శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్, ఐ.ఎ.ఎస్. గారు తిరుమల తిరుపతి దేవస్థానములు కార్యనిర్వహణాధికారిగా పని చేసిన కాలంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణము, నిత్యాన్న ప్రసాదవితరణ పధకము… ఇంకా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చక్కని రూపుదిద్దుకున్నాయి. తర్వాత కాలంలో వారు విశాఖపట్టణం బదిలీ అయ్యారు. పిమ్మట ఒకసారి జిల్లెళ్ళమూడి వచ్చారు.
శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారి పేరు జిల్లెళ్ళమూడి సోదరీసోదరులందరికీ సుపరిచితమే. అందరిల్లు, అన్నపూర్ణాలయం, ఓరియంటల్ కాలేజి, ఆస్పత్రి… మొదలైన అన్ని విశ్వకళ్యాణకారక అర్కపురి దేవాలయాల వ్యవస్థాపకులు ఆ మహానుభావుడే. శ్రీ శేషగిరిరావు అన్నయ్య శ్రీప్రసాద్ గార్కి సన్నిహిత బంధువు.
ఒక రోజు శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్ గారు అమ్మకు నమస్కరించుకొని సమీపంలో ఆసీనులు కాబోతున్నారు. అమ్మ ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసికొని, “నాన్నా! వెంకన్న (శ్రీవేంకటేశ్వరస్వామి) నీ కోసం బెంగపెట్టుకున్నాడు” – అన్నది. అందుకు వారు సవినయంగా “నాదేమీ లేదమ్మా. అంతా ఆయనే (శ్రీ వేంకటపతి) చేసుకున్నారు” – అన్నారు. తమ సంభాషణ కొనసాగిస్తూ అమ్మ, “నాన్నా! దేవుడు అంటే రాయి కాదు కదా, తనకీ మనస్సు ఉన్నది కదా!” అన్నది. అమ్మ ప్రకాశింపజేసిన ఈ సత్యం ప్రతి అర్చామూర్తి, ప్రతి దేవాలయం విషయంలోనూ సత్యమే.
సాధారణంగా దేవుడు – దేవాలయం పేర్లు వినగానే భక్తి కంటే భయమే ఎక్కువ శాతం మన మనస్సుల్లో చోటు చేసుకుంటుంది. మొక్కు తీర్చకపోతే ముక్కలైపోతామనో, నెత్తి అణుస్తుందేమోననే భావాలతో భయకంపితులౌతాము. అది కేవలం అపోహ; ఒక అపవాదు. వాస్తవం లేదు. దైవం జీవకోటికి బిడ్డలని ఎందుకు అనుగ్రహించాడంటే తన కడుపు తీసి మాధుర్యాన్ని కాస్త రుచి చూపించటానికి. కనుకనే అమ్మ అంటుంది, “తనను కన్నవారి మీద కంటే తాను కన్నవారి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది” – అని. తత్త్వతః పునర్దర్శన ప్రాప్తి కోసం పరితపించేది భగవంతుడే. ప్రయాణమై సెలవు తీసుకుందామని బొట్టు పెట్టమని ఎవరైనా అమ్మ దరి చేరితే అమ్మ కన్నులు నీటికుండలు అయ్యేవి. సృష్టికర్త లక్షణాలే సృష్టికీ వచ్చాయి. జగన్మాత దివ్య మాతృత్వ విశేషమే జగత్తులోని తల్లులకూ వారసత్వంగా రక్తగతంగా సంక్రమించింది.
ఇక్కడ మరొక ముఖ్యాంశం పైన మన దృష్టిని సారించాలి- ‘రాయికీ మనస్సు ఉన్నది’ – “నా దృష్టిలో జడం ఏమీ లేదు; అంతా చైతన్యమే, సజీవమే” అని అమ్మ స్పష్టం చేసింది. జగన్మాత సత్యమే; జగన్మాత రూపాంతరమైన జగత్తూ సత్యమే, చైతన్యమే, జీవమే. కాగా మన కళ్ళకి అలా కనిపించదు. అందుకు కారణం మన శాస్త్రం (Science), శాస్త్రజ్ఞులు (Scientists) ఇచ్చిన నిర్వచనాలు. అవి అసంపూర్ణములు, పరిమితులకు లోబడినవి. ఎవరికి అందినంతవరకు వారు చెపుతారు. తమకి అర్థంకాని, తమ శక్తికి మించిన సంగతిని శాస్త్రజ్ఞులు (Scientists) స్వభావము (Natural) అనీ; వేదాంతులు అవ్యక్తము (mysterious) అనీ పేరు పెట్టి చేతులు ఎత్తేస్తారు; పరోక్షంగా తమ ఓటమిని అంగీకరిస్తారు.
