(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
ఇక భాగవతములో నిక్షిప్తధనమగునవి 1. గోపికా గీతలు, 2. ఉద్ధవుని రాయబారము (భ్రమర గీతలు), 3. రాసలీల.
- గోపికా గీతలోని ‘పున్నాగ కానవే’ మొదలైనవి జీవుడు పరమాత్మను వెలుపల వెదుకుట వర్ణింపబడినది. తమ ఈప్సితార్థమైన వస్తువును కృష్ణుని, చరాచరముల నన్నింటియందును దర్శింపగల్గిరి. అనేక పద్యములలో తమలో తామే, ఒకరు కృష్ణుని గను ఇతరులు గోపికలుగను భావించుకొని, ఇదివరలో తామనుభవించిన, లీలలనన్నింటిని, భావోద్వేగములో అనుభవించిరి కదా? వారిది వరకు తిరిగిన స్థలములన్నియు, కృష్ణునే గుర్తు చేయగల్గినవి. ఇది సాకార సిద్ధిగాక మరేమి? అట్లే అమ్మ తిరిగిన స్థలములన్నియు మనకు ముఖ్యమైనవి. ఆమెగారి జీవితములోని సంబంధములన్నియు ఇంతే వాసిగలవి. రాసలీల ఇవి భాగవత మందలి సారాంశమనిన అతిశయోక్తిగాదు. గోపికలు గుండ్రముగా, కృష్ణుని మధ్య నుంచుకొని నిలువబడి ‘అంగనా మంగనామాతరే మాధవం (Vice Versa)’ ప్రతి ఒక్కరు ఉన్నస్థితి తెల్పును. యమునా తీరము, ఇసుకతిన్నెలు, శరత్ ఋతువులోని వెన్నెల రాత్రి మొదలైనవి. సాకార ఉపాసనా ఫలితమైన, నిర్గుణ సుఖమునే తెల్పుచున్నవి. (with center everywhere and circumference nowhere) వారి వారి వ్యక్తిత్వాలు నశింపగా, కుడి ఎడమల, ఎటుజూచినను, మధ్యన తాము కేంద్రీకరించు కొనిన కృష్ణుడే కనపడుట. ఆనందమే పరమావధిగాను, ఆనందమే స్వరూపముగను, ఆనందమే అనుభవముగను కనగల్గిన స్థితి గదా? ఇన్నిటి యందును మురళీ స్వరము “నాదము’ మధ్యకృష్ణుడు ‘బిందువు’, కళవిస్తరిల్లినప్పుడు సర్వత్రా ధ్యేయము అనుభవించుస్థితి ‘నాద, బిందు, కళాతీతమగును’.
ఇట్లు స్వారోపాసనా నంతరము, నిర్గుణా నందమనుభవించుటే ”ఆనందసమాధి’ అనువారి అనుభవము కూడ ‘సవికల్ప, నిర్వికల్ప’ సమాధుల అనంతరము అనుభవించు ‘ఆనంద, నిర్భీజ, సహజ’ సమాధులని పిలువబడువాని అనుభవములే – ఇదియే వైష్ణవాగమములలో తెల్పు ‘అనిరుద్ధవ్యూహము’ అనగా ‘సర్వము సామాన్యమే ఐన స్థితి’.
