(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్ధమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
- బృందావనము :- శ్రీకృష్ణుడు 9-10 సం॥లోపు బాలుడు – గోపికల లీలలు తమ సర్వత్ర కలవని ఋజువు చేసినది. ‘ఒక ఇంటిలో నాడు మొ॥ అమ్మ సాదృశములు – 7 మొదలు 10, 11 సం॥లలో గల పర్యటనలు.
ఎ) అమ్మ భౌతిక వయస్సు 38 సం||లు అయినను 90, 80, 70 సంవత్సరముల లౌకిక వయస్సు కలవారు పసిపాపలై యుండుట – జీవుని వయస్సు కొలుచుటకు వలను పడనిదిగాన, మనకు గోచరమగు కాలమునకు లోబడిన వయస్సునే చెప్పుకొనుచున్నారము. కాని జీవునికి, పరమాత్మకు గల సంబంధము ‘అనాది’, అని నాభావము భగవంతుడే ఆదర్శమును చూప అవతరించునో – దానికి వలయు సాధన సంపత్తి నంతయు గొని తెచ్చిననే గాని, లీలల కనువుపడదు. కావున ప్రస్తుతము అమ్మ వద్దకు చేరు వారందరిలో, సత్సంప్రదాయములు గల ఋషులుగానో, లేక, ఇదివరలో ఆమెచే నిష్కృతి నొంద పంపబడినవారో ఇక మీదట రాగలవానికి వలయు సామగ్రి చేకూర్చుకొనగలవారో, పలు తెరంగుల వారుండ నోపుదురు. ఇప్పుడీ లీల యను నాటకములో పాత్రధారు లెందరుందురో తెలియ నేరము. లేనిచో ఎందరో ఉండగా కొందరినే చేరదీయుట యేమి? కొందరికే పాత్ర ధారణ మేల? ఇది ఏమి నాటకమనిన ఇపుడిపుడే మొదలుగాన, నాటకము పూర్తియగు వరకు ఇట్టిదని చెప్పుటకు ఎవ్వరికిని సాధ్యపడదు. ఇట్లే చివరగల అంకములోని పాత్రధారులు ఇప్పుడే అగుపడరేల అనిన, వారి పాత్ర ఔసరమైన రంగములో, వారు కూడ భాగస్వాములై వారి భూమికలు నిర్వహింప గల్గుదురు.
బి. ముక్తి పొందిన మాల పిచ్చమ్మగారు, వారిని సంబోధించుత “వీడు” అని చెప్పుకొనుట పరిపాటి అనగా ఆ స్థితి యందుండు వారికి లింగ భేద ముండ నేరనందునను, పురుషుని తెలిసికొన్న పురుషుడై నందునను “వీడు” అని చెప్పుట సహజము. ఇట్లే అమ్మ రాజమ్మగారి వద్దకు వెళ్లినపుడు “ఏరా” అని సంబోధించుట గమనింపదగినది. ఇదియే గోపికా వస్త్రాపహరణలోని విశిష్టత. వారు ఆవరణ రహితులు.
వస్త్రాపహరణకు సంబంధించిన ఉపాఖ్యానము :
ఒకనాడు వేదవ్యాసుడు, దేవకన్యలు కొందరు స్నానము చేయుచుండిన | సరస్సుదాపుగా పోవునపుడా కన్యలు సరస్సు వెలుపల తమతమ వస్త్రముల ధరించిరట. ఆ దారినే శుకమహర్షి వెళ్లినపుడు, వారది గమనింప లేదనియు చెప్పిరి. చేయుటకు తాను వృద్ధుడననియు, శుకుడు యవ్వనుడైనను, వారట్లుండుటకు హేతువేమని ప్రశ్నించిరట. సమాధానముగా వారలు వ్యాసుడు దేహాత్మ జ్ఞానము కలిగి యుండెననియు, శుకుడన్న అట్టి జ్ఞానము లేకుండ అంతర్దృష్టిలో నుండెననియు సమాధానము చెప్పిరట. అట్లే మధురభక్తి నందును గోపికలు దేహాత్మ జ్ఞానము లేకుండి రనియు, పరమాత్మను చేరుటయే పరమావధి యనియు తెలియును. కృష్ణుడు పరిహాసముగా గోపికల నట్లేల వచ్చి యుంటిరని ప్రశ్నింపగా (తతృతి పుత్రాదిక వాంఛలు) తనయందే యుంచు కొనినందున తప్పేమియు లేదనిరి గదా!
