1. Home
  2. Articles
  3. Viswajanani
  4. రామరాజు కృష్ణమూర్తి గారు

రామరాజు కృష్ణమూర్తి గారు

Ravuri Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : November
Issue Number : 4
Year : 2010

“ఏరా! పిల్లలకోడి వచ్చావా” అంటూ అమ్మచే ఆప్యాయంగా మురిపెంగా పిలిపించుకొన్నది ఒక్క రామరాజు కృష్ణమూర్తి గారేనేమో! అమ్మ అనంత వాత్సల్య జలధిలో ఓలలాడి తన జీవిత గమ్యాన్ని తనదైన పంథాలో అధిరోహించారాయన. అవి గుంటూరులో తమ బావగారి పర్యవేక్షణలో డిగ్రీ చదువుకొనే రోజులు. అప్పుడు ఈయన వయస్సు 23 సంవత్సరాల మధ్య వుండవచ్చు. ఆ రోజులలోనే 1956లో మోతడక రామచంద్రరావు గారి ద్వారా అమ్మను గురించి విని అమ్మని జిల్లెళ్ళమూడిలో దర్శించారీయన. అలౌకికానుభూతికి లోనయి అమ్మ పాదాలపై మ్రోకరిల్లారు. సాధకులు ఏదైతే పొందాలని అభిలషించి సాధనలు చేస్తున్నారో ఆ శక్తికి ప్రతిగా మానవ దేహంతో కదలాడే మాతృమూర్తిని దర్శిస్తున్నానని తన మనసు సంబరపడింది. ఈ తల్లి సన్నిధిన గడపటమే తన జీవిత పరమావధి అని మనస్సు ఉబలాటపడింది. అయితే అదెలా సాధ్యం? దీనికి తన కుటుంబ సభ్యుల అనుమతి లభిస్తుందా ? తానా! అస్వతంత్రుడు. ఈ ఆలోచనలు ఆయనని కలవరపెట్టాయి. ఏమయినా ఈ అమ్మ సన్నిధినే తన జీవితయానం సాగాలి అని ఆనాడే నిశ్చయించు కొన్నారు. అమ్మ దర్శనానంతరం తిరిగి ఆ రాత్రికే గుంటూరు చేరారు. ఇంత ఆలస్యం అయింది ఎక్కడకు వెళ్ళావు అని ఆందోళన పడిన కుటుంబ సభ్యులకు విషయం వివరించారాయన. విన్న ఆయన బావగారు చిన్నవాడివి ముందు చదువు మీద శ్రద్ధ చూపాల్సిందనీ, ఇక మీదట ఇట్లా చెప్పకుండా వెళితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని మందలించారు. ఆయన తల్లిగారు బావగారు చెప్పింది శ్రద్ధగా విని చదువుకోవాలని సూచించారు. ఇక ఎప్పుడూ జిల్లెళ్ళమూడి వెళ్ళకూడదనేది ఆనాటి మందలింపుల సారాంశం. తర్వాత పూనాలో లా డిగ్రీ చదివారు. అమ్మని దర్శించాలనే తపన ఒక ప్రక్క జిల్లెళ్ళమూడి వెళ్ళకుండా ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లని ఎలా ఛేదించాలని మరొక ప్రక్క సతమతమవుతూ ఆయన ఒకరోజు రాత్రి 11-12 గంటల మధ్యలో అందరూ నిద్రలోకి జారుకొన్నారని నిర్ధారించుకొన్నాక అమ్మకై కొన్న నేత చీరలు ఒక ఫ్లాస్క్, మిగిలివున్న పాకెట్ మనీ తీసుకొని తన మేడపై లైట్లన్నీ ఆర్పేసి శబ్దం కాకుండా అతి కష్టం మీద ప్రహరీగోడ దుమికి మెల్లిగా రాత్రి 12 గంటల సమయములో గుంటూరు నుండి పెదనందిపాడు చేరే రోడ్డుకు చేరుకున్నారు. ఆ దారిన వస్తున్న ఒక లారీని ఎక్కి రాత్రి 2 గం|| ప్రాంతాన పెదనందిపాడు చేరారు. అక్కడి నుండి చీకటిలో వడివడిగా అడుగులు వేస్తూ తెల్లవారుఝామున 5.30 ప్రాంతంలో జిల్లెళ్ళమూడిలో అమ్మ పడుకొన్న మందిరాన్ని చేరారు. అప్పుడపుడే ఒకరూ అరా ఆ ఆవరణలో నిద్ర లేస్తున్నారు. అమ్మ మంచంపై పడుకొని ఉంది. తెచ్చిన చీరలు అమ్మ మంచంపై ఉంచి, ఫ్లాస్క్ క్రింద పెట్టి అమ్మ పాదాలకు లేచి నమస్కరించారు కృష్ణమూర్తిగారు. అమ్మ కూర్చుంది. ఈ సమయంలో ఎలా వచ్చావు నాన్నా అంది ఏమీ తెలియనట్లు! నీకు తెలియందేముందమ్మా! అని తెచ్చిన నేత చీరలు అమ్మ పాదాల వద్ద ఉంచి నీవు త్రాగుతావని కాఫీ తెచ్చాను అంటూ ప్లాస్క్ లోని కాఫీ కప్పులో పోసి అమ్మకి ఆర్ద్ర నయనాలతో ఆయన అందిస్తుంటే అమ్మ ఆప్యాయంగా ఆయనను దగ్గరకు తీసుకొని తలనిమిరింది. నీవు తాగాలని తెచ్చానమ్మా అంటూ ఆయన వేడుకోలుగా అంటూ ఉంటే తను తాగుతూ ఆయనచేత కాఫీని తాగించింది అమ్మ. ఆ తర్వాత కొద్ది రోజులకు అమ్మ దైవత్వం గురించి కృష్ణమూర్తి గారితో ఆయన బావగారు వాదులాడారు. వాదులాట మధ్యలో మీ అమ్మే నిజంగా దైవం అయితే నీవు ఆ ఎలక్ట్రిసిటీ మెయిన్ ఓపెన్ చేసి ఫ్యూజ్ తీసి లైవ్ ఎలక్ట్రిసిటీ వైరు పట్టుకో నీ దైవం కాపాడుతుందేమో చూడు అన్నారు బావగారు. ఆ మాటలకి భయపడి ఆపని కృష్ణమూర్తిగారు చేయరనీ దాని ఆధారంగా అమ్మపై ఆయనకు వున్న నమ్మకాన్ని మెల్లిమెల్లిగా సన్నగిల్ల చేయవచ్చునని ఆయన పథకం.