మనిషి శరీరంలో రక్తం ఎఱ్ఱగా ఉంటుంది. రక్తం అంటే ఎఱ్ఱగా ఉన్నదే కాదు. ఆనపకాయ, పొట్లకాయ కోసి లోపలి భాగాల్ని చూస్తే కండ, నీరు, మాతృగర్భస్థ శిశువుల్లాగా లేలేత విత్తనాలూ కనిపిస్తాయి. వాటిలో రక్తమాంసాదులు నీరుగా, కండగా ఉన్నాయి.
ప్రాణశక్తినీ, చైతన్యాన్నీ నేటి వరకు నిర్వచించలేదు. ‘మనిషి పోయిన తర్వాత ప్రాణం ఎక్కడికి పోతుందమ్మా?’ అని అడిగితే ‘ఎక్కడికి పోతుంది? అక్కడే ఉంటుంది. టైరులో గాలి పోతే ఎక్కడికి పోతుంది? గాలిలోనే” అన్నది.
Atoms are invisible and indivisible’ అని అన్నారు ఒకనాడు. నేడు రెండూ సాధ్యమే. పరమాణువును ఛేదిస్తే విడుదలయ్యే అనూహ్య శక్తిపైన ఆధారపడి Atomic Reactors ఉపయోగపడుతున్నాయి. E = mc2 సమీకరణం తెలిసిన తర్వాత, పదార్థం, శక్తి రూపాంతరం చెందుతున్నాయి అని తెల్సింది; అణోరణీయాన్ మహతోమహీయాన్’ (దైవం అణువు కంటే చిన్నవాడు, మహత్తు కంటే గొప్పవాడు) అనే శృతి వాక్యానికి అర్థం తెల్సింది.
కనుకనే అమ్మ, “సృష్టికి నాశనం లేదు. పరిణామ శీలం కలది. పరిణామం సత్యం. కనిపిస్తున్నదంతా నిజస్వరూపమే” అని విస్పష్టంగా చాటింది.
‘To define God is to deny HIM’ అన్నారు ఒక తత్త్వవేత్త. మానవ పరిమిత మేధస్సును వివరిస్తూ Emerson ‘The American Scholar’ అనే ప్రసంగంలో – ‘All Literature is yet to be written, All inventions are yet to be made’ అన్నారు. ఈ అంశాన్ని సమర్ధిస్తూ మరొక శాస్త్రవేత్త – ‘It is impossible to conceive that one day a Newton will airse who can explain the origin of even a single blade of grass-‘ దీని అర్థం – నేటికి మన కనుగొన్నది ఆవగింజంత, కనుగొనవలసింది కొండంత అని.
జీవలక్షణాలు – శ్వాసక్రియ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ప్రేరణకు ప్రతీకారం – అని లోగడ నిర్వచించారు. జగదీశ చంద్రబోస్ పుణ్యమా అని మొక్కలకీ ప్రాణం ఉన్నదని తేటతెల్లం అయింది. కాళిదాసు మహాకవి శకుంతలంలో “సేయం యాతిశకుంతలా పతి గృహం సర్వైరనుజ్ఞాయతాం’ అన్నారు. ప్రాణాధికంగా మొక్కలను పెంచే శకుంతల అత్తవారింటికి వెడుతోంది. మీరు (మొక్కలు) అంతా ఆశీర్వదించండి – అని.
మొక్కలు మనుషుల్ని ఆశీర్వదిస్తాయా? వాటికి మనస్సు ఉన్నదా? మొక్కలు స్వయం పోషకాలు. తమ బ్రతుకు తాము బ్రతుకుతూ మనుషుల్ని బ్రతికిస్తాయి. వృక్షాలు భగవత్ప్రసాదాలు. అట్టి మొక్కలనే అర్థం చేసికోలేము. ఇక రాళ్ళనేమి అర్థం చేసుకుంటాం?
రాళ్ళకి ఇతఃపూర్వం నిర్వచించిన జీవలక్షణాలు లేవు. కానీ అమ్మ “అవీ జీవులే” అని అంటోంది. అది కదలలేదు, స్పందించలేదు – అని మన పరిశీలన. దానిలో చైతన్యం ఎలా ప్రస్ఫుటం అవుతోంది? ఈ సందర్భంగా ఏప్రియల్ 2012, విశ్వజనని మాసపత్రికలో సో॥ శ్రీ వి. విశ్వనాధమయ్యగారి వ్యాసం ‘అమ్మ సహజ మహిమ’ను చూడగోర్తాను. అందలి ఒక పేరాను ఇక్కడ పొందుపరుస్తాను.