ఇక కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తైను గదా? ఇట్టి సిద్ధులు ప్రదర్శింప బడుచున్నవా? అనిన ఈ రెండు, మూడు సంవత్సరముల నుండియు సత్రము జరుగుట గమనించిన గోవర్ధన గిరి ఎత్తుట అగునో కాదో తెలియును. గోవర్ధన గిరి ఎత్తినది గోవుల గోపకులు కాచుకొరకె గదా! ఇట్లే ఇచట ప్రధమమున దినమునకు 10, 15, తర్వాత 20, 50, 70, 100 ఇంకను 150 మొదలు 300 వరకు దిన పరిమితియై ప్రత్యేక కార్యక్రమములలో 1000, 2000, 3000 ఇంకను 4, 5 వేలకు మించి జనము వచ్చి పోవుచుండిరే? వీరిలో భోజనము చేయక వెళ్లిన వారొక్కరైన కలరా? ఇది యే ధనము కలవారివల్ల సాధ్యమగును? ఇది గోవర్ధనగిరి ఎత్తుట వంటిది కాక మరి యేమి?
గోపికా గీతలు :- ఇవి శ్రీకృష్ణుడు బృందావనము వీడి, మధురలో నున్నపుడుకదా? అనగా వారికి ఎడబాటు కలిగినందున, భరింపలేని ఆవేదనయే కారణము గదా? ఈ సందర్భములో, ఎడబాటు ఎట్లుండునో తెలియుట కొక ఉదాహరణ చాలును. మనలో చాల మంది తమ కుమార్తెలకు ద్వాహ మొనర్ప సంకల్పించి, యుక్త వయస్సు వచ్చువరకు అల్లారు ముద్దుగా పెంచుకొని, తగిన వరుని వెదకి, ఎక్కువగా కట్నకానుకలిచ్చి పెళ్ళి జరుపునంతవరకు సంతోషముతో నుండి కాలము గడిపెదరు గదా? నాక బలియగుడు, పోయి రావమ్మ జానకీ, అనుపాట నాగస్వరమున వినినంత, ధైర్యము కలవాడు కండ్లు నలుపుకొనియు, కొందరు కన్నీటి చుక్కలు. రాల్చియు, మరికొందరు పట్టరానంతగా వెక్కి వెక్కి ఏడ్చుటయు ఎందులకు? వీరు కావలెనని చేసిన వివాహమే కదా? దీనికి కారణమేమి! ఎడబాటు. ఐనను ఈ ఎడబాటు కొంతకాలమేగదా? మరి ఇదేమి? దీనికి రామకృష్ణ పరమహంసగారు చెప్పినది కాళీమాత నుపాసించు దినములలో, అమ్మ! ఒక దినము గడచి పోయినది కదా? ఇంకను కనికరము రాదా? అను కొనినపుడు తడిసిన గుడ్డ నుండి నీరు పిండుటకు, గుడ్డను మెలికలు త్రిప్పి పిండిన ఎట్లుండునో, అట్లు హృదయముండుననిగదా? అట్లే మాతృ సన్నిధి చేరుసరికి పెండ్లివారు వచ్చినట్లు సంతోషముగానే యుండుననుకొని తిరిగి వెళ్ళి పోవు సమయ మాసన్న మగుడు, ఆ దిన ముదయముననే నాక బలియను నాగవల్లికళ ప్రతివాని ముఖము మీద, కనపుడును. దీనికి తోడు వెళ్ళుతావా నాయనా అను అమ్మ మాటలు ‘పోయిరావమ్మ జానకీ’ అనుపాట నాగస్వరమున పాడుటే యగును. కావున కొందరు, కల్గు ఆవేదనను బయల్పడ నీయక వక్కపలుకు వేయుటయో, దగ్గుటయో, ఏడ్వలేక నవ్వుటయో, తిరిగి ఎవ్వరికి కనపడకుండ కంటి నీరొత్తుకొనుటయో, లేక బహిర్గత మయినపుడు, పట్టలేనంతగా పెల్లుబికి, బొబ్బలు పెట్టుటయు చూచు చున్నారము. దీనిని ఏడ్చుట అని పిలుచు చున్నారుగాని ‘భావోద్రేకము అనినను, ఎడబాటు వలన కలుగు ‘ఆవేదన’ అనిన బాగుండును. ఈ ఆవేదనయే ఆరాధనకు కారణమనియు తెలియనగును. ఇట్టి వీరికి తమ ఇండ్ల వద్ద గల కుటుంబములు లేవా? కలవు కాని ఇదివరలో చెప్పుకొనినట్లు, ఈషణ త్రయములలో తమ ప్రాణముపై తీపి ఎక్కువగదా! ఇంతకంటే ప్రాణమునకు, ప్రాణదాతపై మరి యెక్కువ గదా? ఇదియే ప్రతి జీవికిని గల స్వాభావిక ధర్మము. అనగా జీవుని పరమాత్మ యందు లయమొందించుట. అంతదనుక నిర్వేదము తప్పదు.