అమ్మపై అచంచల విశ్వాసం కల కృష్ణమూర్తిగారు వెంటనే లేచి ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెయిన్ ఓపెన్ చేసి ఫ్యూజ్ వేరు చేసి లైవ్ వైరు పట్టుకొన్నారు. ఊహించని ఈ పరిణామానికి వారి బావగారు నిర్ఘాంతపోయారు. అలానే పట్టుకొని ఇప్పటికైనా మా అమ్మ దైవం అని నమ్ముతారా? అన్న కృష్ణమూర్తి గారి మాటలకు ఈ లోకంలోకి వచ్చారు. అయినా అందుకు అంగీకరించలేదు. ఆ…. నీ ముఖం నీవు ప్యూజ్ తీసి వైర్ పట్టుకొనే సమయానికి కరెంట్ పోయి వుంటుంది. అది మీ అమ్మగారి గొప్పే ? అంటూ ఎద్దేవా చేశారు. అమ్మ మహనీయత్వాన్ని ఆయన నిరసించి అవహేళన చేసేసరికి కృష్ణమూర్తిగారిలో బాధా ఆవేశమూ పెల్లుబికాయి. అయితే యిప్పుడు చూడు అంటూ గదిలో ట్యూబ్ లైటు వేసి వెలిగింతర్వాత ఇప్పుడు కరెంట్ ఉంది కదా అంటూ ఆ గదిలోనే ఉన్నా 60 వాల్ట్స్ బల్బు వేసి వెలుగుతున్న బల్బుని హోల్డర్ లోనించి వేరు చేసి కరెంట్ పాస్ అవుతున్న హోల్డర్లో చేతి వేళ్ళు ఉంచి పట్టుకొని మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాచేయి పట్టుకోండి చూద్దాం అన్న కృష్ణమూర్తి గార్ని చూచి భయంతో వారి బావగారుగది బైటకు గబ గబా వెళ్ళిపోయారు. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్న లైవ్ వైర్ని ముట్టుకొంటే ఏ మనిషైనా మరణించటం తధ్యం. అందుకే కృష్ణమూర్తిగారు అంతటి సాహసం చేయరనీ తన మాట విని క్రమంగా అమ్మని మరచి చదువుకొంటారనీ భావించారు వారి బావగారు. కానీ జరిగింది వేరు.

