1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘ రాజుపాలెపు’ డైరీల నుండి

‘ రాజుపాలెపు’ డైరీల నుండి

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 8
Month : April
Issue Number : 2
Year : 2009

(అవతార సమయములు)

(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

(గత సంచిక తరువాయి)

పూర్వాపరములు

అనంతమైన ఆదిశక్తి ఆది మధ్యాంత రహితయై నందున, ఒకపరి ఉండి. మరి యొక పరి లేనిదికాదు. అట్లగుట కాల నిర్ణయము చేయనలవి కానిది. యగును. కావున ఏయే వేళల, ఏయే అవతార విభూతులలో దైవాంశలు పొడచూపునో అట్టి దైవాంశ సంభూతులెల్లరు, ఆదిశక్తి నుండియే ఆవిర్భవించిరనిన సమంజసము కానోపును.

కావున మన మెరింగి నంత వరకు బుద్ధ భగవానుని కన్న తల్లి మాయాదేవి, శంకరుని జనయిత్రి ఆర్యాంబ, ఏసుక్రీస్తును షుమారు చిన్న వయస్సుననే చెడకుండ కనిన మరియమ్మ (Virgin Mary) మొదలుగా గల విభూతులన్నియు ఆదిశక్తి యగు అమ్మ ప్రతిరూపములే యని ఎరుంగ నగును.

అట్లగుట, మన మూహింప గల్గినంత దనుక విచారించుకొని సమన్వయపరచుకొనిన కొంత వరకు మాతృత్వము అమ్మ తత్వమన, విశదమగునేమో యను ఊహచే ఈ కొలది విషయములు అప్రస్తుతము అని తొచియు, అనివార్యముగా లభింప బడినవియే అగును. మీదట తటస్థించు రూపముల షుమారు 300 సం॥ల దనుక, ఎరింగింప బడినందున, ఈ పూర్వమునకు సహితము పూర్వమొకటి కలదను తలంపు కలుగ జేయుటయే ముఖ్యోద్దేశ్యము.

ప్రధమమున ‘అమ్మ’ అనేక ఖండముల యందావిర్భవించి, అన్ని

మతముల వారి సన్నిహితత్వము, సామరస్యము ఎరింగియుంట, సర్వమతసారమే అమ్మ రూపమై యుండనోపును. ‘తల్లి’ యన అమ్మ తరచు ‘తల్లి’ యగునేమో అనుటయు వినియున్నారము. నిర్గుణ పరబ్రహమ్మతత్త్వము నందలి ప్రథమస్పందన మని తలంచిన పొరపాటు కానేరదు.

ఇక ఖండాంతర అనుభవముల నెంచుచో ప్రథమమున ‘ఆఫ్రికా ఖండ మందలి దక్షిణ భాగమున ఆఫ్రికా తెగలకు చెందిన, అనాగరికులలో జన్మించి షుమారు 1 లేక 2 సంవత్సరములు మాత్రమే యుండి, తన దృష్టి ప్రసరించినంత దనుక గలవారల సుద్దరించి యుంటయేగాక, ఆ సమయములో నుద్ధరింప బడువారల రాబట్టుకొని సద్గతులొసంగి యుండిరట. పిమ్మట ఆ ఖండము నందే పలుచోట్ల అవతరించి, ఆ ఖండము నందలి పని నెరవేరినంత మరి యొక ఖండమగు ‘ఆస్ట్రేలియా యందవతరించి (ఇచట కూడ దక్షిణతీరముననే) అందుగల వారల సన్నిహితత్వమునకు చేర్చియుండిరట. ఈ ఖండమునందు దైవ చింతన కొంత తక్కువగనే యుండునట.

మూడవసారి ఐరోపా ఖండమందలి ‘స్వీడన్ ‘లో అవతరించి, అచటగల భక్తుల నుద్ధరించి, నాల్గవసారిగా ‘అమెరికా’ యందును, ఇట్లు పలుచోట్ల తన నిర్ణయము నెరవేర్చుకొనుచు చివరకు ‘బ్రహ్మభూమి’ యని పేర్వడసిన హిందూదేశమున శ్రీ కన్యాకుమారి చేరుట మన ప్రస్తుతాంశము.