ఆత్మార్పణ మన నెట్టిదో ఇదివరకెరింగించిన మీదట, కొందరు వారి వారి ధన, ధాన్య వస్తు వాహనముల సహితము అర్పణ చేసిననే ఆత్మార్పణ అనియు, లేనిచో వృధా అందురు. దీనినే కొందరు ధనము చేనైన, సేవ చేనైన తృప్తి పరచుటయే పరమావధి అందురు. ఉదాహరణకు “ఒక స్త్రీ తన కుటుంబములో కలవారలలో తల్లి, తండ్రి, మామ, అత్త, కొడుకు, కోడలు, భర్త మొదలగు వారుండినపుడు వీరిలో ముఖ్యముగా భర్త యెడలగల ప్రీతి, ప్రేమ, అనురాగము
మొదలైనవి. ఇతర బంధువులు యెడ ప్రేమ చూపు చున్నందున తక్కువగునని ఎవరైన చెప్పగలరా? ఇట్లే మామగాని, అత్తగాని తదితరుల యందు ఎక్కువ మక్కువ చూపు చున్నందున, తమ యెడ తక్కువగుననుకొన గలరా? ఆ ఆదర్శ గృహిణి, ఎవరి యందేవిధముగా, ఎట్లెట్లు ప్రవర్తింప వలయునో అట్లు చేయును కదా? ఇట్లే తమ సంసారముండియు, ఈషణ త్రయముల తేడా ననుసరించి, పరమాత్మ ఎక్కుడగునని, ఎక్కువ రాగము చూపుటలో వింత యేమో తెలియుట లేదు. ఇంత మాత్రమున, తనది యగునదంతయు అర్పించవలెననుట యెట్టిది? కావున తన ధర్మం ప్రకారం సంసారములోని భార్యాపిల్లల యోగక్షేమములరయుట తప్పదు. తప్పుకాదు. సంసారమును పోషించుట ధర్మము, పరమార్థము వెదకి కొనుట ఆత్మ ధర్మము.
అష్టావక్రుడు, కుబ్జ, వీరిరువురికి కృష్ణుడు సద్గతుల నొసంగుట అందరెరింగినదే కదా? అష్టావక్రుడన, కుండలిని మూలాధారము నుండి సహస్రార పర్యంతము నడచు నడక యేమో? ఇట్లే కుబ్జయన మూడు వంపులు కలది. మనలో చాలా మంది ‘ఒ’కు ఎన్ని వంకలో తెలియునా? అని అందురు కదా? దీనిని బట్టి, తెలుగునకు, సంస్కృతమునకు ‘ఓ’ ‘C’లలో మూడు వంకరలుండుట గమనార్హము. ఇవి స్థూల, సూక్ష్మము, కారణము లేమో? (మహాకారణము బిందువు) త్రిగుణము లేమో? వీనికవ్వలి స్థానమే కదా తెలిసి నంత, సర్వము తానగుట ఈ ప్రశ్నలో ‘పరమాత్మ’ జ్ఞానము కలదా? యను ప్రశ్న తోచును. అట్లే కుబ్జయు వక్రము పోయి కృష్ణ సాయుజ్యము పొందినది. ఇక అమ్మ “ఎట్టి కప్పగంతులు వేయు వారి నైనను, వానపాము నడక నడిపించుటయే “తమ విధానమని కదా చెప్పిరి? ఈ కప్పగంతులున్నూ, మండూక గతియును ఒకానొక కుండలినీ నడక యేమో?
బృందావనములో నున్నప్పుడు, ఎట్లున్నది మనమిప్పుడు వినుచున్నారమే గాని చూచి యుండ లేదు గదా? అట్లు చూచిన వారలలో ఒకరు వ్రాసిన దానిని బట్టి “పరమానందమే అమ్మ లీలలు” అని కదా? మనమందరము ప్రస్తుతము మధురలో నున్నారము. కావున మన వద్దకు అప్పుడప్పుడు “ఉద్దవుడు” వచ్చుచునే యున్నాడు. ఉద్దవుడనిన కృష్ణుని బుద్ధి తత్వమందురు కదా? లేనిచో ఎవరైనను అమ్మ వద్దకు వెళ్ళి వచ్చినంతనే, విని, పని కట్టుకొని వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నది? ప్రసాదమేమైనా పంపిరా? అని అడిగి తెలుసుకొనుచున్నాము కదా? ఇది ఎడబాటులో నున్నపుడు గల్గు మానసిక సంస్మరణలు కావా?