అయితే ఈ సంఘటన జరిగిన రోజు అదే సమయాన జిల్లెళ్ళమూడిలో మంచంపై కూర్చొని చుట్టూ ఉన్న సోదరీ సోదరులతో ముచ్చటిస్తున్న అమ్మ ఒక్కసారిగా హఠాత్తుగా ఉన్నట్లుంటి 1 1/2 అడుగుల ఎత్తు ఎగిరిపడింది. అలా రెండు సార్లు జరిగింది. అమ్మ ముఖం కూడా ఆ సమయాన కందగడ్డలా ఎర్రగా మారింది. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ వారందరూ గాభరాపడ్డారు. కొంతసేపైన తర్వాత ఏమైందమ్మా అని “అమ్మనే” అడిగారు. మొదట ఏమీ లేదనీ తర్వాత తరచి తరచి అడుగగా ఆ కరెంట్ షాక్ కొట్టిందిలే అని చెప్పింది అమ్మ. అక్కడ ఉన్నవారికేమో ఆ మాటలు అర్ధం కాలేదు.

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత కృష్ణమూర్తిగారు కుటుంబ సభ్యులతో జిల్ళెళ్ళమూడికి అమ్మను దర్శించుకొన్నారు. అలా కరెంట్ వున్న తీగలు పట్టుకొంటే చచ్చిపోతావు నాన్నా! అట్లా ఎవరైనా పట్టుకొంటారా! అంటూ అమ్మ కృష్ణమూర్తి గారిని సున్నితంగా మందలించింది.

ఒకసారి జిల్లెళ్ళమూడి సంస్థ నిర్వహణ బాధ్యతలతో తలమునకలయిన ఒక సోదరుడు అక్కడ జరిగే నిర్మాణ కార్యక్రమానికి నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిన కృష్ణమూర్తిగారు, వెంటనే గుంటూరులో తమకు వున్న స్థలాన్ని వున్నపళంగా బేరం పెట్టి అమ్మి ఆ డబ్బును అప్పటి ఆ సంస్థ అవసరానికి వినియోగించేందుకు దోహదపడ్డారు.

ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. వివాహ ప్రస్తావన వచ్చినపుడు అమ్మ నిర్ణయానికే వదిలేశారు. చివరకు హైస్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ రాజగోపాలరావు గారి మూడవ కుమార్తె శ్రీమతి ద్వారక గార్ని 1963 సంవత్సరంలో అమ్మ నిర్ణయ ప్రకారం వివాహం చేసుకొన్నారు. చిన్న వయసులోనే ప్రాపంచిక వున్నతులు కాదని వివాహం కూడా చేసుకొని అనంతరం అమ్మ పరమార్ధమనీ, పరమావధి అని భావించి అమ్మ చెంత స్థిర నివాసమున్నారు శ్రీ రామరాజు కృష్ణమూర్తిగారు. అంతా తానే అయిన అమ్మ తనే అన్నీ చూచుకొంటుందనే విశ్వాసం అయనది. అంతే.