‘ఒక ఇటుకను మనం రమ్మంటేరాదు – కానీ చేతిలోకి తీసికొంటే వస్తుంది. ఒక చీమను కూడా అలాగే తీసికోవచ్చు. రెండింటినీ ఒక చోట ఉంచితే చీమ కదిలి పోతున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే ఇటుక కూడా కదులుతుంది. అంటే మార్పు చెందుతుంది. ఆ మార్పు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మన గుర్తింపునకు అందదు. కాని మార్పు అయితే ఉంది. అందువల్ల చీమలోని చైతన్యాన్నీ గుర్తించినంత తొందరగా ఇటుకలోని చైతన్యాన్ని మనం ‘మానవులం’ గుర్తించలేము. సృష్టిలోని ప్రతి వస్తువూ ఇలా మార్పు చెందేదే. మన శరీరం కూడా! ఏ మార్పు లేనిదే శుద్ధ చైతన్యం” అంటూ జడ పదార్ధం అని నామకరణం చేయబడిన చైతన్య స్వరూపాలు ‘పొందిక’ అనే అద్భుత ధర్మాన్ని కలిగి ఉన్నాయి అని అమ్మ మాటల వలన వారికి అవగతమైనది. ఒకసారి సో॥ శ్రీ కె.నరసింహమూర్తిగారు “రాయిలో చైతన్యం ఉందా, అమ్మా!” అని ప్రశ్నిస్తే లేకపోతే గోడగా, ఇటుకగా అనేక వస్తువులుగా ఎన్నో విధాలుగా ఎలా ఉపయోగపడుతోంది? అని బదులిచ్చింది అమ్మ. సృష్టిలో సర్వేసర్వత్రా పరివ్యాప్తమైన చైతన్యలక్షణాల్ని ‘పొందిక’ ఉపయోగపడటం అంటూ నిర్వచించింది.
నా దృష్టిలో మనిషి కంటే ఒక మూగజీవి (ఉదా: ఎద్దు), జంతువుకంటె ఒక మొక్క, మొక్క కంటె ఒక రాయి గొప్పవి. సృష్టిలో ఒక జంతువు, ఒక రాయి, ఒక మొక్క పాత్రల్ని తీసికొంటే విధి విధానానికి శిరస్సు వంచి మారుమాట లేక చివరిక్షణం వరకు శ్రమిస్తాయి. There’s not to reason why, There’s but to do and die. మూలానికి వెడితే సృష్టికి ఆధారభూతమైన పంచభూతాలు గొప్పవి. పంచభూతాత్మకమైన పరతత్త్వం సర్వశ్రేష్టమైనది. మనిషికి విచక్షణా జ్ఞానం ఉన్నది. ఆ అజ్ఞానంతోనే దైవాన్ని పలు సందర్భాల్లో నిందిస్తాడు, నిలదీస్తాడు.
ఒకనాటి రాత్రి సమయం బాగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా సన్నగా చినుకులు పడుతున్నాయి. అమ్మ నాతో “నాన్నా ! శ్రీమాత (విశాఖపట్టణం వాస్తవ్యులు యాత్రీకులు సౌకర్యార్థం నిర్మించిన అతిథి గృహం) కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటున్నాయి. పగిలిపోతాయేమో! వెళ్ళి గడియపెట్టిరా” అన్నది. ఆ మాటలు కేవలం ఆస్తినష్టం గురించి మాట్లాడినవికావు. ఏడాది రెండేళ్ళ పసివాడు తంటాలుపడి ఒక గోడ పైకి ఎక్కాడు. ఆ దృశ్యాన్ని వాడి తల్లి చూసింది. అక్కడి నుంచి పడితే ఎంత ప్రమాదం అంటూ లబలబలాడుతున్నట్లు “గాలికి కొట్టుకుంటున్నాయి పగిలిపోతాయేమో! అన్నమాటలు అమ్మ గొంతులోంచి ఆ రకంగా ధ్వనించాయి. బహువన పాదాపాబ్ది కుల పర్వతపూర్ణ సరస్సరస్వతీ సహిత మహా మహీధరము అంతా అమ్మ పొత్తిళ్ళలో పసిపాపే.
ఒకసారి మాన్యసోదరులు శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారు, “అమ్మా! ఇది జడం అనీ, ఇది చైతన్యం అనీ మాకు తెలుస్తోంది. మీరు అంతా చైతన్యమే అంటే మాకు అర్థం కావటం లేదు” అని అంటే అమ్మ”, నాన్నా! ఇది జడం, ఇది చైతన్యం అని మీరు అంటూంటే నాకూ అర్థం కావటం లేదు” అన్నది వెంటనే ఆయన సవినయంగా, “అమ్మ అనుగ్రహంతో ఆ స్థితి మాకు కలగాలి” అన తమ భక్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అది సూన్నత వాక్యం.
అమ్మ దృష్టిలో కుంకుడు కాయలు కొట్టేందుకు ఉపయోగించే రాయీ ఒక సాలగ్రామశిల, శివలింగము, కన్నులు తెరవని పురిటి బిడ్డ, బంగారుకొండ, మేరుగిరి.