ఇక భాగవతము ముక్తి ప్రతిపాదితముగాక ‘మధుర భక్తియే ప్రాధాన్యమనినచో, మొదట అనుకొనినట్లు భక్తి జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తులు” అనునవి ఎట్లు తెలుపబడినవి? అనిన. మనో, వాక్, కాయములు మూడున్నూ వేర్వేరుగా నుండినను, మూడును కలిసి నపుడే ‘ధర్మ క్షేత్రమగును కదా! ఇట్లే భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఒక దానిని విడిచి, మిగత రెండును ఉండనేరవు. ఎవరెవ్వరి తత్వము ననుసరించి, ఏ ఒక్కటి ప్రధానముగా తీసికొని, సాధకుడు పయనించినను, మిగిలిన రెండును అంతేవాసి తనకు తెలియకనే పొందుచుండును. వీటి పరమావధి ‘తత్-త్వం’ అని తెలుపుటయే. ఇది తెలిసిన కల్గు ఫలితము ముక్తియే అగును. ఇక ఈ మూటి స్థితి ఒక ఉదాహరణము వల్ల సులభగ్రాహ్యమగును. మూడు వేర్వేరు గొట్టములను వాటి అడుగుభాగమున వేరొక గొట్టమునకు కలిపినామనుకొందము. ఆ గొట్టములు మూడున్నూ వేర్వేరుగా కనిపించుచున్నను. వానిని కలుపు గొట్టము అడుగున సూత్రాత్మగా ఒకటియే. ఉండుటంజేసి, ఏ గొట్టమునుండి నీరు పోసినను, మిగిలిన గొట్టములు కూడ ఆ స్థితి వరకే వచ్చి తీరును (Water finds its level). కాని కొందరు పెద్దలు సూచించినట్లు ‘యతి మతము’ అను సామెత యోగములోగల పట్టుదలను చూపును – ‘జ్ఞాని లుబ్ధుడు’ అనుటలో జ్ఞాని తాను మాత్రమే అనుభవించు వాడనియు, భక్తుడు ‘సర్వసమ్మేళకుడు’ అనుటలో విద్యతోను, మరి ఏ విధములైన అర్హతలతోను సంబంధములేక, అందరిని ప్రేమించు స్వభావము కలవాడు అని తెలియుచున్నది. మీదు మిక్కిలి ప్రతి వానికి సుకరమనిన బాగుండును. కాబట్టి వీని ప్రయోజనము ‘తత్వం’ అని తెలియునంతవరకు ఇట్లు ఏ రూపములో చూచినను, భగవద్రూపములన్నియు సమానములే అనియు తేలును. ఇక ఇష్టదైవతమనుటలో, దైవతము నందారోపించుకోగల గుణగణములన్నియు ‘యద్భావం తద్భవతి యనినట్లు తానే పొందుట యగును.
ఇక పరిసమాప్తిలో ప్రస్తుతము ‘అమ్మ’ మన జీవితములలో చొచ్చుకొని విడనాడుటకు వలను పడని స్థితిలో మనమున్నారము. ఏ కారణములనైన. ఒక వేళ ఎడబాటే సంభవించిన మనకు ప్రస్తుతమున్న మానసిక పరివర్తనము ఎక్కుడగునే గాని తగ్గదు.
“భక్తుల నుండి – భక్త పరాధీనుని వేరు పరచ జాలరు” .
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః
దేవీ పరముగా చెప్పుకొనిన లలితానామములలో పైన చూపినది ఉన్నందున దశావతారములలో ఒకటి యగు “కృష్ణావతారమునే పోల్చుకొని యున్నాము. ఇక దేవియన్న దశావతారములు ఆమె యెడ ఎంత సుకరము, సులభమో గోట మీటినంత యని కదా! ఇక రెండవ పక్షమున ‘నఖము’ అనునది సజీవమా? నిర్జీవమా? అనిన చైతన్యము జీవము కల్గియు లేనట్లగుపడుస్థితి. సమాధిస్థితిలో బ్రతికి యుండియు బాహ్యమునకు ప్రకృతి సంబంధమగు దానికి వేరుగ అవాఙ్ఞానస స్థితిలో, గోటితో సమానమైనందున అట్లు చెప్పిరేమో? అను సంశయము పొడమును అట్టి స్థితిలో గల ‘సాయి’ మొదలైన సిద్ధులు, శిష్యుల ఇష్టదైవతములగు, శివ, రామ, కృష్ణ, మారుతి, దత్త మొదలగు సాకారముల తమ యందే ప్రదర్శించుటచే ఈ సంశయము దృఢమై, అట్టి స్థితి గలవారలకు సాకార అవతారముల ప్రదర్శింప శక్తి యుండుట సులభమని తోచును.
ఇట్లే “వెంట్రుక బట్టుకొని కొండకెగబ్రాకుట”లో కూడ వెంట్రుకలన ‘నఖము’ మాదిరి ప్రాణమున్నదాలేదా? అన్న ప్రశ్న ఉదయించి, ఏ కొద్ది సహాయము చేతనో గొప్ప స్థితి చేరుట అని తోచినను ‘నీటమునుగు వాడు గడ్డి పోచను బట్టుకొని ప్రాణరక్షణ చేసుకొను యత్నము ద్యోతకమైనను, ఉండి లేని స్థితి’ అనుభవమైనంత ‘కొండ’ అనగా శిరోపరి భాగమైన సహస్రారము అత్యుత్తమ స్థితి. అచ్యుతస్థితి చేరుటకు అనువగుననియు, వెంట్రుక అనుటలో సూక్ష్మాతి సూక్ష్మమైన సుషుమ్న నాధారముగా గొని అనియు తోచుచున్నది. అట్టి స్థితి యందున్నవారు మాత్రమే శిష్యుల ఇష్టదైవతముల తమ యందే చూపుట తటస్థింపు చున్నది.