ఆ తర్వాత జీవన ప్రయాణంలో ఆయనకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా అన్నిటినీ అమ్మ అనుగ్రహ వీక్షణతో అధిగమించారు. ఇప్పుడు ఆయన కుటుంబం సర్వతోముఖాభివృద్ధితో వర్ధిల్లుతుంది అనేది జగమెరిగిన సత్యం. ఆయనకు 5గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. చాలా మంది జిల్లెళ్ళమూడిలో జన్మించినవారే. 1, 2 సం॥ తప్ప పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం లేదు. ఆ రోజులలో ఆఖరి సంతానాన్ని ఎత్తుకొని మిగతా చిన్న చిన్న పిల్లలందరినీ నడిపించుకొంటూ, ఆయన తన యింటినించి అమ్మ వుండే అందరింటి మేడపైన ఉన్న వాత్సల్యాలయానికి దర్శనానికి రోజూ క్రమం తప్పక వచ్చేవారు. ఆనాటి ఆ దృశ్యం కనులవిందుగా ఉండేది. అదిగో ఆ రోజులలోనే అట్లా వస్తుండే ఆయనను చూచి అమ్మ “ఏరా! పిల్లల వచ్చి కోడీ” అంటూ మురిపెంగా చిలిపిగా గేలిచేసేది. కృష్ణమూర్తి ఎంతటి హాస్యప్రియులో అంతటి ముక్కు సూటి మనిషి చివరకు అమ్మతో తన భావాలు చెప్పేటపుడయినా అంతే. కృష్ణమూర్తి గారు అమ్మను గూర్చి “ప్రస్తుతి” అనే పుస్తకం రాశారు. ఆ రచనలలో గుడిపాటి వెంకటచలంగారి ఒరవడి కన్పించుతోందని విమర్శకుల ఉవాచ. 

జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిన వుండే కృష్ణమూర్తి గారు 1970 నుంచి శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 1974లో శ్రీ విశ్వజననీ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. అప్పట్లో అనారోగ్యంతో వున్న అమ్మను చికిత్స నిమిత్తం డా॥ ఎస్.వి. సుబ్బారావు గారు నెల్లూరులో వారింటికి అమ్మను తీసుకొని వెళ్ళారు. అమ్మతో చాలామంది ఆవరణలోని సోదరీ సోదరులు విశ్వజననీ పరిషత్ కార్యనిర్వాహక సభ్యులు నెల్లూరు వెళ్ళారు. జిల్లెళ్ళమూడిలో దైనందిన కార్యక్రమాల నిర్వహణ బాధ్యత ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న కృష్ణమూర్తిగారిపై పడింది. జనం తక్కువగా వున్న కారణాన అఖండ నామ సంకీర్తన 24 గంటలు జరపటం కష్టసాధ్యమని నిర్వాహకులు కృష్ణమూర్తిగారితో చెప్పారు. కొద్ది రోజులు ఉన్నవారెలాగో సర్దుకొని నిర్వహించాల్సిందిగా వారిని కృష్ణమూర్తిగారు కోరారు. అలా చేయటం కుదరదని వారు ఖరాఖండిగా చెప్పారు. అయితే ఈ అఖండనామ సంకీర్తనని ఈ రోజునుంచి ఆపేద్దాం ఎలాగూ జనం తగినంతమంది లేరనీ మీరు చేయలేమని అంటున్నారు కదా! అన్నారు. కృష్ణమూర్తిగారు. నిర్ఘాంతపోయిన నిర్వాహకులు ఇన్ని సంవత్సరాలు నిరంతరాయంగా జరుగుతున్న అఖండనామ సంకీర్తన ఆగిపోతుందేమోననే ఆందోళనతో క్రొత్తవారిని కూడా చేర్చి అమ్మ నెల్లూరు నుంచి తిరిగి వచ్చేదాకా ఎంతో వైభవంగా నామ సంకీర్తన నిర్వహించారు. ఈయన అఖండనామ సంకీర్తన ఆపేద్దాం అన్న మాటలను తిరిగివచ్చిన అమ్మతో ఎవరో ఫిర్యాదు చేశారు. అమ్మ కృష్ణమూర్తిగారిని పిలిచి విచారించారు. అవునమ్మా! నీకు తెలియంది ఏముంది. అలా నేను అన్న తర్వాత అంతకు ముందు నామ సంకీర్తనలో పాల్గొనని వారు సైతం పాల్గొని అతి వైభవంగా సంకీర్తన చేశారు. వారు అలా చేయటం కొరకే నేనిలా అన్నాను అంటూ అమ్మతో నవ్వులు పంచుకొన్నారు. 1976లో పిల్లల చదువుల కోసం ఆయన తన నివాసాన్ని జిల్లెళ్ళమూడి నుండి గుంటూరుకు తరలించారు.