శ్రీ కన్యాకుమారి నుండి దైవాంశ వెడలి, టెంకానికి 3, 4 మైళ్ల దూరములో గల “ఋష్యాశ్రమము” అని పేర్వడసిన ‘అత్రిమహాముని’ ఆశ్రమముగా బయలుదేరి, రెండురూపములు ‘అనసూయ, బాలాత్రిపురసుందరి” యను నామముల, ఒక విభూతిని అందే “చిరంజీవి” యననేమో ఋజువు పరచుటకై ఒక విభూతి నందే నిల్పి (అనగా భౌతికమందు సహితము పెరుగుట, తరుగుట లేని రూపములో) ఇన్ని వందల సంవత్సరములు గడచియు ఆయమ 10 సం.ల వయస్సును మించని (బాలా) రూపములో (పరికిణీ, గౌను తొడిగి, జడకుప్పెలు పెట్టుకొని నేటివరకు చిరంజీవత్వమన నెట్టిదో ఋజువు పరచుటకై అందే నిలచి యుండుట గమనింప దగినది.

  1. ఇక రెండవ రూపము కన్యాకుమారి నుండి బయలు వెడలిన పిమ్మట ప్రథమముగా మధురలో రాజ్యలక్ష్మియను “మాఘపూర్ణిమ” దివసంబున మకర సంక్రమణములో 14-1-1917 జన్మించి, అచట జరుపదగు విధానములు పరిపూర్తియైనంత, కార్తీక మాసమున, ఏకాదశి తిధియందు, అరుణోదయ సమయమున, రక్తపోటు అను వ్యాధిరూపేణ, ఓంకారము పూరించుచు, రక్తము నవ ద్వారముల నుండి వెలువడు చుండగా, ప్రస్తుతము మనము వినుచున్న కపాల మోక్షము ‘అనగా బ్రహ్మరంధ్రము నుండి, ప్రాణములు వెలువరించుతరి పెద్దకేకతో శరీరము వదలిరట. అప్పటి నుండియు ఏదేహము స్వీకరింపవలెనో, ఎప్పటికి వదలవలెనో, ఇవి రెండును తమ స్వాధీనము నందే యుండెనట. ఈ అవతారములో 36 సంవత్సరములు గడిపిరట.
  2. తరువాత తంజావూరు నందు ‘వరలక్ష్మి’ యను పేర మార్గశీర్షములో వెలసి సంగీత మభ్యసించి, అనేక వాద్యములలో ప్రజ్ఞనార్జించి, నాదబ్రహ్మయననేమో, ఎట్లు నాదబ్రహ్మమునుపాసించి, నాదలీన మెట్లు పొందనగునో ఋజువు పరచిరట. ఈ యమగారు బాహ్యమునకు “కాళీ” ఉపాసనా పరురాలై యుండి, అనేక సిద్ధుల ప్రదర్శించి తన 49వ సంవత్సరములో ఆశ్వయుజ బహుళములో బుధవారం మధ్యాహ్నం 12 గం. నుండి నిద్ర చెందగా అందరు రెండు, మూడు దినములైనను లేవకుంట, చూచి, పరీక్షించగా, ఇదివరకే శరీరము వదలియుంట గ్రహించిరట.
  3. ఋష్యా శ్రమము నుండి ఇరువురుగా బయలుదేరుటయు, రెండవవారు బ్రహ్మచారిగనే యుండుటయు, వీరిరువురు కవలలుగా యుంటచే, ఒకే సంకల్పము ఇరువురి యందు ఒకే పరి కల్గుచుండుటయు, ఇట్లే ఆయుః ప్రమాణము కూడా ఇరువురి మీద ఆధారపడి యుంట, ఇందు రెండవ వారు బ్రహ్మచారిగ చిరాయువులుగనుంట. వీరు స్వేచ్ఛానుసారము, ఆయుః ప్రమాణము నిర్ణయించుకో గల్గుటయు తన స్వేచ్ఛానుసారము భౌతికము వదల కల్గియుంటము మొదలగున వెన్నియో సాధ్యములయ్యెనట. కావున అచట నిల్పిన బాలాత్రిపురసుందరి శరీరము “చిరంజీవత్వము గల చిన్మయ శరీరమనదగును.”

