున్నారేమో? దీనికిని ‘హంస’ అను శబ్దమునకును కూడ సంబంధము లుండునేమో యనునదియు సహజము. ఎందులకన ఈ హంసయను ప్రాణములోనే (microcosm; macrocosm) పిండాండ, బ్రహ్మాండముల భేదము కలయిక – కలదనియు శాస్త్రము. కావుననే ప్రాణమునకు ‘సత్యము’ అని పేరట. కావున సత్యమునకు (ప్రాణమునకు) సత్యమైన (ప్రాణమైన పరమాత్మను గ్రహించి, పొందుటకు ఈ “ప్రాణము, హంసయు” కొంత తోడ్పడుట ఇంతక భాగవతము నందు “గోపికలు = సాధకులు, జీవాత్మలు; – “శ్రీకృష్ణుని, పరమాత్మను ఎట్లు పొంది సుఖించిరో వారి అనుభవము లెట్టివో భాగవతమున చదివినారము. కాని పరమాత్మ స్థూల దృష్టికి స్త్రీగా యుండి, గోపికలగు సాధకులు పురుష రూపములలో యుండిన, ఎట్లుండగల్గుదురో, కనుగొనుట కవకాశములు లభింపమి, ఊహించుకొనవలెను. (గోపికాగీతలు మొ॥) కాని ప్రత్యక్షముగా చూచు అవకాశము లభించి యుండలేదు. ఈ రహస్యము వెల్లడి జేయుటయే ‘అమ్మ’ అవతార ప్రయోజనమై యుండ నోపునేమో. ఇచట “మాతాశిశు” సంబంధమే “జీవాత్మపరమాత్మల” సంబంధము – మాతయగుడు మీదు మిక్కిలి రక్షణ బాధ్యత సహిత మామెయే నిర్వహించుటయు గమనింప దగ్గది.