నవంబరు 1వ తేదీ ఉదయం మాతృశ్రీ విద్యాపరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా॥ బి.ఎల్.సుగుణ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతం లెక్చరర్ శ్రీమతి ఎల్. మృదులగారు స్వాగత వచనాలు అందించగా, కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతం ఆలపించారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల సంస్కృత శాఖాధ్యక్షులు డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి గారు ముఖ్య అతిధిగా పాల్గొని సందేశం అందించారు. “ఆంధ్రజాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన విశ్వకవి జాషువా” అని, “జాషువా కవితలో జాతీయతా భావం, విశ్వచైతన్యం నిండి ఉంటాయని, తెలుగు నుడికారపు సొగసులతో, రసరమ్యమైన కవితలు అందించిన మానవతా వాది జాషువా” అని తమ ప్రసంగంలో డా॥ నాగరాజ్యలక్ష్మి గారు విద్యార్థులకు ఆసక్తికరంగా, ఉపయుక్తంగా సోదాహరణంగా వివరించారు.
చరిత్రోపన్యాసకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నాగరాజ్య లక్ష్మి గారిని సభాధ్యక్షులు డాక్టర్ సుగుణగారు అందమైన శాలువతో, జ్ఞాపికతో సత్కరించారు. శ్రీ విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ వి.రమేష్బాబుగారు అమ్మ శేష వస్త్రాలను బహూకరించి, ప్రసాదం అందించి, సత్కరించారు. కళాశాల విద్యార్థులు జ్ఞాపికతో సత్కరించారు. మాతృశ్రీ సంస్కృత కళాశాల పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సభలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారి పర్యవేక్షణలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వైభవంగా జరిగింది.
సంస్కృతోపన్యాసకులు శ్రీ ఎ. సుధామవంశీగారు తమ స్పందనను అందించి, ముఖ్య అతిధి ఔన్నత్యాన్ని విశదీకరించగా, తెలుగు లెక్చరర్ శ్రీ కె.ఫణిరామలింగేశ్వర శర్మగారు వందన సమర్పణ చేశారు.