ఇట్లు జరిగిన పిమ్మట షుమారు 100 సంవత్సరములు అనేక చోట్ల జన్మించుటయు, వాటిని గురించి తర్కించుటయు ప్రస్తుతాంశమునకు దూరమైనవి.

వీరు తదుపరి “తిరుత్తని” యందు సర్పరూపము ధరించి యుంటయు అనగా రూపము సర్పాకారమైనను, మానవ చర్మముతోనే కప్పబడి యుంటయు 11 పడిగెలు (ఫణములు) కల్గి ఒకే ముక్కుతో, రెండు కండ్లతో యుండి, వెనుకగా వరుసన నెత్తిన మూడు కండ్లు కలిగి, ఒక మట్టి చెట్టునకు చుట్టుకొని యుండెడివారట. తదనంతరము చెట్టును రాతి రూపముగా మార్చుకొని, తానున్నూ రాతి రూపముగా మార్పు ధరించి యుండ, ఒకపరి ఒక వేటగాడు, ఆజాను బాహుడు, విల్లు అంబులు ధరించి, చేత శూలము దాల్చి, కంబళీ కప్పుకొని అచటికి చేరి రాతిరూపముగా నున్న సర్పాకృతి మీద నిలువబడి, చేతనున్న శూలమును నిలువరింపనెంచి, నేల ఆనుకొని, సర్పాకృతి మీద గ్రుచ్చగా రాయి కాలికి గట్టిగా తగిలియు, శూలము దిగుటయు, అందుండి రక్తము వెలువడుట చూచి ఆ కంబళీకప్పుకొనిన వాడు మూర్ఛ చెందెనట ఆ బండమీద వెంటనే ఒక స్త్రీ రూపము ధరించిన వ్యక్తి ‘ఫరవాలేదు. నేనే ఆ రక్తాన్ని’ అని చెప్పిరట. తదుపరి ఆ సర్పాకారమే రాతిరూపమై, నేడు పూజాదికము లందు కొనుటయు వినియున్నాము. ఇది ప్రస్తుతము మహావిశేషము గల యాత్రా స్థలమైనది కదా! దీనిని ఆదర్శ యాత్రగా పరిగణించువారు పెక్కురు సుబ్రహ్మణ్యోపాసకులు గలరు.

ఆ శూలధారి యగు కంబళివాడే తిరిగి చాగంటిపాటి యందు జన్మించి ‘శీతలాదేవి’ ఉపాసకుడై యుంట, తదాది నేటి దనుకగల పూర్వాపర సమన్వయము.

  1. తదనంతరము ‘అమ్మ’ ఒక ఇంట జన్మించి 6 సం. లుంటయు, దీనిలో మాట్లాడ నేరకుంటయు, ఆహారముతో నిమిత్తము లేకుండుటయు గమనించి అచటివారు “బుద్ధావతారమనుకొనెడివారట”, సంభాషణ మాత్రము లేదటగాని, తెలివిగల్గి యుండినట్లు గ్రహింప గల్గిరట. అట్లగుట బౌద్ధమతావలంబకులు, జాతక కథలలో నమ్మిక గల వారగుడు బుద్ధుని అవతారమై యుండనోపు ననుకొనుట సామాన్యము, సహజము అగును.
  2. తరువాత తిరుత్తని యందే ఆలయమునకు దక్షిణ దిశలో గలవారలయింట జన్మించి, అచట నుండి బయలుదేరి మన నల్లమడ వంతెన చేరుసరికి 26 సంవత్సరములుండ నోపునట. వీరిచే తనే చాగంటిపాటి మాంత్రికుడు, చాగంటిపాడు, “నీరు, నిప్పు’ అనునవి లేకయే “దగ్ధము- నాశనము” అగుట. తదుపరి 16 సంవత్సరములుండి, వారు జన్మ తీసికొనిరట. 26 + 16 = 42.

