ఒకసారి రాజుబావ అమ్మతో మాట్లాడుతూ “అమ్మా! నేనొక కథ విన్నానమ్మా! కథ కాదు నిజమేనని విన్నాను. ఏమిటంటే “ఒక రోజు యోగివేమన దగ్గరికి తనతో పూర్వం సంబంధమున్న చాకలిస్త్రీ వారిద్దరికీ జన్మించిన ఒక పిల్లవాణ్ణి తీసుకుని వచ్చి, ఆ పిల్లవాణ్ణి తన ఆస్తికి (వేమన అన్నగారు, వారి కుమార్తె జ్యోతి మరణించటంతో సంక్రమించినది) వారసుణ్ణి చేయమని అడిగిందట. అప్పుడు యోగి వేమన ఆ కుర్రవాణ్ణి దగ్గరకు తీసుకుని అతని శరీరాన్ని పై నుంచి క్రిందిదాకా నిమరగా ఆ కుర్రవాడు క్రమంగా కృశించి అంతకంతకూ చిన్నవాడై చివరకు వేమనగారి దోసిలి పరిమాణంలోకి వచ్చాడట. అప్పుడు వేమన గారు తన దోసిలి మూసి కాసేపటికి తెరచి రెండు అరచేతులను చూపిస్తూ ఒక అరచేతిలో శుక్లము, రెండవ అరచేతిలో శోణితము’ వుండగా ఆ శుక్లాన్ని ఆయన మ్రింగి శోణితమును ఆమెకిచ్చి వెళ్లి పొమ్మన్నాడట.
అయితే నేనిదివరలో విన్నట్లు ఉదజని, ప్రాణవాయువుల సంయోగము ద్వారా యేర్పడిన నీటి నుంచి తిరిగి ఉదజని, ప్రాణవాయువులని విడదీయ వచ్చని విన్నాను. అట్లాగే ఈ ఉదంతంలో చెప్పినట్లుగా “శుక్ల శోణితాలను విడదీయటం సాధ్యమేనా?” అని అడిగిన రాజుబావ ప్రశ్నకు అమ్మ “సాధ్యమే” అని సమాధానం చెప్పింది.