1988 గుంటూరు బ్రాడీపేటలోని తమ ఇంటిపై భాగాన ఉన్న పెద్దగది అమ్మ పూజా మందిరంగా మార్చారు. మాతృశ్రీ అధ్యయన పరిషత్, గుంటూరు శాఖ కార్యక్రమాలు అమ్మపూజలు, సమావేశాలు ఒకటేమిటి? అన్నిటికీ అదే కేంద్ర బిందువు అయింది. అమ్మ నాన్నగారితో జిల్లెళ్ళమూడికి కాపురానికి వచ్చిన కొత్తలో ఆ పేద కుగ్రామంలో ఏ బీద కుటుంబం సంవత్సరంలో ఏరోజూ ఆకలితో బియ్యం లేక అలమటించకూడదనే ఉద్దేశంతో ఇంటింటా మహిళలు స్వచ్ఛందంగా రోజు ఒక పిడికెడు బియ్యం తీసి వుంచి అలా తీసిన బియ్యం ఒక చోట ప్రోగు చేసి ఆ బియ్యాన్ని ఆ ఊరిలో అవసరం అయినవారికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయించింది “అమ్మ”. గుంటూరులో కూడా అదే పథకాన్ని అమలుపరచి అలా సేకరించిన బియ్యాన్ని జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయ నిర్వహణకు పంపాలని అధ్యయన పరిషత్ నిర్ణయించింది. అంత పెద్ద పట్టణంలో ఇంటింటా పిడికెడు బియ్యం తీసి వుంచిన వాటిని యింటింటికీ తిరిగి సేకరించటం ఎంత కష్టం! అయితే కృష్ణమూర్తిగారు తమ పిల్లలని గుంటూరులో యింటింటికీ పంపించి అలా సేకరించిన బియ్యం నెల నెలా 2, 3 క్వింటాళ్ళు అయితే వాటిని జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయ నిర్వహణకు పంపే పనిని నెలనెలా నిరంతర యజ్ఞంగా నిర్వహించారు.

ఆయన కుటుంబం గుంటూరు మారగానే పిల్లలందరినీ గుంటూరులో సంగీత కళాశాలలో చేర్పించారు. మేమెవరిమైనా అలా అందరినీ చేర్పించారేమిటండి? అని ప్రశ్నిస్తే ఈ అస్తిపాస్తులు ఎంతవరకు శాశ్వతం ఈ అమ్మని నమ్ముకున్నాం! అవసరం అయితే సంగీతం నేర్చుకొంటే వీధి వీధికి అమ్మ నామంచేసుకొంటూ అయినా బతకగలరు అని చమత్కరించేవారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు సంగీతంలో మంచి ప్రజ్ఞా పాటవాలు పొంది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

గుంటూరులో వున్నా అమ్మ ధ్యాసతో, అమ్మ సేవా కార్యక్రమాలతో తాము నేర్చుకొన్న హోమియోపతి ఉచిత వైద్య సేవతో పిల్లా పాపలతో సంతృప్తికరంగా జీవనయానం సాగిస్తూ శ్రీరామరాజు కృష్ణమూర్తిగారు ఏ రకమైన శారీరక రుగ్మతలు లేక ది. 13-7-1993న రాత్రి నిద్రలోనే అమ్మ సాన్నిధ్యం చేరిన ధన్యజీవి. ఆదర్శప్రాయుడు.

అంతా జీవమయం.- నా దృష్టిలో జడమే లేదు.

భిన్నత్వం లేనిదే ఏకత్వం.

నేను చేస్తున్నాను అనుకునేది మానవత్వం. వాడు ఇస్తున్నాడు అనేది జ్ఞానం. అన్నీ తానైనది దైవం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!