అమ్మ సర్పాకృతిలో నుండగ, శూలముచే నొప్పింపబడిన పిమ్మట రాతిరూపమై, తాను కొండ చిలువ రూపమున, ఆ యాత్రా స్థలమునకు దగ్గరలోగల చిన్న కొండ తిప్ప యందుండిరట. ఆ యాత్రకై వెళ్ళువారు తరచు ఆ తిప్పదగ్గర విడిసి, శ్రమదీర్చుకొని, తిరిగి ప్రయాణము సాగించెడివారట. అట్టి తరి ఒక విధవరాలు, మరి యొక యాత్రికుని వెంట నిడుకొని ఆహారము పచనము చేసుకొనుటకై, ఒక చోట రెండు రాళ్లను చేర్చి, మూడవ దానికి బదులు

ఆ సర్పాకృతిలో గల చిలువ దేహము రాయి అని ఎంచుకొని, పదార్ధము నాయత్త పరుచుకొని వంట నిమిత్త మగ్ని రగుల్కొలపగా, కొతసేపటికి వేడి ఆ అజగరమునకు సోకి, కదల మొదలిడెనట. దానికే చోద్యమంది యుండగా పర్వతమంతయు కదలినట్లును, దాని నుండి భూకంపము వెలువడు చున్నట్లును, దాని నుండి గొప్ప ధ్వనులు బయల్పడుట విని భయమందిరట. “వారికానాడు అభయ మొసంగిరట” “నేటి అభయము ఆనాటిది”.

తదాది ఆ విధవరాలు మాతృరూపముగను, ఆయాత్రీకుని కుమారునిగా కనుచు, తన కుమారుని సేవకునిగా ఉపయోగించుకొనుట ఆచారములు. అట్లుగావున జన సామాన్యములోగల మాతాపుత్రుల ప్రేమతత్వముగాక “ఆసామి, జీతగాడు” వీరికి గల సంబంధములు ఎరుంగనగును. అనగా అన్యోన్యానురాగములుగాక “కర్తవ్యనెరవేరణ” మాత్రమే అతని పని యగుటయు ఇచ్చిన ఆజ్ఞలోని గుణాగుణములుగాని, కర్తవ్యాన్వేషణగాని, సేవకుని పనిగాదు. ఆజ్ఞానువర్తియై నెరవేర్చుట మాత్రమే అతని కర్తవ్యమగుట మన మెరుంగనిది కాదు. (నమ్మినబంటు)

ప్రస్తుత జన్మలో వీరు ఉద్యోగరీత్యా హైద్రాబాద్లో నుండగా, ఒక బంగళాలో “దయ్యాలకొంప” అని ప్రతీతిగల ఇంటిలో యుండిరట. ఈమెగారు “లలిత” ఉపాసన చేయు చున్నందున, వాటికి ప్రకోపము కల్గి, భర్తను ఆవహించి చంపినవనునమ్మకమట. తరువాత తన భర్తయే “అమ్మ”ను ఆవహించి యుండెనని తలంచి అట్లు తనకుమారునికి నమ్మకము కల్గించిరట. ఈమెగారికి తరచు కలలోను, ఒక్కొక్కప్పుడు జాగృతిలోను, ఒక గడ్డము గల సాహెబును, తన కండ్ల ఎదుట తెరగట్టి తెరచాటున ఉరితీయు – చున్నట్లుండునట మరియు ఒక దున్నపోతు తరచు తనను వెంబడించి, పొడవ వచ్చు చున్నట్లు అగుపడునట. వీనిని “రాజమ్మగారికి” చెప్పగా “నీవు పూర్వ జన్మలో జీవహింస చేయుదానవని “తన పాదముల తాకనీయలేదట. అందుకు విచారింపు చుండగా ‘అమ్మ’ అట్లైన ‘ఉబ్బసము వారికి కలదుకదా? “వారు చిలుకను చంపిరా? అని స్వస్థత కూర్చిన, ఉండబట్ట నేరక ప్రతీకారముగా ఇదే ప్రశ్న ‘రాజమ్మ’ గారి నట. వారది అంగీకరించి తాము చెప్పినదియు సత్యమని రూఢి పరచిరట. దీనిని బట్టి వీరి కింత క్రౌర్యమెట్లు కల్గెనో? దానిని సుమంతయు బహిర్గతము కానీక ఎట్లు పదిల పరచు కొనుశక్తి గల్గియుండిరో తెలియును. అట్లయ్యు జయ, విజయుల రీతి, వైరభావముననైన ఈ జన్మలో ఉత్తీర్ణులు కాగల్గుట సాధ్యమయ్యును, పూర్వజన్మ సంస్కారము లెల్లను ఎట్లు పొడగట్టు చున్నవో ఎరుంగగును.

– (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!